పార్లమెంటు రేపటికి వాయిదా
అత్యంత కష్టమ్మీద కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం పార్లమెంటు ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. గత నెలలో జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2011లో సభలో ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లును ఆహార శాఖమంత్రి కేవీ థామస్ ముందుగా ఉపసంహరించుకుని, ఆ తర్వాత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇందులో రాష్ట్రాల హక్కుల్లో జోక్యం విషయం లేదని, సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం కాదని థామస్ తెలిపారు. ఆహారాన్ని ఒక హక్కుగా ఇవ్వడానికే ఈ బిల్లు ఉద్దేశించామన్నారు.
అయితే ఆహార భద్రత కంటే సరిహద్దు భద్రత మరింత ముఖ్యమని లోక్సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్ ఈ సందర్భంగా తెలిపారు. జమ్ము కాశ్మీర్లో సైనికుల హత్యపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తన విధానాన్ని స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆహార భద్రత బిల్లు రాష్ట్రాల హక్కులకు విరుద్ధంగా ఉందంటూ అన్నాడీఎంకే సభ్యుడు ఎ.తంబిదురై దాన్ని వ్యతిరేకించారు. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందే రాష్ట్రాలను సంప్రదించి ఉండాల్సిందన్నారు. బిల్లుకు కొన్ని సవరణలు చేయాలని యూపీఏ మాజీ మిత్రపక్షం డీఎంకేకు చెందిన టీఆర్ బాలు అన్నారు.
ఈ గందరగోళం నడుమ స్పీకర్ మీరాకుమార్ లోక్సభను గురువారానికి వాయిదా వేశారు. ఆహార భద్రత బిల్లుపై చర్చకు ఆరు గంటలు కేటాయించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. గురువారం లేదా వచ్చే సోమవారం చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. అయితే, ఉభయ సభల్లో కాశ్మీర్ అంశం తీవ్ర గందరగోళానికి కారణమైంది. దీనిపై రక్షణ మంత్రి ఆంటోనీ ఇచ్చిన సమాధానం పార్లమెంటును కుదిపేసింది. ఈ సంఘటనపై భారత ఆర్మీ చెప్పేదానికి, ఆంటోనీ చెప్పిన విషయాలకు పొంతన కుదరకపోవడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. లోక్సభ పదే పదే వాయిదా పడగా రాజ్యసభలో బీజేపీ సభ్యులు కార్యకలాపాలను స్తంభింపజేశారు. లోక్ సభ సమావేశం కాగానే విపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ పాకిస్థానీ సైనికుల దాడి విషయంలో ఆంటోనీ తీరును తప్పుబట్టారు. ఆయన పాకిస్థాన్ను సమర్థిస్తున్నట్లుందని ఆమె అన్నారు.
వామపక్షాల సభ్యులు కూడా ఇదే సమయంలో వెల్లోకి దూసుకెళ్లారు. పశ్చిమబెంగాల్లో విపక్షాలు, మహిళలు, బలహీనవర్గాలపై తృణమూల్ దాడులకు అంతులేకుండా పోతోందని వారు మండిపడ్డారు. అప్పుడే ఇరు సభల్లోనూ సీమాంధ్ర సభ్యులు తమ వాదనను గట్టిగా వినిపించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నోటికి నల్ల గుడ్డ కట్టుకుని వచ్చారు. రక్షణమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సభలోనే ఉన్నందున ఆయన కాశ్మీర్ సంఘటనపై వివరంగా ఓ ప్రకటన చేయాలని ఆమె కోరారు. తీవ్ర గందరగోళం చెలరేగడంతో ఉభయ సభలు తొలుత మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.
అనంతరం రెండోసారి సమావేశమైన తర్వాత ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టినా, పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో అటు లోక్సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీలు ఉభయ సభలను గురువారానికి వాయిదా వేశారు.