సైనికుల కాల్చివేతపై ప్రకటనను సమర్థించుకున్న ఆంటోనీ
ఐదుగురు భారత సైనికులను పాకిస్థాన్ మూకలు కాల్చి చంపిన సంఘటనపై పార్లమెంటులో తాను చేసిన ప్రకటనను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సమర్థించుకున్నారు. తనకు మరిన్ని వివరాలు అందిన వెంటనే వాటిని పార్లమెంటుకు సమర్పిస్తానన్నారు. ఈ సంఘటనపై ఆంటోనీ మంగళవారం పార్లమెంటులో చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. పాకిస్థానీ సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారనడం వాళ్లు తప్పించుకోడానికి అవకాశం ఇచ్చినట్లేనని తీవ్రంగా విమర్శించాయి. మంత్రి ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించాయి. అయితే, 'రక్షణ మంత్రిగా ఏవైనా ప్రకటనలు చేసేటప్పుడు నేను జాగ్రత్తగానే ఉంటాను. నేను నిన్న ఓ ప్రకటన చేశాను. ఈరోజు ఆర్మీ చీఫ్ బిక్రం సింగ్ అక్కడకు వెళ్లారు. నాకు మరిన్ని వివరాలు తెలియగానే వాటిని మీ ముందుంచుతాను' అని ఆయన రాజ్యసభలో బుధవారం తెలిపారు. పార్లమెంటుతో పాటు భారతదేశం మొత్తం జాతి భద్రత, సమగ్రత విషయంలో ఒక్కటిగానే ఉన్నట్లు ఆంటోనీ చెప్పారు.
అయితే, ఆంటోనీ ఇచ్చిన సమాధానం బుధవారం కూడా పార్లమెంటును కుదిపేసింది. ఈ సంఘటనపై భారత ఆర్మీ చెప్పేదానికి, ఆంటోనీ చెప్పిన విషయాలకు పొంతన కుదరకపోవడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. లోక్సభ పదే పదే వాయిదా పడగా రాజ్యసభలో బీజేపీ సభ్యులు కార్యకలాపాలను స్తంభింపజేశారు. లోక్ సభ సమావేశం కాగానే విపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ పాకిస్థానీ సైనికుల దాడి విషయంలో ఆంటోనీ తీరును తప్పుబట్టారు. ఆయన పాకిస్థాన్ను సమర్థిస్తున్నట్లుందని ఆమె అన్నారు.
వామపక్షాల సభ్యులు కూడా ఇదే సమయంలో వెల్లోకి దూసుకెళ్లారు. పశ్చిమబెంగాల్లో విపక్షాలు, మహిళలు, బలహీనవర్గాలపై తృణమూల్ దాడులకు అంతులేకుండా పోతోందని వారు మండిపడ్డారు. అప్పుడే ఇరు సభల్లోనూ సీమాంధ్ర సభ్యులు తమ వాదనను గట్టిగా వినిపించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నోటికి నల్ల గుడ్డ కట్టుకుని వచ్చారు. రక్షణమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సభలోనే ఉన్నందున ఆయన కాశ్మీర్ సంఘటనపై వివరంగా ఓ ప్రకటన చేయాలని ఆమె కోరారు. తీవ్ర గందరగోళం చెలరేగడంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.