indian soldiers killed
-
సీఎం మాట్లాడిన తర్వాతే అంత్యక్రియలు!
జమ్ము కశ్మీర్లో బీఎస్ఎఫ్లో విధులు నిర్వహిస్తూ, పాక్ సైనికుల చేతిలో దారుణంగా హతమైన కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ అంత్యక్రియలు ఎట్టకేలకు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని అతడి స్వగ్రామం దేవారియాకు మృతదేహం వచ్చిన 11 గంటల తర్వాత ఈ కార్యక్రమం జరగడం గమనార్హం. మృతదేహాన్ని పెట్టెలో మూతవేసి తీసుకొచ్చారని, దానిమీద జెండా కూడా కప్పేశారని, అసలు అది తమవాళ్లదేనన్న నమ్మకం ఏంటని ప్రశ్నించిన ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులు.. అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడాల్సిందేనని పట్టుబట్టారు. వాళ్లు అదే పట్టుదలతో ఉండటంతో అర్ధరాత్రి సమయంలో సీఎం యోగి ఫోన్ చేశారు. ప్రేమ్ సాగర్ పెద్ద కొడుకుతో మాట్లాడారు. 13 రోజుల శ్రాద్ధ కర్మలు ముగిసేలోపు తప్పనిసరిగా తాను దేవరియా వస్తానని, ప్రేమ్ సాగర్ పేరుమీద ఒక పాఠశాల, స్మారక చిహ్నం ఏర్పాటు చేయిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నియంత్రణ రేఖ వద్ద పెట్రోలింగ్ విధులలో ఉన్న కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్, నాయబ్ సుబేదార్ పరమ్‌జీత్ సింగ్‌లను పాకిస్తానీ బోర్డర్ యాన్ టీమ్ సభ్యులు పట్టుకుని దారుణాతి దారుణంగా చంపి వాళ్ల తలలు నరికేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వాళ్ల మృతదేహాలు కనిపించాయి. ఈ దాడి వెనుక లష్కరే తాయిబా హస్తం ఉండి ఉంటుందని కూడా భారత ఆర్మీ వర్గాలు అనుమానిస్తున్నాయి. తన తండ్రి తలకు బదులుగా తనకు 50 మంది పాకిస్తానీల తలలు కావాలని ప్రేమ్ సాగర్ కుమార్తె అన్నారు. నాయబ్ సుబేదార్ పరమ్‌జీత్ సింగ్ గ్రామం తనన్ తరన్‌లో కూడా ఉద్రిక్తత నెలకొంది. తన భర్త మృతదేహం తమకు చూపించనిదే అది ఆయనదని ఒప్పుకునేది లేదని సైనికుడి భార్య పరమ్‌జీత్ కౌర్ పట్టుబట్టారు. తీరా తలలేని మృతదేహాన్ని చూపించడంతో.. తన తండ్రి తల ఎక్కడుందని 12 ఏళ్ల కుమార్తె అమాయకంగా ప్రశ్నించింది. దానికి అక్కడున్న ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేకపోయారు. -
పార్లమెంటు రేపటికి వాయిదా
అత్యంత కష్టమ్మీద కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం పార్లమెంటు ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. గత నెలలో జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2011లో సభలో ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లును ఆహార శాఖమంత్రి కేవీ థామస్ ముందుగా ఉపసంహరించుకుని, ఆ తర్వాత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇందులో రాష్ట్రాల హక్కుల్లో జోక్యం విషయం లేదని, సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం కాదని థామస్ తెలిపారు. ఆహారాన్ని ఒక హక్కుగా ఇవ్వడానికే ఈ బిల్లు ఉద్దేశించామన్నారు. అయితే ఆహార భద్రత కంటే సరిహద్దు భద్రత మరింత ముఖ్యమని లోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్ ఈ సందర్భంగా తెలిపారు. జమ్ము కాశ్మీర్లో సైనికుల హత్యపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తన విధానాన్ని స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆహార భద్రత బిల్లు రాష్ట్రాల హక్కులకు విరుద్ధంగా ఉందంటూ అన్నాడీఎంకే సభ్యుడు ఎ.తంబిదురై దాన్ని వ్యతిరేకించారు. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందే రాష్ట్రాలను సంప్రదించి ఉండాల్సిందన్నారు. బిల్లుకు కొన్ని సవరణలు చేయాలని యూపీఏ మాజీ మిత్రపక్షం డీఎంకేకు చెందిన టీఆర్ బాలు అన్నారు. ఈ గందరగోళం నడుమ స్పీకర్ మీరాకుమార్ లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు. ఆహార భద్రత బిల్లుపై చర్చకు ఆరు గంటలు కేటాయించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. గురువారం లేదా వచ్చే సోమవారం చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. అయితే, ఉభయ సభల్లో కాశ్మీర్ అంశం తీవ్ర గందరగోళానికి కారణమైంది. దీనిపై రక్షణ మంత్రి ఆంటోనీ ఇచ్చిన సమాధానం పార్లమెంటును కుదిపేసింది. ఈ సంఘటనపై భారత ఆర్మీ చెప్పేదానికి, ఆంటోనీ చెప్పిన విషయాలకు పొంతన కుదరకపోవడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. లోక్‌సభ పదే పదే వాయిదా పడగా రాజ్యసభలో బీజేపీ సభ్యులు కార్యకలాపాలను స్తంభింపజేశారు. లోక్ సభ సమావేశం కాగానే విపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ పాకిస్థానీ సైనికుల దాడి విషయంలో ఆంటోనీ తీరును తప్పుబట్టారు. ఆయన పాకిస్థాన్‌ను సమర్థిస్తున్నట్లుందని ఆమె అన్నారు. వామపక్షాల సభ్యులు కూడా ఇదే సమయంలో వెల్‌లోకి దూసుకెళ్లారు. పశ్చిమబెంగాల్లో విపక్షాలు, మహిళలు, బలహీనవర్గాలపై తృణమూల్ దాడులకు అంతులేకుండా పోతోందని వారు మండిపడ్డారు. అప్పుడే ఇరు సభల్లోనూ సీమాంధ్ర సభ్యులు తమ వాదనను గట్టిగా వినిపించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నోటికి నల్ల గుడ్డ కట్టుకుని వచ్చారు. రక్షణమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సభలోనే ఉన్నందున ఆయన కాశ్మీర్ సంఘటనపై వివరంగా ఓ ప్రకటన చేయాలని ఆమె కోరారు. తీవ్ర గందరగోళం చెలరేగడంతో ఉభయ సభలు తొలుత మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. అనంతరం రెండోసారి సమావేశమైన తర్వాత ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టినా, పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో అటు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీలు ఉభయ సభలను గురువారానికి వాయిదా వేశారు. -
పూంఛ్ ప్రాంతాన్ని సందర్శించిన ఆర్మీచీఫ్ బిక్రం సింగ్
పూంచ్ జిల్లాలో భారత సైనికులపై పాకిస్థాన్ మూకలు కాల్పులు జరిపి హతమార్చిన సంఘటనపై వాస్తవాలు పరిశీలించి, పూర్వాపరాలు తెలుసుకునేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ బుధవారం అక్కడకు చేరుకున్నారు. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిని కూడా ఆయన సమీక్షించనున్నారు. జనరల్ సింగ్ ముందుగా పూంఛ్ జిల్లాతో పాటు జమ్ము ప్రాంతంలో నియంత్రణ రేఖను పరిరక్షించే 16 కోర్ దళం ప్రధాన కార్యాలయం ఉన్న నగ్రోటాను సందర్శించారు. అనంతరం రాజౌరి వెళ్లి అక్కడ డివిజన్ ప్రధాన కార్యాలయంలో ఉన్న పలువురు సీనియర్ ఆర్మీ అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం పూంఛ్ వద్దకు వెళ్లి అక్కడ నియంత్రణ రేఖ సమీపంలో భద్రత పరిస్థితిని సమీక్షించారు. పాకిస్థానీ సైనిక దుస్తులలో ఉన్న దాదాపు 20 మంది వచ్చి పూంఛ్ సెక్టార్‌లోని చకన్ దా బాగ్ ప్రాంతంలో భారత సైనికులపై కాల్పులు జరిపి ఐదుగురిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో భారత సైన్యంలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారికి అండగా ఉండేందుకు బిక్రం సింగ్ అక్కడకు వెళ్లారు. -
సైనికుల కాల్చివేతపై ప్రకటనను సమర్థించుకున్న ఆంటోనీ
ఐదుగురు భారత సైనికులను పాకిస్థాన్ మూకలు కాల్చి చంపిన సంఘటనపై పార్లమెంటులో తాను చేసిన ప్రకటనను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సమర్థించుకున్నారు. తనకు మరిన్ని వివరాలు అందిన వెంటనే వాటిని పార్లమెంటుకు సమర్పిస్తానన్నారు. ఈ సంఘటనపై ఆంటోనీ మంగళవారం పార్లమెంటులో చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. పాకిస్థానీ సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారనడం వాళ్లు తప్పించుకోడానికి అవకాశం ఇచ్చినట్లేనని తీవ్రంగా విమర్శించాయి. మంత్రి ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించాయి. అయితే, 'రక్షణ మంత్రిగా ఏవైనా ప్రకటనలు చేసేటప్పుడు నేను జాగ్రత్తగానే ఉంటాను. నేను నిన్న ఓ ప్రకటన చేశాను. ఈరోజు ఆర్మీ చీఫ్ బిక్రం సింగ్ అక్కడకు వెళ్లారు. నాకు మరిన్ని వివరాలు తెలియగానే వాటిని మీ ముందుంచుతాను' అని ఆయన రాజ్యసభలో బుధవారం తెలిపారు. పార్లమెంటుతో పాటు భారతదేశం మొత్తం జాతి భద్రత, సమగ్రత విషయంలో ఒక్కటిగానే ఉన్నట్లు ఆంటోనీ చెప్పారు. అయితే, ఆంటోనీ ఇచ్చిన సమాధానం బుధవారం కూడా పార్లమెంటును కుదిపేసింది. ఈ సంఘటనపై భారత ఆర్మీ చెప్పేదానికి, ఆంటోనీ చెప్పిన విషయాలకు పొంతన కుదరకపోవడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. లోక్‌సభ పదే పదే వాయిదా పడగా రాజ్యసభలో బీజేపీ సభ్యులు కార్యకలాపాలను స్తంభింపజేశారు. లోక్ సభ సమావేశం కాగానే విపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ పాకిస్థానీ సైనికుల దాడి విషయంలో ఆంటోనీ తీరును తప్పుబట్టారు. ఆయన పాకిస్థాన్‌ను సమర్థిస్తున్నట్లుందని ఆమె అన్నారు. వామపక్షాల సభ్యులు కూడా ఇదే సమయంలో వెల్‌లోకి దూసుకెళ్లారు. పశ్చిమబెంగాల్లో విపక్షాలు, మహిళలు, బలహీనవర్గాలపై తృణమూల్ దాడులకు అంతులేకుండా పోతోందని వారు మండిపడ్డారు. అప్పుడే ఇరు సభల్లోనూ సీమాంధ్ర సభ్యులు తమ వాదనను గట్టిగా వినిపించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నోటికి నల్ల గుడ్డ కట్టుకుని వచ్చారు. రక్షణమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సభలోనే ఉన్నందున ఆయన కాశ్మీర్ సంఘటనపై వివరంగా ఓ ప్రకటన చేయాలని ఆమె కోరారు. తీవ్ర గందరగోళం చెలరేగడంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. -
పార్లమెంటు ఉభయ సభలు వాయిదా
వరుసగా మూడోరోజు కూడా పార్లమెంటు సమావేశాలకు ఆటంకాలు తప్పలేదు. తొలి రెండు రోజులు సమైక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎంపీలు సభను హోరెత్తించి వాయిదా వేయిస్తే మూడోరోజు బుదవారం నాడు పాకిస్థాన్ సైనికులు జమ్ము కాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లోకి చొచ్చుకొచ్చి మరీ భారత సైనికులను హతమార్చిన వైనంపై ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఉభయ సభలను అట్టుడికించింది. దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న మెతక వైఖరి వల్లే పాకిస్థాన్ చెలరేగిపోతోందని, పదే పదే మన దేశం మీద దాడులకు పాల్పడుతూ జవాన్ల విలువైన ప్రాణాలను హరిస్తోందని బీజేపీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజీనామా చేసి తీరాల్సిందేనని బీజేపీ గట్టిగా పట్టుబట్టింది. లోక్‌సభతో పాటు రాజ్యసభలో కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఈ అంశంపై ప్రభుత్వాన్ని దునుమాడారు. రాజ్యసభలో రక్షణమంత్రి ఆంటోనీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని పార్లమెంట్లో బీజేపీ డిమాండ్ చేసింది. విపక్షాల గలభాతో లోక్‌సభ, రాజ్యసభ రెండూ మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. -
పాక్ చర్యలను బట్టే భారత్ స్పందన: ఏకే ఆంటోనీ
కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో భారత జవాన్ల కాల్చివేతపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన చేశారు. పాకిస్థాన్ చర్యలను బట్టే భారతదేశం స్పందన కూడా ఉంటుందని ఆయన తెలిపారు. పాకిస్థానీ సైన్యం యూనిఫాం ధరించిన వ్యక్తులతో కలిసి ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తమకు కచ్చితమైన సమాచారం ఉందని ఆయన తెలిపారు. అంతకుముందు పాకిస్థాన్ దుశ్చర్యపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఈ అంశంపై ఓ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దీనిపై చర్చిద్దామని అధ్యక్ష స్థానంలో ఉన్న పీజే కురియన్ సూచించినా వెంకయ్యనాయుడు తన వాదనను కొనసాగించారు. ప్రభుత్వం దీనిపై స్పందించి తీరాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. లోక్‌సభ సమావేశం కాగానే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, పాకిస్థాన్ దుశ్చర్య అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోనే లేచి నిలబడి, భారత సైనికుల హత్యను లేవనెత్తారు. సమాజ్‌వాదీ అద్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ ఎంపీ శైలేంద్రకుమార్ దీనిపై వాయిదా తీర్మానం లేవనెత్తారు. ఈ గందరగోళంతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది.