సీఎం మాట్లాడిన తర్వాతే అంత్యక్రియలు!
జమ్ము కశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్‌లో విధులు నిర్వహిస్తూ, పాక్ సైనికుల చేతిలో దారుణంగా హతమైన కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ అంత్యక్రియలు ఎట్టకేలకు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని అతడి స్వగ్రామం దేవారియాకు మృతదేహం వచ్చిన 11 గంటల తర్వాత ఈ కార్యక్రమం జరగడం గమనార్హం. మృతదేహాన్ని పెట్టెలో మూతవేసి తీసుకొచ్చారని, దానిమీద జెండా కూడా కప్పేశారని, అసలు అది తమవాళ్లదేనన్న నమ్మకం ఏంటని ప్రశ్నించిన ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులు.. అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడాల్సిందేనని పట్టుబట్టారు. వాళ్లు అదే పట్టుదలతో ఉండటంతో అర్ధరాత్రి సమయంలో సీఎం యోగి ఫోన్ చేశారు. ప్రేమ్ సాగర్ పెద్ద కొడుకుతో మాట్లాడారు. 13 రోజుల శ్రాద్ధ కర్మలు ముగిసేలోపు తప్పనిసరిగా తాను దేవరియా వస్తానని, ప్రేమ్ సాగర్ పేరుమీద ఒక పాఠశాల, స్మారక చిహ్నం ఏర్పాటు చేయిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
నియంత్రణ రేఖ వద్ద పెట్రోలింగ్ విధులలో ఉన్న కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్, నాయబ్ సుబేదార్ పరమ్‌జీత్ సింగ్‌లను పాకిస్తానీ బోర్డర్ యాన్ టీమ్ సభ్యులు పట్టుకుని దారుణాతి దారుణంగా చంపి వాళ్ల తలలు నరికేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వాళ్ల మృతదేహాలు కనిపించాయి. ఈ దాడి వెనుక లష్కరే తాయిబా హస్తం ఉండి ఉంటుందని కూడా భారత ఆర్మీ వర్గాలు అనుమానిస్తున్నాయి. తన తండ్రి తలకు బదులుగా తనకు 50 మంది పాకిస్తానీల తలలు కావాలని ప్రేమ్ సాగర్ కుమార్తె అన్నారు.
నాయబ్ సుబేదార్ పరమ్‌జీత్ సింగ్ గ్రామం తనన్ తరన్‌లో కూడా ఉద్రిక్తత నెలకొంది. తన భర్త మృతదేహం తమకు చూపించనిదే అది ఆయనదని ఒప్పుకునేది లేదని సైనికుడి భార్య పరమ్‌జీత్ కౌర్ పట్టుబట్టారు. తీరా తలలేని మృతదేహాన్ని చూపించడంతో.. తన తండ్రి తల ఎక్కడుందని 12 ఏళ్ల కుమార్తె అమాయకంగా ప్రశ్నించింది. దానికి అక్కడున్న ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేకపోయారు.