
కోల్ కతా: మహా కుంభ మేళాను ‘మృత్య్ కుంభ్’గా ఆరోపించారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు రావడంతో దానిపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చే యత్నం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ ఆమె స్పష్టం చేశారు. తాను ప్రతీ మతాన్ని గౌరవిస్తానని, కానీ తాను చేసిన వ్యాఖ్యలు ఒకటైతే దాన్ని వేరే రకంగా చిత్రీకరించే యత్నం జరిగిందన్నారు మమతా. ప్రధానంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అసెంబ్లీ వేదికగా .. మమతా వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు మమతా.
‘యోగి నాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలతో నాకు బొప్పి ఏమీ కట్టదు. ఒక సీఎంగా యోగికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను. నేను ఆరోజు చెప్పింది ఒక్కటే. మహా కుంభమేళా ఏర్పాట్లు సరిగా చేయని కారణంగా కొన్ని కుటుంబాల మీద ప్రభావం పడింది. మీరు వారికి డెత్ సర్టిఫికేట్లు, పోస్ట్ మార్టమ్ సర్టిఫికేట్లు ఇవ్వకపోయినా ఇక్కడకు వచ్చిన తర్వాత మేము వారికి పోస్ట్ మార్టమ్ నిర్వహించాం. మిగతా రాష్ట్రాల్లో ఏమి జరిగిందో నాకైతే తెలీదు. మీరు వారికి పరిహారం ప్రకటించి ఉంటే పరిహారం ఇవ్వండి’ అని మమతా ఘాటుగా స్పందించారు.
ప్రజలు భారీ సంఖ్యలో హాజరైటప్పుడు వారికి తగిన సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అసలు ఎంతమంది వస్తున్నారు.. ఏర్పాట్లు ఎలా ఉండాలి అనేది ముందుకు పర్యవేక్షించుకోవాలి.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. అంతేకానీ మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తోంది అనే హైప్ ఇక్కడ అవసరం లేదు. కుంభమేళా అనేది 2014లో కూడా వచ్చింది. ఏది అవసరమో అది చేయాలి కానీ అవసరం లేనిది అక్కర్లేదు’ అంటూ మమతా చురకలంటించారు. తమ రాష్ట్రంలో కూడా దుర్గా పూజ ఘనంగా నిర్వహిస్తామని, ఆ సమయంలో ప్రతి నిమిషం దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment