మమతా బెనర్జీపై యోగి ఆదిత్యానాథ్‌ ఆగ్రహం | UP CM Yogi Criticize Mamata Banerjee Over Maha Kumbh Comments | Sakshi
Sakshi News home page

కుంభమేళాపై వ్యాఖ్యలు.. మమతా బెనర్జీపై యోగి ఆదిత్యానాథ్‌ ఆగ్రహం

Published Wed, Feb 19 2025 4:04 PM | Last Updated on Wed, Feb 19 2025 4:38 PM

UP CM Yogi Criticize Mamata Banerjee Over Maha Kumbh Comments

లక్నో: మహా కుంభమేళాపై వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీసేలా ఆమె మాట్లాడారాంటూ బుధవారం అసెంబ్లీ వేదికగా మండిపడ్డారాయన.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) మహా కుంభమేళాను మృత్యు కుంభమేళాగా  అభివర్ణించిన విషయం తెలిసిందే. కుంభమేళా నిర్వహణలో యూపీ ప్రభుత్వం(UP Government) ఘోరంగా విఫలమైందని తీవ్ర విమర్శలే గుప్పించారామె. అయితే ఆమె వ్యాఖ్యలపై అసెంబ్లీలోసీఎం యోగి ఇవాళ స్పందించారు.  

మహా కుంభమేళా(Maha Kumbh Mela) ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 56 కోట్ల మంది సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. నిరాధారమైన ఆరోపణలతో ఆమె వాళ్లందరి విశ్వాసాలతో ఆటాడుకున్నారు అని సీఎం యోగి మండిపడ్డారు. జనవరి చివర్లో ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా ఘాట్‌ల వద్ద తొక్కిసలాట జరిగి 30 మంది మరణించారు. కుంభమేళా తొక్కిసలాట మృతులకు, వివిధ రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వచ్చి మృత్యువాత చెందిన వాళ్లకు అసెంబ్లీ వేదికగా సంతాపం ప్రకటించారాయన. ఈ క్రమంలో.. దీదీ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.

కుంభమేళా మృతులకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుంది. కానీ, ఇలాంటి సున్నితమైన అంశాన్ని కూడా రాజకీయం చేయడం ఏంటి?. ఈ కుంభమేళాలో దేశం.. ప్రపంచమే పాల్గొంటోంది. అలాంటప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలను పట్టించుకోవాల్సిన పనేముంది? అని అన్నారాయన. 

ఇదిలా ఉంటే.. యోగి మాత్రమే కాదు పలువురు బీజేపీ నేతలు కూడా మమత వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీహార్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ.. మత విశ్వాసాలు లేనివాళ్లే అలాంటి సిగ్గుమాలిన ప్రకటనలు చేస్తారంటూ మండిపడ్డారు. మరోవైపు హిందూ సంఘాలు కూడా దీదీపై విరుచుకుపడుతున్నాయి. 

దీదీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ..

మహా కుంభమేళాపై వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయితే.. దీదీ వ్యాఖ్యలకు ఓ అనూహ్య మద్దతు లభించింది. ఉత్తరాఖండ్‌ జ్యోతిష్‌ పీఠ్‌ 46వ శంకారాచార్య అయిన స్వామి అవిముక్తేశ్వరానంద్‌ సరస్వతి(సద్గురు) మమత వ్యాఖ్యలతో ఏకీభవించారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో వందల కిలోమీటర్లు ట్రాఫిక్‌ జామ్‌ ఉంటోంది. భక్తులకు సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. ఇది నిర్వహణ లోపం కాకుంటే మరేమిటి?. మహా కుంభమేళా రాబోతోందని మీకు తెలియదా?. అలాంటప్పుడు మీరు చేసే ఏర్పాట్లు ఇవేనా? అంటూ యోగి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement