
త్రివేణి సంగమంలో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం
గంగ, యమున నదుల్లో వ్యర్థాలు చేరకుండా చర్యలు చేపట్టాం
కుంభమేళాపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపాటు
లక్నో: మహా కుంభమేళాపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, పవిత్రమైన కార్యక్రమాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా కుట్రలకు పాల్పడుతున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. మహాకుంభమేళాను, సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కుంభమేళా కేవలం ఒక మతపరమైన కార్యక్రమం కాదని చెప్పారు.
భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని స్పష్టంచేశారు. మన ప్రాచీన గ్రంథాల్లో కూడా కుంభమేళా ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. మహా కుంభమేళాలో ఇప్పటిదాకా 56 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని వివరించారు. కుంభమేళా ప్రాధాన్యతను తగ్గించడానికి విపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. భారతీయ ఆత్మ అయిన సనాతన ధర్మం గౌరవాన్ని మరింత పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.
ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలోని నీళ్లు స్నానానికి పనికిరావంటూ కొన్ని సంస్థలు, వ్యక్తులు చేస్తున్న వాదనను యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. త్రివేణి సంగమంలో నీళ్లు కలుషితమయ్యాయంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కుంభమేళా గురించి అసలేమీ తెలియని వాళ్లే ఇలాంటి దుష్ప్రచారానికి తెరతీశారని ధ్వజమెత్తారు. అక్కడి నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని స్పష్టంచేశారు. కేవలం స్నానాలకే కాదు, తాగడానికి సైతం ఆ నీళ్లు పనికొస్తాయని తేల్చిచెప్పారు. కుంభమేళాలో స్నానం, ఆచమనం నిరభ్యంతరంగా ఆచరించవచ్చని ఉద్ఘాటించారు. ఇటీవల కొన్ని అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని నిర్ధారించాయని గుర్తుచేశారు. గంగ, యమున నదుల్లో వ్యర్థాలు చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు.
మృత్యుకుంభ్ అనడం దారుణం
దేశం యావత్తూ ఘనంగా నిర్వహించుకుంటున్న పవిత్రమైన వేడుకపై ప్రతిపక్షాలు బురదజల్లడం హిందువుల మనోభావాలను గాయపరుస్తోందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. మహాకుంభ్‌ను వ్యతిరేకిస్తున్న వాళ్లే రహస్యంగా త్రివేణి సంగమానికి వెళ్లి పవిత్ర స్నానాలు చేస్తున్నారని విపక్ష నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహాకుంభ్ కాదు...మృత్యుకుంభ్ అనడం దారుణమని విపక్ష నేతలపై మండిపడ్డారు. కుంభమేళాలో తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని వెల్లడించారు. బాధ్యతల నుంచి తాము తప్పించుకోవడం లేదన్నారు. తొక్కిసలాట ఘటనలో 30 మంది మరణించగా, 36 మంది గాయపడినట్టు తెలియజేశారు. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి వస్తూ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన భక్తుల కుటుంబాలను కూడా ఆదుకుంటామని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment