water quality
-
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఏపీ తాగునీరే సేఫ్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకెల్లా మన ఏపీలోని బోరు, బావుల్లోని తాగునీరే అత్యంత సురక్షితమని తేలింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అన్ని రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లోని బోర్లు, బావుల నీటికి నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో వంద శాంపిల్స్కుగాను 14 నమూనాల్లో వివిధ రకాల కాలుష్య కారకాలను గుర్తించారు. కానీ, మన రాష్టంలో మాత్రం వందకు నాలుగు శాంపిల్స్‌లో మాత్రమే అవి ఉన్నట్లు తేలింది. ఈ పరీక్షల ఫలితాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. అలాగే, ఏపీలో మూడు నాలుగేళ్ల కిందట నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఎక్కువగా కనిపించేవని.. అయితే, గత మూడేళ్లగా రాయలసీమ జిల్లాలతో సహా రాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాల్లో నీటి నాణ్యత చాలాబాగా మెరుగైనట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వెల్లడించారు. కాలుష్య కారకాలు.. వాటితో దుష్ఫలితాలు.. వైద్యులు పేర్కొంటున్న వివరాల ప్రకారం.. ► మెర్క్యూరీ ఉన్న నీటిని దీర్ఘకాలం తాగితే మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► క్లోరైడ్ కారకం ఉండే నీటిని తాగితే రక్తపోటు వ్యాధులకు గురవుతుంటారు. ► లెడ్ వంటివి చిన్న పిల్లల ఎదుగుదల మీద, పెద్దల్లో కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ► ఇక ఫ్లోరైడ్‌తో కీళ్ల వ్యాధులు రావడంతో చిన్న వయస్సులో పళ్లు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో.. ప్రజల తాగునీటిలో కలుషిత కారకాలను గుర్తించడానికి ప్రభుత్వం ముందస్తుగానే ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటుంది. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 2.60 లక్షల బోర్లు, బావుల్లో నీటికి ఏటా ఒకసారి.. అలాగే, దాదాపు 50 వేలకు పైబడి రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరాచేసే నీటికి ఏటా రెండు విడతల చొప్పున ఆర్డబ్ల్యూఎస్ విభాగం, రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలు చేపడుతుంది. ఇక ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 107 నీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌లు ఉండగా, వాటిల్లో మొత్తం 21 రకాల కలుషిత కారకాలను గుర్తించే సౌలభ్యం ఉంది. పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్లో పొందుపర్చాల్సి ఉంటుంది. పరీక్షల్లో మన రాష్ట్రమే ఫస్ట్ మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా నాణ్యత పరీక్షలు నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లో 47,03,476 నీటి శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించగా.. అందులో మన రాష్ట్రం అత్యధికంగా 4,04,083 నమూనాలకు నిర్వహించింది. తర్వాత మధ్యప్రదేశ్ 4,01,022 శాంపిల్స్‌కు.. పశ్చిమ బెంగాల్లో 3,82,846 శాంపిల్స్‌కు పరీక్షలు జరిగాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా 3 లక్షల మించి పరీక్షలు నిర్వహించలేదు. నీటి నాణ్యతలోనూ ఏపీ చాలా మెరుగు మరోవైపు.. గత ఏడాది ఏపీలో పరీక్షలు నిర్వహించిన 4,04,083 శాంపిల్స్‌లో కేవలం 16,801 నమూనాల్లోనే కాలుష్య కారక ఆనవాళ్లు గుర్తించారు. అంటే మొత్తం శాంపిల్స్‌లో ఇది 4.15 శాతం మాత్రమే. అదే సమయంలో దేశం మొత్తం మీద 47,03,476 నీటి శాంపిల్స్‌కు నిర్వహించిన పరీక్షల్లో 6,73,687 శాంపిల్స్‌లో కలుషిత కారకాలు బయటపడ్డాయి. అంటే ఇది 14.32 శాతం. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక నీటి కాలుష్యం ఉన్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. -
పురుగు మందుల అవశేషాలకు చెక్
సాక్షి, అమరావతి: తాగునీటిలో ఉండే పురుగు మందుల అవశేషాలను గుర్తించే అత్యాధునిక నీటి పరీక్షల ల్యాబొరేటరీలు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమయ్యే లెడ్, మెర్క్యురీ, క్రోమియం వంటి లోహాలు తాగునీటిలో సూక్ష్మస్థాయిలో ఉన్నా ఈ అత్యాధునిక ల్యాబ్‌లు పసిగట్టేస్తాయి. గ్రామీణ ప్రజలు తాగునీటికి ఉపయోగించే బోరు బావులతోపాటు ప్రభుత్వ రక్షిత మంచినీటి పథకాల్లోని నీటి నమూనాలను గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు సేకరించి, నీటి నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందుకు గాను రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో మొత్తం 112 నీటి పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, పాలకొల్లుతోపాటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలోని నీటి పరీక్షా కేంద్రాలను ఒక్కొక్కటీ రూ.6 కోట్లతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆధునికీకరించింది. వీటిలో వినియోగించే అత్యాధునిక యంత్ర సామగ్రిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. ల్యాబ్‌ల నిర్వహణ సైతం అమెరికన్ సంస్థ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. 4 ల్యాబ్‌ల ఏర్పాటు పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తెలిపారు. మరో 4 ల్యాబ్‌ల ఆధునికీకరణకు ప్రతిపాదన జోన్ల వారీగా రాష్ట్రంలో మరో నాలుగు నీటి పరీక్షల ల్యాబ్‌లను కూడా ఈ తరహాలోనే ఆధునికీకరించేలా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించి విశాఖలో, రాయలసీమ నాలుగు జిల్లాలకు సంబంధించి కడపలో, విజయవాడలో ఒకటి, ప్రకాశం జిల్లాలో మరొకటి ఈ తరహా అత్యాధునిక ల్యాబ్‌ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏలూరు ఘటన తర్వాత సీఎం ఆదేశాల మేరకు సుమారు ఏడాది క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతంలో అంతుచిక్కని సమస్యతో ఒకే రోజున పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారినపడ్డారు. పురుగు మందుల అవశేషాలతో కూడిన నీటిని తాగడం వల్లే ఆ సమస్య ఉత్పన్నమై ఉండొచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో పురుగు మందుల వాడకం పెరగడం వల్ల నీటి కాలుష్యానికి ఎక్కువగా అవకాశం ఉందన్న అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, తాగునీటిలో దాగి ఉండే పురుగుమందుల అవశేషాలను, మెర్క్యురీ వంటి ప్రమాదకర సూక్ష్మస్థాయి మెటల్స్ను గుర్తించడానికి నీటి పరీక్ష కేంద్రాలు ఇప్పటివరకు రాష్ట్రంలో అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యాధునిక నీటి పరీక్షల ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మొదటగా నాలుగు ల్యాబ్‌లను ఆధునికీకరించారు. -
ఫ్లోరైడ్ తగ్గింది.. నీటి నాణ్యత పెరిగింది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించే బోరు బావుల్లో నీటి నాణ్యత గతం కంటే బాగా మెరుగుపడినట్టు తేలింది. ప్రత్యేకించి గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కోసం వినియోగించే వివిధ రకాల నీటి వనరులకు అధికారులు పరీక్షలు నిర్వహించగా.. ఫ్లోరైడ్ తదితర కాలుష్య కారకాలు అతి తక్కువ చోట్ల ఉన్నట్టు స్పష్టమైంది. తాగునీటి అవసరాలకు ఉపయోగించే వనరులలోని నీటికి గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఒకసారి, ఆరు నెలల తర్వాత మరోసారి తప్పనిసరిగా నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆరున్నర నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వివిధ చోట్ల మొత్తం 1,80,608 నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేయించారు. వాటిలో 6,432 నీటి నమూనాల్లో ఫ్లోరైడ్ లేదా ఇతర ప్రమాదకర కాలుష్యాలు ఉన్నట్టు తేలింది. అంటే మొత్తం పరీక్షలలో కేవలం 3.5 శాతం నీటి నమూనాలలోనే కాలుష్య కారకాలను గుర్తించారు. గతంలో వివిధ సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సేకరించిన నీటి నమూనాల్లో 15 శాతానికి పైగా ఫ్లోరైడ్ వంటి కారకాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు నిర్ధారణ అయిన సందర్భాలు ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,432 చోట్ల కాలుష్య కారకాలను గుర్తించగా.. వాటిలో 6,396 చోట్ల వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు కూడా పూర్తి చేసినట్టు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు వెల్లడించారు. గత రెండేళ్లగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టాలు పెరగడం, సురక్షిత తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల వల్ల రాష్ట్రంలో కలుషిత నీటి జాడలు బాగా తగ్గినట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెప్పారు. పరీక్షల్లో మన రాష్ట్రమే టాప్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ముందే నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 1,99,785 నీటి నమూనాలు సేకరించి, వాటిలో 1,80,608 నమూనాలకు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. దేశంలో మరే రాష్ట్రం లక్షన్నర నీటి నమూనాలకు మించి పరీక్షలు నిర్వహించలేదు. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ 1.49 లక్షల నీటి నమూనాలను సేకరించి, అందులో 1.26 లక్షల నమూనాలకు పరీక్షలు నిర్వహించి రెండో స్థానంలో ఉంది. -
తాగునీటి పరీక్షల్లో మనమే ముందు
సాక్షి, అమరావతి: తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగించే బోర్లు, ఇతర స్టోరేజీ ట్యాంకుల్లో నిల్వ ఉంచిన నీరు ఫ్లోరైడ్ వంటి ఇతర ప్రమాదకర కారకాలు లేకుండా సురక్షితమైనదేనా అని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నీటి వనరులో నమూనాకు ఏటా నాణ్యత పరీక్షలు చేస్తుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు చివరి వరకు (5 నెలల్లో) దేశం మొత్తంలో 8,78,667 నీటి నమూనాలకు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. అందులో దాదాపు ఐదోవంతు అంటే 1,63,065 నమూనాల పరీక్షలు మన రాష్ట్రంలో నిర్వహించినవే. పలు పెద్ద రాష్ట్రాలతో సహా దేశంలోని మిగిలిన వాటిలో మరే రాష్ట్రంలోను లక్షకు మించి నీటి నాణ్యత పరీక్షలు జరగలేదు. కేంద్ర ప్రభుత్వమే ఈ వివరాలను తమ వెబ్ పోర్టల్‌లో తెలిపింది. రాష్ట్ర గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగం ఆధ్వర్యంలో మొత్తం 112 నీటినాణ్యత పరీక్ష కేంద్రాలున్నాయి. రాష్ట్రస్థాయిలో ఒకటి, ప్రతి జిల్లా కేంద్రంలోను, డివిజన్ కేంద్రంలోను ఒకటి వంతున ఈ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగించే నీటివనరుల నుంచి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటివరకు 1,81,518 నీటి నమూనాలను సేకరించగా, వాటిలో 1,63,065 నమూనాల నాణ్యత పరీక్షలు పూర్తిచేసి ఎటువంటి కలుషిత కారకాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత ఆ వనరుల్లో నీటిని తాగునీటిగా ఉపయోగించుకోవడానికి అనుమతించినట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 12 ల్యాబ్‌లకు కొత్తగా నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ సర్టిఫికెట్ పొందినట్టు చెప్పారు. -
అంతర్జాతీయ స్థాయిలో.. తాగునీటి ల్యాబ్‌లు
సాక్షి, అమరావతి: తాగునీటిలో అత్యంత సూక్ష్మస్థాయిలో దాగి ఉండే విషపూరిత కారకాలను ముందే పసిగట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌లను పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరిస్తోంది. సీసం, పాదరసం వంటి కొన్నిరకాల మూలకాలతో పాటు పురుగు మందుల అవశేషాలున్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించడంవల్ల క్యాన్సర్, కిడ్నీ సంబంధిత ప్రమాదకర రోగాల బారినపడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ ల్యాబ్‌లలో ఇలాంటి ప్రమాదకర కారకాలను గుర్తించే సౌకర్యాల్లేవని అధికారులు తెలిపారు. గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 112 ల్యాబ్‌లలో కేవలం ఫ్లోరైడ్, కాల్షియం, ఐరన్ వంటి 14 రకాల భారీ మూలకాలను మాత్రమే గుర్తించే వీలుంది. కానీ, అతి సూక్ష్మస్థాయిలోని ప్రమాదకర మూలకాలను, పురుగు మందుల అవశేషాలను గుర్తించే సామర్థ్యం ఈ ల్యాబ్‌లకు లేదు. ఈ నేపథ్యంలో.. 70 రకాల అతిసూక్ష్మ మూలకాలతో పాటు 24 రకాల పురుగుమందుల అవశేషాలను గుర్తించగలిగేలా ఈ ల్యాబ్‌లను ఆధునీకరించేందుకు ప్రభుత్వం పూనుకుంది. తద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో శుద్ధిచేసిన తాగునీటిని సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అమెరికా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ 10–15 రోజుల్లోనే ఆధునిక యంత్రాలను రాష్ట్రానికి పంపిస్తుందని అధికారులు తెలిపారు. ఏలూరు ఘటనతో చర్యలు వేగవంతం సాధారణంగా రైతులు పంటలపై పిచికారీ చేసిన పురుగు మందుల అవశేషాలు ఏదో ఒక రూపంలో నీటిలో కలిసిపోతుంటాయి. ఆ నీరే భూగర్భంలో ఇంకిపోవచ్చు.. లేదంటే సమీపంలో వాగులు వంకలతో పాటు అక్కడకు దగ్గరగా ఉండే సాగునీటి కాలువలలోనే కలిసే అవకాశం ఉంది. సాగునీటి కాల్వల ద్వారా పారే ఈ తరహా నీరు ఒక్కోసారి ప్రజల తాగునీటి అవసరాల కోసం ముందస్తుగా నీటిని నిల్వచేసే స్టోరేజీ ట్యాంకుల్లోనూ కలిసే అవకాశం ఉంటుంది. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పెద్ద సంఖ్యలో స్థానికులు అనారోగ్యానికి గురైన ఘటన ఈ కోవకు చెందిందే. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వైద్య నిపుణుల బృందం ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి తాగునీటిలో సీసం, పాదరసం వంటి మూలకాలతోపాటు కొన్ని పురుగు మందుల అవశేషాలున్నట్లు గుర్తించింది. ఇదే విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై తాగునీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌ల ఆధునీకరణకు పూనుకుంది. ముందుగా గోదావరి జిల్లాల్లో 4 ల్యాబ్‌లు.. ల్యాబ్‌ల ఆధునీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉభయ గోదావరి జిల్లాల్లోని నాలుగు ల్యాబ్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఏలూరు ప్రాంతంలోని ఓ ల్యాబ్‌తో పాటు ఇదే జిల్లాలో ఆక్వాసాగు ఎక్కువగా ఉండే నరసాపురం డివిజన్ పాలకొల్లులో మరొకటి.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలోని ల్యాబ్‌లనూ ఆధునీకరిస్తారు. వీటికి ఆధునిక నీటి పరీక్షల యంత్రాల సరఫరాతో పాటు ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ బాధ్యతలను అమెరికాకు చెందిన ‘పెర్కిన్ ఎలయర్’ సంస్థకు అప్పగించారు. అక్టోబర్ 1 నుంచి వాటిల్లో అన్ని రకాల నాణ్యత పరీక్షలు మొదవుతాయని అ«ధికారులు వెల్లడించారు. ఎగుమతులకు ముందు చేసే పరీక్షల్లాగే.. వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే ముందు వాటికి నాణ్యత పరీక్షలు చేయడం తప్పనిసరి. వాటిపై ఎలాంటి పురుగు మందుల అవశేషాల్లేవని నిర్ధారిస్తూ ల్యాబ్ సర్టిఫికెట్ ఉంటేనే ఓడలో లోడింగ్‌కు అనుమతిస్తారు. ఈ తరహా పరీక్షలనే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆధునీకరిస్తున్న ల్యాబ్‌లలో నిర్వహిస్తారు. ఇక్కడ ఒక్కో పరీక్షకు రూ.12 వేల చొప్పున ఫీజుగా చెల్లించాలి. ఏలూరు ఘటన సమయంలో హైదరాబాద్‌లో ఒక్కో శాంపిల్ పరీక్షకు రూ. 15 వేల చొప్పున ఫీజు చెల్లించినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. నిర్ణీత రుసుంకు ప్రైవేట్ వ్యాపారుల శాంపిల్స్‌ను కూడా పరీక్షించే ఆలోచన ఉందన్నారు. -
స్వచ్ఛత మనకు అందని మానిపండు..
‘స్వచ్ఛ’భారతంలో స్వచ్ఛత ఒక దేవతావస్త్రం. మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం తినే తిండి–ఎందులో చూసినా స్వచ్ఛత మనకు అందని మానిపండు. ప్రపంచ జల నాణ్యత సూచిలో మన దేశం అట్టడుగు నుంచి మూడోస్థానంలో ఉంది. మొత్తం 122 దేశాలతో కూడిన ఈ జాబితాలోమనది 120వ స్థానం. మన దేశంలో మనం తాగే నీటి తీరుతెన్నులపై ఒక సంక్షిప్త పరిశీలన. మన దేశంలో తాగేనీటి కోసం జనాలు అనుదినం అగచాట్లు పడుతూనే ఉన్నారు. నానా తంటాలు పడి తెచ్చుకున్న నీటితో దాహం తీర్చుకుంటే, ఆ నీటిలో స్వచ్ఛత కొరవడి వ్యాధుల బారిన పడుతున్నారు. మన దేశంలోని ఉపరితల, భూగర్భ జలాల్లో దాదాపు 70 శాతం కలుషిత జలాలే. దేశంలోనే అతిపెద్దదైన గంగానది సహా దేశంలోని నదుల నీటిలో విషపూరితమైన ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం, రాగి, ఇనుము, పాదరసం, సీసం వంటి భారలోహాలు చేరుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. దేశంలోని చాలాచోట్ల నీటి లభ్యతే అంతంత మాత్రం. ఇక దొరికే నీటిలో చాలా వరకు కలుషితమైనదే కావడంతో నీటికాలుష్యం ప్రజారోగ్య సమస్యగా మారింది. దేశంలోని నదీపరివాహక ప్రాంతాల్లోని గ్రామీణ ప్రజలు చాలామంది నదుల నుంచి సేకరించిన నీటిని నేరుగా తాగునీటిగా ఉపయోగించే పరిస్థితులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మన నదుల పరిస్థితి కేంద్ర జల మండలి పరిశోధనలో తేలిన అంశాల ప్రకారం దేశంలోని ప్రధానమైన నదులేవీ కాలుష్యానికి అతీతంగా లేవు. గంగానదీ జలాల్లో ఐదు ప్రమాదకరమైన భార లోహాలు– క్రోమియం, రాగి, నికెల్, సీసం, ఇనుము పరిమితికి మించి చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి. గంగానది సహా దేశంలోని 42 నదులలోని నీరు అత్యంత తీవ్రస్థాయిలో కలుషితమైనట్లు కేంద్ర జలమండలి నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఈ నదుల నీటిలో పరిమితికి మించి ప్రమాదకరమైన భార లోహాలు, ఇతర రసాయనాలు ఉన్నాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. యమున, గోమతి, అర్కావతి, ఓర్సంగ్, సబర్మతి, సరయు, రాప్తి, వైతరణి, గోదావరి, కావేరి, పెన్నా, నర్మద, తీస్తా, మహానది, బ్రహ్మపుత్ర, సువర్ణరేఖ, నాగావళి వంటి నదులలో సైతం ఈ భార లోహాలు పరిమితికి మించి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. కాలుష్య కాసారాలుగా మారిన ఈ నదుల పరివాహక ప్రాంతాల్లోని సాగుభూముల్లోకి, వాటి ద్వారా తిండిగింజల్లోకి, ఇతర ఆహార పంటల్లోకి ఈ విషపదార్థాలు ప్రమాదకరమైన స్థాయిలో చేరుతున్నాయి. కలుషితమైన నీటి కారణంగా మనం తినే తిండి కూడా కలుషితమవుతోంది. గనులు, తోలు, రబ్బర్, వ్యవసాయంలో మోతాదుకు మించి వాడే పురుగుమందులు, ఎరువులు, నదుల్లో పడవేసే ఘన వ్యర్థాలు వంటివన్నీ ఈ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్వహించిన అధ్యయనం ప్రకారం– దేశవ్యాప్తంగా 3,119 పట్టణాలు, నగరాలలో, కేవలం 209 పట్టణాలు, నగరాలలో వ్యర్థజాలాలను శుద్ధి చేసే సౌకర్యాలు పాక్షికంగా ఉన్నాయి. కేవలం 8 నగరాల్లో మాత్రమే వ్యర్థజలాలను శుద్ధి చేసే సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. దేశంలోని 114 నగరాలు శుద్ధి చేయని వ్యర్థజలాలను, సగం కాలిన శవాలను నేరుగా గంగా నదిలోకి వదిలేస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల నుంచి ప్రతిరోజూ 3835.4 కోట్ల లీటర్ల మురుగు నీరు విడుదలవుతోంది. ఈ నగరాల మురుగునీటి శుద్ధి సామర్థ్యం రోజుకు 1178.6 కోట్ల లీటర్లు మాత్రమే. మిగిలిన మురుగునీరంతా ఆయా నగరాలకు సమీపంలోని నదులకు, ఇతర జలాశయాలకు నేరుగా చేరుకుంటోంది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని 28 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడానికి 1429 కేంద్రాలను నెలకొల్పాయి. ఈ కేంద్రాలు దేశంలోని 293 నదులు, 94 సరస్సులు, 94 జలాశయాలు, 23 కాలువలు, 18 డ్రైనేజీలు, 411 బావులలోని నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా, మన దేశం నీటి నాణ్యత విషయంలో ఇంకా అట్టడుగు స్థానాల్లోనే కొనసాగుతుండటం గమనార్హం. ప్రమాదకర స్థాయిలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ దేశంలోని నగరాలు, పట్టణాల వద్ద ప్రవహించే నదీ ప్రాంతాల్లో నీటిలో బయెకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) అతి ఎక్కువగా, అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు సేకరించి, పరీక్షించిన శాంపుల్స్ ద్వారా వెల్లడైంది. నీటిలో ప్రతి లీటరుకు బీఓడీ 1–2 మిల్లీగ్రాముల వరకు ఉంటే ఆ నీరు పూర్తిగా స్వచ్ఛమైనది. బీఓడీ ప్రతి లీటరుకు 3–8 మిల్లీగ్రాముల మధ్య ఉంటే, నీరు ఒక మోస్తరు స్వచ్ఛమైనది. బీఓడీ లీటరుకు 8–20 మిల్లీగ్రాముల వరకు ఉంటే, ఆ నీరు ప్రమాదానికి చేరువలో ఉన్నట్లు లెక్క. నీటిలో బీఓడీ ప్రతి లీటరుకు 20 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఆ నీరు పూర్తిగా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లే లెక్క. బీఓడీ మోతాదు పెరిగే కొద్ది ఆ నీటిలో జలచరాల మనుగడ సాగించడం కష్టమవుతుంది. నీటిలో బీఓడీ పెరుగుదల కారణంగా జలచరాలకు ముప్పు వాటిల్లుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కొన్ని ప్రధానమైన నదుల్లో కోలిఫార్మ్ బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. గంగ, యమున, గోమతి, ఘాఘరా, చంబల్, మహి, వార్ధా, గోదావరి జలాల్లో కోలిఫార్మ్ బ్యాక్టీరియా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు నీటి నాణ్యత కేంద్రాల పరిశీలనలో తేలింది. నీటి కాలుష్యంతో తీవ్ర నష్టం దేశంలో పట్టణీకరణ పెరుగుతున్న కొద్ది నీటి వనరుల కాలుష్యం పెరుగుతూ వస్తోంది. ప్రతిరోజూ దాదాపు నాలుగు కోట్ల లీటర్ల వ్యర్థజలాలు నదుల్లోకి, ఇతర జలాశయాల్లోకి చేరుతున్నాయి. మన దేశంలోని నదుల ఎగువ ప్రాంతాల్లో కాలుష్యం పెరిగే కొద్ది దిగువ ప్రాంతాలకు ఆర్థిక నష్టం పెరుగుతూ వస్తోందని, ఫలితంగా ఈ ప్రాంతాల్లోని స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు మూడింట ఒకవంతు పడిపోతోందని ప్రపంచ బ్యాంకు ఒక అధ్యయనంలో తెలిపింది. నదుల దిగువ ప్రాంతాల్లో కాలుష్యం కారణంగా వ్యవసాయ దిగుబడులకు 16 శాతం వరకు, వ్యవసాయ ఆదాయానికి 9 శాతం వరకు నష్టం వాటిల్లుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం నీటి కాలుష్యం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా రూ.61 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. అంతేకాదు, నీటి కాలుష్యం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలతో దేశంలో ఏటా సుమారు నాలుగు లక్షల వరకు అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మరణాలు ‘కరోనా’ మహమ్మారి కారణంగా సంభవించిన మరణాల కంటే చాలా ఎక్కువ. ‘కలుషితమైన నీటిని వ్యవసాయానికి ఉపయోగిస్తుండటం వల్ల రైతులు నానా సమస్యలను ఎదుర్కొంటున్నారు. కలుషితమైన నీటి వల్ల మట్టి, అందులో పండే పంటలు కూడా కలుషితమవుతున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామం’ అని సెంటర్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్’ (సీఈఈడబ్ల్యూ) శాస్త్రవేత్త సుమిత్‌కుమార్ గౌతమ్ అభిప్రాయపడుతున్నారు. నీటిలో చేరిన రసాయనాల కారణంగా ఏర్పడుతున్న కాలుష్యం ఒక ఎత్తయితే, నదీతీరాలు ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రత లోపం, జంతు కళేబరాలను, పాడైన ఆహార వ్యర్థాలను యథేచ్ఛగా నదుల్లో పడేస్తూ ఉండటం తదితర కారణాల వల్ల నదుల నుంచి సరఫరా అయ్యే తాగునీటిలో సూక్ష్మజీవుల ఉధృతి పెరుగుతోంది. రక్షిత మంచినీటి సరఫరా లేని ప్రాంతాల్లోని వారు అపరిశుభ్రమైన పరిసరాల్లోని నదులు, చెరువులు, బావుల నీటినే తాగడానికి ఉపయోగిస్తుండటం వల్ల రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. నీటి నుంచి వ్యాపించే సూక్ష్మజీవుల వల్ల తలెత్తే డయేరియా, కలరా, డీసెంట్రీ, అమీబియాసిస్, ఫైలేరియా, హెపటైటిస్, టైఫాయిడ్ వంటి వ్యాధులతో దేశంలో ఏటా 3.77 కోట్ల మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధుల కారణంగా ఏటా దాదాపు 15 లక్షల మంది చిన్నారులు అకాల మరణాల పాలవుతున్నారు. ఫ్లోరైడ్ ప్రభావం మరో సమస్య ఉపరితల జలాలు భార లోహాలు, సూక్ష్మజీవుల కారణంగా కలుషితమవుతుంటే, దేశంలోని పలు చోట్ల భూగర్భ జలాలు మోతాదుకు మించిన ఫ్లోరైడ్‌తో ప్రజారోగ్యాన్ని కుదేలు చేస్తున్నాయి. దేశంలోని 19 రాష్ట్రాల్లోని 230 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ మోతాదుకు మించి ఉన్నట్లు వివిధ అధ్యయనాల్లో తేలింది. ఈ ప్రాంతాల్లో దాదాపు 2.50 కోట్ల మందికి పైగా ప్రజలు మోతాదుకు మించిన ఫ్లోరైడ్ నిండిన నీటిని తాగడం వల్ల ఫ్లోరోసిస్ ముప్పు అంచున మనుగడ సాగిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నీటిలో ఫ్లోరిన్ పరిమాణం ప్రతి లీటరుకు 1.0–1.5 మిల్లీగ్రాముల వరకు ఉండాలి. ఈ పరిమాణం కంటే తగ్గినా, పెరిగినా ఇబ్బందేనని తొలిసారిగా 1938లో అమెరికాలోని మెలాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్త గెరాల్డ్ కాక్స్ గుర్తించారు. నీటిలో తగిన మోతాదులో ఉండే ఫ్లోరిన్ దంతక్షయాన్ని నివారిస్తుంది. మోతాదుకు మించితే ఫ్లోరోసిస్ జబ్బుకు దారితీస్తుంది. ఈ జబ్బు బారిన పడిన వారిలో దంతాలపై మచ్చలు, ఎముకలు వంకర్లు పోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది మామూలుగా నడవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. నీటిలో ఫ్లోరిన్ మోతాదు ఎక్కువగా ఉంటే ఫ్లోరోసిస్‌తో పాటు ఆస్టియోపొరాసిస్, ఆర్థరైటిస్, ఎముకలు పెళుసుబారడం, కేన్సర్, మెదడు లోపాలు, అల్జీమర్స్ వ్యాధి, థైరాయిడ్ సమస్యలు కూడా తలెత్తుతాయి. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లోని భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ కాలుష్యం అత్యధికంగా ఉంటోంది. బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ కాలుష్యం మోతాదుకు మించి ఉంటోంది. ఫ్లోరిన్ కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కొన్ని ప్రాంతాల్లో సత్ఫలితాలను ఇస్తున్నాయి. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఇదివరకు ఫ్లోరోసిస్ తీవ్రత ఎక్కువగా ఉండేది. గడచిన ఐదేళ్లలో ఈ ప్రాంతంలో కొత్త ఫ్లోరోసిస్ కేసులేవీ నమోదు కాలేదు. ఇటుకల బట్టీలు, అల్యూమినియం, ఉక్కు కర్మాగారాలు, ఫాస్ఫేట్ ఎరువుల కర్మాగారాలకు చెందిన వ్యర్థాలను భూమిలో లోతైన గోతులను తవ్వి, వాటిలో పారవేస్తుంటాయి. వీటి వల్ల పరిసరాల్లోని భూగర్భ జలాల్లో రసాయనిక కాలుష్యం ఏర్పడుతోంది. కొన్ని రకాల ఫాస్ఫేట్ ఎరువుల కర్మాగారాల వ్యర్థాలు భూగర్భంలో చేరుతుండటం వల్ల భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ పరిమాణం మోతాదుకు మించి చేరుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 70 శాతం జనాభాకు మంచినీరు కొళాయిల ద్వారా సరఫరా అవుతుంటే, గ్రామీణ ప్రాంతాల్లో 18.4 శాతం జనాభాకు మాత్రమే కొళాయిల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోంది. కొళాయిల ద్వారా సరఫరా అవుతున్న మంచినీటి నాణ్యతపై కూడా పలుచోట్ల ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. చిట్లిపోయిన పైపుల్లోకి మురుగునీరు చేరడంతో కొన్ని చోట్ల కొళాయిల ద్వారా మురుగునీరు సరఫరా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, మంచినీటి పైపుల్లోకి మురుగునీరు చేరకుండా డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం, నదులలోకి ఘన వ్యర్థాలు చేరకుండా అరికట్టడం వంటి చర్యలను కట్టుదిట్టంగా చేపడితే తప్ప మన దేశంలోని నీటి నాణ్యత మెరుగుపడే పరిస్థితులు కనిపించడం లేదు. -
డైలీ చెక్!
సాక్షి సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోజలమండలి నిర్వహిస్తున్న 18మురుగుశుద్ధి కేంద్రాల్లో నీటి నాణ్యతను పరిశీలించేందుకు అత్యాధునిక సెన్సర్ల ఏర్పాటుకు వాటర్ బోర్డు శ్రీకారంచుట్టింది. ఔటర్ పరిధిలో రోజువారీగా వెలువడుతున్న 2800 మిలియన్లీటర్ల మురుగు నీటిలో జలమండలి సుమారు 750 మిలియన్ లీటర్ల నీటిని 18 మరుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేస్తుంది. అయితే శుద్ధి చేసిన నీటికి సంబంధించి నాణ్యత, రంగు, వాసన, గాఢత, కరిగిన ఘనపదార్థాలు, భార లోహాల ఆనవాళ్లు,రసాయనిక ఆనవాళ్లు , కాఠిన్యత, నీటిలో బురద రేణువుల శాతం, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం, విద్యుత్ వాహకత తదితరాలను సెన్సర్ల ద్వారా పరీక్షించి రోజువారీగా ఆన్లైన్లో ఖైరతాబాద్‌లోనిజలమండలి ప్రధాన కార్యాలయానికి చేరవేస్తారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల మేరకు నీటిశుద్ధి జరుగుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెన్సర్ల ఏర్పాటుకు ఆసక్తిగల సంస్థలను జలమండలి ఆన్లైన్ లో బహిరంగ ప్రకటన ద్వారా ఆహ్వానించింది. ఈ విధానాన్ని ఆన్లైన్ కంటిన్యూయస్ మానిటరింగ్ సిస్టం (ఓసీ ఈఎంఎస్) గా పిలుస్తారు. సెన్సర్ల నిర్వహణ బాధ్యతలను సైతం ఐదేళ్ల పాటు సదరు సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్టీపీలో సెన్సర్ల ఏర్పాటుకు సుమారు రూ.25 లక్షలు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. తుది వ్యయాన్ని ఖరారు చేసేందుకు జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చైర్మన్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా ప్రాజెక్టు, సాంకేతిక విభాగం డైరెక్టర్లు, ఎస్టీపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్, ఐటీ విభాగం జనరల్ మేనేజర్, ఎస్టీపీ డివిజన్ జీఎంలు ఉంటారు. ఈ విధానం సఫలీకృతం ఐతే సమీప భవిష్యత్‌లో సీవరేజి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఔటర్ పరిధిలో జలమండలి నిర్మించ తలపెట్టిన 65 ఎస్టీపీలకు సెన్సర్లు ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. మురుగు శుద్ధి మహా మాస్టర్ ప్లాన్.. మహానగరం నలుచెరుగులా ఉన్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి నిత్యం వెలువడుతోన్న వ్యర్థజలాలను శుద్ధిచేసేందుకు జలమండలి సీవరేజి మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధంచేసింది. ఈ ప్రణాళికలో ముందుగా నగరం నలుమూలలా నిత్యం 2133 మిలియన్ లీటర్ల మురుగు జలాలను శుద్ధిచేసేందుకు 65 చోట్ల మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ)నిర్మించాలని సంకల్పించింది. ఇందుకు ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్లతో కలిసి జలమండలి అధికారులు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తిచారు. ఎస్టీపీల నిర్మాణానికి సుమారు రూ.5 వేల కోట్ల వ్యయం అవుతుందని జలమండలి ప్రాథమికంగా అంచనావేసింది. నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను షా కన్సల్టెన్సీ సంస్థ సిద్ధం చేసింది. ఈ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. మరో మూడు నెలల్లో ఈ పనులకు మోక్షం లభించనుంది. సాకారం కానున్న మురుగు మాస్టర్‌ప్లాన్.. ప్రస్తుతం మహానగరం ఔటర్‌రింగ్ రోడ్డు వరకు శరవేగంగా విస్తరించింది. మొత్తంగా 1450 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీవరేజి మాస్టర్‌ప్లాన్ అమలుకానుంది. కోటిన్నరకు పైగా జనాభా..లక్షలాది గృహ, వాణిజ్య, సముదాయాలతో అలరారుతోంది. ప్రస్తుతం మహానగరంలో నిత్యం సుమారు 2800 మిలియన్ లీటర్ల మురుగుజలాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో జలమండలి ప్రస్తుతానికి 750 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను శుద్ధిచేసి మూసీలోకి వదిలిపెడుతోంది. మిగతా జలాలు సమీప చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాలు, మూసీని ముంచెత్తుతున్నాయి. మురుగు అవస్థలకుచరమగీతం గ్రేటర్ నగరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఔటర్‌రింగ్ రోడ్డు పరిధి వరకు సమగ్ర మురుగునీటి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశాం. దీంతో శివారువాసులకు మురుగునీటి అవస్థలు తప్పనున్నాయి. ఎస్టీపీలకు సెన్సర్ల ఏర్పాటు ద్వారా నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించి శుద్ధిచేసిన నీటిని గార్డెనింగ్, పారిశ్రామిక, నిర్మాణరంగ అవసరాలకు వినియోగించేందుకు అవకాశముంటుంది. గ్రేటర్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వాతావరణం పెంపొందించడం, మూసీతోపాటు చెరువులు, కుంటలు తదితర విలువైన జలవనరులు కాలుష్యం బారిన పడకుండా కాపాడవచ్చు. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
ఒక లీటర్ తాగి చెప్పండి..ఎలా ఉందో..!
న్యూఢిల్లీ : దేశంలోని ప్రముఖ నగరాల్లో నల్లా నీళ్ల నాణ్యతపై కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చేసిన సర్వేలో దేశ రాజధాని ఢిల్లీ నగర నల్లా నీళ్ల నాణ్యత అధ్వానంగా ఉందని వెల్లడైంది. ఢిల్లీతో పాటు మరో 13 నగరాల్లో నీటి నాణ్యత బాగోలేదని బీఐఎస్ పేర్కొంది. అయితే, నీటి నాణ్యత అంశాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ప్రజలకు మెరుగైన తాగునీటి వసతిని కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. (చదవండి : ముంబై నీళ్లు అమోఘం) ఇక బీఐఎస్ రిపోర్టుని తప్పుబట్టిన కేజ్రీవాల్‌పై విమర్శల దాడి కొనసాగుతోంది. దేశంలో అందరూ బీఎస్ఐ రిపోర్టును అంగీకరిస్తుండగా.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీ సీఎం యత్నిస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కేజ్రీవాలే నీటి సమస్యను రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి హర్షవర్దన్ విమర్శించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విటర్ వేదికగా.. ‘ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. నగర ప్రజలు తాగుతున్న నీరు మరీ అధ్వానంగా లేదని అంటున్నారు. మరైతే.. అక్కడి నీరు ఒక లీటర్ తాగండి. అప్పుడు తెలుస్తుంది. నీటి నాణ్యత ఎలా ఉందో’అని చురకలంటించారు. -
ముంబై నీళ్లు అమోఘం
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ నగరాల్లో నల్లా నీళ్ల నాణ్యతపై కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చేసిన ఈ సర్వేలో దేశం మొత్తం మీద ముంబై నగర నల్లా నీళ్లే స్వచ్ఛమైనవని తేలింది. మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైతోపాటు 20 రాష్ట్రాల రాజధానుల్లో ఈ సర్వే నిర్వహించారు. దీనిపై మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. సర్వే జరిపిన అన్ని నగరాల్లోకెల్లా ఒక్క ముంబై నగర నమూనాల్లోనే అవసరమైన 11 బీఎస్ఐ పరామితుల నాణ్యత ఉన్నట్లు తేలిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అయ్యే పైపులు, నల్లాల నాణ్యతను పెంచడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. బీఐఎస్ ప్రమాణాలు అందుకోవడంలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలు విఫలమయ్యాయని తేలగా, తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్, అమరావతి, భువనేశ్వర్, రాంచీ, రాయ్‌పూర్, సిమ్లా, చండీగఢ్, గుహవాటి, బెంగళూరు, గాంధీనగర్, లక్నో, జమ్మూ, డెహ్రాడూన్ కూడా ఈ ప్రమాణాలు అందుకోలేకపోయాయని తెలుస్తోంది. సర్వే జరిపిన బీఐఎస్ సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ మాట్లాడుతూ.. మూడో దశ సర్వేను ఈశాన్య రాష్ట్రాల రాజధానులు, 100 స్మార్ట్ సిటీల్లో జరపనున్నట్లు తెలిపారు. -
పరీక్షలు.. పక్కాగా
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని చెరువులు, కుంటల్లో నీటి నాణ్యతాపరీక్షలు నిర్వహించేందుకు పీసీబీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సరికొత్తవిధానాన్ని అవలంభించనుంది. ప్రస్తుతం సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ హుస్సేన్‌సాగర్, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ సహా మరో 19 జలాశయాల్లో మాత్రమే ప్రతినెలా విధిగా నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే అక్టోబర్ నుంచి అన్ని జలాశయాల్లోనూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో జేఎన్టీయూ, ఓయూ పరిధి కళాశాలల్లో ఇంజినీరింగ్, ఫార్మా, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో పీజీ, పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కిట్లను సిద్ధం చేస్తున్నట్లు పీసీబీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ప్రస్తుతం 22 జలాశయాల్లోనే... హెచ్ఎండీఏ పరిధిలో 3,132.. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి కేవలం 22 చెరువుల్లోనే పీసీబీ నెలనెలా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. మిగతా చెరువుల్లో కాలుష్యం స్థాయి తెలుసుకోకుండా... సిబ్బంది కొరతను సాకుగా చూపుతున్నారు. ప్రస్తుతానికి పెద్దచెరువు, బంజారా చెరువు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, హుస్సేన్‌సాగర్, శామీర్‌పేట్, ప్రగతినగర్, సరూర్‌నగర్, ఉమ్దాసాగర్, కాముని చెరువు, ఇబ్రహీం చెరువు, మల్లాపూర్, ఫాక్స్‌సాగర్, నూర్‌మహ్మద్‌కుంట, దుర్గం చెరువు, నల్ల చెరువు, కాప్రా, అంబర్ చెరువు, హస్మత్‌పేట్ చెరువు, రంగధాముని చెరువు, సఫిల్‌గూడ, మీరాలం, లంగర్‌హౌస్ చెరువుల్లో నీటి నాణ్యత పరీక్షిస్తున్నారు. ఇక నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో నీటి నమూనాలు సేకరించి విద్యార్థులతో పరీక్షలు చేయించేందుకు ప్రత్యేక కిట్లను తయారు చేస్తున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ నుంచి ఈ విధానం అమలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. ప్రధానంగా నీటిలో గాఢత, కరిగిన ఘన పదార్థాలు, కోలీఫాం బ్యాక్టీరియా ఆనవాళ్లు, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, కరిగిన ఆక్సిజన్ శాతం తదితరాలను ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. కాలుష్య కాసారాలు... నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకుకాలుష్యకాసారంగా మారుతున్నాయి. వీటి ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలమవుతోంది. పలు చెరువుల్లో ఇటీవల కాలంలో గుర్రపుడెక్క అనూహ్యంగా పెరిగింది. మరోవైపు సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి వదులుతున్నారు. దీంతో జలాశయాలు దుర్గంధభరితంగా మారుతున్నాయి. ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థ జలాల్లో ఉండే ఫేకల్ కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరగడంతో పాటు నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా పరిశీలనలో తేలింది. మురుగుతోనే అనర్థాలు... చెరువులు కబ్జాలకు గురవడం, ఎఫ్టీఎల్ పరిధిలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో ఆయా జలాశయాలు మురికి కూపాలవుతున్నాయి. పలు చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలో సగం భూములను కోల్పోయాయి. చెరువుల ప్రక్షాళన విషయంలో జీహెచ్ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తోంది. మురుగు నీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. మరోవైపు రోజువారీగా గ్రేటర్ వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధి లేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. చెరువులు ఇలా.. హెచ్ఎండీఏ పరిధిలో 3,132 జీహెచ్ఎంసీ పరిధిలో 185 -
కృష్ణమ్మ తియ్యగా..గోదావరి చప్పగా..!
సాక్షి, హైదరాబాద్ : రాజధాని నగరానికి ప్రస్తుతం కృష్ణా.. గోదావరి జలాలే దాహార్తిని తీర్చే వరదాయినిగా మారాయి. కృష్ణా జలాలు తియ్యగా, తేటగా ఉండగా, గోదావరి జలాల కాఠిన్యత స్వల్పంగా అధికంగా ఉండటంతో కొంచెం చప్పగా ఉంటున్నాయి. అయితే రెండు జలాల నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు ఉండటం విశేషం. ప్రస్తుతం జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లో నీటి నిల్వలు అందుబాటులో ఉన్నా వీటిని పరిమితంగానే తాగునీటి అవసరాలకు వాడాలని ప్రభుత్వం జలమండలిని ఆదేశించింది. అలాగే సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నగరానికి వస్తున్న నీటిని సైతం సర్కారు ఉమ్మడి మెదక్ జిల్లా తాగు, సాగునీటి అవసరాలకే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో మహానగరం తాగునీటి అవసరాల కోసం కృష్ణా, గోదావరిపైనే ఆధారపడుతోంది. ఆయా జలాశయాల నుంచి రోజువారీగా 440 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరించి శుద్ధి చేసి సరఫరా చేస్తోంది. కాగా, తాగు నీటి నాణ్యతపై సోమవారం ’సాక్షి’ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. పలుచోట్ల నల్లా నీటి నమూనాలను సేకరించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టం ప్రయోగశాలలో పరీక్షించింది. ప్రధానంగా నీటి గాఢత, కరిగిన రేణువులు, కరిగిన ఘన పదార్థాలు, కాఠిన్యత, క్లోరైడ్స్, క్లోరిన్, లవణీయత తదితర పరీక్షలు నిర్వహించి ఫలితాలను పరిశీలించగా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డ్స్ (ఐఎస్ఓ) ప్రమాణాల మేరకు ఉన్నట్లు తేలింది. అంతేకాదు గ్రేటర్ పరిధిలో సుమారు 300 వరకు ఉన్నసర్వీసు రిజర్వాయర్ల పరిధిలోని 9.65 లక్షల నల్లాలకు సరఫరా అవుతున్న నీరు ప్రమాణాల మేరకు ఉండటంతో గతేడాది జలమండలి ఐఎస్ఓ ధ్రువీకరణ సాధించడం 3 దశాబ్దాల వాటర్ బోర్డు చరిత్రలో ఓ రికార్డు. కృష్ణా, గోదావరి జలాలను శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్స్ వద్ద ఆలం అనే రసాయనంతోపాటు నీటిని నిల్వచేసే స్టోరేజి రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియను నిర్విరామంగా చేపడుతుండడంతో నీటి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. నీటి నాణ్యతలో స్వల్ప తేడా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు గరిష్ట నీటి కాఠిన్యత ప్రతి లీటర్‌కు.. 200మిల్లీగ్రాములు గోదావరి జలాల్లో ఉన్న కాఠిన్యత లీటర్‌కు..152 మిల్లీగ్రాములు కృష్ణా జలాల్లో ఉన్నకాఠిన్యత లీటర్‌కు.. 120 మిల్లీగ్రాములు ఎల్లంపల్లి నుంచి నగరానికి నిత్యం సరఫరా అయ్యే గోదావరి జలాలు : 172(మిలియన్ గ్యాలన్లు) పుట్టంగండి నుంచి సిటీకి నిత్యం సరఫరా అయ్యే కృష్ణా జలాలు : 270 (మిలియన్ గ్యాలన్లు) కృష్ణా, గోదావరి నీటికి సంబంధించి ప్రతి 1000 లీటర్ల శుద్ధికి జలమండలి చేస్తున్న ఖర్చు : 45–50 (రూపాయలు) -
నీటికీ ఏటీఎంలు..!
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఏటీఎంలలో డబ్బులు తీసుకుంటారు. కానీ నగరానికి ఆనుకుని ఉన్న కనకపురలో నీళ్లు తీసుకోవచ్చు. ఇదేదో అద్భుతం కాదు కానీ, గ్రామీణులకు స్వచ్ఛమైన నీటిని అందించే ఈ ప్రయత్నాన్ని అభినందించక తప్పదు. డాలర్ ముందు రూపాయి రోజు రోజుకు చిన్నబోతున్నా, అదే రూపాయితో పది లీటర్ల మినరల్ వాటర్‌ను ఎంచక్కా పట్టుకోవచ్చు. పైగా ఈ నీటి కోసం చాంతాడంత క్యూలలో నిల్చుకోవాల్సిన అవసరం లేదు. మిషన్‌లో రూపాయి వేసి, పది లీటర్ల నీటిని కింద పట్టుకోవచ్చు. అందుకే కనకపుర వాసులు వీటిని వాటర్ ఏటీఎంలని అంటున్నారు. కాంగ్రెస్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డీకే. శివకుమార్, ఇటీవల లోక్‌సభ ఉప ఎన్నికలో గెలిచిన ఆయన సోదరుడు సురేశ్ కలసి కనకపుర నియోజక వర్గంలో ఇలాంటి 33 నీటి కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి రూ.13 లక్షల వరకు ఖర్చయింది. కరువు కారణంగా కనకపురలో నీటి మట్టం 1,300 అడుగుల లోతుకు పడిపోయింది. ఉప ఎన్నికలకు ముందే సురేశ్ వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ‘నీటి నాణ్యత చాలా బాగుంది. నిన్నటి వరకు మేము బోరు నీటిని తాగేవారం. ఆ నీరు కలుషితమైనదే కాకుండా చాలా కఠినంగా కూడా ఉండేది. మా కుటుంబంలో అయిదు మంది ఉన్నాం. వంటకు, తాగడానికి రోజుకు 20 లీటర్ల నీరు అవసరమవుతుంది’ అని జయమ్మ అనే కార్మికురాలు పేర్కొన్నారు. ఆమె ఓ పెద్ద పాత్రను తీసుకొచ్చి ఓ కియోస్క్‌లో రెండు రూపాయి నాణేలు వేసి 20 లీటర్ల నీటిని పట్టుకెళ్లింది. శివకుమార్ ఏమంటారంటే...‘ప్రధాని, ముఖ్యమంత్రి, ఇతర నాయకులు మినరల్ వాటర్ తాగ గలుగుతున్నప్పుడు, పేదలు ఎందుకు తాగకూడదు. అందుకనే...ఈ నీటి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, బీపీఎల్ కుటుంబాలకు శుద్ధమైన నీటని అందిస్తున్నాం’.