పరీక్షలు.. పక్కాగా | PCB Focus on Water Qulity Tests in GHMC Lakes | Sakshi
Sakshi News home page

పరీక్షలు.. పక్కాగా

Published Fri, Sep 6 2019 10:04 AM | Last Updated on Fri, Sep 6 2019 10:04 AM

PCB Focus on Water Qulity Tests in GHMC Lakes - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలోని చెరువులు, కుంటల్లో నీటి నాణ్యతాపరీక్షలు నిర్వహించేందుకు పీసీబీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సరికొత్తవిధానాన్ని అవలంభించనుంది. ప్రస్తుతం సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ హుస్సేన్‌సాగర్, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ సహా మరో 19 జలాశయాల్లో మాత్రమే ప్రతినెలా విధిగా నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే అక్టోబర్‌ నుంచి అన్ని జలాశయాల్లోనూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో జేఎన్‌టీయూ, ఓయూ పరిధి కళాశాలల్లో ఇంజినీరింగ్, ఫార్మా, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కిట్లను సిద్ధం చేస్తున్నట్లు పీసీబీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. 

ప్రస్తుతం 22 జలాశయాల్లోనే...  
హెచ్‌ఎండీఏ పరిధిలో 3,132.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి కేవలం 22 చెరువుల్లోనే పీసీబీ నెలనెలా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. మిగతా చెరువుల్లో కాలుష్యం స్థాయి తెలుసుకోకుండా... సిబ్బంది కొరతను సాకుగా చూపుతున్నారు. ప్రస్తుతానికి పెద్దచెరువు, బంజారా చెరువు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, హుస్సేన్‌సాగర్, శామీర్‌పేట్, ప్రగతినగర్, సరూర్‌నగర్, ఉమ్దాసాగర్, కాముని చెరువు, ఇబ్రహీం చెరువు, మల్లాపూర్, ఫాక్స్‌సాగర్, నూర్‌మహ్మద్‌కుంట, దుర్గం చెరువు, నల్ల చెరువు, కాప్రా, అంబర్‌ చెరువు, హస్మత్‌పేట్‌ చెరువు, రంగధాముని చెరువు, సఫిల్‌గూడ, మీరాలం, లంగర్‌హౌస్‌ చెరువుల్లో నీటి నాణ్యత పరీక్షిస్తున్నారు. ఇక నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల్లో నీటి నమూనాలు సేకరించి విద్యార్థులతో పరీక్షలు చేయించేందుకు ప్రత్యేక కిట్లను తయారు చేస్తున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌ నుంచి ఈ విధానం అమలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. ప్రధానంగా నీటిలో గాఢత, కరిగిన ఘన పదార్థాలు, కోలీఫాం బ్యాక్టీరియా ఆనవాళ్లు, బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్, కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్, కరిగిన ఆక్సిజన్‌ శాతం తదితరాలను ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. 

కాలుష్య కాసారాలు...
నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకుకాలుష్యకాసారంగా మారుతున్నాయి. వీటి ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం విఫలమవుతోంది. పలు చెరువుల్లో ఇటీవల కాలంలో గుర్రపుడెక్క అనూహ్యంగా పెరిగింది. మరోవైపు సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి వదులుతున్నారు. దీంతో జలాశయాలు దుర్గంధభరితంగా మారుతున్నాయి. ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థ జలాల్లో ఉండే ఫేకల్‌ కోలిఫాం, టోటల్‌ కోలిఫాం మోతాదు అధికంగా పెరగడంతో పాటు నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా పరిశీలనలో తేలింది.  

మురుగుతోనే అనర్థాలు... 
చెరువులు కబ్జాలకు గురవడం, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో ఆయా జలాశయాలు మురికి కూపాలవుతున్నాయి. పలు చెరువులు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో సగం భూములను కోల్పోయాయి. చెరువుల ప్రక్షాళన విషయంలో జీహెచ్‌ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తోంది. మురుగు నీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. మరోవైపు రోజువారీగా గ్రేటర్‌ వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్‌ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధి లేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది.  

చెరువులు ఇలా..
హెచ్‌ఎండీఏ పరిధిలో 3,132  
జీహెచ్‌ఎంసీ పరిధిలో 185

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement