జీహెచ్‌ఎంసీ ప్రణాళిక బాగుంది..  | High Court order to pollution control board | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ ప్రణాళిక బాగుంది.. 

Published Thu, Nov 1 2018 1:17 AM | Last Updated on Thu, Nov 1 2018 1:17 AM

High Court order to pollution control board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కాలుష్యానికి మురికివాడల్లో ఉండే నిరుపేదలు కారణమని అందరూ అనుకుంటుంటారు. వాస్తవానికి అది తప్పు. దేశం కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి బీఎండబ్ల్యూ, బెంజ్‌ కారుల్లో తిరిగే ధనవంతులే కారణం. వారే చెత్త విషయంలో బాధ్యత లేకుండా వ్యవహరించేది. క్యారీ బ్యాగుల్లో చెత్తను తీసుకొచ్చి ఎక్కడపడితే అక్కడ వేసేది ధనవంతులే. 
– హైకోర్టు ధర్మాసనం 

జంట నగరాల్లోని చెరువుల పరిరక్షణలో భాగంగా చెరువుల్లోకి మురుగు నీటిని తీసుకొచ్చే మార్గాలను మూసివేసే విషయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై హైకోర్టు సంతృప్తి వ్యక్తంచేసింది. ఈ ప్రణాళిక అమల్లో చట్టపరమైన ఇబ్బందులతో పాటు ఇతర ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుకెళ్లే విషయంలో జీహెచ్‌ఎంసీకి సహకారం అందించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు సూచనలు, సలహాలను జీహెచ్‌ఎంసీకి ఇవ్వాలని పీసీబీకి స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయబోతున్నారో తెలియచేయాలని హెచ్‌ఎండీఏ, సీవరేజీ బోర్డు, పీసీబీ తదితరులను ఆదేశించింది. చెరువుల శుద్ధీకరణకు జియో ట్యూబ్‌ టెక్నాలజీతోపాటు ఇతర సాంకేతిక పద్ధతుల వినియోగంపై ఓ నిర్ణయం తీసుకోవాలంది. విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువు ను ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్‌ అధికారి అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్స్యకారుడు సుధాకర్‌ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం బుధవా రం మరోసారి విచారించింది. చెరువుల్లోకి మురుగునీటిని తీసుకొస్తున్న మార్గాలను మూసివేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ఓ కార్యాచరణ ప్రణాళికను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ధర్మాసనం ముందుంచారు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం, గత ప్రణాళికతో పోలిస్తే, ఇది బాగుందంటూ సంతృప్తి వ్యక్తం చేసింది.

జియో ట్యూబ్‌ టెక్నాలజీతో పాటు ఇతర టెక్నాలజీలను పరిశీలిస్తున్నామని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పగా, ఇందులో పరిశీలించడానికి ఏముందని ప్రశ్నించింది. నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందని ధర్మాసనం ప్రశ్నించగా, నెల రోజులు పడు తుందని ఏజీ చెప్పారు. నెల రోజుల గడువుపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేస్తూ, అంత సమయం ఎందుకు? ఇది షాపుల వెంట తిరిగి తెలుసుకోవాల్సిన విషయం కాదు కదా? ఐకియా టౌన్‌కి వెళ్లి పరిశీలించాల్సిన విషయం అంతకన్నా కాదు.. ఉన్న టెక్నాలజీ ఏమిటి..? దేని వ్యయం తక్కువ వంటివి తెలుసుకుంటే చాలు. వీటిని తెలుసుకునేందుకు 30 రోజులు ఎందుకంటూ ప్రశ్నించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement