pollution control board
-
మోత మోగిన కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ఈ ఏడాది వాయు కాలుష్యంకంటే శబ్దకాలుష్యం అధికంగా నమోదైంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, మరికొన్ని చోట్ల శబ్ద స్థాయిలు గతం కంటే అధికంగా నమోదయ్యాయి. దీపావళి రోజు నమోదైన వాయు, శబ్ద నాణ్యతలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నివేదిక విడుదల చేసింది. గత ఏడాది దీపావళి పండుగ రోజుతో పోల్చితే ఈ ఏడాది శబ్ద కాలుష్య స్థాయిలు ఎక్కువ రికార్డయ్యాయి.ముఖ్యంగా హైదరాబాద్‌లో పండుగ రోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా పటాకులు కాల్చటంతో కమర్షియల్, నివాస, సెన్సిటివ్ (ఆసుపత్రులు, స్కూళ్లు, జూ పార్కు ఇతర సున్నిత ప్రాంతాలు) ప్రదేశాల్లో శబ్ద స్థాయిలు (డెసిబుల్స్) అధికంగా నమోదయ్యాయి. ఐతే పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రమే ప్రామాణిక స్థాయిల కంటే తక్కువగా శబ్ద స్థాయిలు నమోదయ్యాయి. మిగతా మూడు కేటగిరీల్లో మాత్రం శబ్ద కాలుష్యం అధికంగా రికార్డ్ కావడం గమనార్హం.వాయునాణ్యత కాస్త మెరుగు..గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దీపావళి రోజు వాయు నాణ్యత కాస్త మెరుగ్గా నమోదైంది. ముఖ్యంగా పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (పీఎం 2.5–అతి సూక్ష్మ ధూళి కణాలు) ఈ ఏడాది తగ్గింది. ఇది గత ఏడాది దీపావళి రోజు 119 పాయింట్లు నమోదుకాగా, ఈ ఏడాది 84 పాయింట్లు రికార్డయ్యింది. పీఎం 10 (సూక్ష్మ ధూళికణాలు) గత ఏడాది 188 పాయింట్లు ఉండగా, ఈ ఏడాది 184 పాయింట్లుగా రికార్డయింది. పీఎం 2.5 వాయు కాలుష్య స్థాయిలు గత ఏడాది మామూలు రోజుల్లో 35 పాయింట్లుగా ఉండగా, ఈ ఏడాది 44 పాయింట్లుగా ఉంది. సాథారణ రోజుల్లో గత ఏడాది 85 పాయింట్లుగా ఉన్న పీఎం 10 సాంద్రత, ఈ ఏడాది 111 పాయింట్లుగా నమోదైంది. ఇతర కాలుష్యాలూ ఎక్కువే..ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ వంటి వాయు కాలుష్య కారకం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగా రికార్డయింది. సల్ఫర్ డై ఆక్సైడ్ కాలుష్యకారకం కూడా గత ఏడాది కంటే ఈ ఏడాది కొంత ఎక్కువగానే నమోదైంది. గత ఏడాది దీపావళి సందర్భంగా నైట్రోజన్ ఆక్సైడ్ 30.6 పాయింట్లు నమోదుకాగా.. ఈ ఏడాది 40 పాయింట్లుగా నమోదైంది. గత ఏడాది దీపావళి సమయంలో 12 పాయింట్లు ఉన్న సల్ఫర్ డై ఆక్సైడ్, ఈ ఏడాది 14 పాయింట్లుగా రికార్డయింది. 2023లో మామూలు రోజుల్లో 6.2 పాయింట్లుగా ఉన్న సల్ఫర్ డై ఆక్సైడ్, ఈ ఏడాది సాధారణ రోజుల్లో 12 పాయింట్లుగా అంటే రెండింతలుగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్ గత ఏడాది మామూలు రోజుల్లో 23.4 పాయింట్లు ఉండగా, ఈ ఏడాది 32.6 పాయింట్లుగా నమోదైంది. దీనిని బట్టి దీపావళి నాడే కాకుండా మామూలు రోజుల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రదేశాల్లో ధూళి కణాలు, కలుషిత వాయువులు, శబ్ద స్థాయిలను టీపీసీబీ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోంది. దీపావళి సందర్భంగా పర్యావరణ పరిస్థితి పర్యవేక్షణ అక్టోబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 7 దాకా కొనసాగిస్తున్నారు. -
కాలుష్యం కోరల్లో ఢిల్లీ.. బాణా సంచాపై నిషేధం
ఢిల్లీ : దీపావళికి ముందే ఢిల్లీలో వాయి కాలుష్యం భారీగా పెరిగింది. ఢిల్లీలో ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ 221గా నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు టపాసుల కాల్చివేతపై నిషేధం విధించింది.అంతేకాదు, అన్నీ రకాల బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు నిర్వహించకుండా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు కొత్త నిబంధనలు వెంటనే అమ్మల్లోకి తెచ్చేలా కార్యచరణను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.దేశ వ్యాప్తంగా పండుగ సీజన్ కొనసాగుతుంది. ఈ తరుణంలో ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డీపీసీసీ) ఢిల్లీలో గాలి కాలుష్యంపై దృష్టి సారించింది. పండుగ సీజన్లో ముఖ్యంగా నిన్నటి దసరా వరకు గాలి నాణ్యత భారీగా తగ్గినట్లు గుర్తించింది.అదే సమయంలో ఢిల్లీలో గాలి నాణ్యతను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విశ్లేషించింది. ఆదివారం మద్యాహ్నం 4గంటల వరకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 224కి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్ బోర్డ్ బాణా సంచాపై నిషేధం విధించింది. దీంతో ఢిల్లీ వాసులు బాణా సంచా కాల్చకుండానే ఈ దీపావళి జరుపుకోనున్నారు.గాలిలో నాణ్యత ఎలా ఉంటే మంచిది..సాధారణ గాలి ఏక్యూఐ 0–50 మంచి గాలి.. ఇబ్బంది లేదు.51 – 100 పర్వాలేదు.. చిన్న చిన్న స్థాయిలో రోగాలు101 – 150 శరీరంపై చిన్నదద్దుర్లు, ఎలర్జీ, నీరసం151 – 200 ఊపిరితిత్తులు, గుండె సమస్యలు వస్తాయి, కళ్లు తిరుగుతాయి.201 – 300 ఊపిరితిత్తులు, గుండె వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలుగా మారిపోతాయి. కిడ్నీలపై ప్రభావం వాటి సమస్యలు300+ అయితే ఆ ప్రాంత గాలి పిలిస్తే నిత్యం ప్రమాదమే.. అనేక రోగాలబారిన పడతారు. -
చెవుల్లో రీసౌండ్
ఓవైపు వాహనాల రొద.. హారన్ల మోత. మరోవైపు భవన నిర్మాణ చప్పుళ్లు, డీజేలు, లౌడ్‌స్పీకర్ల హోరు.. వెరసి రోజురోజుకూ భాగ్యనగరంలో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా నివేదిక ప్రకారం 78 డెసిబెల్స్ శబ్ద కాలుష్యంతో హైదరాబాద్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీ పీసీబీ) గణాంకాల ప్రకారం నగరంలో పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్ లోపు శబ్దాలు ఉండాల్సి ఉంది.కానీ పరిమితికి మించి 10 నుంచి 20 డెసిబెల్స్ శబ్ద తీవ్రత అధికంగా నమోదవుతోంది. వాణిజ్య, పారిశ్రామికవాడలతో పోలిస్తే నివాస, సున్నిత ప్రాంతాల్లోనే రణగొణ ధ్వనులు పగలూరాత్రి అనే తేడా లేకుండా వెలువడుతున్నాయి. దీంతో ఇప్పటికే వాయు కాలుష్యంతో అనారోగ్యాల బారినపడుతున్న నగరవాసులను కొంతకాలంగా శబ్ద కాలుష్యం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు కూడా వెంటాడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ఉదాహరణకు..⇒ రెసిడెన్షియల్ జోన్ అయిన జూబ్లీహిల్స్‌లో ఏప్రిల్‌లో పగలు 68.71 డెసిబెల్స్ శబ్ద తీవ్రత నమోదవగా రాత్రివేళ 71.36 డీబీ నమోదైంది. ⇒ పారిశ్రామిక ప్రాంతమైన సనత్‌నగ ర్లో ఉదయం 66.40 డెసిబెల్స్‌గా ఉంటే రాత్రిపూట 66.58 డీబీగా ఉంది.⇒ వాణిజ్య ప్రాంతమైన జేఎన్టీయూ వద్ద పగలు 67.76 డీబీ ఉండగా.. రాత్రివేళ 67.57 డీబీ నమోదైంది. అలాగే సున్నిత ప్రాంతమైన జూపార్క్ వద్ద ఉదయం 56.88 డీబీ నమోదవగా.. రాత్రిపూట 52.20గా రికార్డయింది.కారణాలు అనేకం..⇒ భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్ల నిరంతరం హారన్లు మోగించడం⇒ ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనాల మోత⇒ 15 ఏళ్లకు మించిన వాహనాలు రోడ్లపై తిరుగుతుండటంతో వాటి నుంచి వచ్చే అధిక శబ్దాలు.⇒ నివాసిత ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్ల నుంచి లౌడ్ స్పీకర్లు, డీజేల హోరు.⇒ నివాస ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు, పబ్బుల ఏర్పాటుతో డప్పులు, డీజే సౌండ్లు⇒ భవన నిర్మాణాల కోసం తవ్వకాలు, బ్లాస్టింగ్లు, బోర్ల తవ్వకం, భారీ కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాల వినియోగం.⇒ పరిశ్రమల కోసం జనరేటర్ల వినియోగం.శబ్ద కాలుష్యంతో చుట్టుముట్టే అనారోగ్యాలు ఇవే..⇒ పరిమితికి మించి శబ్దాల విడుదలతో గుండె స్పందనల్లో భారీగా హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు.⇒ తలనొప్పి, చికాకుతోపాటు నిద్రలేమి, అలసట⇒ గుండెజబ్బులు, చెవుడు కూడా రావచ్చు.⇒ పిల్లల్లో కర్ణభేరిలో సూక్ష్మనాడులు దెబ్బతినే ప్రమాదం. వృద్ధులకు వినికిడి శక్తి తగ్గిపోయే అవకాశం.⇒ మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం.⇒ వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లకు ఏకాగ్రత దెబ్బతిని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.ప్రభుత్వ విభాగాలు విఫలం..నగరంలో పరిమితికి మించి నమోదవుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి (టీజీ పీసీబీ), ట్రాఫిక్ పోలీసులు, రవాణా, మున్సిపల్ శాఖలు విఫలమవుతున్నాయి. ఇతర నగరాల్లో ‘నో హాంకింగ్ క్యాంపెయిన్’ నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తుండగా మన నగరంలో ఈ తరహా కార్యక్రమాల ఊసే లేదు. భారీ శబ్దం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించడానికి పరిమితమవుతున్నారు తప్పితే వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లేదు. వాహనాల నుంచి వెలువడే అధిక శబ్దాలు, అక్రమ ఎయిర్ హారన్లను గుర్తించి జరిమానాలు విధించేందుకు పోలీసులు నగరంలోని ప్రధాన మార్గాల్లో నాయిస్ డిటెక్షన్ ఉపకరణాలు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి. -
నిబద్ధతతోనే కాలుష్య నియంత్రణ
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా మాత్రమే నీలి ఆకాశం కనబడుతోంది. గాలి నాణ్యత తీవ్రతకు ఇదొక సంకేతం. వాయు కాలుష్యం ఇప్పుడు జాతీయ సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గాల్లోని నలుసు పదార్థాల (పీఎం) సాంద్రత 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రో గ్రాములు మించకూడదు. ఇది ఢిల్లీ లాంటి నగరంలో 102. ఈ గాలిని పీల్చడం ప్రాణాంతకం. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తెచ్చిన ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం’ కొంతమేరకు ఫలితమిస్తున్నా అది సరిపోదు. మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో మనం వ్యవహ రిస్తున్నాం. ప్రజారోగ్య దృక్కోణం నుండి చూస్తే ఎంత ప్రగతి అయినా తక్కువే. నిరంతర రాజకీయ నిబద్ధత మాత్రమే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. శీతకాలపు నెలల్లో భారీ పొగమంచుతో కప్పబడి ఉండే ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నీలి ఆకాశం, ప్రకాశవంతమైన సూర్యబింబం అరుదుగా గోచరిస్తుంటాయి. అయితే పేలవమైన గాలి నాణ్యత అనేది ఇప్పుడు జాతీయ సమస్య అయింది. కాకపోతే గత ఐదేళ్లలో, వాయు కాలుష్యం ఒక విధానపరమైన సమస్యగా కూడా గుర్తింపు పొందింది. అయిన ప్పటికీ ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమ’ (ఎన్సీఏపీ) అయిదేళ్ల అంచనాను పరిశీలిస్తే, అర్థవంతమైన, శాశ్వతమైన ప్రయోజనాలను అందించడానికి గట్టి ప్రయత్నాలు అవసరమని తెలుస్తుంది. అపఖ్యాతి పాలైన భారతదేశ గాలి నాణ్యతను పరిష్కరించడానికి తెచ్చిన మొదటి విధానం – 2019లో ప్రారంభించిన ఎన్సీఏపీ. కాలుష్య స్థాయులను, గాలిలోని నలుసు పదార్థాల గాఢతలను ప్రధాన నగరాల్లో 30 నుంచి 20 శాతం తగ్గించాలనే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి కేంద్రం నుండి రూ. 443 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుండి రూ. 4,400 కోట్ల ప్రారంభ కేటాయింపులు జరిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి చెందిన నిరంతర పరిసర వాయు నాణ్యతా పర్యవేక్షణ కేంద్రాల విశ్లేషణ (భారత దేశ వాయు నాణ్యతా మానిటర్ల నెట్వర్క్) పురోగతి స్థిరంగా ఉన్నప్ప టికీ, ఎన్‌సీఏపీని అమలు చేయడంలో వ్యూహాత్మకమైన, సైన్స్ ఆధారిత మార్పుల అవసరం ఉంది. ఉదాహరణకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ గాల్లోని నలుసు పదార్థాల (పర్టిక్యులేట్ మ్యాటర్) సాంద్రతకు పరిమితులు నిర్దేశించింది. 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాములు, 10 పీఎం అయితే ఒక క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాములు మించకూడదు. ఎన్సీఏపీ అమలయ్యాక, ప్రత్యేకించి 2.5 పీఎం వారణాసిలో 96 నుంచి 26.9 మైక్రోగ్రాములకు తగ్గింది. ఆగ్రాలో 73 నుంచి 33కు, జో«ద్‌పూర్‌లో 81.8 నుంచి 40.6కు మెరుగ్గా తగ్గింది. కానీ ఢిల్లీలో మాత్రం 108 నుంచి 102కు మాత్రమే తగ్గింది. పీఎం 2.5 స్థాయుల డేటా 2019–2023 మధ్య 46 నగరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం 27 నగరాల్లో మాత్రమే తగ్గుదల మెరుగ్గా ఉంది. 10 పీఎం విషయంలో ఐదేళ్ల డేటా కేవలం 46 నగరాలకు అందుబాటులో ఉండగా, అందులో కేవలం 24 నగరాల్లో మాత్రమే మెరుగుదల కనబడింది. 50 శాతం నగరాలు గణనీయమైన అభివృద్ధిని చూపుతున్నా యనీ, ఇది ఎన్సీఏపీ విజయవంతమైన ప్రగతిని సూచిస్తోందనీ ఎవరైనా వాదించవచ్చు. కానీ మనం మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో వ్యవహరిస్తున్నాము. పైగా రక్తపోటు, మధుమేహం వంటివాటిని ఇవి మరింత తీవ్రతరం చేయవచ్చు. 2.5 పీఎం రక్త–మెదడు అవరోధాన్ని కూడా దాటవచ్చు. దీర్ఘకాలం అలాంటి గాలిలో మసలితే ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి, ప్రజారోగ్య దృక్పథం నుండి చూస్తే మరింత కఠినమైన ప్రగతి అత్యవశ్యం. మరో సమస్య ఏమిటంటే, ఎన్సీఏపీలో సమన్వయం కొరవడింది. ఢిల్లీ లాంటి నగరంలో సరి–బేసి ట్రాఫిక్‌ను అమలు చేయడం, ‘జాతీయ రాజధాని ప్రాంతం’ నుండి నిబంధనలు పాటించని వాహనాలను తొలగించడం, వ్యర్థాలను బహిరంగంగా కాల్చడాన్ని నిరోధించడం, దుమ్మును తగ్గించడానికి రోడ్లపై నీటిని చల్లడం వంటి చర్యలు అన్నీ అమలవుతున్నాయి. అయినప్పటికీ, కాలుష్యానికి సంబంధించిన ఇవే కారణాలు ఉన్న మిగిలిన ప్రాంతాలకు విస్తరించకుంటే ఈ చర్యలు సరిపోవు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల దట్టమైన పొగమంచుతో చలి కాలం ప్రారంభం కావడం దీనికి స్పష్టమైన ఉదాహరణ. ఢిల్లీ నగరంలో నమోదైన సుమారు 80 లక్షల వాహనాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఉష్ణోగ్రతలో తగ్గుదల గాలిలో నిలిచివుండే అణువుల స్థాయులను ప్రమాదకరంగా పెంచుతుంది. ఈ కాక్టెయిల్ను ఢిల్లీ నివాసులు ప్రతి సంవత్సరం కొన్ని వారాల పాటు పీల్చుకుంటున్నారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) ప్రతి శీతాకాలంలో ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతంలో ఊహించిన ప్రతిస్పందనగా అమలులోకి వస్తుంటుంది. అయితే దాని ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యం కావాలి. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సజావుగా సమన్వయం లేకపోతే ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంది. జాతీయ రాజధాని వెలుపల, సీపీసీబీ పర్యవేక్షణ నెట్వర్క్ అసమానంగా ఉందని మా విశ్లేషణ చూపుతోంది. ఇది మూల్యాంకనానికి వ్యత్యాసాల పొరను జోడిస్తుంది. ముజఫర్‌పూర్, బిహార్ లాంటి రద్దీ ప్రదేశాలలో కేవలం మూడు మానిటర్లు ఉన్నాయి. అదే ఢిల్లీ అంతటా 37 స్టేషన్లు,ముంబై అంతటా 22, హైదరాబాద్‌లో 14 స్టేషన్లు ఉన్నప్పుడు మనం తప్పుడు నిర్ధారణలకు వచ్చే ప్రమాదం ఉంది. ప్రామాణిక పర్యవేక్షణ విధానంలో, పోల్చదగిన జనాభా ఉన్న నగరాలు ఒకే విధమైన లేదా కనీసం సారూప్య సంఖ్యలో గాలి నాణ్యత మానిటర్లను కలిగి ఉంటాయి. స్థానిక కాలుష్య మూలాల శాస్త్రీయ అవగాహన ఆధారంగా ఆ స్థానాలు ఉంటాయి. నగరాల కాలుష్య సాంద్రతలు ఒకే పారామి తుల సెట్లో ట్రాక్ చేయబడతాయి. ఇది వాటి గాలి నాణ్యత ధోర ణులపై ‘గ్రాన్యులర్’(కణికీయ) అవగాహనను పెంపొందించడంలో సహాయపడుతుంది. వాయు కాలుష్య ప్రయత్నాలకు సంబంధించిన నిధుల కేటాయింపుల్లో కూడా సమస్యలున్నాయి. తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్న ఢిల్లీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే అందాయి. అందులో అది 10 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. గాలి నాణ్యత చర్యల కోసం వర్తించే నిధులను క్రమబద్ధీకరించడంలో ఇదొక ప్రశ్నగానే ఉండిపోతుంది. గ్రేటర్ ముంబైకి రూ.938 కోట్లు అందగా, దానిలో రూ.660 కోట్లు వినియోగించుకుంది. అయినప్పటికీ, జాతీయ స్వచ్ఛ వాయు పథకం(ఎన్సీఏపీ)లో సానుకూల అంశాలున్నాయి. వీటిలో మొదటిది 2026 నాటికి 10 పీఎం గాలి సాంద్రతలను 40 శాతానికి తగ్గించడం. ఇది ప్రతిష్ఠా త్మకమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. అందుకే దీన్ని ఎన్సీఏపీ అమలు కాని నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రేటర్ నోయిడా (ఉత్తర ప్రదేశ్), భివాడీ (రాజస్థాన్) వంటివి తీవ్ర కాలుష్య స్థాయులను నివేదించాయి. ఇంకా, రంగాల వారీగా వివరణాత్మక చర్యలు ఉండాలి. ఇటుక బట్టీలు, నిర్మాణాలు, కూల్చివేత ప్రాజెక్టుల వంటి అత్యంత కాలుష్య కారకాలకూ... సిమెంట్, ఉక్కు కర్మాగారాలకూ భిన్నమైన విధానం అవసరం. అదేవిధంగా, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం మాత్రమే నిర్దిష్ట వయస్సు దాటిన పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించింది. కానీ దేశవ్యాప్తంగా కఠినమైన, కాలుష్య నియంత్రణ వ్యవస్థ లేక పోతే... ప్రమాణాలను అందుకోని వాహనాలను ఇతర నగరాలకు తరలించే ప్రమాదం ఉంది. అప్పుడు కాలుష్య భారం మారదు. మరీ ముఖ్యంగా, ఎన్సీఏపీ ప్రధాన అంశంగా ప్రజారోగ్యం ఉండాలి. ప్రతి కొలమానాన్ని తప్పనిసరిగా ప్రతిపాదించాలి, చర్చించాలి. అంతే గాకుండా వాయు కాలుష్య కారకాలను తగ్గించడం పట్ల నిర్మాణా త్మకంగా ఉండాలి. మనం ఎన్సీఏపీ రెండవ దశలోకి ప్రవేశించినప్పుడు చాలా ఆశించవచ్చు. ప్రభుత్వం అత్యున్నత స్థాయిలలో సమస్యను అంగీకరించడం అనేది మాత్రం ఇప్పటికి సానుకూలాంశం. కానీ నిరంతర రాజ కీయ నిబద్ధత మాత్రమే బలమైన ఫలితాలను ఇస్తుంది. ఆరతీ ఖోస్లా వ్యాసకర్త న్యూఢిల్లీలోని క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఢిల్లీ: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. స్కూల్స్ బంద్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. వరుసగా మూడోరోజు వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. ఆదివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 401కి చేరింది. మరోవైపు.. శనివారం జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో, అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రైమరీ స్కూల్స్‌ను నవంబర్ 10వ తేదీ మూసివేస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, విద్యాశాఖ మంత్రి అతిషి తెలిపారు. అలాగే, 6-12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. "As pollution levels continue to remain high, primary schools in Delhi will stay closed till 10th November. For grade 6-12, schools are being given the option of shifting to online classes," tweets Delhi Education Minister Atishi pic.twitter.com/fNw8DeKgbP — ANI (@ANI) November 5, 2023 మరోవైపు.. ఢిల్లీలో గాలిలో విషవాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలో ఉండటం.. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) జారీ చేసిన ప్రమాణాల కంటే 80 రెట్లు అధికం. ఈ గాలిని పీల్చడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యానికి కారణమయ్యాయి. #WATCH | Delhi: ANI drone camera footage from the Kalindi Kunj area shows a thick layer of haze in the air. Visuals shot at 9:15 am today. The air quality in Delhi continues to be in the 'Severe' category as per CPCB (Central Pollution Control Board). pic.twitter.com/6yfIjGq0kV — ANI (@ANI) November 5, 2023 #WATCH | The air quality in Delhi continues to be in the 'Severe' category as per CPCB (Central Pollution Control Board). (Visuals from Chanakyapuri area, shot at 8:40 am) pic.twitter.com/aWTVUauThG — ANI (@ANI) November 5, 2023 -
రోజు రోజుకు దిగజారుతోంది..పట్టించుకోరా: బాంబే హైకోర్టు సీరియస్
ముంబై: నగరంలోని గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) క్షీణించడంపై బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ, జస్టిస్ ఆరిఫ్ డాక్టర్లతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)ల వివరణ కోరింది. ముంబైలో వాయు కాలుష్యం పెరిపోవడంపై నగరవాసులు ముగ్గురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ, జస్టిర్ ఆరిఫ్ డాక్టర్లతో కూడిన బెంచ్ ఈ అంశంపై విచారించింది. ‘‘నగరంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సంబంధిత అధికారులందరూ తెలియ జేయాలి’’ అని కోర్టు ఆదేశించింది తదుపరి విచారణను నవంబర్ ఆరవ తేదీకి వాయిదా వేసింది. నగరంలో కాలుష్యాన్ని అరికట్టడానికి, గాలి నాణ్యతను పెంచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, బృహన్ముంబై పాలక సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్లు – అమర్ బాబాన్ టికే, ఆనంద్ ఝా మరియు సంజయ్ సర్వే – తమ వాజ్యంలో కోరారు. ముంబైలో విచ్చలవిడిగా నిర్మాణ కార్యకలాపాలు, తగినంత పచ్చదనం లేకపోవడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని, ఇది నివాసితులపై, పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. -
బీపీసీఎల్, ఐఓసీకి రూ.3కోట్లు ఫైన్!
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)..భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు రూ.2కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు రూ.1కోటి మేర జరిమానా విధించింది. తమ పెట్రోల్ పంపుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు జరిమానా విధించినట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు రెండు సంస్థలు వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోని రిటైల్ అవుట్లెట్లలో వేపర్ రికవరీ సిస్టమ్స్ (వీఆర్ఎస్) ఇన్స్టాల్ చేయనందుకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీసీబీ నుంచి ఆదేశాలు అందినట్లు ఐఓసీ తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు పెట్రోల్ స్టేషన్లలో వీఆర్ఎస్లను ఏర్పాటు చేయనందుకు ఈ ఫైన్ విధించలేదని స్పష్టం చేసింది. వాహనాల్లో ఇంధనం నింపేటప్పుడు పెట్రోల్ ఆవిరై వాతావరణంలోకి వెళుతుంది. ఈ ఆవిరిలో బెంజీన్, టోలీన్, క్సైలీన్ వంటి క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. పెట్రోల్ ఆవిరి బయటకు రాకుండా ఇంధన స్టేషన్లలో వీర్‌ఎస్‌ని అమర్చాలని 2016లో పెట్రోల్ పంపులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు, సీపీసీబీ నిర్దేశించిన సమయంలో వీఆర్ఎస్ను ఇన్స్టాల్ చేయనందుకు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసు అందుకున్నట్లు బీపీసీఎల్ ప్రకటన విడుదల చేసింది. -
‘వైఎస్సార్ పర్యావరణ’ భవనాలు సిద్ధం
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అన్ని వసతులతో సొంత కార్యాలయాలను నిర్మించింది. ‘డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనాలు’ పేరిట రూ.54.43 కోట్లతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మించిన భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.22.57 కోట్లతో విజయవాడ ఏపీఐఐసీ కాలనీలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు. కర్నూలులో రూ.15.93 కోట్లతో జోనల్ కార్యాలయం, తిరుపతిలో మరో రూ.15.93 కోట్లతో రీజనల్ కార్యాలయం నిర్మించారు. ఐదు అంతస్తుల్లో అత్యాధునిక రీతిలో ఈ భవనాల నిర్మాణం పూర్తిచేశారు. ఈ భవనాల్లో విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు సోలార్ సిస్టం, రక్షణ కోసం అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని అంతస్తుల్లోనూ సెంట్రల్ ఏసీ, ఇతర అన్ని సదుపాయాలను కల్పించారు. త్వరలోనే ఈ భవనాలను ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
Hyderabad: గూబ గుయ్‌మంటోంది.. నిద్రపోని మహానగరం
అర్ధరాత్రి ఒంటి గంట.. రెండు గంటలు.. ఎప్పుడైనా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మెయిన్‌రోడ్లు చూశారా.. బంపర్ లైట్లు వేసుకుంటూ.. గట్టిగా హారన్లు కొట్టుకుంటూ కార్లు, టూవీలర్లు లెక్కకు మించి అతివేగంగా వెళ్తుంటాయి. ఏదో ఒక్క రోజు.. రెండు రోజులో కాదు.. ప్రతిరోజూ ఇదే వరస.. వాస్తవానికి సగటున పగటిపూట కంటే కూడా ఆయా రోడ్లపై రాత్రి పూట తిరిగే వాహనాలే ఎక్కువని ఓ అంచనా. హైదరాబాద్ మహానగరంలో రాత్రిళ్ల ఉద్యోగాలు, ప్రజల జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పులకు పగలు, రాత్రి అనే తేడాలు చెరిగిపోయాయి. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే విపరీతమైన శబ్దకాలుష్యం. చెవులకు చిల్లులు పడే ధ్వనుల మోత. పెరిగిన వాహనాలతోపాటు పెద్దఎత్తున సాగుతున్న గృహనిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు, పరిశ్రమలు.. డీజే సౌండ్లు, హడావుడితో అర్ధరాత్రి ఫంక్షన్లు తదితర రూపాల్లో పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ : తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణబోర్డు (పీసీబీ) గణాంకాలను పరిశీలిస్తే... పగలు కంటే కూడా రాత్రి సమయాల్లోనే మోతాదుకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు వెల్లడైంది. ఎప్పటి లెక్కో కాదు...తాజాగా ఈ నెల 1 నుంచి 14వ తేదీల మధ్య వెలువడిన శబ్దాలకు సంబంధించిన సమాచారం గమనిస్తే... జూబ్లీహిల్స్, జేఎన్టీయూ, తార్నాక, జూ పార్కు, గచ్చిబౌలిలలో పగటిపూట కంటే కూడా రాత్రిళ్లు ధ్వనులు ఎక్కువగా వెలువడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు దాదాపుగా ఇదే ట్రెండ్ కొనసాగిందంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మారిన జీవనశైలి అలవాట్లతో... పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాలు, ఇతర రూపాల్లో అంతకంతకూ పెరుగుతున్న విపరీతమైన ధ్వనులతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణీత పరిమితులకు మించి వెలువడుతున్న శబ్దాలతో చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రభావితమవుతున్నారు. జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పు చేర్పులతో పగటి కంటే కూడా రాత్రిపూట పొద్దుపోయే దాకా వాహనాల రాకపోకలు, పెద్దశబ్దంతో హారన్లు మొగించడం, ఫంక్షన్లు, ఇతర కార్యకలాపాలు శబ్దాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 లోపు నిర్ణీత ఆఫీస్ పనివేళల్లో పనిచేసే వారితోపాటు అమెరికా, యూరప్, బ్రిటన్ వేళలను బట్టి పనిచేసేవారు కూడా ఉంటున్నారు. రోజుకు మూడు, నాలుగు షిఫ్టుల్లో ఉద్యోగ విధులు, బాధ్యతల నిర్వహణలో నిమగ్నమవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు, ఇతర విధులు, బాధ్యతల్లో నిమగ్నమైనవారు పనిచేసే సమయాలు కూడా మారిపోతున్నాయి. అధిక ధ్వనులతో ఆరోగ్యంపై దుష్ప్రభావం రాత్రిపూట విశ్రాంతి తీసుకునే సమయంలో వాహనాలు, ఇతర రూపాల్లో ధ్వనులు పెరగడం వంటివి వివిధ సమస్యలకు పరోక్షంగా కారణమవుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి అధికంగా వెలువడే ధ్వనులతో ఆరోగ్యం, మానసికస్థితి తదితరాలపై తమకు ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయన్న దానిపై ప్రజలకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన ఏర్పడలేదు. వాయుకాలుష్యం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిసినంతగా శబ్దకాలుష్యం గురించి అంత అవగాహన కలగకపోవడంతో వివిధ రూపాల్లో రోజువారీ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం సోషల్లైఫ్లోనూ ఎంటర్టైన్మెంట్ పేరుతో బర్త్‌డేలు, ఇతర ఫంక్షన్లను పెద్ద శబ్దాలతో డీజేలు వంటివి నిర్వహిస్తున్నారు. 80 డెసిబుల్స్‌కు మించి వెలువడే శబ్దాలకు 8 గంటలపాటు ఎక్సోపోజ్ అయితే వినికిడి శక్తిపై ప్రభావం పడుతుంది. చెవుల్లో గింగురమనే శబ్దాల(టినిటస్)తో మానసిక ఒత్తిళ్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఏకాగ్రత దెబ్బతింటోంది. ఉదయం నుంచి రాత్రి దాకా పరిమితులకు మించి వెలువడే శబ్దాలు మనుషుల ‘హ్యుమో డైనమిక్స్’ పైనా ప్రభావం చూపి రక్తపోటు రావొచ్చు. గుండె సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. రాత్రిళ్లు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాల్లో వెలువడే శబ్దాలు వృద్ధులు, పిల్లలు, విద్యార్థులపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రజల జీవనశైలి అలవాట్లు మారినందున దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అధిక«శబ్దాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.మోహన్‌రెడ్డి -
‘గుట్టలు గుల్ల’కు ఇక చెల్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఏర్గట్ల మండలం బట్టాపూర్ వద్ద నిబంధనలు అతిక్రమించి గుట్టను తవ్వడాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో స్థానికులు, బీజేపీ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా బట్టాపూర్లో గుట్టలను తొలిచేయడంపై గతేడాది ’సాక్షి’ప్రదాన సంచికలో ‘గుట్టలు గుల్ల’శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనం ఆధారంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి హైకోర్టులో ‘పిల్’దాఖలు చేశారు. దీనిపై గత నెల 16న ‘బట్టాపూర్ గుట్ట మింగివేతపై పిల్’అనే కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన మైన్స్ అండ్ జియాలజీ విభాగానికి చెందిన బృందం ‘ఈటీఎస్’(ఎల్రక్టానిక్ టోటల్ సర్వే) గుట్టలను పరిశీలించి నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో క్వారీ, క్రషర్‌ను సీజ్ చేయాలని చెప్పిన హైకోర్టు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా మొత్తం 13 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై బీజేపీ నేతలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల, మోర్తాడ్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, వేల్పూర్, భీంగల్ మండలాల్లో ఫ్లెక్సీలు కట్టారు. గతంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలను వాటిపై ముద్రించారు. మరోపక్క గురువారం బట్టాపూర్ గుట్ట వద్ద బీజేపీ శ్రేణులు టపాకాయలు కాల్చి కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశాయి. కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. -
కాలుష్యంతో ఊళ్లన్నీ ఉక్కిరిబిక్కిరి!
సాక్షి, కామారెడ్డి / భిక్కనూరు : కాలుష్యం కోరలు చాస్తోంది. పీల్చే గాలి, తాగేనీరు కలుషితమవుతోంది. జనం రోగాల బారిన పడుతున్నారు. విషవాయువులు పల్లెల్ని కమ్మేస్తుండడంతో భరించలేకపోతున్నారు. తమ ప్రాంతానికి పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుందని ఆశించిన ప్రజలకు ఉపాధి ఏమోగాని రోగాలు వెన్నాడుతున్నాయి. కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలంటూ పలు చోట్ల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. 44వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, భిక్కనూరు, జంగంపల్లి, తలమడ్ల, తదితర గ్రామాల పరిసరాల్లో ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీస్‌తో పాటు ఇతర పరిశ్రమలు, కోళ్ల ఫారాలు ఏర్పాటయ్యాయి. అయితే పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల మూలంగా దుర్వాసనతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయని వివిధ గ్రామాల ప్రజలు పేర్కొంటు న్నారు. పరిశ్రమల నుంచి వదిలే వ్యర్థాలతో చెరువుల్లోని నీరు కలుషితమవుతోందని, ఆఖరుకు భూ గర్భజలాలు కూడా దెబ్బతిని ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భిక్కనూరు మండల కేంద్రం పరిధిలో నెలకొల్పిన ఓ ఫార్మా కంపెనీతో తాము అనేక కష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ కాచాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గడిచిన 57 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు పొరుగున ఉన్న పెద్దమల్లారెడ్డి, అయ్యవారిపల్లి, సంగమేశ్వర్, మాందాపూర్, అంతంపల్లి తదితర గ్రామాల ప్రజలు కూడా సంఘీభావం తెలిపారు. వ్యర్థాలతో తామూ ఇబ్బంది పడుతున్నామని పే ర్కొంటూ వారితో జతకలిశారు. అలాగే ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలతో భూగర్భజలాలు కూడా కలుషితమై, ఆ నీళ్లు తాగిన వారంతా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల వ్యర్థాలన్నీ పంట చేలగుండా కాలువలు, వాగుల్లోకి చేరి నీరు కలుషితమవుతోంది. గతంలో చెరువులోకి వ్యర్థాలు వెళ్లడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. మొక్కుబడి తనిఖీలు.. పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) అధికారులు మొక్కుబడి తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫార్మా కంపెనీ మూలంగా తాము పడుతు న్న ఇబ్బందులపై 57 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా పీసీబీ అధికారులు ఇటువైపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 44వ నంబరు జాతీయ రహదారిపై భిక్కనూరు మండలంలో అడుగుపెట్టగానే ఆయా పరిశ్రమల నుంచి వెలుబడుతున్న వాసనలతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కార్లు, ఇతర వాహనాల అద్దాలన్నీ మూ సి ఉంచినా దుర్గంధంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. -
అమరరాజాకిచ్చిన నోటీసులపై చర్యలు తీసుకోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: నిబంధనలు పాటించలేదంటూ అమరరాజా బ్యాటరీస్‌కు ఇచ్చిన షోకాజు నోటీసులపై తదుపరి చర్యలు తీసుకోవచ్చని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)కి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో కోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలను ఈ మేరకు సవరించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అమరరాజా బ్యాటరీస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. అమరరాజా తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పదేపదే తనిఖీల పేరిట ఇప్పటివరకు 34 సార్లు నోటీసులు జారీచేశారని చెప్పారు. పిటిషనర్ ప్రతిపక్ష పార్టీ ఎంపీ అని, అందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాజకీయాల జోలికి వెళ్లొద్దని సూచించింది. తనిఖీలు తప్పేంకాదని, షోకాజు నోటీసులకు స్పందించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఐఐటీ–మద్రాస్ ఇచ్చిన నివేదిక కూడా పట్టించుకోలేదని రోహత్గి తెలిపారు. షోకాజు నోటీసులకు స్పందించామని పేర్కొన్నారు. ఏపీపీసీబీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నాదకర్ణి వాదనలు వినిపిస్తూ.. షోకాజు నోటీసులకు స్పందించారని, అయితే పదేపదే వాయిదాలు కోరారని, అంతకు మించి ఏమీలేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించారనిపిస్తే తొలిసారే చర్యలు తీసుకోవాల్సిందని ధర్మాసనం పేర్కొంది. షోకాజు నోటీసుకు స్పందించడానికి పలుసార్లు సమయం ఇచ్చామని నాదకర్ణి తెలిపారు. ఇలా సమయం అడుగుతూనే సుప్రీంకోర్టును ఆశ్రయించారని, సుప్రీంకోర్టు స్టే ఇచ్చి తమ చేతులు కట్టేసిందని చెప్పారు. అనంతరం ధర్మాసనం షోకాజు నోటీసులపై తామెలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేసింది. తదుపరి చర్యలు తీసుకునే అధికారం అథారిటీకి ఉందని తెలిపింది. ‘షోకాజు నోటీసులపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి తదుపరి చర్యలు తీసుకోవచ్చు. అమరరాజా సంస్థ వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలి. ఆ వాదనలపై మండలి నిర్ణయం తీసుకోవాలి. అయితే, ఆ నిర్ణయాన్ని నాలుగు వారాలపాటు నిలుపుదల చేయాలి. తదుపరి ఏమైనా ఉంటే హైకోర్టులో వాదనలు వినిపించుకోవడానికి వాదప్రతివాదులకు స్వేచ్ఛనిస్తున్నాం..’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంటూ పిటిషన్‌పై విచారణను ముగించింది. -
Amara Raja: చట్ట ప్రకారమే ముందుకెళ్లండి: సుప్రీం
సాక్షి, ఢిల్లీ: అమర్ రాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం విచారణ సందర్భంగా.. షోకాజ్ నోటీస్ పై పబ్లిక్ హియరింగ్ నిర్వహించి.. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే.. పీసీబీ ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని అమర్ రాజాకు సూచించింది న్యాయస్థానం. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసిన సంగతి తెలిసిందే. అయితే.. 34 సార్లు నోటీసులు ఇచ్చి రాజకీయ కారణాలతో తమను వేధిస్తున్నారని అమర్ రాజా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదించారు. ఈ తరుణంలో న్యాయస్థానం.. రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ చట్టప్రకారం ముందుకు పోవాల్సిందే అని స్పష్టం చేసింది. అమర్ రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, పరిసర ప్రాంతాల జలాల్లో లెడ్ కంటెంట్ పెరిగిందని గతంలో నోటీసులు ఇచ్చింది ఏపీ కాలుష్య నియంత్రణ మండలి. జల, వాయు కాలుష్యాలను వెదజల్లుతూ కార్మికులు సహా చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న అమర్‌రాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై.. గతంలో అధికారుల విధులను అడ్డుకున్నందుకు పోలీసు కేసు నమోదైంది. -
ఏపీ: మూడు నెలల్లో నిషేధిత ప్లాస్టిక్ వినియోగానికి చెక్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నిషేధిత ప్రమాణాలతో కూడిన ప్లాస్టిక్ వినియోగాన్ని మూడు నెలల్లో పూర్తిగా అరికట్టాలని రాష్ట్ర పర్యావరణ, శాస్త్రసాంకేతిక, ఇంధన, అటవీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నగరంలో బుధవారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొనసాగించాలని కోరారు మంత్రి పెద్దిరెడ్డి. మానవాళికి హాని కలిగించేలా, పర్యావరణంకు విఘాతం ఏర్పడేలా కాలుష్యంను విడుదల చేస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆయా పరిశ్రమలు వ్యర్థాలను నేరుగా బయటకు విడుదల చేయకుండా, వాటిని శుద్దిచేసి, హానికర రసాయనాలను పూర్తిగా తొలగించిన తరువాతే బయటకు వదిలేలా చూడాలని కోరారు. అందుకు అవసరమైన వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ లను పరిశ్రమలు సిద్దం చేసుకోవాలని అన్నారు. దాదాపు రూ.20.30 కోట్ల జరిమానా రాష్ట్ర వ్యాప్తంగా 17 కేటగిరిల్లోని 307 పరిశ్రమలు ఇప్పటికే AP PCB పరిధిలో నిత్యం కాలుష్య నియంత్రణ ప్రమాణాలపై ఆన్ లైన్ ద్వారా సమాచారంను అందిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ఏ పరిశ్రమలో అయినా కాలుష్యం ప్రమాణాలకు భిన్నంగా వెలువడితే వెంటనే పీసీబీ అధికారులు సదరు పరిశ్రమలను అప్రమత్తం చేయడానికి వీలవుతోందని తెలిపారు. ఇదే విధానాన్ని అన్ని పరిశ్రమలకు వర్తింపచేయాలని అన్నారు. ఇప్పటికే ఇండస్ట్రియల్ పొల్యూషన్ మానిటరింగ్, హజార్డ్ వేస్ట్, బయోవేస్ట్, ఈ-వేస్ట్, ప్లాస్టిక్ వేస్త్, బ్యాటరీ వేస్త్, ఫ్లైయాష్ విభాగాల్లో పీసీబీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రమాణాలను పాటించని సంస్థలపై జరిమానాలు విధించడం, నోటీసులు జారీ చేస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటివరకు దాదాపు రూ.20.30 కోట్లను జరిమానాలుగా విధించడం జరిగిందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ఏపీ పీసీబీ పనిచేస్తోందని అన్నారు. వివిధ కేటగిరిల్లోని వ్యర్థాల నిర్వహణపై ఎప్పటికప్పుడు జాతీయ సంస్థలకు నివేదికలను సమర్పిస్తున్నామని అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై నేరుగా స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపిస్తోందని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సైతం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి, ప్రమాణాలు పాటించని సంస్థలపై తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తోందని పేర్కొన్నారాయాన. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్(ఎన్ క్యాప్) కింద రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాలి కాలుష్యంను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర, జోనల్, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి గాలి కాలుష్యంపై పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఐఐటి తిరుపతి, ఆంధ్రా యూనివర్సిటీ, ఎన్‌ఎఆర్‌ఎల్, సిఎస్ఐఆర్, ఎన్ఇఇఆర్ఐ, ఐఐటి మద్రాస్ ల ద్వారా రాష్ట్రంలోని పలుచోట్ల గాలి కాలుష్యంపై అధ్యయనం జరుగుతోందని అన్నారు. హాట్ స్పాట్ లను గుర్తించడం, కాలుష్యానికి కారణాలను పరిశీలించి, వాటికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే 42.90 కోట్లతో పలు నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో బయో వ్యర్థాల నిర్వహణ సగ్రమంగా జరగాలని, బయోవేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థలు ఇస్తున్న వివరాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చేపించే బయో వ్యర్థాలను నిర్థిష్టమైన ప్రమాణాల మేరకు డిస్పోజ్ చేస్తున్నారో లేదో పరిశీలించే విధానాలను రూపొందించాలని కోరారు. ఈ సమీక్షలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ సమీర్ శర్మ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, పిసిబి మెంబర్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జాతీయ పార్కుల్లో ఎస్టీపీలు తప్పనిసరి.. ఎందుకంటే!
సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఆహ్లాదాన్ని అందించే జాతీయ పార్కులు కలుషిత కాటుకు గురవుతున్న వైనంపై పీసీబీ సీరియస్‌గా దృష్టి సారించింది. నగరంలోని కేబీఆర్‌పార్కు, జూపార్క్ సహా మహవీర్ హరిణ వనస్థలి తదితర జాతీయ ఉద్యానవనాల్లో మురుగు నీరు చేరకుండా నిరోధించడంతోపాటు.. ప్రతి చుక్క నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీలు నిర్మించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీలు నెలరోజుల్లోగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించింది. హరిణ వనస్థలిలో కలుషిత కాటు ఇలా... నగర శివార్లలో విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహవీర్ హరిణ వనస్థలి జాతీయ పార్క్‌లోని సహజ సిద్ధమైన నీటికుంటలోకి ఆటోనగర్ పారిశ్రామిక వాడలోని ఆటోగ్యారేజ్లు, భారీ వాహనాల సర్వీసింగ్ సెంటర్లు, ఫెస్టిలైజర్ గోడౌన్ల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థజలాలతో కాలుష్య కాసారంగా మారింది. దీంతో ఈ పార్క్‌లోని వన్యప్రాణులకు ముంపు పొంచి ఉండడంతో పీసీబీ అప్రమత్తమైంది. నీటినమూనాలు సేకరించి పరీక్షించగా.. కలుషిత ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో విధిగా ఎస్టీపీ నిర్మించాలని..శుద్ధి చేసిన నీటిని కేవలం గార్డెనింగ్ అవసరాలకే వినియోగించాలని సంబంధిత విభాగాలకు స్పష్టం చేసింది. మిగతా వ్యర్థజలాలను పైప్లైన్లను ఏర్పాటు చేసి మూసీలోకి మళ్లించాలని సూచించింది. చుట్టూ సీసీటీవీల నిఘా తప్పనిసరి.. నగరంలో జాతీయ పార్క్‌లకు ఆనుకొని ఉన్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థజలాలు ఉద్యానవనాల్లోకి చేరకుండా చూసేందుకు ఆయా వాడల్లో సీసీ టీవీలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని పీసీబీ టీఎస్ఐఐసీ, బల్దియాను ఆదేశించింది. వ్యర్థజ లాలను బహిరంగ ప్రదేశాలు, నాలాలు, చెరువులు, జాతీయ పార్కుల్లోకి వదిలిపెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎస్టీపీల ఏర్పాటుతో ఉపయోగాలివే.. ► జాతీయ పార్క్‌ల్లోకి చేరే మురుగు, వ్యర్థజలాలను శుద్ధి చేసిన తరవాతనే లోనికి ప్రవేశించే ఏర్పాటుచేయవచ్చు. ► శుద్ధిచేసిన నీటిని మొక్కల పెంపకం, గార్డెనింగ్ అవసరాలకు వినియోగించవచ్చు. ► ఆయా పార్క్‌లలోని చెరువులు, కుంటలు కాలుష్యకాసారం కాకుండా చూడవచ్చు. ► ఆయా ఉద్యానవనాల్లోకి కేవలం వర్షపునీరు మాత్రమే చేరే ఏర్పాట్లు చేయాలి. ► ప్లాస్టిక్, ఇతర ఘన వ్యర్థాలు పార్కుల్లోకి చేరకుండా నిరోధించాలి. ► జీవ వైవిధ్యాన్ని పరిరక్షణపై అన్ని వర్గాల్లో అవగాహన కల్పించాలి. -
Hyderabad: పరిశ్రమల నిర్వాకం.. గుంతలు తీసి.. రసాయనాలు దాచి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ను ఆనుకొని ఉన్న పలు రెడ్, ఆరెంజ్ కేటగిరీ బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా నిల్వ చేస్తుండటంతో పర్యావరణ హననం జరుగుతోంది. ఇటీవల పీసీబీ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. పర్యావరణ నిబంధనలు పాటించనివి, పీసీబీ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే ఉత్పత్తులు చేస్తున్న ఆరు కంపెనీలను మూసివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి తాజాగా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిబంధనలకు నీళ్లు... పలు ఫార్మా, బల్క్ డ్రగ్, కంపెనీల్లో ఉత్పత్తులు తయారు చేస్తున్న క్రమంలో ఉత్పన్నమయ్యే ఫార్మా వ్యర్థ జలాలను జీడిమెట్లలోని ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించకుండా రోజుల తరబడి కంపెనీల ఆవరణలోనే భారీ గుంతలు తీసి వాటిల్లో నిల్వ చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినపుడు వరద నీటితోపాటు ఈ వ్యర్థాలను బయటకు వదలిపెడుతుండడంతో సమీప చెరువులు, కుంటలు కాలుష్య కాసారమవుతున్నాయి. మరికొందరు అక్రమార్కులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు ట్యాంకర్లలో ఈ వ్యర్థాలను తరలించి ఔటర్ పరిసరాల్లో ఉన్న పలు చెరువులతో పాటు మూసీలోకి యథేచ్ఛగా డంపింగ్ చేస్తున్నారు. అంతుచిక్కని లోగుట్టు.. నగరంలో పదికిపైగానే పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో సుమారు మూడువేలకు పైగా పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఇందులో బల్క్‌డ్రగ్స్, రసాయనాల తయారీ, ఇంజినీరింగ్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. పాశమైలారం, జీడిమెట్ల, చర్లపల్లి, కాటేదాన్, జిన్నారం, బొల్లారం తదితర పారిశ్రామికవాడల్లోని అధిక శాతం పరిశ్రమల్లో ఎలాంటి ఉత్పత్తులు తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఇదే తరుణంలో కొందరు అక్రమార్కులు పరిశ్రమ ముసుగులో నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో చాలా పరిశ్రమలకు కనీసం బోర్డు కూడా లేదు. గేట్ల దగ్గర సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్య క్తులు లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. లోపల ఏమి జరుగుతోందో స్థానికులకు కూడా తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడటం గమనార్హం. కాగితాలకే పరిమితం.. వాయు, జల కాలుష్యానికి కారణమయ్యే రెడ్, ఆరెంజ్ కేటగిరీల్లోకి వచ్చే అన్ని పరిశ్రమలు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇప్పటివరకు పీసీబీ నుంచి అనుమతులు తీసుకున్న పరిశ్రమల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల వరకు ఉంటే అందులో నగరం చుట్టు పక్కల 3 వేల వరకు ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించే ముందు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఈ), పూర్తైన తర్వాత కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్ఓ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పీసీబీ అనుమతి పొందిన ప్రతి పరిశ్రమ కచ్చితంగా 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న బ్లాక్ బోర్డును ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. దానిపై తెల్లటి రంగుతో ఏ సంస్థ పేరుతో.. ఏయే ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు అనుమతి పొందారు.. ప్రతిరోజూ వెలువడుతున్న వ్యర్థ జలాలు, ఇతర వ్యర్థాల (హజార్డస్ వేస్టేజ్) పరిమాణం.. వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనే తదితర వివరాలను పేర్కొనాలి. కానీ పారిశ్రామిక వాడల్లో ఈ నిబంధన అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. -
డీజిల్ కారు ఉందా? ఆ రోడ్లపైకి వెళ్లారో రూ.20వేల ఫైన్!
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ సతమతమవుతోంది. గాలి నాణ్యత మెరుగు పడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధానిలో డీజిల్ కార్లను నిషేధిస్తూ రవాణా విభాగం ఆదేశాలు జారీ చేసింది. బీఎస్-6 మినహా డీజిల్‌తో నడిచే పాత వర్షన్ లైట్ మోటార్ వాహనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) సిఫార్సు చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.20,000 జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. బీఎస్6 వాహనాలు, నిత్యావసర, ఎమర్జెన్సీ సర్వీసుల్లోని వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. బ్యాన్ కేటగిరీలోకి వచ్చే వాహనాలు ఉన్న యజమానులకు ఢిల్లీ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం సందేశాలు సైతం పంపించింది. ‘మీ వాహనం నిషేధిత కేటగిరిలో ఉన్నందున ఢిల్లీ రోడ్లపైకి తీసుకురాకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే.. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 ప్రకారం.. మీకు రూ.20,000 జరిమానా విధించబడుతుంది.’ అనే మెసేజ్‌ను వాహన యజమానులకు పంపించారు. మరోవైపు.. నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఢిల్లీ రోడ్లపై అలాంటి వాహనాలు భారీగా తిరగటం గమనార్హం. ఢిల్లీ గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఏఐక్యూ 408కు చేరుకున్న క్రమంలో నగరం మొత్తం నల్లటి పొగ ఆక్రమించేసింది. ఏఐక్యూ 400 దాటితే దానిని తీవ్రమైన కాలుష్యంగా భావిస్తారు. అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డీజిల్ వాహనాలు మినహాయిస్తే.. సీఎన్జీ, ఎలక్ట్రిక్ ట్రక్కులకు అనుమతులు ఉన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసు సేవల్లో ఉన్న డీజిల్ వాహనాలకు మినహాయింపునిచ్చారు. ఇదీ చదవండి: Delhi-NCR Pollution: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయాలు -
పరిశ్రమల్లో తనిఖీలకు మూడు టాస్క్‌ఫోర్స్‌లు
సాక్షి, అమరావతి: ఇటీవల పరిశ్రమల్లో ప్రమాదాల నేపథ్యంలో నిరంతరం తనిఖీ చేసేందుకు మూడు టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, గనులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాస్క్‌ఫోర్స్ బృందాలు పరిశ్రమలు, కాలుష్యకారక సంస్థల్లో తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని ఆదేశించారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఏకే ఫరీడా, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ విజయ్‌కుమార్, పీసీబీ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరించాలి రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై మరింత కఠినంగా వ్యవహరించాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఎర్రచందనం నిల్వలు విస్తరించిన ప్రాంతాల్లో సాయుధ అటవీ బృందాలతో నిరంతరం గస్తీ నిర్వహించాలని, అవసరమైతే డ్రోన్లతో నిఘా పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30 ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, వాటితోపాటు పులికాట్, నేలపట్టు, కోరింగ, పాపికొండలు ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్, అటవీదళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి, పీఆర్, ఆర్డీ స్పెషల్ కమిషనర్ శాంతిప్రియ పాండే, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, పీసీసీఎఫ్ బీకే సింగ్, పీసీపీఎఫ్ ఏకే ఝా పాల్గొన్నారు. -
ఓఎన్జీసీకి ఎన్జీటీ భారీ జరిమానా
అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్(ఓఎన్జీసీ)కి భారీ జరిమానా విధించింది జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ). కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి కారణమైనందున రూ.22.76 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఓఎన్జీసీపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. సీఎస్ఆర్ ఫండ్స్‌ను ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా ఓఎన్జీసీకి భారీ జరిమానా విధించినట్లు తెలిపింది. యెనుమల వెంకటపతి రాజు పిటిషన్‌పై విచారణ చేపట్టిన హరిత ట్రైబ్యునల్- (ఎన్జీటీ) తీర్పు వెలువరించింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఈ జరిమానా విధించింది. ఇదీ చదవండి: ‘విద్యారంగంలో దేశంలోనే ఎవరు చేపట్టనన్ని సంస్కరణలు తెచ్చాం’ -
పుడమికి ప్రాణాంతకంగా ప్లాస్టిక్
సాక్షి, అమరావతి: నేలను, నీటిని, గాలిని కలుషితం చేస్తూ అత్యంత ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ ప్రపంచాన్ని వదలనంటోంది. మన దేశంలో ఒక వ్యక్తి ఏడాదికి సగటున నాలుగు కిలోల ప్లాస్టిక్‌ను వాడి పారేస్తున్నాడు. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుందని అంచనా. ప్లాస్టిక్ బాటిళ్లకు 450 ఏళ్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులు కుళ్లిపోవడానికి 30 ఏళ్లకు పైగా పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కానీ అది మట్టిలో కలిసే లోపు అపార నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా వాడి పారేసే ప్లాస్టిక్ ఇంటింటా, వీధుల్లో, రోడ్లపైన, చెత్తకుప్పల్లో, కాలువల్లో, చెరువుల్లో, నదుల్లో, చివరికి సముద్ర తీరాల్లో కూడా పేరుకుపోతోంది. సమస్త జీవరాశికి ప్రాణాంతకంగా పరిణమించింది. ప్లాస్టిక్ వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ, అమలు, ఆచరణలో వైఫల్యం వల్ల రోజురోజుకు దీని బెడద పెరిగిపోతోంది. గతేడాది దేశంలో 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్టు కేంద్ర ప్రభుత్వం లెక్క తేల్చింది. గత ఐదేళ్లలో వీటి ఉత్పత్తి రెట్టింపయిందని, సగటు వార్షిక పెరుగుదల 21.8 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. 2015–16లో 15.89 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తయితే, 2018–19లో 30.59 లక్షల టన్నులు, 2019–20లో 35 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి అయ్యాయని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి ఇటీవల పార్లమెంట్లో చెప్పారు. ప్రపంచంలో ఉత్తమ నియంత్రణ దేశాలు ప్రపంచంలో ప్లాస్టిక్ బ్యాగులు, సీసాలు, కట్లర్స్, స్ట్రాలు, కాఫీ స్టిరర్స్ వంటి వాటిని నిషేధించిన మొట్టమొదటి దేశం కోస్టారికా. ఇది యూఎన్వో అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ను 2019లో అందుకుంది. ఈ దేశంలో 2021 నుంచి 80 శాతం ప్రకృతికి హాని చేయనివి, పునర్ వినియోగించదగ్గ వస్తువులను మాత్రమే వినియోగిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ► జమైకా 2019 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దిగుమతిని నిషేధించింది. ఈ దేశంలో పర్యావరణ అనుకూలం వస్తువులనే తయారు చేస్తున్నారు. ► ఆఫ్రికాలోని దాదాపు 34 దేశాలు ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాయి. రువాండా పదేళ్ల క్రితమే ప్లాస్టిక్ సంచులను నిషేధించింది. ► ఇండోనేసియా 2018 నుంచి ప్లాస్టిక్ బ్యాగ్‌లు, స్ట్రాలను నిషేధించింది. 2025 నాటికి ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం 70 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ► న్యూజిలాండ్ దేశం 2019లోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిషేధించింది. లోరల్, కోకొకోలా, నెస్లే వంటి 12 అంతర్జాతీయ కంపెనీలు 2025 నాటికి 100 శాతం కంపోస్ట్ చేయదగిన ప్యాకేజింగ్‌ను అమలు చేస్తామని ఆ ప్రభుత్వానికి హామీనిచ్చాయి. ► జర్మనీ 56.1 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 53.8 శాతం, దక్షిణ కొరియా 53.7 శాతం, వేల్స్ 52.2 శాతం, స్విట్జర్లాండ్ 49.7 శాతం రీసైక్లింగ్ చేస్తున్నాయి. ఢిల్లీదే అగ్రస్థానం ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఢిల్లీ మహానగరం మొదటి స్థానంలోఉంది. ఇక్కడ ఏటా 2,51,850 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 1,56,767 టన్నులతో కోల్‌కతా రెండో స్థానంలో ఉంది. చెన్నై 1,56,731 టన్నులతో తర్వాతి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2020–21 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలు 70 వేల టన్నులుగా గుర్తించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద 124 ప్లాస్టిక్ తయారీ యూనిట్లు, ఆరు రీసైక్లింగ్ పరిశ్రమలు నమోదు చేసుకున్నాయి. కానీ అనధి కారిక తయారీ సంస్థలు 400 వరకు ఉంటాయని అంచనా. పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతు న్న సరుకుపై లెక్కలు లేవు. అనధికారిక ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలు బీహార్‌లో అత్యధికంగా 43 శాతం, తమిళనాడులో 26 శాతం, మహరాష్ట్రలో 13 శాతం ఉన్నాయి. ఇవి విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. 12 శాతమే రీసైక్లింగ్ ప్లాస్టిక్ వ్యర్థాలలో 12 శాతం మాత్రమే రీసైక్లింగ్ చేస్తున్నారని, 20 శాతం బహిరంగ ప్రదేశాల్లో తగులబెడుతున్నట్టు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) నివేదిక తెలిపింది. మిగిలిన 68 శాతం భూమిలో, నీటిలో కలుస్తున్నట్టు తేల్చింది. చట్ట ప్రకారం ప్లాస్టిక్ తయారీ సంస్థలు అవి ఉత్పత్తి చేస్తున్న వాటిలో 70 శాతం వ్యర్థాలను రీసైక్లింగ్ చేయాలి. కానీ ఈ నిబంధన సరిగా అమలు కావడంలేదు. దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ, దాని వాడకంపై నియంత్రణ లేదు. దీంతో జూలై 1వ తేదీ నుంచి 75 మైక్రాన్లు, ఆపై మందం గల ప్లాసిక్ సంచులు, బయో డిగ్రేడబుల్ కవర్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లు, ఆపై మందం గలవాటినే ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్‌తో కొన్ని నష్టాలివీ.. ► భూసారం పెరగకుండా అడ్డుపడుతుంది ► క్లోరినేటెడ్ ప్లాస్టిక్‌తో మట్టిలో విష రసాయనాలు చేరుతున్నాయి. అ వి భూగర్భ జలాల్లో కలిసి మానవాళి, ప్రాణికోటికి హానిచేస్తున్నాయి. ► ఏటా పక్షులు, చేపలు, జంతువులు ప్లాస్టిక్ వల్ల చనిపోతున్నాయి. అంతరించిపోతున్న ప్రాణుల్లో దాదాపు 700 జాతులు ప్లాస్టిక్ వల్ల ప్రభావితమైనట్లు గుర్తించారు. ► మనం తినే జలచరాల్లో మైక్రో ప్లాస్టిక్, నానో ఫైబర్ వ్యర్థాలను కూడా కనుగొన్నారు. ► బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను మండించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి అవుతోంది. ఇది 60 లక్షల మంది మరణాలకు కారణమ వుతున్నట్టు అంచనా. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు వస్తున్నాయి. ప్లాస్టిక్ పాలిమర్ అవశేషాలతో క్యాన్సర్, ఎండోక్రైన్ గ్రంధి దెబ్బతినడం, చర్మవ్యాధులు సోకుతున్నాయి. ► ప్లాస్టిక్‌లో బిస్ఫినాల్–ఏ, థాలేట్స్, డయాక్సిన్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ (పీఏహెచ్), పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ (పీసీబీస్), స్టైరిన్ మోనోమర్, నానిల్ఫెనాల్ వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి మానవుల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని నిరోధిస్తాయి. పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. దేశానికి సిక్కిం ఆదర్శం ప్లాస్టిక్ నిషేధంలో సిక్కిం రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే మొదటిసారిగా సిక్కిం రాష్ట్రం 1998లోనే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నిషేధించింది. ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించిన మొదటి రాష్ట్రం కూడా ఇదే. 2016లో ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాలలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వాడకాన్ని నిషేధించింది. దీంతో ఈ రాష్ట్రంలో ప్యాస్టిక్ వ్యర్థాలు 5.99 టన్నులకు తగ్గిపోయింది. దీని తర్వాత మిజోరాం(13.30 టన్నులు), త్రిపుర 26.2 టన్నులు), మేఘాలయ (1,263 టన్నులు) ఉన్నాయి. -
వాయు కాలుష్యాన్ని30% తగ్గించడమే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యాన్ని 30 శాతం మేర తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో గాలిలో ఉన్న కాలుష్యం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ రెండు నగరాలకు రూ.100 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది. ఇప్పటికే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్.. ఆంధ్ర యూనివర్సిటీ, ఐఐటీ (కాన్పూర్), అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీలతో కలిసి కాలుష్య నియంత్రణకు ప్రణాళిక తయారు చేసింది. విజయవాడ కార్పొరేషన్ కూడా ఐఐటీ (తిరుపతి) భాగస్వామ్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు నగరాల్లో ఈ తరహా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఆ నగరాలకు ప్రభుత్వం ఏటా రూ.2 కోట్ల చొప్పున మూడేళ్లు కేటాయిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు నగరపాలక సంస్థలు ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ ప్రణాళికలు రూపొందించాయి. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు నగరాలకు ఐఐటీ (తిరుపతి) సహకారంతో, చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు నగరాలకు నేషనల్ సెంటర్ ఫర్ అట్మోస్ఫియరిక్ రీసెర్చ్ (తిరుపతి) ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాయు కాలుష్య పర్యవేక్షణ వాయు కాలుష్య నియంత్రణ కోసం ఈ నగరాల్లో రూ.35 కోట్లతో కంటిన్యూస్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఐదు చొప్పున, 11 మున్సిపాల్టీల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తున్నారు. వీటిద్వారా గాలి కాలుష్యాన్ని ఆన్లైన్లో పర్యవేక్షించడం, ప్రజలకు దానిపై డిజిటల్‌గా చూపించడం అవగాహన కల్పించనున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రతి జిల్లా కేంద్రంలోను ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 35 స్టేషన్లలో గాలి కాలుష్యాన్ని పర్యవేక్షించనున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల నుంచి వచ్చే వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంటోంది. అక్కడి నుంచి వచ్చే మురుగునీటిని ప్రస్తుతం 89 సివేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధిచేస్తుండగా మరికొన్ని ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్, ఈ–పరిశ్రమల వ్యర్థాల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రమాదకర వ్యర్థాలను వినియోగించుకునేందుకు 10సిమెంట్ కంపెనీలకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఒకే ఒక భూమి (ఓన్లీ ఒన్ ఎర్త్) పేరుతో నిర్వహించారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 8,953 పరిశ్రమల్లో సెస్టెంబర్ నాటికి 33% మొక్కలతో పచ్చదనాన్ని వృద్ధి చేయాలని కోరాం. – ఎ.కె.పరిడ, చైర్మన్, కాలుష్య నియంత్రణ మండలి -
‘రామగుండం’లో ఉత్పత్తి ఆగలేదు
ఫెర్టిలైజర్ సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్ కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)లో ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతోంది. ఉత్పత్తిని ఆపాలని కాలుష్య నియంత్రణ మండలి శనివారం ఆదేశించింది. కానీ కర్మాగారంలో ఆదివారం కూడా 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి జరిగింది. ఈ కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేయాల్సిందిగా శనివారం కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులివ్వడం తెలిసిందే. దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్యం సోమవారం మండలి అధికారులతో సమావేశమైంది. దేశవ్యాప్తంగా యూరియాకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో.. కర్మాగారంలో ఉత్పత్తి ఆపితే రైతులకు సకాలంలో ఎరువులు అందించడం ఇబ్బందిగా మారుతుందని తెలిపింది. అమ్మోనియా గ్యాస్, వ్యర్థ జలాల కాలుష్యంపై వివరణకు సమయం ఇవ్వాలని కోరింది. దీనికి అంగీకరించిన అధికారులు ఎరువుల ఉత్పత్తిని కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రాష్ట్రంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయశాఖ కమిషనర్ ఎం. రఘునందన్‌రావు తెలిపారు. -
సమాజ సేవతోనే జీవితానికి పరిపూర్ణత
ఒక వ్యక్తి తన కోసం తాను పని చేసుకుంటుంటే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండకపోవచ్చు. అదే వ్యక్తి సమాజం కోసం కూడా పని చేస్తుంటే చెప్పుకోవడానికి ఎంతో కొంత ఉంటుంది. అదే... సమాజంలో మార్పు కోసం నిరంతరాయంగా శ్రమిస్తుంటే చెప్పుకోవడానికి చాలా ఉంటుంది. చాలా చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో ఒకరు అనిత చావలి. గాంధీజీతో పాటు చీరాల–పేరాల ఉద్యమంలో పాల్గొన్న తాతగారి స్ఫూర్తితో ఆమె సామాజిక కార్యకర్తగా మారారు. గత రెండు దశాబ్దాలుగా ఆమె సామాజిక జీవనం, సమాజంలో ఆమె తీసుకువచ్చిన మార్పులు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. అనిత చావలి పుట్టింది పెరిగింది బాపట్ల జిల్లా (విభజనకు పూర్వం ప్రకాశం జిల్లా) చీరాల. డిగ్రీ వరకు చీరాలలోనే చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీలో చేశారు. జిల్లా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా, ఎన్సీసీ క్యాడెట్‌గా ఆమె విద్యార్థి దశ నుంచే చురుగ్గా ఉండడానికి కారణం తాతగారు వాసుదేవమూర్తిగారినే చెబుతారు. ఇంటర్ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు 1986 గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఎన్సీసీ క్యాడెట్‌గా సేవలందించిన రోజులను గుర్తు చేసుకున్నారు అనిత. ‘‘బాధితులకు ఆహార పొట్లాలు పంచడం, మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న డాక్టర్లకు సహాయం చేయడం వంటి పనులు మాకప్పగించారు. సర్వీస్‌లో ఉండే ఆత్మసంతృప్తిని నూటికి నూరుపాళ్లు అనుభవించిన సందర్భం అది. పీజీలో కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పని చేశాను. అయితే నా జీవితంలో అతి పెద్ద విరామం పెళ్లి రూపంలో వచ్చింది. నా పీహెచ్డీ సీటును కూడా వదులుకుని యూఎస్‌కి వెళ్లాల్సి వచ్చింది. పన్నెండేళ్లు అక్కడే ఉన్నాం. అయితే అక్కడ కూడా ఊరికే ఉండలేదనుకోండి. లోవెల్ జనరల్ హాస్పిటల్లో చారిటీ వర్క్ చేశాను. ఒక కల్చరల్ ఫౌండేషన్ స్థాపించి బోస్టన్, న్యూజెర్సీల్లో ఉన్న భారతీయ మహిళలను సంఘటితం చేస్తూ తరచూ కలిసే ఏర్పాటు చేశాను. యూఎస్ రోడ్లే కాదు! ఇండియాకి వచ్చి హైదరాబాద్, సఫిల్‌గూడలో స్థిరపడ్డాం. అప్పటికి మా పిల్లలిద్దరూ ప్రైమరీ స్కూల్ వయసులోనే ఉన్నారు. ఇక్కడికి రాగానే ఒకింత షాక్ ఏమిటంటే... చిన్న క్లాసుల పిల్లలను కూడా ట్యూషన్‌కి పంపిస్తున్నారు. ఆ వయసులో ఇంత ప్రెషర్ ఎందుకు? ఆట–పాట లేని చదువేమిటి! అనిపించింది. ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో రెయిన్ బో డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. అదే సమయంలో కాలనీ మీద కూడా నా ఫోకస్ పడింది. ‘యూఎస్‌లో రోడ్లు శుభ్రంగా ఉంటాయి, అలాంటి రోడ్లు ఇండియాకి ఎప్పుడు వస్తాయో... అని పెదవి విరిస్తే సరిపోదు, అక్కడి వాళ్లు ఎలా పని చేస్తారో అలా మనం కూడా పని చేయాలి, అలా పని చేయడం అలవాటు చేయాలి... అనుకున్నాను. మా కాలనీలో ఉత్సాహవంతులతో ఒక సొసైటీ ఏర్పాటు చేశాం. ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి జీహెచ్ఎంసీ వాళ్లు చెత్త తీయకపోతే ఫోన్ చేయడం అలవాటు చేశాం. కాలనీ రోడ్లు శుభ్రంగా మారిపోయాయి. ఇలా ఉన్నప్పుడు 2015 వరదలు మా కాలనీని జలమయం చేశాయి. డ్రైనేజ్ నీరు పొంగి రోడ్ల మీదకు రావడానికి కారణం నాలాలు ప్లాస్టిక్ చెత్తతో పూడిపోవడమేనని తెలిసింది. ప్లాస్టిక్ మీద నా పోరాటం అప్పుడే మొదలైంది. ప్లాస్టిక్ వద్దు... కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ బదులు ఈ బ్యాగ్ వాడండి అని జ్యూట్ బ్యాగ్ ఇచ్చాం. జీహెచ్ఎంసీతో కలిసి తడి చెత్త –పొడి చెత్త వేరు చేయడం నేర్పించాం. ఇంకా చక్కగా వేరు చేసిన వారిని గుర్తించి ‘స్వచ్ఛ నాగరిక’ పురస్కారంతో ప్రోత్సహించాం. స్వచ్ఛ రంగోలి పేరుతో ‘యాంటీ ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయవద్దు, డ్రై–వెట్ వేస్ట్ సెగ్రెగేషన్, నీటి సంరక్షణ, మొక్కలు నాటడం’ అంశాల మీద ముగ్గుల పోటీలు పెట్టాం. ఈ విషయాల్లో మహిళలను ప్రభావితం చేయగలిగితే ఆ ప్రభావం ఇంట్లోనూ, సమాజంలోనూ ప్రతిబింబిస్తుందనే ఉద్దేశంతో ఈ థీమ్ డిజైన్ చేశాను. వీటన్నింటితోపాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ చేపట్టాం. అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్, ఆయిల్ బాటిల్స్ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్‌గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం. మా దగ్గరకు వచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ క్రషింగ్ యూనిట్‌కి వెళ్లిపోతుంది. ప్లాస్టిక్ ఎలిమినేషన్ కోసం రైల్వే స్టేషన్లలో కూడా క్రషింగ్ మెషీన్లు పెట్టించాం. ఇవన్నీ బాగా జరిగాయి. కానీ... చికెన్, మటన్ షాపులకు స్టీలు బాక్సు తీసుకెళ్లాలనే ఉద్యమం కరోనా ముందు వరకు విజయవంతంగా చేయగలిగాం. ఆ తర్వాత మా చేతుల్లో నుంచి మెల్లగా జారిపోయింది. దాని మీద మళ్లీ ఫోకస్ పెట్టాలి. మా కాలనీలో నేను కనిపిస్తే అందరూ ఎదురు వచ్చి పలకరిస్తారు. చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉన్న వాళ్లు మాత్రం ఇప్పుడు పలకరించవద్దు అనుకుని మరో దారిలో మలుపు తిరిగి వెళ్లిపోతుంటారు’’ అన్నారామె నవ్వుతూ. సంఘటిత శక్తి ‘పని చేసే చేతులకు తీరిక ఉండదు, పని చేయని చేతులకు పని కనిపించదు’... అంటారు. అనిత వ్యాపకాల జాబితా చూస్తే ఈ నానుడి నిజమే అనిపిస్తోంది. వాటర్ బోర్డు సహకారంతో కాలనీలో ఇంకుడు గుంతల తవ్వకం వంటి పనులు చేస్తున్నారు, చేయిస్తున్నారు. ‘‘నేను ఒక పని తలపెట్టి ‘కాలనీలో ఈ పని చేద్దాం’ అని వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ పెట్టిన ఇరవై నాలుగ్గంటల్లో స్వచ్ఛందంగా తమ వంతు సహకారంగా ఎవరు ఏమేమి చేయాలనుకుంటున్నదీ తెలియచేస్తారు, అందుకయ్యే ఖర్చులో తమ వంతుగా ఎంత ఇవ్వగలరో కూడా సమాచారం ఇచ్చేస్తారు. అందుకే ఇంత సజావుగా చేయగలుగుతున్నాం. పైకి కనిపించేది నేనే, కానీ, నాకు సహకరించే ఎందరో అండగా ఉన్నారు’’ అని చెప్పారు అనితా చావలి. జీవితం అంటే... మన ఇంటి నాలుగ్గోడలకు పరిమితమైనది కాదు, సమాజంతో కలిసి ఉన్నదే జీవితం. ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించినట్లే, సామాజిక బాధ్యతను కూడా పూర్తి చేయాలి. అప్పుడే జీవితానికి పరిపూర్ణత. ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్, ఆయిల్ బాటిల్స్ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్‌గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం. అలాగే గౌతమ్‌నగర్ సరిహద్దులో రైల్వే పరిధిలో చెత్తకుప్పలా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయించి సరిహద్దు గోడకట్టించి గాంధీజీ విగ్రహం పెట్టాం. – వాకా మంజులారెడ్డి. -
పోరస్ ఫ్యాక్టరీ మూసివేత
సాక్షి, అమరావతి/నూజివీడు/ముసునూరు/లబ్బీపేట/భవానీపురం: బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆరుగురి మృతికి కారణమైన ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను మూసివేస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ)చట్టం 1974లోని 33ఏ, గాలి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1981ను అనుసరించి ఫ్యాక్టరీపై చర్యలు తీసుకున్నారు. విద్యుత్ కనెక్షన్‌ను కూడా తొలగించారు. బుధవారం రాత్రి 10.55 గంటలకు ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించడంతో గురువారం సాయంత్రం వరకు ఆరుగురు మృతి చెందడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికితోడు పర్యావరణానికి సైతం నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. సీఎఫ్‌వో నిబంధనలు పాటించకపోవడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యానికి కారణమైనట్టు గుర్తించారు. ఫ్యాక్టరీలోని వ్యర్థాలను క్రమపద్ధతిలో తొలగించాలని ఆదేశాలు జారీ చేశామని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఎ.కె.పరీడా తెలిపారు. ఇదిలా ఉండగా ప్రమాద ఘటనపై గురువారం ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారాన్ని పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. గ్యాస్ లీక్ వల్లే మంటలు ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు తయారయ్యే ఈ ఫ్యాక్టరీలోని డీబ్లాక్‌లో ఉన్న 3కేఎల్ సామర్థ్యం గల స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్లో ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించి గ్యాస్ ఒక్కసారిగా లీకైంది. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనమవ్వగా, మరొక వ్యక్తిని విజయవాడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుల్లో నలుగురు బిహార్ రాష్ట్రం నలంద జిల్లాకు చెందినవారు. మిగిలిన ఇద్దరిలో ఒకరిది అక్కిరెడ్డిగూడెం కాగా మరొకరిది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప. ఈ ప్రమాదంలో ఉదురుపాటి కృష్ణయ్య (34), అవదేష్ రవిదాస్ (30), కారు రవిదాస్ (25), మనోజ్‌కుమార్ (25), సువాస్ రవిదాస్ (32), బొప్పూడి కిరణ్ (32) మృతి చెందారు. వీరిలో కృష్ణయ్య కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. తీవ్రంగా గాయపడ్డ 12 మందిని తొలుత విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. గురువారం కంపెనీ యాజమాన్యం అక్కడికి చేరుకుని వారిని మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆస్పత్రికి తరలించింది. క్షతగాత్రులను హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఇక్కడ రోష¯Œ (30), సుధీర్ రవిదాస్ (30), రవి (36), వరుణ్‌దాస్ (30), మునారక్ (30), సుధీర్‌కుమార్ (35), జోసెఫ్ (30), వికారి రవిదాస్ (30)తో పాటు స్థానిక గ్రామాలకు చెందిన నాగేశ్వరరావు(30), ముల్లపూడి నాగరాజు (35), ఎస్కే సుభానీ(30) ఉన్నారు. వీరిలో ఏడుగురు బిహార్‌కు చెందిన వారు. సీహెచ్ రాజీవ్ (38)కు 5% గాయాలే కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాక ఇంటికెళ్లాడు. అంతకు ముందు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్ గురువారం స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్‌బాబు, డీఐజీ పాల్రాజు, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తదితరులు ఘటన స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. తక్షణ సాయంగా రూ.లక్ష అందించనున్నట్టు తెలిపారు. వాల్వ్ సరిగా లేనందునే ప్రమాదం! ఫ్యాక్టరీ దుర్ఘటనకు గ్యాస్ లీకే కారణంగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఫ్యాక్టరీ డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ ‘సాక్షి’కి వెల్లడించారు. రియాక్టర్ వద్ద వాల్వ్ సరిగా కట్టకపోవడం వల్ల గ్యాస్ లీక్ కావడంతో ఉష్ణోగ్రతలు పెరిగి రియాక్టర్ పేలి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సేకరించిన వస్తువులను తదుపరి పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపామని, నివేదిక వచ్చాక వాస్తవ కారణాలు తెలుస్తాయన్నారు. పాలిమర్స్ గ్రాన్యూల్స్ తయారీలో వినియోగించే 4ఎంపీఐ పౌడర్‌ను ఇక్కడ తయారు చేస్తున్నారు. 4వ రియాక్టర్లో 1,500 కేజీలకుపైగా పాథలిక్ ఎన్‌హైడ్రేడ్ అనే కెమికల్ కాంపౌండ్ తయారీలో భాగంగా మిథేల్మెన్ అనే రసాయనాన్ని పంపుతున్నప్పుడు ఉష్ణోగ్రత పెరిగి రియాక్టర్ పేలినట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన బిహార్ వాసుల బంధువులతో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ప్రధాని మోదీ సంతాపం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే ఘటనపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారని రాజ్‌భవన్ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందించాలని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఆరా తీశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్‌తో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. -
మూసీ.. కాస్త మెరిసీ..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ జీవనరేఖ.. చారిత్రక మూసీ నది నీటి నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది. మూసీ నీటిలో హానికారక కోలిఫాం బ్యాక్టీరియా మోతాదు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడైంది. కాలుష్య మోతాదును నిర్ధారించేందుకు పలు రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించగా.. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ మూసీలో క్రమంగా తగ్గుముఖం పట్లినట్లు తేలింది. మార్చి చివరి నాటికి జలాల్లో బీఓడీ మోతాదు లీటరు నీటిలో 21 మిల్లీ గ్రాములుగా నమోదైంది. అంతకు ముందు సంవత్సరం ఇది 40 మిల్లీ గ్రాములుగా నమోదవడం గమనార్హం. మానవ మల, మూత్రాదుల్లో ఉన్న హానికారక కోలిఫాం బ్యాక్టీరియా ఉనికి కూడా తగ్గుముఖం పట్టడం విశేషం. ఈ బ్యాక్టీరియా మోతాదు సైతం సీపీసీబీ పరిమితి ప్రకారం మోస్ట్ ప్రాపబుల్ నంబరు పరిమితులకు లోపలే ఉన్నట్లు తేలింది. కారణాలివే.. గతేడాది సీజన్లో భారీ వర్షాలు కురియడంతో మూసీ మురికి వదిలింది. ఎగువ ప్రాంతంలో ఉన్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల గేట్లను వర్షాకాల సీజన్లో సుమారు పది సార్లు వదిలి వరద ప్రవాహాన్ని దిగువనకు వదిలిపెట్టారు. దీంతో వ్యర్థ జలాలు తొలగి నాణ్యత మెరుగుపడింది. ఇటీవలి కాలంలో జలమండలి, జీహెచ్ఎంసీ, పీసీబీ, మూసీరివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు తీసుకుంటున్న కొన్ని చర్యలు నీటినాణ్యత స్వల్పంగా మెరుగు పడేందుకు కారణమని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక నగరంలో రోజువారీగా ఉత్పన్నమవుతోన్న 1800 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో సగానికి పైగా జలమండలి నిర్వహిస్తోన్న 22 ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదలడం కూడా నాణ్యత పెరిగేందుకు మరో కారణంగా కనిపిస్తోంది. మూసీ కష్టాలివే.. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. అక్కడి నుంచి సుమారు 95 కి.మీ ప్రవహించి.. బాపూఘాట్ వద్ద మూసీ నగరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మేర నగరంలో నది ప్రవహిస్తోంది. ఈ మార్గంలోనే నదిలోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థజలాలు చేరడమే మూసీ పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు తక్షణం మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసి దాని ప్రకారం పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.