సమాజ సేవతోనే జీవితానికి పరిపూర్ణత | Perfect life with community service says Anitha chawali | Sakshi
Sakshi News home page

సమాజ సేవతోనే జీవితానికి పరిపూర్ణత

Published Tue, May 17 2022 12:25 AM | Last Updated on Tue, May 17 2022 12:25 AM

Perfect life with community service says Anitha chawali - Sakshi

గాంధీజీ విగ్రహానికి పూలమాల వేస్తున్న అనిత

ఒక వ్యక్తి తన కోసం తాను పని చేసుకుంటుంటే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండకపోవచ్చు. అదే వ్యక్తి సమాజం కోసం కూడా పని చేస్తుంటే చెప్పుకోవడానికి ఎంతో కొంత ఉంటుంది. అదే... సమాజంలో మార్పు కోసం నిరంతరాయంగా శ్రమిస్తుంటే చెప్పుకోవడానికి చాలా ఉంటుంది.  చాలా చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో ఒకరు అనిత చావలి.   గాంధీజీతో పాటు చీరాల–పేరాల ఉద్యమంలో పాల్గొన్న తాతగారి స్ఫూర్తితో ఆమె సామాజిక కార్యకర్తగా మారారు. గత రెండు దశాబ్దాలుగా ఆమె సామాజిక జీవనం, సమాజంలో ఆమె తీసుకువచ్చిన మార్పులు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి.

అనిత చావలి పుట్టింది పెరిగింది బాపట్ల జిల్లా (విభజనకు పూర్వం ప్రకాశం జిల్లా) చీరాల. డిగ్రీ వరకు చీరాలలోనే చదివారు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీలో చేశారు. జిల్లా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా, ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఆమె విద్యార్థి దశ నుంచే చురుగ్గా ఉండడానికి కారణం తాతగారు వాసుదేవమూర్తిగారినే చెబుతారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు 1986 గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఎన్‌సీసీ క్యాడెట్‌గా సేవలందించిన రోజులను గుర్తు చేసుకున్నారు అనిత.

‘‘బాధితులకు ఆహార పొట్లాలు పంచడం, మెడికల్‌ క్యాంపు నిర్వహిస్తున్న డాక్టర్లకు సహాయం చేయడం వంటి పనులు మాకప్పగించారు. సర్వీస్‌లో ఉండే ఆత్మసంతృప్తిని నూటికి నూరుపాళ్లు అనుభవించిన సందర్భం అది. పీజీలో కూడా ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో చురుగ్గా పని చేశాను. అయితే నా జీవితంలో అతి పెద్ద విరామం పెళ్లి రూపంలో వచ్చింది. నా పీహెచ్‌డీ సీటును కూడా వదులుకుని యూఎస్‌కి వెళ్లాల్సి వచ్చింది. పన్నెండేళ్లు అక్కడే ఉన్నాం. అయితే అక్కడ కూడా ఊరికే ఉండలేదనుకోండి. లోవెల్‌ జనరల్‌ హాస్పిటల్‌లో చారిటీ వర్క్‌ చేశాను. ఒక కల్చరల్‌ ఫౌండేషన్‌ స్థాపించి బోస్టన్, న్యూజెర్సీల్లో ఉన్న భారతీయ మహిళలను సంఘటితం చేస్తూ తరచూ కలిసే ఏర్పాటు చేశాను.  

యూఎస్‌ రోడ్లే కాదు!
ఇండియాకి వచ్చి హైదరాబాద్, సఫిల్‌గూడలో స్థిరపడ్డాం. అప్పటికి మా పిల్లలిద్దరూ ప్రైమరీ స్కూల్‌ వయసులోనే ఉన్నారు. ఇక్కడికి రాగానే ఒకింత షాక్‌ ఏమిటంటే... చిన్న క్లాసుల పిల్లలను కూడా ట్యూషన్‌కి పంపిస్తున్నారు. ఆ వయసులో ఇంత ప్రెషర్‌ ఎందుకు? ఆట–పాట లేని చదువేమిటి! అనిపించింది. ఈస్ట్‌ ఆనంద్‌ బాగ్‌లో రెయిన్‌ బో డాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టాను. అదే సమయంలో కాలనీ మీద కూడా నా ఫోకస్‌ పడింది.

‘యూఎస్‌లో రోడ్లు శుభ్రంగా ఉంటాయి, అలాంటి రోడ్లు ఇండియాకి ఎప్పుడు వస్తాయో... అని పెదవి విరిస్తే సరిపోదు, అక్కడి వాళ్లు ఎలా పని చేస్తారో అలా మనం కూడా పని చేయాలి, అలా పని చేయడం అలవాటు చేయాలి... అనుకున్నాను. మా కాలనీలో ఉత్సాహవంతులతో ఒక సొసైటీ ఏర్పాటు చేశాం. ఒక టోల్‌ ఫ్రీ నంబర్‌ పెట్టి జీహెచ్‌ఎంసీ వాళ్లు చెత్త తీయకపోతే ఫోన్‌ చేయడం అలవాటు చేశాం. కాలనీ రోడ్లు శుభ్రంగా మారిపోయాయి. ఇలా ఉన్నప్పుడు 2015 వరదలు మా కాలనీని జలమయం చేశాయి. డ్రైనేజ్‌ నీరు పొంగి రోడ్ల మీదకు రావడానికి కారణం నాలాలు ప్లాస్టిక్‌ చెత్తతో పూడిపోవడమేనని తెలిసింది. ప్లాస్టిక్‌ మీద నా పోరాటం అప్పుడే మొదలైంది.

ప్లాస్టిక్‌ వద్దు...  
కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్‌ బదులు ఈ బ్యాగ్‌ వాడండి అని జ్యూట్‌ బ్యాగ్‌ ఇచ్చాం. జీహెచ్‌ఎంసీతో కలిసి తడి చెత్త –పొడి చెత్త వేరు చేయడం నేర్పించాం. ఇంకా చక్కగా వేరు చేసిన వారిని గుర్తించి ‘స్వచ్ఛ నాగరిక’ పురస్కారంతో ప్రోత్సహించాం. స్వచ్ఛ రంగోలి పేరుతో ‘యాంటీ ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయవద్దు, డ్రై–వెట్‌ వేస్ట్‌ సెగ్రెగేషన్, నీటి సంరక్షణ, మొక్కలు నాటడం’ అంశాల మీద ముగ్గుల పోటీలు పెట్టాం. ఈ విషయాల్లో మహిళలను ప్రభావితం చేయగలిగితే ఆ ప్రభావం ఇంట్లోనూ, సమాజంలోనూ ప్రతిబింబిస్తుందనే ఉద్దేశంతో ఈ థీమ్‌ డిజైన్‌ చేశాను.

వీటన్నింటితోపాటు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుతో కలిసి ప్లాస్టిక్‌ ఎలిమినేషన్‌ ప్రోగ్రామ్‌ చేపట్టాం. అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ప్లాస్టిక్‌ ఎలిమినేషన్‌ ప్రోగ్రామ్‌ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్, కూల్‌డ్రింక్, ఆయిల్‌ బాటిల్స్‌ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్‌గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్‌ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం.

మా దగ్గరకు వచ్చిన ప్లాస్టిక్‌ వేస్ట్‌ క్రషింగ్‌ యూనిట్‌కి వెళ్లిపోతుంది. ప్లాస్టిక్‌ ఎలిమినేషన్‌ కోసం రైల్వే స్టేషన్‌లలో కూడా క్రషింగ్‌ మెషీన్‌లు పెట్టించాం. ఇవన్నీ బాగా జరిగాయి. కానీ... చికెన్, మటన్‌ షాపులకు స్టీలు బాక్సు తీసుకెళ్లాలనే ఉద్యమం కరోనా ముందు వరకు విజయవంతంగా చేయగలిగాం. ఆ తర్వాత మా చేతుల్లో నుంచి మెల్లగా జారిపోయింది. దాని మీద మళ్లీ ఫోకస్‌ పెట్టాలి. మా కాలనీలో నేను కనిపిస్తే అందరూ ఎదురు వచ్చి పలకరిస్తారు. చేతిలో ప్లాస్టిక్‌ కవర్‌ ఉన్న వాళ్లు మాత్రం ఇప్పుడు పలకరించవద్దు అనుకుని మరో దారిలో మలుపు తిరిగి వెళ్లిపోతుంటారు’’ అన్నారామె నవ్వుతూ.

సంఘటిత శక్తి
‘పని చేసే చేతులకు తీరిక ఉండదు, పని చేయని చేతులకు పని కనిపించదు’... అంటారు. అనిత వ్యాపకాల జాబితా చూస్తే ఈ నానుడి నిజమే అనిపిస్తోంది. వాటర్‌ బోర్డు సహకారంతో కాలనీలో ఇంకుడు గుంతల తవ్వకం వంటి పనులు చేస్తున్నారు, చేయిస్తున్నారు. ‘‘నేను ఒక పని తలపెట్టి ‘కాలనీలో ఈ పని చేద్దాం’ అని వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ పెట్టిన ఇరవై నాలుగ్గంటల్లో స్వచ్ఛందంగా తమ వంతు సహకారంగా ఎవరు ఏమేమి చేయాలనుకుంటున్నదీ తెలియచేస్తారు, అందుకయ్యే ఖర్చులో తమ వంతుగా ఎంత ఇవ్వగలరో కూడా సమాచారం ఇచ్చేస్తారు. అందుకే ఇంత సజావుగా చేయగలుగుతున్నాం. పైకి కనిపించేది నేనే, కానీ, నాకు సహకరించే ఎందరో అండగా ఉన్నారు’’ అని చెప్పారు అనితా చావలి.  

జీవితం అంటే... మన ఇంటి నాలుగ్గోడలకు పరిమితమైనది కాదు, సమాజంతో కలిసి ఉన్నదే జీవితం. ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించినట్లే, సామాజిక బాధ్యతను కూడా పూర్తి చేయాలి. అప్పుడే జీవితానికి పరిపూర్ణత.

ప్లాస్టిక్‌ ఎలిమినేషన్‌ ప్రోగ్రామ్‌ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్, కూల్‌డ్రింక్, ఆయిల్‌ బాటిల్స్‌ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్‌గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్‌ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం. అలాగే గౌతమ్‌నగర్‌ సరిహద్దులో రైల్వే పరిధిలో చెత్తకుప్పలా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయించి సరిహద్దు గోడకట్టించి గాంధీజీ విగ్రహం పెట్టాం.

– వాకా మంజులారెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement