Social work
-
గాడిద మోత గురించి ఎపుడైనా ఆలోచించారా? ఇంట్రస్టింగ్ కథనం
మన దేశంలో మహారాష్ట్రలో గాడిదలను అధిక స్థాయిలో రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఇటుక బట్టీలలో ఇసుక రవాణాలో వీటి వీపు మీద 200 కేజీల వరకూ వేయడానికి వెనుకాడరు. దీని వల్ల గాడిదలు హింసకు గురవుతున్నాయి. రోగాల బారిన పడుతున్నాయి. అందుకే నాందేడ్‌కు చెందిన సిర్జనా నిజ్జర్ గాడిదల సంరక్షణ గురించి పోరాడుతోంది. గాడిద మోత నుంచి గాడిదలను తప్పించాలంటోంది. ఆమె పోరాటం గురించి...‘జనం దేనికైనా విరాళాలు ఇస్తారు గాని గాడిదలంటే ఇవ్వరు. కాని గాడిదలు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు’ అంటుంది సిర్జనా గుజ్జర్.ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివిన సిర్జనా జనం కోసం న్యాయస్థానాల్లో వాదించడం కంటే హింసకు గురవుతున్న మూగజీవాల కోసం సమాజంలో వాదించడం మేలు అనుకుంది. అందుకే ఆమె ఎఫ్.ఐ.ఏ.పి.ఓ. (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్)లో కీలకబాధ్యతలు నిర్వహిస్తోంది. వీధి శునకాలతో మొదలైన ఆమె సేవ నేడు గాడిదలకు చేరింది.నాందేడ్‌లో చూసి...మహరాష్ట్రలోని నాందేడ్ సిర్జనా తాతగారి ఊరు. కాలేజీ రోజుల్లో వేసవి సెలవుల్లో అక్కడకు వెళితే గాడిదలు విపరీతంగా కనిపించేవి. వాటిని చూసి సరదా పడదామనుకుంటుడగానే ఒళ్లంతా గాయాలతో, బరువులు మోయలేక అవస్థపడుతూ, తిండి లేక ఎముకలు తేలి ఉన్న వాటి రూ΄ాలు సిర్జనాకు ఎంతో బాధ కలిగించేవి. విద్యార్థిగా ఉండగానే వాటి కోసం చేతనైనంతలో హెల్త్ క్యాంప్స్ నిర్వహించేది. లా పూర్తయ్యాక ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటి సంరక్షణ కోసం పని చేస్తోంది.మూడు జిల్లాల్లో...‘మహరాష్ట్రలోని మూడు జిల్లాలు నాందేడ్, బీడ్, లాతూర్‌లలో గాడిదల సంఖ్య ఎంత లేదన్నా 6000 ఉంటుంది. ఇవి మహరాష్ట్రలో వాన కొరత ్ర΄ాంతాలు. జనం పేదరికంలో మగ్గుతుంటారు. ఈ మూడు జిల్లాల్లోనూ ఇటుక బట్టీలు విస్తారం. వాటిలో కూలీ చేస్తే రోజుకు వంద రూ΄ాయలు వస్తాయి. ఇటుకలు మోయడానికి వీరంతా గాడిదలను ఉపయోగిస్తారు. ఇటుకలను చేరవేయడానికి వాటి వీపు మీద 60 కేజీల నుంచి 100 కేజీల వరకూ బరువు మోయిస్తారు. ఈ ప్రాంతంలో పారే ఉపనది చంద్రభాగ ఒడ్డు నుంచి ఇసుక మోయిస్తారు. శక్తికి మించి బరువు మోయడం వల్ల గాడిదలు గాయాల బారిన పడతాయి. ఒక్కోసారి వాటి కాళ్లు విరుగుతాయి. కంటి సమస్యలు వస్తాయి. వాటికి వైద్యం చేయించే శక్తి పేదలకు ఉండదు. వాటిని అలాగే వదిలేస్తారు’ అంటుంది సిర్జనా.వానలు వస్తే పస్తే‘నాందేడ్, బీడ్, లాతూర్ జిల్లాల్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకూ నిర్విరామంగా ఇటుక బట్టీల పని జరుగుతుంది. అన్నాళ్లు గాడిదలకు పని ఉంటుంది. కొద్దోగొ΄్పో తిండి దొరుకుతుంది. కాని ఎప్పుడైతే తొలకరి మొదలవుతుందో ఇటుక బట్టీలు మూతపడతాయి. కూలీలు గాడిదలకు తిండి భారం అని రోడ్ల మీద వదిలేస్తారు. వాటికి తిండి దొరకదు. మంచినీరు దొరకదు. రోగాలతో బాధ పడతాయి. ముసలివైతే కబేళాకు అమ్మేస్తారు. వాటి కోసం ఈ మూడు జిల్లాలో సంరక్షణాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్.పి.సి.ఏ. (సొసైటీస్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్) బలోపేతం చేస్తున్నాం. గత పదేళ్లలో గాడిదల సంఖ్య కూడా బాగా తగ్గింది. వీటి సంఖ్య కాపాడుకుంటూ వీటితో మానవీయంగా వ్యవహరించే చైతన్యాన్ని కలిగించడమే నా లక్ష్యం’ అని తెలిపింది సిర్జనా. -
భర్త గుర్తింపుమీద ఆధారపడొద్దు.. నీ గుర్తింపు నువ్వు తెచ్చుకో..!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర పట్టణమైన బృందావన్‌లోని యమునా నదిలో పవిత్ర స్నానాలు చేయడానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. అలా వచ్చే వారిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా లక్ష్మికి ఫోన్ చేస్తారు. ‘నేను ఉన్నాను’ అంటూ వారికి అండగా నిలబడుతుంది డా.లక్ష్మి. వితంతువులు, అనాథలు, నిరుపేదలకు ఆమె బృందావన దేవదూత.బృందావన్ ‘సిటి ఆఫ్ విడోస్’ అని పేరు తెచ్చుకుంది. దీనికి కారణం లక్ష్మి మాటల్లో చెప్పాలంటే... పశ్చిమ బెంగాల్‌తోపాటు మన దేశంలోని మారుమూల ప్రాంతాల్లో బాలవితంతువులు ఉన్నారు. కొద్దిమంది విషయంలో భర్త చనిపోయినా, వదిలి వెళ్లినా వారిని పట్టించు కునేవారు ఉండరు. ఈ నేపథ్యంలో వితంతువులకు సురక్షితమైన ఆశ్రమాలు ఉన్న పట్టణంగా బృందావన్ మారింది’ सेवा-सहयोग-सद्भाव.. कनकधारा, बीमार-घायल निराश्रित, असहाय माँ को अपना घर भेजा pic.twitter.com/jD6CINaT5H — Dr.laxmi gautam (@Drlaxmigautam1) February 12, 2019 అయితే అందరి పరిస్థితి ఒకేలా లేదు. కొంతమంది వితంతువులు ఇక్కడ కష్టాలు పడేవారు. కొన్ని సంవత్సరాల క్రితం దర్శనం కోసం బృందావన్‌కు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు వితంతువుల దుస్థితిని చూసి ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని వేశారు. అలా నియమించిన కమిటీలో లక్ష్మి కూడా ఉన్నారు. ఈ కమిటీలో భాగం కావడం ద్వారా వితంతువుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను లోతుగా తెలుసుకునే అవకాశం దొరికింది. వితంతువుల అంతిమ సంస్కారాలను ఎవరూ పట్టించుకోక΄ోవడం ఆమెను ఆవేదనకు గురిచేసింది. బృందావనంలో ఏ ఒక్క వితంతువు కూడా దయనీయస్థితిలో చనిపోకూడదు. వారి కర్మకాండలు గౌరవప్రదంగా చేయాలనే ఉద్దేశంతో ‘కనకధార’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. ‘కనకధార’ అనేది ఆమె అత్తయ్య పేరు. మృదుభాషి అయిన తనను అత్తయ్య నలుగురి ముందు గట్టిగా మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది. ‘భర్త గుర్తింపు మీద ఆధారపడవద్దు. నీదైన గుర్తింపు తెచ్చుకో’ అని చెప్పేది ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అత్తయ్య. అత్తయ్య ప్రోత్సాహంతో లక్ష్మి పీహెచ్డీ చేసి అధ్యాపక వృత్తిలోకి వచ్చింది. వృత్తిని, స్వచ్ఛందసంస్థ కార్యకలాపాలతో బ్యాలెన్స్ చేసుకోవడం అంత సులభం కాదు. అయితే సంకల్పబలం ఉన్న వాళ్లకు అదేమీ కష్టం కాదు. లక్ష్మీగౌతమ్ ఈ కోవకు చెందిన మహిళ. ‘కనక ధార’ స్వచ్ఛంద కార్యక్రమాలలో అత్తయ్యతో΄ాటు భర్త విజయ్ గౌతమ్ కూడా భాగం అయ్యారు. ఇప్పటివరకు లక్ష్మి వెయ్యి మందికి పైగా వితంతువుల అంతిమ సంస్కారాలు నిర్వహించింది. అంబులెన్స్ అవసరాల నుంచి ఫైనల్ డ్రెస్సింగ్ వరకు అన్నీ ఆమె చూసుకునేది. కరోనా మహమ్మారి కాటేస్తున్న సమయంలో మధురలో 72 రోజుల పాటు వందలాది మంది అనాథలకు వండి వడ్డించేది. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన యువతులకు మార్గదర్శనం చేయడంలో, అపహరణకు గురైన యువతులను రక్షించి అండగా నిలవడంలో ‘కనక ధార’ స్వచ్ఛంద సంస్థ సహాయపడుతోంది. వృత్తి జీవితాన్ని, సామాజిక సేవను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేదాన్ని. సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాలకు తప్ప వ్యక్తిగత పనుల కోసం సెలవుపెట్టే దాన్ని కాదు. ఒక వితంతువు చనిపోయిందని, మృతదేహాన్ని క్లెయిమ్ చేయకుండా అనాథలా పడి ఉందని ఒకరోజు ఫోన్ వచ్చింది. ఆ సమయంలో కాలేజీలో ఉన్నాను. వెంటనే ప్రిన్సిపల్‌ను అనుమతి అడిగి బయటికొచ్చాను. బైకర్ నుంచి లిఫ్ట్ తీసుకొని ఘటన స్థలానికి చేరకున్నాను. అక్కడ ఎన్నో గంటల పాటు ఉండాల్సి వచ్చింది. అంబులెన్స్ ఏర్పాటు చేసి అంత్యక్రియలు చేశాను. ఇలాంటి సంఘటనలెన్నోఉన్నాయి – డా.లక్ష్మీ గౌతమ్ -
Padma Awards 2024: అసామాన్య పద్మశ్రీలు
స్త్రీలు జీవానికి జన్మనివ్వడమే కాదు.. జీవాన్ని కాపాడతారు కూడా! ఈసారి భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీలలో కొందరు అసామాన్యమైన స్త్రీలు తమ జీవితాన్ని కళ, పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, ఔషధ మొక్కలు వీటన్నిటిలోని జీవాన్ని కాపాడుకుంటూ రావడం కనిపిస్తుంది. ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన పర్బతి బారువా... లక్షలాది మొక్కలు నాటి ఆకుపచ్చదనం నింపిన చామి ముర్ము... విస్మరణకు గురైన ఔషధ మూలికలకు పూర్వ వైభవాన్ని తెచ్చిన యానుంగ్... కొబ్బరి తోటలు తీయటి కాయలు కాచేలా చేస్తున్న అండమాన్ చెల్లమ్మాళ్... గోద్నా చిత్రకళకు చిరాయువు పోసిన శాంతిదేవి పాశ్వాన్... వీరందరినీ పద్మశ్రీ వరించి తన గౌరవం తాను పెంచుకుంది. ఏనుగుల రాణి భారతదేశ తొలి మహిళా మావటి పర్బతి బారువాకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆమె పరిచయం. ఇది సంతోషించదగ్గ విషయం. అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలో ఎక్కడైనా అటవీ ఏనుగులు అదుపు తప్పి, తల తిక్కగా వ్యవహరిస్తూ ఉంటే పర్బతి బారువాకు పిలుపు వచ్చేది... వచ్చి వాటిని కాస్త పట్టుకోమని, మాలిమి చేయమని. ఇన్నేళ్లకు 69 ఏళ్ల వయసులో ఈ ‘ఏనుగుల రాణి’కి, ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన రుషికి భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ‘ స్వీకరించమని పిలుపు వచ్చింది. మన దేశంలోనే కాదు ఆసియాలోనే ప్రమాదస్థాయిలో పడిపోతున్న గజరాజుల సంరక్షణకు, వాటిని ఎలా కనిపెట్టుకోవాలో తెలిపే జ్ఞానాన్ని సముపార్జించి పంచినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇవ్వడం సంతోషించాల్సిన సంగతి. కళ్లు తెరవగానే ఏనుగు ‘నాకు ఊహ తెలిసిన వెంటనే నా కళ్ల ఎదురుగా ఏనుగు ఉంది’ అంటుంది పర్బతి. అస్సాంలోని ధుబ్రీ జిల్లాకు చెందిన గౌరిపూర్ సంస్థానం పర్బతి కుటుంబీకులది. పర్బతి తండ్రి రాజా ప్రతాప్ చంద్ర బారువా సంస్థానం మీద వచ్చే పరిహారంతో దర్జాగా జీవిస్తూ 40 ఏనుగులను సాకేవాడు. అంతేకాదు అతనికి ఏనుగులతో చాలా గొప్ప, అసామాన్యమైన అండర్స్టాండింగ్ ఉండేది. వాటి ప్రతి కదలికకూ అతనికి అర్థం తెలుసు. మహల్లో ఉండటం కన్నా కుటుంబం మొత్తాన్ని తీసుకుని అడవుల్లో నెలల తరబడి ఉండటానికి ఇష్టపడే రాజా ప్రతాప్ తన తొమ్మిది మంది సంతానంలో ఒకతైన పర్బతికి ఏనుగుల మర్మాన్ని తెలియచేశాడు. 9 ఏళ్ల వయసు నుంచే పర్బతి ఏనుగులతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. 16 ఏళ్ల వయసులో మొదటిసారి అటవీ ఏనుగును పట్టి బంధించగలిగింది. అది చూసి తండ్రి మెచ్చుకున్నాడు. కష్టకాలంలో ఏనుగే తోడు 1970లో భారత ప్రభుత్వం (విలీనం చేసుకున్న) సంస్థానాలకిచ్చే భరణాన్ని ఆపేయడంతో పర్బతి తండ్రి పరిస్థితి కష్టాల్లో పడింది. రాబడి లేకపోవడంతో ఏనుగులే అతని రాబడికి ఆధారం అయ్యాయి. ఏనుగులను అమ్మి, టింబర్ డిపోలకు అద్దెకిచ్చి జీవనం సాగించాడు. ఆ సమయంలో పర్బతి ఏనుగుల గురించి మరింత తెలుసుకుంది. ఇంకా చెప్పాలంటే ఏనుగు కళ్లను చూసి దాని మనసులో ఏముందో చెప్పే స్థితికి పర్బతి చేరుకుంది. ఏనుగుల ప్రవర్తనకు సంబంధించిన ఆమె ఒక సజీవ ఎన్‌సైక్లోపిడియాగా మారింది. క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్ బీబీసీ వారు ‘క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్’ పేరుతో పర్బతి మీద డాక్యుమెంటరీ తీయడంతో ఆమె గురించి లోకానికి తెలిసింది. ఉదయం నాలుగున్నరకే లేచి ఏనుగుల సంరక్షణలో నిమగ్నమయ్యే పర్బతి దినచర్యను చూసి సలాం చేయాల్సిందే. ‘ఏనుగును మాలిమి చేసుకోవాలంటే ముందు దాని నమ్మకం, గౌరవం పొందాలి. లేకుంటే ఏనుగులు మావటీలను చంపేస్తాయి. వాటికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఒక ఏనుగు తనను ఇబ్బంది పెడుతున్న మావటిని అతను నిద్రపోతున్నప్పుడు వెతికి మరీ చంపింది’ అంటుంది పర్బతి. కాని నమ్మకం పొందితే ఏనుగుకు మించి గొప్ప స్నేహితుడు లేదని అంటుంది. ‘ఒకో ఏనుగు రోజుకు 250 కిలోల పచ్చగడ్డి తింటుంది. దానికి అనారోగ్యం వస్తే ఏ మొక్క తింటే ఆరోగ్యం కుదుటపడుతుందో ఆ మొక్కను వెతికి తింటుంది. అది తినే మొక్కను బట్టి దాని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యం చేయించాలి’ అంటుందామె. ‘ఎవరికైనా విశ్రాంతి ఉంటుంది కాని మావటికి కాదు. మావటి పని డ్రైవర్ ఉద్యోగం కాదు. కారు గ్యారేజ్‌లో పెట్టడానికి. జీవంతో నిండిన ఏనుగుకు మావటి అనుక్షణం తోడు ఉండాలి’ అంటుందామె. అస్సాం అటవీశాఖలో ‘చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్’గా పని చేసిన ఆమె ఇప్పుడు పర్యావరణ సంరక్షణ కోసం పని చేస్తోంది. నారియల్ అమ్మ దక్షిణ అండమాన్‌లోని రంగచాంగ్కు చెందిన 67 ఏళ్ల కామాచీ చెల్లమ్మాళ్ సేంద్రియ కొబ్బరి తోటల పెంపకంలో చేసిన విశేష కృషికి ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది. దక్షిణ అండమాన్‌లో ‘నారియల్ అమ్మ’గా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలం తరువాత నేలలో తేమను సంరక్షించడానికి కొబ్బరి ఆకులు, పొట్టు మొదలైన వాటితో సేంద్రియ ఎరువు తయారుచేసింది. ‘నాకు పద్మశ్రీ ప్రకటించారు అని ఎవరో చెబితే నేను నమ్మలేదు. అయోమయానికి గురయ్యాను. అండమాన్‌లోని ఒక మారుమూల గ్రామంలో నివసించే నాకు ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ ఎందుకు ప్రకటిస్తారు అనుకున్నాను. ఆ తరువాత నేను విన్న వార్త నిజమే అని తెలుసుకున్నాను’ అంటున్న చెల్లమ్మళ్ ఆగ్రో–టూరిజంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. తమ ప్రాంతంలోని రకరకాల పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపకం...మొదలైనవి ఆగ్రో–టూరిజానికి ఊతం ఇస్తాయి అని చెబుతుంది చెల్లమ్మాళ్. అవమానాలను అధిగమించి గోద్నా చిత్రకళలో చేసిన విశేష కృషికి బిహార్‌లోని మధుబని జిల్లా లహేరిఆగంజ్ ప్రాంతానికి చెందిన శాంతిదేవి పాశ్వాన్ ఆమె భర్త శివన్ పాశ్వాన్లు పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక అయ్యారు. గోద్నా చిత్రకళ ద్వారా ఈ దంపతులు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. అమెరికా నుంచి జపాన్ వరకు వీరి చిత్రాలను ప్రదర్శించారు. తన కులం కారణంగా ఎన్నో అవమానాలకు గురైన శాంతిదేవి, వాటిని అధిగమించి జీ20 సదస్సులో పాల్గొనే స్థాయి వరకు ఎదిగింది. శాంతిదేవి, శివన్ పాశ్వన్ దంపతులు ఇరవైవేల మందికి పైగా గోద్నా చిత్రకళలో శిక్షణ ఇచ్చారు. ఆది రాణి అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన యానుంగ్ జమెహ్ లెగో ఆది తెగ సంప్రదాయ వైద్య విధానాన్ని పునరుద్ధరించడంలో చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ జిల్లాకు చెందిన 58 సంవత్సరాల యానుంగ్ను అభిమానులు ‘ఆది రాణి’ అని పిలుచుకుంటారు. లక్షమందికి పైగా ఔషధమూలికలపై అవగాహన కలిగించించిన యానుంగ్ ఏటా 5,000 ఔషధ మొక్కలను నాటుతుంది. ప్రతి ఇంటిలో హెర్బల్ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తోంది. ఆర్థికపరిమితులు ఉన్నప్పటికీ విస్మరణకు గురైన ఆది తెగ సంప్రదాయ వైద్య వ్యవస్థను, సాంప్రదాయ జ్ఞానాన్ని సజీవంగా ఉంచడానికి తన జీవితాన్ని అంకితం చేసింది యానుంగ్. మొక్కవోని ఆత్మస్థైర్యం ‘మొక్కలు నాటడానికి నువ్వు ఏమైనా కలెక్టర్ వా!’ అని ఊరి మగవాళ్లు చామిని వెక్కిరించేవాళ్లు. మొక్కలు నాటడం అనే పుణ్యకార్యం వల్ల ఉత్త పుణ్యానికే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇంటి నుంచి బయటికి వచ్చిన చామి కూలి పనులు చేసుకుంటూనే 36 ఏళ్ల రెక్కల కష్టంతో 28 లక్షలకు పైగా మొక్కలు నాటింది. ఝార్ఖండ్‌కు చెందిన చామి ముర్ము ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది.... తన గ్రామం భుర్సాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సమావేశానికి హాజరు కావడం ద్వారా పర్యావరణ కార్యకర్తగా చామీ ముర్ము ప్రయాణం ప్రారంభమైంది. ‘మా ప్రాంతంలో ఎటు చూసినా బంజరు భూములు కనిపించేవి. బాధగా అనిపించేది. ఇలాంటి పరిస్థితిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాను. అయితే మొక్కలు నాటడం మా ఊరిలోని మగవాళ్లకు నచ్చలేదు. ఇంట్లో కూడా గొడవలు జరిగాయి. ఈ గొడవల వల్ల సోదరుడి ఇంటికి వెళ్లాను. అతడితో కలిసి రోజూ కూలి పనులకు వెళ్లేదాన్ని. ఒకవైపు జీవనోపాధిపై దృష్టి పెడుతూనే మరోవైపు ప్రకృతికి మేలు కలిగించే పనులు చేయడం ప్రారంభించాను’ అంటుంది చామీ ముర్ము. పదో తరగతి వరకు చదువుకున్న చామి మొక్కలు నాటడం, చెట్ల పరిరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నందుకు కొంతమందికి అకారణంగా శత్రువు అయింది. 1996లో చామి నాటిన మొక్కలను ధ్వంసం చేశారు కొందరు. ‘ఇక ఆపేద్దాం. ఎందుకు లేనిపోని గొడవలు’ అని కొందరు మహిళలు చామిని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే చామి మాత్రం ఆనాటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఉత్సాహం ముందు ప్రతికూలశక్తులు తోకముడిచాయి. ‘నన్ను నేను ఒంటరిగా ఎప్పుడూ భావించలేదు. నాకు పెద్ద కుటుంబం ఉంది. నేను నాటిన 28 లక్షలకుపైగా మొక్కలు నా బంధువులే’ అంటుంది చామి. ఝార్ఖండ్‌లోని వెనబడిన జిల్లా అయిన సరైకెలా ఖరావాన్లో రైతులు వ్యవసాయం కోసం వర్షంపై ఆధారపడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీటి అవసరాల కోసం వాటర్షెడ్లను నిర్మించడానికి చామి కృషి చేస్తోంది. 2,800 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వేలాది మంది మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా, సొంత వ్యాపారం ప్రారంభించేలా చేసింది. తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై స్పందిస్తూ ‘ఈ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నాను. పర్యావరణ స్పృహతో మొదలైన నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి స్ఫూర్తి ఇస్తుంది’ అంటుంది చామి. ఒంటరిగా అడుగులు మొదలు పెట్టినప్పటికీ అంకితభావం కలిగిన వ్యక్తులు సమాజంపై సానుకూల ప్రభావం చూపించగలరు అని చెప్పడానికి చామీ ముర్ము ప్రయాణం బలమైన ఉదాహరణ. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చామీ ముర్ము పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది. టింబర్ మాఫియాపై పోరాడిన చామీ ముర్మును ‘లేడీ టార్జన్ ఆఫ్ ఝార్ఖండ్’ అని అభిమానులు పిలుచుకుంటారు. -
Khushi Pandey: మండే ఎండలు కాస్త జాగ్రత్త
‘అబ్బబ్బా! ఎండలు మండిపోతున్నాయి’ అని ఇంట్లో కూర్చొనే అపసోపాలు పడుతుంటారు చాలామంది. అలాంటిది ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబడడం సామాన్య విషయం కాదు. కాని సామాన్యులకు తప్పదు. తనను తాను సామాజిక కార్యకర్తగా పరిచయం చేసుకునే లక్నోకు చెందిన ఖుషీ పాండే వీధి వీధి తిరుగుతూ పండ్లు, కూరగాయలు అమ్ముకునేవాళ్లకు, రిక్షా కార్మికులకు కాటన్ టవల్స్ ఇవ్వడంతో పాటు ఎండలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పింది. ‘నో నీడ్ టు వర్రీ ఎబౌట్ ది హీట్’ కాప్షన్‌తో కూడిన ఖుషీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొద్ది సమయంలోనే 5.15 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘మీ వీడియో నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. నేను టోపీలు పంచాలనుకున్నాను. ఈ వీడియో చూసిన తరువాత కాటన్ టవల్స్ బెటర్ అనిపించింది. తలతోపాటు మెడను కూడా కవర్ చేస్తాయి’ అని ఒక యూజర్ స్పందించాడు. -
కేశిరాజు విజయ కుమారి: 19 X 7 = ?
‘‘డిజిటల్ యుగంలో లెక్కలు చేయడం సులువైంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చేతిలో కంప్యూటర్ ఉన్నట్లే. ఈ విజ్ఞాన పరిణామం ఎటు దారి తీసిందో తెలుసా? ఏడెనిమిదులు ఎంతో చెప్పలేకపోతున్న తరం తయారైంది. అవన్నీ గుర్తు పెట్టుకోవడం తన పని కాదనుకుంటోంది మెదడు. కాలిక్యులేటర్ ఉండగా తనకెందుకు శ్రమ అని విశ్రాంతిలోకి వెళ్తోంది. కాలిక్యులేటర్ ఉండాల్సింది చేతిలో కాదు... తలలో. నిజమే! కాలిక్యులేటర్ బుర్రలో ఉండాలి... ఎక్కాలు నాలుక మీద నాట్యం చేయాలి.’’ అని... పిల్లలకు ఎక్కాలు నేర్పించడానికి ముందుకొచ్చారు కేశిరాజు విజయ కుమారి. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చిన్న గ్రామం కవిటం. థింక్ బిగ్ అని ఏపీజే అబ్దుల్ కలామ్ చెప్పగా ఆమె వినలేదు. కానీ తనకు తానుగా పెద్ద కలనే కన్నారు. ఐఏఎస్ కావాలనే కల నెరవేరకపోవడానికి ఒకటి కాదు రెండు కాదు కుటుంబ రీత్యా అనేక కారణాలు. అడ్డంకులు ఐఏఎస్ కాకుండా ఆపగలిగాయి, కానీ సమాజానికి సేవ చేయడానికి కాదు కదా అనుకున్నారామె. తన ఎదురుగా కనిపించిన ప్రతి సమస్యకూ పరిష్కారాన్ని వెతుకుతూ, పరిష్కరించే వరకు విశ్రమించకుండా శ్రమించారు. బాల్యంలోనే నాన్న పోవడం, పిల్లల పెంపకం బాధ్యతను మోస్తూ అమ్మ భుజాలు అరిగిపోవడం చూస్తూ పెరిగారామె. అంతేకాదు... తొలి ఉద్యోగం ఒక ఎన్జీవోలో టీచర్‌గా. దాంతో ఆ తర్వాత కూడా ఆమె అడుగులు సర్వీస్ వైపుగానే సాగాయి. దశాబ్దాలపాటు మహిళల కోసమే సేవలందించారామె. ఈ ప్రయాణంలో ఆమెకో కొత్త సంగతి తెలిసింది. డిగ్రీ చదువుకున్న వాళ్లకు కూడా ఎక్కాలు రావడం లేదు. నేర్చుకుని మర్చిపోయారా అంటే... అదీ కాదు. బడి గడప తొక్కని, అక్షరాలు నేర్వని బాల్యం ఉంటుంది. కానీ బడికి వెళ్లి అక్షరాలు నేర్చుకుని ఎక్కాలు నేర్వని బాల్యం ఉంటుందని ఊహించలేదామె. మరింత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తెలిసిందేమిటంటే... నేటి బాల్యానికి ఎక్కాలు నేర్చుకోవడం టైమ్ వేస్ట్ పనిగా ఉంటోందని. కాలిక్యులేటర్ లేకుండా వందలో నాలుగోవంతు ఎంత అంటే చెప్పడం చేతకావడం లేదని. ఇన్ని తెలిసిన తర్వాత ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి ఎక్కాల పుస్తకాలు పంచు తున్నారు. ఒకటి రెండు నెలల పాటు వాళ్లకు నేర్చుకునే టైమ్ ఇచ్చి ఆ తర్వాత పోటీలు పెడుతున్నారు. ప్రతి క్లాసులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పాల్గొన్న వాళ్లకు కూడా ప్రోత్సాహకాలిస్తున్నారు. రకరకాలుగా సాగిన తన సామాజిక ప్రస్థానాన్ని ఆమె సాక్షితో పంచుకున్నారు. ఆడపిల్ల పుట్టాలి... చదవాలి! ‘‘మా వారి ఉద్యోగరీత్యా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువ కాలం ఉన్నాను. పెళ్లికి ముందు చదువు చెప్పిన అలవాటు ఉండడంతో అక్కడ ఖాళీగా ఉండలేకపోయేదాన్ని. పైగా మేము నార్త్‌లో ఉన్న రోజుల్లో అక్కడి మహిళలు దాదాపుగా నిరక్షరాస్యులే. నేనిక్కడ చదివింది సెకండ్ లాంగ్వేజ్ హిందీ మాత్రమే. కానీ అక్షరాలు, వాక్యాలు నేర్పించడానికి సరిపోయేది. వాళ్లకు నేర్పిస్తూ నేను హిందీ మాట్లాడడం నేర్చుకున్నాను. భాష మీద పట్టు రావడంతో వాళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం సులువైంది. ఘూంఘట్ చాటున, అత్తింటి నియమాల మాటున జీవించడమే వాళ్లకు తెలిసింది. కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే బిడ్డను కనకూడదని, గర్భస్రావం చేయించుకోవాలని నూరిపోసింది అక్కడి సమాజం. యువతులు కూడా అదే నిజమనే విశ్వాసంతో ఉండేవాళ్లు. స్త్రీ లేని సమాజం ఎలా మనుగడ సాగిస్తుందో చెప్పమని, దక్షిణాదిలో ఆడపిల్ల çపుడితే లక్ష్మీదేవి పుట్టినట్లు భావిస్తారని వాళ్లకు నచ్చచెప్తుంటే... ‘ఇద్దరు మగపిల్లలున్న తల్లి ఆమె ఏ మాటైనా చెబుతుంది. ఆడపిల్లకు కట్నాలిచ్చేది ఎవరు’ అని అక్కడి మగవాళ్లలో నా మీద వ్యతిరేకత పెల్లుబుకుతుండేది. నాది నిశ్శబ్ద ఉద్యమం కాబట్టి నా మీద దాడులు జరగలేదు. ఇంటిముందు మురుగు కాలువ ఓపెన్ డ్రైనేజ్‌లో పిల్లలు పడుతుంటారు కూడా. పరిశుభ్రత లేమిని, ఇలాంటి సమస్యలను ప్రశ్నిస్తూ, మహిళలను కలుపుకుని స్థానిక మున్సిపల్ ఆఫీసులకు వెళ్లేదాన్ని. రోడ్డు శుభ్రం చేసిన తర్వాత ఆ కాలనీలో నివసించే ఆడవాళ్ల చేత సంతకం చేయించుకునే నియమం పెట్టారు మున్సిపల్ కమిషనర్. నేర్చుకోవడానికి వయసు పరిమితి ఎందుకు! నా ఉద్దేశం ఒక్కటే. ‘మహిళ కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తే... ఆ క్షణంలో బెంబేలెత్తిపోకూడదు. ప్రతి ఒక్కరి చేతిలో ఏదో ఒక పని ఉండాలి. ఆర్థిక స్వావలంబన సాధించాలి’... అని. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఇక్కడి మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేకం చేశాను. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్‌లో వయో పరిమితి ఉంటుంది. అందులో ఇమడని వాళ్లు ‘మాకూ నేర్చుకోవాలని ఉంది’ అంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది. అలాంటి వాళ్ల కోసం కేవీఎస్ ఫౌండేషన్ స్థాపించి ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. శిక్షణ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు 2006 నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. శిక్షణ కార్యక్రమాల నుంచి పుట్టుకు వచ్చిన అవసరమే ఈ ఎక్కాల ఉద్యమం’’ అన్నారు విజయకుమారి. టైలరింగ్ నేర్పించేటప్పుడు నడుము చుట్టు కొలత లో నాలుగో వంతు మార్క్ చేయమంటే చాలామందికి తెలిసేది కాదు. దాంతో ముందు లెక్కలు నేర్పించాల్సి వచ్చేది. ఏదో సందేహం వచ్చి హైదరాబాద్‌లోని మా అపార్ట్మెంట్ పిల్లలను అడిగాను. ఎక్కాలు చదవడం ఏంటన్నట్లు చూశారు. అపార్ట్మెంట్లో ఎక్కాల పోటీలు పెట్టాను. పాల్గొనడానికే సిగ్గుపడుతున్నారు కొందరు. స్కూళ్లకు వెళ్లాను. ప్రైవేట్ స్కూళ్లు పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వ పాఠశాలలు స్వాగతించాయి. సిటీలో ఇప్పటికి మూడువేల ఎక్కాల పుస్తకాలు పంచాను. ఉప్పరపల్లి, ప్రభుత్వ పాఠశాల లో రెండవ తరగతి పిల్లాడు చాలా త్వరగా ఇరవై ఎక్కాలు నేర్చుకున్నాడు. పిల్లలకు చక్కగా నేర్పిస్తే మెరికల్లా తయారవుతారు. ప్రైవేట్ విద్యారంగం పిల్లలను మార్కుల పోటీలోకి నెట్టేస్తూ, లెక్కలకు పునాది వంటి ఎక్కాలను నిర్లక్ష్యం చేస్తోంది. మహిళలకు స్కిల్ డెవలప్‌మెంట్‌తోపాటు పిల్లలకు ఎక్కాలు నేర్పించే మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని చేపట్టాను. – కేశిరాజు విజయకుమారి, సామాజిక కార్యకర్త, కేవీఎస్ ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
Chutni Mahato: పోరాటమే ఆమె 'మంత్రం'
‘చేతబడి చేస్తుందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు’ అనే వార్తను చూసే ఉంటారు. మూఢనమ్మకాల వల్ల స్త్రీలే కాదు, బాధింపబడినవారిలో పురుషులు కూడా ఉన్నారు. అవిద్య, అజ్ఞానం కారణంగా జరిగే ఇటువంటి అకృత్యాలకు చెక్ పెట్టేందుకు నడుం కట్టింది ఓ మహిళ. తనమీద పడిన నిందను దూరం చేసుకోవడానికే కాదు, సాటి అమాయక మహిళలను ఇలాంటి నిందల నుంచి దూరం చేయాలనుకుంది. ఆమె పేరే చుట్నీదేవి. జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. మంత్రగత్తె అనే నెపంతో స్త్రీలను హింసించి, అనైతికంగా ప్రవర్తించేవారిపైన 25 ఏళ్లుగా పోరాటం చేసి, 125 మంది మహిళలను కాపాడింది. అందుకు గాను ఈ ఏడాది రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంది. దేశమంతటా ఉన్న ఈ అరాచకాన్ని జార్ఖండ్‌లో పుట్టి పెరిగిన చుట్నీదేవి కథనం ద్వారా తెలుసుకోవచ్చు. పోరాటమే ఆమె ‘మంత్రం’ తనకు జరిగిన అన్యాయం ఇతరులకు జరగకూడదని గట్టిగా నిర్ణయించుకున్న 63 ఏళ్ల చుట్నీదేవి, అందుకు తన జీవితమే ఓ పాఠమైందని తెలియజేస్తుంది.. ‘‘మంత్రవిద్య ప్రయోగిస్తున్నారనే మూఢ నమ్మకంతో అమాయకులైన వారిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో విజయం సాధించడం అంత సులభం కాదు. మాది జార్ఖండ్‌లోని భోలాదిహ్ గ్రామం. పన్నెండేళ్ల వయసులోనే పెళ్లయ్యి, అత్తింటికి వచ్చాను. చదవడం, రాయడం రాదు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించేదాన్ని. భర్త, నలుగురు పిల్లలు. ఎప్పుడూ కుటుంబం పనుల్లో మునిగేదాన్ని. ఓసారి పక్కింటి అమ్మాయి నేను చేసిన చేతబడి వల్లే జబ్బున పడిందని గ్రామ ప్రజలు ఆరోపించారు. తర్వాత్తర్వాత అదే నిజమని ఊళ్లోవాళ్లు నమ్మడం మొదలుపెట్టారు. దాంతో నేను కంటబడితే చాలు పరిగెత్తించి పరిగెత్తించి తరిమేవారు. దాదాపు పదేళ్లపాటు నరకం అనుభవించాను. నిత్యం అవమానాలు, నిందలు. చివరిసారి జరిగిన దాష్టీకానికైతే ఎలాగోలా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. అది నా జీవితంలోనే అత్యంత చీకటి రోజు. చెట్టుకు కట్టేసి రెండు రోజుల పాటు దారుణంగా కొట్టారు. గొడ్డలితో దాడి చేశారు. నా ముఖంపై ఇప్పటికీ ఆ కోతల గుర్తులు ఉన్నాయి. నన్ను చంపాలని రకరకాలుగా కుట్రలు చేశారు. నువ్వు ఊరు విడిచి పారిపోవాలి, లేకపోతే చంపేస్తామని గ్రామస్తులు, గ్రామ పెద్ద దారుణంగా బెదిరించారు. నెల రోజులు అడవిలోనే... ఆ సమయంలో నా భర్త ధనుంజయ్ మహతో కూడా నాకు మద్దతుగా నిలవలేదు. ఊరి వాళ్లు చెప్పినట్టే నా భర్త చేశాడు. ప్రజలు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎలాగోలా నా నలుగురు పిల్లలతో ఊరి నుంచి పారిపోయాను. అడవిలో గుడిసె వేసుకొని నెలపాటు అక్కడే నివసించాను. ఆ తర్వాత ఎలాగోలా మా తమ్ముడు ఇంటికి చేరుకుని, కొంతకాలం అక్కడే ఉన్నాను. ప్రచారంలో ఒకరిగా! అమిత్ ఖరే 1995లో పశ్చిమ సింగ్ భూమ్‌కు డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు. మంత్రగత్తె అనే నెపంతో వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. అప్పుడు మా ఊళ్లో నా విషయం బయటకు రాకుండా చేశారు. అంటే, అలాంటి ప్రదేశంలోనూ ప్రజలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అర్ధమైంది. నేనే నేరుగా నా సమాచారం అందించాను. వెంటనే చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ ప్రచారంలో నేనూ చేరాను. మంత్రగత్తె చేరే చోటు ఎవరైనా మంత్రగత్తె అంటూ ఎవరి గురించైనా నాకు వార్తలు వచ్చినప్పుడల్లా, నేను నా బృందాన్ని కలుసుకునేదాన్ని. అసోసియేషన్ ఫర్ సోషల్ అండ్ హ్యూమన్ అవేర్నెస్ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాన్ని నడుపుతున్నాను. అటువంటి కేసుల గురించి నాకు ఎక్కడి నుండైనా సమాచారం వచ్చినప్పుడు, నేను బృందంతో చేరుకుంటాను. నిందితులను విడిచిపెట్టకూడదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. దీని ఫలితంగా, 125 మందికి పైగా మహిళలు రక్షించబడ్డారు. భరోసా కల్పిస్తూ.. బాధిత మహిళలు భయాందోళనలకు గురికావద్దని ధైర్యం చెబుతుంటాను. జిల్లా యంత్రాంగం వద్దకు వెళ్లండి. న్యాయం కోరండి. పోలీస్ స్టేషన్ లో చెప్పినా వినకపోతే ఎస్పీ వద్దకు వెళ్లండి. మానవ హక్కుల సంస్థలకు ఫిర్యాదు ఇవ్వండి.. అంటూ 35 నుంచి 40 మందిని జైలుకు కూడా పంపాం. చాలాసార్లు నిందితులు జైలుకు వెళ్లే ముందు కూడా రాజీ పడుతున్నారు. నిందితులు తాము ఇంకెప్పుడూ ఏ స్త్రీనీ మంత్రగత్తె అని నిందించబోమని చెబుతూ బాండ్ రాసి ఇచ్చేవారు. కష్టాల్లో ఉన్న మహిళలకు ఆశ్రయం మంత్రవిద్య కారణంగా సమాజానికి దూరంగా ఉంటూ బాధపడే మహిళలు దేశంలోని పలు చోట్ల నుంచి న్యాయం కోసం వస్తుంటారు. అప్పుడు వారి పక్షాన గట్టిగా నిలబడతాను. నిందితులపై పోరాడతాను. ఇటీవల సెరైకెలాకు చెందిన ఇద్దరు మహిళలు, చత్రా జిల్లాకు చెందిన ఓ మహిళ మంత్రగత్తె అనే ఆరోపణతో బాధపడుతూ వచ్చారు. ఓ మహిళ భూమిని లాక్కోవాలని ప్రయత్నించినవాళ్లు ఆమెను మంత్రగత్తె అంటూ వేధించారు. సెరైకెలాకు చెందిన మరో మహిళను మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. చత్రా జిల్లాకు చెందిన బాధితురాలు కూడా అక్కడికి చేరుకుని ‘తన సొంత మామ, అతని కొడుకు తన పూర్వీకుల భూమిని లాక్కోవడానికి తనను మంత్రగత్తె అని పిలుస్తున్నాడ’ని చెప్పింది. ఈ స్త్రీలకు ఆశ్రయం ఇచ్చాను. భూతవైద్యుని నుంచి వైద్యుడి వరకు గ్రామ గ్రామాన తిరిగి, ప్రజలకు వివరిస్తాను. ఎవరైనా ఎద్దు, మేక మొదలైనవి చనిపోతే, భూతవైద్యుని వలలో పడకండి. ఒకరి బిడ్డ అనారోగ్యం పాలైతే అప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లండి, చికిత్స ఉంటుంది. భూతవైద్యుని దగ్గరకు వెళ్లవద్దు. ఎవరినైనా మంత్రగత్తె అని పిలిచి వేధిస్తే, చట్టం తన పని తాను చేస్తుంది అని చెబుతున్నాను. భయం లేకుండా... ఎక్కడనుంచైనా మంత్రగత్తె అనే వార్తలు వచ్చినప్పుడల్లా, నేను కూడా అడవుల మధ్యలో ఉన్న గ్రామాలకు చేరుకుంటాను. పోలీసులు కూడా వెళ్లడానికి ఇష్టపడని ప్రాంతాలు. పంచాయితీలో, గ్రామసభలో అందరినీ సమావేశపరిచి, ఈ దురాచారాన్ని ఎందుకు మానుకోవాలో వివరిస్తాను. ప్రజల ప్రభావం కూడా ఉంటుంది. ‘మీరు మంత్రగత్తె అని పిలిచే వ్యక్తి అంత శక్తివంతమైనది అయితే, ఆమె తనను అణచివేసే వారిని ఎందుకు చంపదు’ అని చెప్తాను. ‘ఆమె మళ్లీ ఎందుకు హింసకు గురవుతుంది?’ అని ప్రశ్నిస్తాను. ఈ నిర్భయత వల్లే నన్ను ’సింహరాశి’ అని పిలవడం మొదలుపెట్టారు’ అని తన ధైర్యాన్ని మన కళ్లకు కడుతుంది చుట్నీదేవి. నిశ్శబ్దంగా కూర్చోవద్దు.. పోరాడాలి ‘నేనేమీ చదువుకోలేదు. కానీ మానవ హక్కులను అర్థం చేసుకున్నాను. మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాడాలి. ఎవరైనా స్త్రీని మంత్రగత్తె అనే ఆరోపణపై చిత్రహింసలకు గురిచేస్తే మూడు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించే చట్టం ఉంది. మంత్రగత్తె అనే పేరుతో ఎవరైనా శారీరక గాయం చేస్తే, ఆరు నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల వరకు జరిమానా విధించే మరో నిబంధన ఉంది. మీ హక్కులు మీరు తెలుసుకోండి’’ అని మంత్రగత్తె ఆరోపణలు ఎదుర్కొంటన్నవారికి ధైర్యం చెబుతుంది చుట్నీ. పద్మశ్రీ.. తెలియదు ‘ఈ అవార్డు ఏమిటో నాకు తెలియదు. అయితే ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు రావడంతో ఇది పెద్ద అవార్డు అని తెలిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. అప్పటి డీసీ అమిత్ ఖరే సాహబ్‌ను కలిశాను. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో నన్ను సత్కరించింది.’ -
పదేళ్ల పార్ధివ్‌కు ‘డయానా అవార్డు’
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల శ్రీపార్ధివ్ కనిష్క్ గుత్తి ప్రతిష్టాత్మక ‘డయానా అవార్డు’అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన పార్ధివ్ ప్రస్తుతం అబుదాబిలో నివసిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల వయసున్న యువత చేసిన సోషల్వర్క్ని పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. నిరుపేద, వెనుకబడిన పిల్లలకు విద్యను అందించినందుకు, పర్యావరణ వేత్తగా ఉన్నందుకు శ్రీపార్ధివ్ను ఈ అవార్డు వరించింది. పార్ధివ్ పర్యావరణ కార్యక్రమాలతో పాటు కేన్సర్ రోగుల గురించి అవగాహన పెంచడానికి రెండున్నరేళ్లు జుట్టు పెంచుకుని, తన టీమ్‌వర్క్‌లో భాగంగా 25 విగ్గులను కేన్సర్ స్వచ్ఛంద సంస్థకు డొనేట్ చేశారు. -
సంచారుల కేరాఫ్ అడ్రస్.. మిత్తల్ పటేల్
అవి చేద్దాం ఇవి చేద్దాం అని జీవితంలో ఎన్నో కలలు కంటుంటాం కానీ, అన్నీ నిజం కావు. కొంతమంది కలలు ఒకరకంగా ఉంటే వారి డెస్టినీ మాత్రం మరోలా ఉంటుంది. కొన్నిసార్లు కల చెదిరినప్పటికీ డెస్టినీ చూపిన మార్గంలో మరెంతోమంది కలలను నిజం చేసే అవకాశం లభిస్తుంది. ఇలా లభించిన అవకాశంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది మిత్తల్ పటేల్. చిరునామా లేని వేలమందికి గుర్తింపు కార్డులతోపాటు, ఒక అడ్రెస్‌ను ఏర్పాటు చేసి, జనజీవన స్రవంతిలో కలుపుతోంది. గుజరాత్‌లోని సంఖల్‌పూర్‌లోని ఓ రైతు కుటుంబంలో పుట్టింది మిత్తల్ పటేల్. చిన్నప్పటి నుంచిఐఏఎస్ అధికారి కావాలనేది ఆమె కల. బీఎస్సీ అయ్యాక ఐఏఎస్ కోచింగ్ కోసం అహ్మదాబాద్ వెళ్లింది. ఒకపక్క ఐఏఎస్‌కు సన్నద్ధమవుతూనే గుజరాత్ విద్యాపీఠ్‌లో జర్నలిజం కోర్సులో చేరింది. ఇక్కడే ఆమె జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. రెండు నెలల ఫెలోషిప్‌లో భాగంగా బార్డోలి గ్రామానికి వెళ్లింది మిత్తల్. అక్కడ ఓ సంచార తెగను చూసింది. ఈ తెగకు చెందిన వాళ్లలో కొందరు ఏవో చిన్నపాటి గుడ్డపీలికలు మాత్రమే ధరించడం, మరికొందరు అదీ లేకుండా అలాగే ఒకచోటనుంచి మరో చోటుకి వలస వెళ్తుండడం వల్ల రోజుల తరబడి తిండిలేక బక్కచిక్కిన శరీరాలను చూసి ఆమె చలించిపోయింది. పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది మిత్తల్‌కు. వీరికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. రెండేళ్ల పాటు సంచార జాతుల గురించి పూర్తిగా తెలుసుకుని వారి కనీస అవసరాలు తీర్చి, వారికో గుర్తింపు ఇవ్వాలని పూనుకుంది. వీరి గురించి ఎంతోమంది అధికారులకు విన్నవించింది. వారికి సాయం చేయడానికి ఏ సీనియర్ అధికారీ ముందుకు రాలేదు. ప్రభుత్వ అధికారులే ఏం చేయలేనప్పుడు .. నేను ఆఫీసర్‌ను అయితే మాత్రం ఏం లాభం అనుకుంది. అప్పటిదాకా ఐఏఎస్ పరీక్షకు సిద్ధమైన మిత్తల్ ప్రిపరేషన్‌ను పక్కన పెట్టింది. విచారత సంస్థాన్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరిగే సంచార జాతులు ఒక్క గుజరాత్‌లోనే 40 రకాలు ఉన్నారు. ముఫ్పై నుంచి నలభై లక్షల వరకు జనాభా ఉండే ఈ సంచారులకు ఆధార్ కార్డు, ఓటరు కార్డు, జనన ధ్రువీకరణ, చిరునామా సంబంధిత పత్రాలు ఏవీలేవని గుర్తించింది. వీరికి కనీస అవసరాలు కల్పించడానికి పూర్తిస్థాయిలో పనిచేయాలనుకుంది. భర్త ప్రోత్సహించడంతో 2015 విచారత కమ్యునిటీ పేరిట ఎన్జీవోను ప్రాంభించింది. సంచార జాతులను వెతకడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరికి సంబంధించిన పెళ్లిళ్లు, ఇతర విందు వినోద కార్యక్రమాల వద్దకు వెళ్లి వారి గురించి వివరాలు అడిగేది. ఈమె ఎవరో ఏమిటో తెలియక మొదట్లో తిరస్కరించినప్పటికీ తరువాత ఆమెను నమ్మి తమ వివరాలు చెప్పేవారు. వాళ్లు నివసించే ప్రాంతంలో టెంట్ వేసుకుని మరీ వారి స్థితిగతులను అధ్యయనం చేసేది. ఈ క్రమంలోనే పద్నాలుగు వందల కుటుంబాలకు పక్కా ఇళ్లను సమకూర్చింది. విచారత ఆధ్వర్యంలో మూడు హాస్టల్స్‌ను నిర్మించింది. వీటిలో వందలమంది సంచారుల పిల్లలు చదువుకుంటున్నారు. ఐడెంటిటీతో అందర్ని కదిలించింది గుజరాత్ ఎలక్షన్ కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరి చుట్టూ తిరిగి సంచారులకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని వినతి పత్రం సమర్పించింది. చివరికి 2010లో తొంబై వేలమంది సంచారులకు రాష్ట్రప్రభుత్వం ఐడెంటిటీ కార్డులు జారీ చేసింది. ఇదే సమయంలో విచారత సంస్థాన్ ‘అమె పన్ చియే’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా సంచారులకు ఐడెంటిటీ కార్డులు అందించారు. అప్పట్లో ఈ కార్యక్రమం అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను ఆకర్షించింది. దీంతో ఆ తరువాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల్లో పార్టీలన్నీ సంచారులకు అనేక హామీలు ఇచ్చాయి. ఊరు, పేరు లేని సంచారులకు ఐడెంటిటీని కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మిత్తల్‌ని 2017లో ‘నారీ రత్న’ అవార్డు వరించింది. దాదాపు పదిహేనేళ్లుగా సంచారుల అభ్యున్నతికి పాటుపడుతోన్న మిత్తల్ ప్రస్తుతం రాజాస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలోని సంచార, బంజార జాతుల అభివృద్ధే లక్ష్యంగా నిర్విరామంగా కృషిచేస్తోంది. చదవండి: అన్నాఖబాలే దుబా..: సేవలో.. ది బెస్ట్! -
సమాజ సేవతోనే జీవితానికి పరిపూర్ణత
ఒక వ్యక్తి తన కోసం తాను పని చేసుకుంటుంటే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండకపోవచ్చు. అదే వ్యక్తి సమాజం కోసం కూడా పని చేస్తుంటే చెప్పుకోవడానికి ఎంతో కొంత ఉంటుంది. అదే... సమాజంలో మార్పు కోసం నిరంతరాయంగా శ్రమిస్తుంటే చెప్పుకోవడానికి చాలా ఉంటుంది. చాలా చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో ఒకరు అనిత చావలి. గాంధీజీతో పాటు చీరాల–పేరాల ఉద్యమంలో పాల్గొన్న తాతగారి స్ఫూర్తితో ఆమె సామాజిక కార్యకర్తగా మారారు. గత రెండు దశాబ్దాలుగా ఆమె సామాజిక జీవనం, సమాజంలో ఆమె తీసుకువచ్చిన మార్పులు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. అనిత చావలి పుట్టింది పెరిగింది బాపట్ల జిల్లా (విభజనకు పూర్వం ప్రకాశం జిల్లా) చీరాల. డిగ్రీ వరకు చీరాలలోనే చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీలో చేశారు. జిల్లా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా, ఎన్సీసీ క్యాడెట్‌గా ఆమె విద్యార్థి దశ నుంచే చురుగ్గా ఉండడానికి కారణం తాతగారు వాసుదేవమూర్తిగారినే చెబుతారు. ఇంటర్ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు 1986 గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఎన్సీసీ క్యాడెట్‌గా సేవలందించిన రోజులను గుర్తు చేసుకున్నారు అనిత. ‘‘బాధితులకు ఆహార పొట్లాలు పంచడం, మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న డాక్టర్లకు సహాయం చేయడం వంటి పనులు మాకప్పగించారు. సర్వీస్‌లో ఉండే ఆత్మసంతృప్తిని నూటికి నూరుపాళ్లు అనుభవించిన సందర్భం అది. పీజీలో కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పని చేశాను. అయితే నా జీవితంలో అతి పెద్ద విరామం పెళ్లి రూపంలో వచ్చింది. నా పీహెచ్డీ సీటును కూడా వదులుకుని యూఎస్‌కి వెళ్లాల్సి వచ్చింది. పన్నెండేళ్లు అక్కడే ఉన్నాం. అయితే అక్కడ కూడా ఊరికే ఉండలేదనుకోండి. లోవెల్ జనరల్ హాస్పిటల్లో చారిటీ వర్క్ చేశాను. ఒక కల్చరల్ ఫౌండేషన్ స్థాపించి బోస్టన్, న్యూజెర్సీల్లో ఉన్న భారతీయ మహిళలను సంఘటితం చేస్తూ తరచూ కలిసే ఏర్పాటు చేశాను. యూఎస్ రోడ్లే కాదు! ఇండియాకి వచ్చి హైదరాబాద్, సఫిల్‌గూడలో స్థిరపడ్డాం. అప్పటికి మా పిల్లలిద్దరూ ప్రైమరీ స్కూల్ వయసులోనే ఉన్నారు. ఇక్కడికి రాగానే ఒకింత షాక్ ఏమిటంటే... చిన్న క్లాసుల పిల్లలను కూడా ట్యూషన్‌కి పంపిస్తున్నారు. ఆ వయసులో ఇంత ప్రెషర్ ఎందుకు? ఆట–పాట లేని చదువేమిటి! అనిపించింది. ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో రెయిన్ బో డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. అదే సమయంలో కాలనీ మీద కూడా నా ఫోకస్ పడింది. ‘యూఎస్‌లో రోడ్లు శుభ్రంగా ఉంటాయి, అలాంటి రోడ్లు ఇండియాకి ఎప్పుడు వస్తాయో... అని పెదవి విరిస్తే సరిపోదు, అక్కడి వాళ్లు ఎలా పని చేస్తారో అలా మనం కూడా పని చేయాలి, అలా పని చేయడం అలవాటు చేయాలి... అనుకున్నాను. మా కాలనీలో ఉత్సాహవంతులతో ఒక సొసైటీ ఏర్పాటు చేశాం. ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి జీహెచ్ఎంసీ వాళ్లు చెత్త తీయకపోతే ఫోన్ చేయడం అలవాటు చేశాం. కాలనీ రోడ్లు శుభ్రంగా మారిపోయాయి. ఇలా ఉన్నప్పుడు 2015 వరదలు మా కాలనీని జలమయం చేశాయి. డ్రైనేజ్ నీరు పొంగి రోడ్ల మీదకు రావడానికి కారణం నాలాలు ప్లాస్టిక్ చెత్తతో పూడిపోవడమేనని తెలిసింది. ప్లాస్టిక్ మీద నా పోరాటం అప్పుడే మొదలైంది. ప్లాస్టిక్ వద్దు... కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ బదులు ఈ బ్యాగ్ వాడండి అని జ్యూట్ బ్యాగ్ ఇచ్చాం. జీహెచ్ఎంసీతో కలిసి తడి చెత్త –పొడి చెత్త వేరు చేయడం నేర్పించాం. ఇంకా చక్కగా వేరు చేసిన వారిని గుర్తించి ‘స్వచ్ఛ నాగరిక’ పురస్కారంతో ప్రోత్సహించాం. స్వచ్ఛ రంగోలి పేరుతో ‘యాంటీ ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయవద్దు, డ్రై–వెట్ వేస్ట్ సెగ్రెగేషన్, నీటి సంరక్షణ, మొక్కలు నాటడం’ అంశాల మీద ముగ్గుల పోటీలు పెట్టాం. ఈ విషయాల్లో మహిళలను ప్రభావితం చేయగలిగితే ఆ ప్రభావం ఇంట్లోనూ, సమాజంలోనూ ప్రతిబింబిస్తుందనే ఉద్దేశంతో ఈ థీమ్ డిజైన్ చేశాను. వీటన్నింటితోపాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ చేపట్టాం. అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్, ఆయిల్ బాటిల్స్ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్‌గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం. మా దగ్గరకు వచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ క్రషింగ్ యూనిట్‌కి వెళ్లిపోతుంది. ప్లాస్టిక్ ఎలిమినేషన్ కోసం రైల్వే స్టేషన్లలో కూడా క్రషింగ్ మెషీన్లు పెట్టించాం. ఇవన్నీ బాగా జరిగాయి. కానీ... చికెన్, మటన్ షాపులకు స్టీలు బాక్సు తీసుకెళ్లాలనే ఉద్యమం కరోనా ముందు వరకు విజయవంతంగా చేయగలిగాం. ఆ తర్వాత మా చేతుల్లో నుంచి మెల్లగా జారిపోయింది. దాని మీద మళ్లీ ఫోకస్ పెట్టాలి. మా కాలనీలో నేను కనిపిస్తే అందరూ ఎదురు వచ్చి పలకరిస్తారు. చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉన్న వాళ్లు మాత్రం ఇప్పుడు పలకరించవద్దు అనుకుని మరో దారిలో మలుపు తిరిగి వెళ్లిపోతుంటారు’’ అన్నారామె నవ్వుతూ. సంఘటిత శక్తి ‘పని చేసే చేతులకు తీరిక ఉండదు, పని చేయని చేతులకు పని కనిపించదు’... అంటారు. అనిత వ్యాపకాల జాబితా చూస్తే ఈ నానుడి నిజమే అనిపిస్తోంది. వాటర్ బోర్డు సహకారంతో కాలనీలో ఇంకుడు గుంతల తవ్వకం వంటి పనులు చేస్తున్నారు, చేయిస్తున్నారు. ‘‘నేను ఒక పని తలపెట్టి ‘కాలనీలో ఈ పని చేద్దాం’ అని వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ పెట్టిన ఇరవై నాలుగ్గంటల్లో స్వచ్ఛందంగా తమ వంతు సహకారంగా ఎవరు ఏమేమి చేయాలనుకుంటున్నదీ తెలియచేస్తారు, అందుకయ్యే ఖర్చులో తమ వంతుగా ఎంత ఇవ్వగలరో కూడా సమాచారం ఇచ్చేస్తారు. అందుకే ఇంత సజావుగా చేయగలుగుతున్నాం. పైకి కనిపించేది నేనే, కానీ, నాకు సహకరించే ఎందరో అండగా ఉన్నారు’’ అని చెప్పారు అనితా చావలి. జీవితం అంటే... మన ఇంటి నాలుగ్గోడలకు పరిమితమైనది కాదు, సమాజంతో కలిసి ఉన్నదే జీవితం. ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించినట్లే, సామాజిక బాధ్యతను కూడా పూర్తి చేయాలి. అప్పుడే జీవితానికి పరిపూర్ణత. ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్, ఆయిల్ బాటిల్స్ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్‌గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం. అలాగే గౌతమ్‌నగర్ సరిహద్దులో రైల్వే పరిధిలో చెత్తకుప్పలా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయించి సరిహద్దు గోడకట్టించి గాంధీజీ విగ్రహం పెట్టాం. – వాకా మంజులారెడ్డి. -
వయసు: 102 ఆరోగ్యరహస్యం: సమాజసేవ
మంగళవారం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనట్లుగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాబితాలో102 ఏళ్ల శకుంతల చౌధురి పేరు కూడా ఉంది. ‘అస్సాంలో వందేళ్లు దాటిన ఏకైక మహిళ శకుంతల’ అనే మాటపై భేదాభిప్రాయాలు ఉండొచ్చుగానీ ‘ఆమె అలుపెరగని సమాజ సేవిక’ అనే వాస్తవాన్ని ఎవరూ విభేదించరు. అస్సాంలో ఏడుదశాబ్దాలకు పైగా ఆమె పేరు ‘సామాజిక సేవ’కు ప్రత్యామ్నాయంగా మారింది. గౌహతిలోని ‘కస్తూర్బా ఆశ్రమం’ కేంద్రంగా శకుంతలమ్మ ఎన్నో సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామ సేవాకేంద్రాలను స్థాపించడం ద్వారా ఎన్నో గ్రామాల అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచింది. ‘స్త్రీ శక్తి జాగారణ్’ ఉద్యమంతో స్త్రీల అక్షరాస్యతకు కృషి చేసింది. స్త్రీ సాధికారత వైపు అడుగులు వేయించింది. శకుంతలమ్మ సుదీర్ఘ ఉపన్యాసాలేవి ఇవ్వదు. చాలా నిశ్శబ్దంగా సేవాకార్యక్రమాలు చేస్తూ పోతుంది. ఈ విధానం ఎంతోమందికి ఆదర్శం అయింది. ‘మనం మాట్లాడడం కంటే మనం చేసే పని మాట్లాడితేనే మంచిది’ అంటారు ఆమె. గాంధీజి, వినోభావే సిద్ధాంతాలతో ప్రభావితం అయిన శకుంతల చిన్న వయసులోనే సమాజసేవను ఊపిరిగా మలుచుకుంది. ‘శకుంతలమ్మను వ్యక్తి అనడం కంటే మహావిశ్వవిద్యాలయం అనడం సరిౖయెనది. ఆమె సైద్ధాంతిక జ్ఞానం, సేవాదృక్పథం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అంటారు ఆమె అభిమానులు. ‘సహాయం కోసం శకుంతలమ్మ దగ్గరికి వెళ్లినప్పుడు, పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్లినట్లుగా అనిపించదు. మన ఇంటి పెద్ద దగ్గరికి ఆత్మీయంగా వెళ్లినట్లుగా అనిపిస్తుంది’ అంటారు సామాన్యులు. శకుంతలమ్మకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న... ‘ఈ వయసులోనూ చురుగ్గా ఉంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?’ ఆమె చెప్పే సమాధానం: ‘సమాజసేవ’ శకుంతలమ్మ ఇచ్చిన చిన్న సమాధానంలో ఎంత పెద్ద తత్వం దాగి ఉందో కదా! -
కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ‘డయానా అవార్డు’
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ప్రతిష్టాత్మక డయానా అవార్డు దక్కింది. బ్రిటన్ దివంగత రాకుమారి డయానా పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువత చేసిన సోషల్ వర్క్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్ ఖాన్‌పల్లి గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా పలు అంశాలపై శోమ పేరుతో హిమాన్షు ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు చేపట్టిన పలు కార్యక్రమాలకుగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తన ప్రాజెక్టుకు మార్గదర్శనం చేసిన తన తాత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు సహకరించిన రెండు గ్రామాల ప్రజలు, తన మెంటార్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుమారుడికి అత్యున్నత అవార్డు రావడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. -
సీనియర్ జర్నలిస్టు కోప్ర కన్నుమూత
ముషీరాబాద్: జర్నలిస్టు, కవి, రచయిత, బహుజన మేధావి కోలపూడి ప్రసాద్ (56) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కోప్రగా ఆయన అందరికీ సుపరిచితుడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వారం క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మొదట పెరాలసిస్ రావడంతో కొన్ని అవయవాలు పనిచేయలేదు. కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందారు. ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ప్రసాద్ మొదట్లో ఆర్ అండ్ బిలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొంతకాలం విరసంలో, అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో పనిచేశారు. అనంతరం ఆ పార్టీకి దూరమై హైదరాబాద్ వచ్చారు. జర్నలిస్టుగా అనేక పత్రికలలో పనిచేశారు. అనేక పాటలు, కవితలు, వ్యాసాలు రాసి బహుజన మేధావిగా గుర్తింపుపొందారు. ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ (ఎంబీసీ) సిద్ధాంతకర్తగా ప్రాచుర్యం పొందారు. కోలపూడి ప్రసాద్ (కోప్ర) మరణంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేతలు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, మేడి పాపయ్య మాదిగలతోపాటు బహుజన మేధావులు, కవులు, రచయితలు, ప్రజాసంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. కోప్ర మరణం బీసీ ఉద్యమానికి తీరనిలోటన్నారు. చదవండి: కాల్పుల విరమణ దిశగా మావోలు? -
పద్మశ్రీకి ఎంపికైనా పింఛను కరువే
అయోధ్య: 25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు.. అందరితో ఆప్యాయంగా ‘షరీఫ్ చాచా’ అని పిలిపించుకున్నారు. కేంద్రం 2020లో ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపికైనట్లు సమాచారం ఇచ్చింది. అయితే, ప్రభుత్వం కనీసం పింఛను కూడా ఇవ్వకపోవడంతో కటిక పేదరికంతో వైద్యం కూడా చేయించుకోలేక మంచానికే పరిమితమయ్యారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొహల్లా ఖిర్కి అలీబేగ్‌కు చెందిన మొహమ్మద్ షరీఫ్(83). అనాథలకు షరీఫ్ అందించిన సేవలకుగాను ‘పద్మశ్రీ’కి ఎంపిక చేసినట్లు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి గత ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరం అందిందని ఆయన కుమారుడు షగీర్ తెలిపారు. అయితే, ఇప్పటికీ ఆయనకు ఆ అవార్డు అందలేదన్నారు. పద్మశ్రీకి తన తండ్రి పేరును సిఫారసు చేసిన స్థానిక ఎంపీ లాలూ సింగ్ కూడా అవార్డు ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు షగీర్ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తండ్రికి పింఛను మంజూరు చేయాలని కోరారు. ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తనకు నెలకు రూ.7వేల వేతనం మాత్రం వస్తుందనీ, అది కుటుంబ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని షగీర్ తెలిపారు. పేదరికం కారణంగా తన తండ్రికి వైద్యం చేయించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. -
నీళ్లు తాగాలంటే భయం
షాపింగ్ మాల్స్ రంగురంగుల లైట్ల వెలుగు లో చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఆ మాల్స్‌లో ఉద్యోగం చేసే సేల్స్‌గాళ్స్ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెరగకూడదు. ఇది ఆ ఉద్యోగ నియమం. దేహం ఎంత బాధిస్తున్నా సరే, నవ్వు మాయం కాకూడదు. కూర్చోవడానికి కుర్చీలు ఉండవు. కొనుగోలుదారుల సేవ కోసం ఎప్పుడూ చురుగ్గా ఉండాలంటే కూర్చోకూడదు... ఇది ఎక్కడా రాయరు, కానీ ఇది కూడా ఒక నియమం. ఇంకా ఘోరం ఏమిటంటే... బాత్రూమ్కి ఎన్నిసార్లు వెళ్తున్నారనేది కూడా లెక్కలోకి వస్తుంటుంది. ఉదయం ఏడు గంటలకు ఇల్లు వదిలిన వాళ్లు రాత్రి ఎనిమిది వరకు షాపులోనే ఉండాలి. తిరిగి ఇల్లు చేరేటప్పటికి తొమ్మిదవుతుంది. దాదాపుగా సేల్స్గాళ్స్గా పని చేసే యువతులందరూ నీళ్లు తాగడం తగ్గిచేశారు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండి తరచూ వెళ్లాల్సి ఉన్న ఓ మహిళ ఉద్యోగం పోతుందనే భయంతో ట్యూబ్ అమర్చుకుని ఉద్యోగం చేసింది. ఇది కేరళ రాష్ట్రం, కోళికోద్ జిల్లాలో చోటుచేసుకున్న దయనీయ స్థితి. ఈ దుస్థితికి మంగళం పాడిందో మహిళ. పేరు విజి పెన్‌కూట్టు. చైతన్యవంతమైన కేరళ రాష్ట్రంలో కూడా ఉద్యమిస్తే తప్ప శ్రామిక చట్టాలు అమలు కాలేదంటే ఆశ్చర్యమే. అయినా ఇది నిజం. యాభై రెండేళ్ల సామాజిక కార్యకర్త విజి పెన్‌కూట్టు మహిళల కోసం పోరాడింది. న్యాయం కోసం గళం విప్పింది. బాధిత మహిళలతోపాటు సానుభూతిపరులైన మహిళలు కూడా ఆమెతో కలిసి నడిచారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఎనిమిదేళ్ల పోరాటం. ఎట్టకేలకు ప్రభుత్వం కళ్లు తెరిచింది. షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (అమెండ్మెంట్) యాక్ట్, 2018 చట్టాన్ని అమలులోకి తెచ్చింది. విజి పోరాటంతో అక్కడి ఉద్యోగినులకు సౌకర్యవంతమైన పనిగంటలు, పని ప్రదేశంలో కనీస సౌకర్యాల ఏర్పాటు సాధ్యమైంది. మన సమాజం ఆధునిక సమాజంగా మారింది. కానీ మెరుగైన సమాజంగా మారలేదింకా. అందుకే చట్టం కోసం కొన్ని పోరాటాలు, వాటి అమలు కోసం మరికొన్ని పోరాటాలు... తప్పడం లేదు. విజి పెన్‌కూట్టు వంటి సామాజిక కార్యకర్తలు తమ గళాలను వినిపించకా తప్పడం లేదు. -
అనాథల అక్క
రైలొచ్చి ఆగిందంటే స్టేషన్ ఖాళీ అవుతుంది. అక్కొచ్చి వెళ్లిదంటే.. స్టేషన్లో అనాథ బాలలెవరూ కనిపించరు.రైలు.. ప్రయాణికుల్ని మోసుకెళ్లినట్లు.అక్క.. గమ్యం లేని ఆ పిల్లల్ని తనతో తీసుకెళుతుంది. వారికో గూడు కల్పిస్తుంది. బడిలో చేర్పిస్తుంది. వాళ్ల భవిష్యత్తుకు బతుకు పట్టాలు వేస్తుంది. ఆ అక్క పరిచయం ఇది. షోరాపుల్లి రైల్వే జంక్షన్ కోల్‌కతాకు 30 కి.మీ.ల దూరాన ఉంటుంది. తొమ్మిది ట్రాక్‌లు, ఆరు ప్లాట్‌ఫామ్‌లతో ఎప్పుడూ వచ్చే పోయే రైళ్లతో, ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్, హుగ్లీ జిల్లాలో ఉంది షోరాపుల్లి. తూర్పు రైల్వే నడిపిన తొలి రైలు మార్గం ఇది. ప్రథమ స్వాతంత్య్ర సమరానికి మూడేళ్ల ముందు 1854, ఆగస్టు 15వ తేదీన హౌరా నుంచి హుగ్లీ వరకు షోరాపుల్లి మీదుగా తొలి రైలు నడిచింది. అంతటి చరిత్రాత్మకమైన రైల్వే స్టేషన్ కాలక్రమంలో అనాథ బాలలకు నెలవుగా మారింది. వాళ్లలో నాలుగేళ్ల పిల్లల నుంచి ఉన్నారు, కానీ ఎక్కువ మంది పన్నెండు– పదమూడేళ్ల వయసు వాళ్లు. చాలా మందికి తల్లిదండ్రులు లేరు. కొంతమందికి తల్లి లేదు. మరో పెళ్లి చేసుకున్న తండ్రి శ్రద్ధ పెట్టకపోవడంతో వీధుల బాట పట్టిన బాల్యం వాళ్లది. ఆ పిల్లలను ‘తిన్నారా’ అని అడిగే వాళ్లు ఉండరు. దొరికింది తినడం, ఏదీ దొరక్కపోతే చెట్ల గుబుర్ల నుంచి చిగురుటాకులు కోసుకుని తినడం! ఎక్కడ పడితే అక్కడే నిద్రకు వాలిపోయేవారు. (మదిదోచే జలపాతాలు.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే) ఆకలిని, చలిని అణుచుకోవడానికి మత్తుగా నిద్రపోవడానికి డెండ్రైట్ గమ్‌కి కూడా అలవాటు పడ్డారు! పరిశ్రమలలో ఉపయోగించే డెండ్రైట్ గమ్ తాగితే మత్తు వస్తుందని, భ్రాంతిలో, అందమైన ఊహల్లో తేలిపోవచ్చని వాళ్లకు ఎలా తెలిసిందో, ఎప్పుడు తెలిసిందో! పెద్ద పిల్లల నుంచి చిన్న పిల్లలకు కొన్నేళ్లుగా ఆ అలవాటు వస్తూనే ఉంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లో అడుక్కోవడం, వాడేసిన బాటిళ్లను ఏరి అమ్ముకోవడం... పదో పదిహేనో వస్తే బిస్కట్టో, కేక్ ముక్కో కొనుక్కుని తినడమే వాళ్లకు తెలిసింది. అదే డబ్బులకు చిన్న బ్రెడ్ ప్యాకెట్ వస్తుందని, దాంతో అయితే ఆకలి తీరుతుందనే ఆలోచన కూడా ఉండదు. అలాగే ఒక్క కేకు ముక్కతో ఆకలి తీరదని కూడా తెలుసు, అందుకే ఆకలి తీర్చుకోవడానికంటే ముందు గమ్ కొనుక్కోవడానికి కొంత డబ్బు తీసి పక్కన పెట్టుకుంటారు. హార్డ్‌వేర్ షాపుకెళ్లి గమ్ కొనుక్కుంటారు. ఆ గమ్‌ను పిల్లలకు అమ్మడం నేరమని ఆ దుకాణాల వాళ్లకు తెలుసు. అయినా సరే అమ్మేస్తుంటారు. అది తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేవాళ్లు లేరు. డెండ్రైట్ గమ్ నుంచి వచ్చే తియ్యటి వాసనను పీల్చకుండా ఉండలేని స్థితికి చేరుకున్నారా పిల్లలు. ఇంకా ఘోరం ఏమిటంటే... స్టేషన్ పరిసరాల్లో నిద్రిస్తున్న ఆడపిల్లల మీద దుండగులు అత్యాచారాలకు పాల్పడడం, కొంతమంది సెక్స్‌వర్కర్లు ఈ పిల్లల్ని మభ్య పెట్టి వ్యభిచారకూపంలోకి దించడమూ. రాత్రయితే ఆ స్టేషన్ పరిసరాలు రెడ్‌లైట్ ఏరియాగా మారిపోతుండేవి. నాలుగేళ్ల కిందట మైత్రేయి బెనర్జీ దృష్టి ఆ పిల్లల మీద పడే వరకు అలాగే ఉండింది. ఆకలి మత్తు మైత్రేయి బెనర్జీ పుట్టిల్లు పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్. అర్నాబ్ బెనర్జీని పెళ్లి చేసుకుని కోల్‌కతాలో అడుగుపెట్టింది. సోషల్ వర్క్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన మైత్రేయి పెళ్లయి ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఉద్యోగం వదిలేసి గృహిణిగా మారిపోయింది. ఓ రోజు మార్కెట్‌కి వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు అల్లరిచిల్లరిగా వ్యవహరించడం ఆమె దృష్టిలో పడింది. వాళ్లను మాటల్లో పెట్టి, వాళ్ల బస రైల్వే స్టేషన్ అని తెలుసుకుంది. మరో రోజు అదేపనిగా రైల్వే స్టేషన్‌కెళ్లి గమనించిందామె. పిల్లలు డెండ్రైట్ గమ్ మత్తు మందు పీల్చడం గమనించి ఎందుకిలా చేస్తున్నారని అడిగింది. ఆమె ఏ మాత్రం ఊహించని సమాధానం... ‘‘అక్కా! మాకు తినడానికి తిండి లేదు. దీన్ని పీలిస్తే మత్తుగా నిద్ర వస్తుంది. ఆకలి తెలియదు’’ అన్నారా పిల్లలు. అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘‘ఆ సమాధానం విని గుండె పగిలిపోయింది’’ అని చెప్పేటప్పుడు మైత్రేయి కళ్ల నుంచి కన్నీరు ధారగా చెంపల మీదకు జారాయి. బాల్యం పట్టాలెక్కింది రైల్వేస్టేషన్లో రోజులు గడుపుతున్న పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు మైత్రేయి. వాళ్ల సమస్యకు పరిష్కారం అంత సులభం కాదని తెలుసు. అయినా ఒక్కటొక్కటిగా తన ప్రయత్నాలను మొదలుపెట్టారామె. దగ్గరలో ఉన్న రెస్టారెంట్లకు వెళ్లి మధ్యాహ్నం మిగిలిన భోజనాన్ని ఈ పిల్లలకు పెట్టడానికి రెస్టారెంట్ యజమానులను ఒప్పించారు మైత్రేయి. ఒక పూట భోజనానికి భరోసా వచ్చింది. వాళ్లకు నీడ వెతకాలి. ఈ లోపు బంధువులు, స్నేహితులతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి తాను చేపట్టిన పని గురించి వివరించారు. అందరి ఇళ్లకు వెళ్లి పిల్లల దుస్తులు, దుప్పట్లు, స్కూలు బ్యాగ్‌లు, బూట్లు సేకరించారామె. ఆ దుస్తులను తాను బాధ్యత తీసుకున్న పిల్లలకు వేసి ఫొటోలు తీసి వాట్సప్ గ్రూప్‌లో పెట్టేవారామె. దాంతో మొదట్లో ఒకింత సహాయం చేసిన వాళ్లందరూ మైత్రేయి చేపట్టిన పనిలో సంతోషంగా భాగస్వాములయ్యారు. ఆ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చేటప్పుడు పుస్తకాలు, యూనిఫామ్ కొనివ్వడం వంటి సహాయాన్ని స్వచ్ఛందంగా అందించారు. ఒక్కొక్కటీ దారిన పడుతోంది. కానీ చీకటి నేరాల నుంచి భద్రత కల్పించే భరోసానిచ్చే నీడ మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. అనాథ పిల్లల కోసం ప్రభుత్వం నడిపిస్తున్న హోమ్‌లను, ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ గ్రామాలను సంప్రదించి మిగిలిన పిల్లలను చేర్పించారు. మొత్తం నూట పదిమంది పిల్లలకు భద్రత కల్పించారు మైత్రేయి. ‘‘ఎవరి జీవితమూ ఒకరికంటే తక్కువ కాదు, మరొకరి కంటే ఎక్కువా కాదు. ఎవరి జీవితం వాళ్లకు గొప్పది. వీధిపాలైందని జీవితాన్ని వదిలేయకూడదు. పట్టాలు తప్పిన బతుకును గాడిన పెట్టాలి. గొప్ప జీవితంగా మలుచుకోవాలి. ఆ ఉద్దేశంతోనే నేను చేస్తున్న ఈ పనికి ‘మహా జిబన్’ అని పేరు పెట్టాను. అంటే మహా జీవితం అని అర్థం’’ అన్నారు మైత్రేయి. – మంజీర అసలైన సవాల్ పిల్లలకు భరోసా కలిగిన ఒక నీడ వెతకడం, అందులో చేర్చడం ఒక ఎత్తయితే.. వారిని అందులో కొనసాగించడం ఆమెకు పెద్ద సవాల్‌గా మారింది. ఇద్దరు పిల్లలు ఎస్ఓఎస్ గ్రామం నుంచి పారిపోయి తిరిగి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కేవలం డెండ్రైట్ కోసమే వాళ్లు ఆ పని చేశారు. వాళ్లను తిరిగి తీసుకెళ్లి ఎస్ఓఎస్లో చేర్చడంతోపాటు వాళ్లకు జీవితం పట్ల ఆశ కలిగేటట్లు కౌన్సెలింగ్ ఇవ్వడం పెద్ద పనిగా మారింది. క్రమం తప్పకుండా కౌన్సెలింగ్‌లు, థెరపీలు, మందులిప్పించడం ద్వారా ఆ పిల్లలను మార్చగలిగారామె. ‘‘ముందున్నది మహా జీవితం అని వాళ్లకు నచ్చచెప్పి జీవితం మీద ఆశలు కల్పించగలిగాను. జీవితేచ్ఛ కలిగితే.. ఆ జీవితేచ్ఛే మనిషిని నడిపిస్తుంది. తొలిసారి వాళ్లను కలిసినప్పుడు స్నానం లేకుండా, మాసిన దుస్తులతో, చింపిరి జుట్టుతో ఎవరు ఎవరో గుర్తు పట్టలేనట్లు ఉన్నారా పిల్లలు. ఇప్పుడు మంచి దుస్తులు ధరించి, స్కూలుకు పోతున్నారు. పలకరిస్తే స్వచ్ఛంగా నవ్వుతున్నారు. బాల్యాన్ని సంతోషంగా గడుపుతున్నారు. వాళ్ల బాల్యాన్ని వాళ్లకు తిరిగి తెచ్చివ్వగలిగినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు మైత్రేయి. -
సోషల్ డాక్టర్
డాక్టర్ కావ్య... ఫలానా వారి అమ్మాయిగా గుర్తింపు పొందడం లేదు. అలాంటి గుర్తింపు ఆమెకే కాదు... వాళ్ల అమ్మానాన్నలకు కూడా ఇష్టం లేదు. ‘నీకు నువ్వుగా సాధించుకున్నదే నీ గుర్తింపు.. అమ్మానాన్నతో వచ్చేది గుర్తింపు కాద’ని చెప్పి పెంచారామెని. మెడిసిన్ కోర్సు మీద ఆసక్తి పెంచుకున్నారామె. ఆమె కోరుకున్నట్లే చదివించారు పెద్దవాళ్లు. పేథాలజిస్టుగా ఆమెది పేషెంట్ల హెల్త్ రిపోర్టులను సర్టిఫై చేయాల్సిన బాధ్యత. ఆ ఉద్యోగం చేయగా చేయగా... ఆమెకు ఒక నిజం తెలిసింది. అనారోగ్యం వ్యక్తుల్లో మాత్రమే కాదని.. సమాజంలోనూ ఉందని! స్త్రీల ఆరోగ్యాన్ని అలక్ష్యం చేసే ఆ సామాజిక అనారోగ్యానికి కూడా వైద్యం చేయాలనుకున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలను చైతన్యవంతం చేస్తున్నారు. డాక్టర్ కావ్య తన తండ్రి పేరుతో గుర్తింపు కోరుకోకపోయినప్పటికీ... ఆమె ప్రాథమిక పరిచయం మాత్రం తెలంగాణ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారమ్మాయిగానే. తను సామాజిక వైద్యురాలిగా మారడానికి దారి తీసిన పరిస్థితులను వివరించే ముందు.. తన కుటుంబ వివరాలను సాక్షితో పంచుకున్నారు కావ్య. సిటీ బస్సులో కాలేజ్‌కి ‘‘ముగ్గురమ్మాయిల్లో నేనే పెద్దదాన్ని. నేను సెవెన్త్‌లో ఉన్నప్పుడు.. అంటే 1994లో ఓ రోజు... ఎప్పటిలాగానే మధ్యాహ్నం భోజనానికి స్కూలు నుంచి ఇంటికి వచ్చాను. మాకప్పట్లో డైనింగ్ టేబుల్ లేదు. నేల మీదనే భోజనాలు. అమ్మ మాకు వడ్డించి తనూ కూర్చుని ఉంది. అప్పుడు నాన్న మంత్రి అయ్యారనే సమాచారం వచ్చింది. మంత్రి అంటే ఏంటని అమ్మని అడిగితే, అమ్మ ఏదో చెప్పింది కానీ, అమ్మకి కూడా వివరంగా చెప్పేటంతగా తెలియదు’’ అన్నారు డాక్టర్ కావ్య. తనకు మంత్రిగారమ్మాయిగా కారులో ప్రయాణించడంతోపాటు బస్ పాస్ కొనుక్కుని ఎంబీబీఎస్ కి కాలేజ్‌లో సిటీబస్‌లో వెళ్లిన అనుభవాలూ ఉన్నాయన్నారామె. బాల్య వివాహాల నియంత్రణ రాజకీయాల్లోకి రాకముందు నాన్న లెక్చరర్. ఇప్పటికీ ఆయనలో టీచర్ అలాగే ఉన్నారు. చిన్నప్పుడు స్కూలుకెళ్లావా, కాలేజ్కెళ్లావా... అని అడిగినట్లే ఇప్పుడు ‘హాస్పిటల్‌కి వెళ్లావా’ అని అడుగుతారు. మన డ్యూటీ మనం నూటికి నూరు శాతం చేయాలనే తత్వం ఆయనది. ఎవరైనా ఆయన్ని ‘ముగ్గురమ్మాయిలు కదా వాళ్లకు ఏమిచ్చారు’ అని అడిగితే... ‘ఏమివ్వాలి’ అని ఎదురు ప్రశ్నిస్తారు. ‘ముగ్గురినీ చదివించాను. నా పిల్లలు ఒకరు డాక్టర్, ఇద్దరు ఇంజనీర్లు. ముగ్గురూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు. ఇంకా నేనిచ్చేదేంటి? వాళ్ల కాళ్ల మీద వాళ్లే నిలబడతారు. వాళ్ల జీవితాన్ని వాళ్లే నిర్మించుకుంటారు’ అని చెబుతారు. ఆయనకు రికమండేషన్ చేయడం ఇష్టం ఉండదు. మాకోసం ఫేవర్ చేయమని ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఎవరైనా మమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు... ఆ విషయాన్ని నాన్న దగ్గరకు తీసుకెళ్లినా కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ‘వ్యక్తులకు కాదు, వ్యవస్థలకు చేయాలి.. అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే చెప్పు మాట్లాడదాం’ అనేవారు. ఆయనకు ఆడపిల్లలంటే ప్రత్యేకమైన అభిమానం. మేము ముగ్గురం. మా ముగ్గురికీ కలిపి నలుగురమ్మాయిలు. ఇంటి నిండా ఆడపిల్లలు కనిపిస్తుంటే ఆయనకు ఎంత సంతోషమో మాటల్లో చెప్పలేను. ఆయనకు బాలికల కోసం ఏదైనా చేయడం చాలా ఇష్టం. ఒకప్పుడు కస్తూర్బా విద్యాకేంద్రాల్లో ఎనిమిదవ తరగతి వరకే ఉండేది. ఆ తర్వాత ఆ పిల్లలను మరో స్కూల్లో చేర్చడం, దూరం పంపడానికి ధైర్యంలేక వాళ్ల అమ్మానాన్నలు ఆ అమ్మాయిలకు తొమ్మిదో తరగతి వయసుకే పెళ్లిళ్లు చేసేవాళ్లు. ఇలాంటి బాల్య వివాహాలను అరికట్టడం కోసం నాన్న ఆ విద్యా కేంద్రాలను పన్నెండవ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయించారు. నాన్న నుంచి చేర్చుకున్నా పేషెంట్‌ను పేషెంట్‌గా మాత్రమే చూడకుండా వ్యాధి లక్షణం వెనుక ఉన్న సామాజిక కారణాన్ని అన్వేషించడం ఎలా అలవడిందంటే ఇదీ అని స్పష్టంగా చెప్పలేను. మనం చేసిన పని వల్ల సమాజానికి ప్రయోజనం చేకూరాలని నాన్న చెప్పిన మాటలే కారణం అనుకుంటాను. గవర్నమెంట్ హాస్పిటల్లో పేథాలజిస్టుని. ఇప్పటి వరకు నా ఉద్యోగం గ్రామాలు, చిన్న పట్టణాలు, అల్పాదాయ వర్గాల నివాస ప్రాంతాల్లోనే. నా దగ్గరకు వచ్చిన పేషెంట్ల ఆరోగ్య పరీక్షల నమూనాల్లో మహిళల హిమోగ్లోబిన్ పర్సెంట్ ఏడు నుంచి తొమ్మిది వరకే ఉండడాన్ని గమనించాను. అది కనీసం పన్నెండైనా ఉండాలి. ఏ ఒకరో ఇద్దరిలోనో కాదు, తొంబై తొమ్మిది శాతం ఇంతే. పది శాతం హిమోగ్లోబిన్ నూటికి ఒకరికి మాత్రమే ఉండేది. మహిళలు అమాయకంగా తీసుకునే మరో నిర్ణయం గర్భాశయాన్ని తొలగించుకోవడం. మెన్స్ట్రువల్ హైజీన్ తెలియకపోవడం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడం. ఇన్నింటిని చూసిన తర్వాత నా ఉద్యోగం నేను చేసుకుని వచ్చేస్తే సరిపోదు.. ఏదో ఒకటి చేయాలనిపించింది. అయితే చేద్దామని అనుకున్నంత సులభం కాదు చేయడం. మెడికల్ క్యాంపు పెట్టి మందులిచ్చి వచ్చేస్తే కూడా సరిపోదు. ఐరన్‌మాత్రలు వేసుకుంటే పొట్ట ఉబ్బరంగా ఉంటోందని హాస్పిటల్లో ఇచ్చిన మాత్రలను వేసుకోవడం లేదు. మేమడిగితే ‘వేసుకున్నాం’ అని మమ్మల్ని మభ్య పెట్టాలని చూస్తారు. వాళ్ల మాటకంటే ముందు ముఖం చెప్పేస్తుంది రక్తహీనత అలాగే ఉందని. వాళ్లకు మంచి ఆహారం కావాలి. అలాగని ప్రతిదీ ప్రభుత్వపరంగా చేయడం కుదరదు. అందుకే ‘కడియం ఫౌండేషన్’ స్థాపించి రక్తహీనతతో బాధపడుతున్న ఆడపిల్లలు, మహిళలకు వేరుశనగపప్పు ఉండలతోపాటు విడిగా ఒక కేజీ బెల్లం ఇవ్వడం మొదలు పెట్టాను. మంచి ఫలితాలను ఇస్తోంది ఎవరెన్ని చెప్పినా ఆడవాళ్లలో ఆహారం పట్ల శ్రద్ధ తక్కువే. మా అమ్మే పెద్ద ఉదాహరణ. మా నాన్న క్యాంపుకెళ్లినప్పుడు ‘నాన్న లేరు కదా, ఏం వండుదాం, ఉన్నవేవో తినేద్దాం’ అనేది. ఈ మాట అనని అమ్మ మనదేశంలో బహుశా ఉండకపోవచ్చు. నేను స్కూళ్లకు వెళ్లి, కమ్యూనిటీ సెంటర్లకు వెళ్లి గొంతు చించుకుని చెప్తున్న విషయాలు.. ఒకటి పోషకాహారం అవసరత, రెండు మెన్స్ట్రువల్ హైజీన్, మూడవది ఆరోగ్య పరిరక్షణ. నా ప్రయత్నంలో భాగంగా ఇప్పుడిప్పుడు సరిగా తినడం, మెన్స్ట్రువల్ హైజీన్ అలవడుతోంది. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి తీవ్రత పెరిగే వరకు ఉదాసీనంగా ఉండడంలో పెద్ద మార్పు రాలేదు. ఈ మూడో విషయంలో మా గ్రామాల మహిళలే కాదు, చదువుకున్న సంపన్న కుటుంబాల మహిళలు కూడా అలాగే ఉంటున్నారు. ఒక పెద్ద మహిళాధికారి ప్రీ క్యాన్సర్ దశలో వైద్యం చేయించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మహిళల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కలిగించడానికి ఇలాంటి ఉదాహరణలెన్నింటినో చెబుతుంటాను’’ అన్నారు డాక్టర్ కావ్య. ఒక మహిళ అనారోగ్యం పాలయినా, ప్రాణాలు కోల్పోయినా ఆ కుటుంబం ఎంతగా ఒడిదొడుకులకు లోనవుతుందో వివరించగలిగితే చాలు. ఆడవాళ్లు తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరు. అదే విషయాన్ని మనసుకు తాకేటట్లు చెప్పే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా జరగాల్సిన అవసరమూ ఉంది. అలాంటి ఒక పెద్ద సామాజిక ఆరోగ్య యజ్ఞంలో కావ్య తన వంతుగా చేస్తున్న ప్రయత్నం ఇది. వాకా మంజులారెడ్డి ఫొటోలు: జి. అమర్ మా వారిది గుంటూరు జిల్లా. మెడిసిన్ చదివేటప్పుడు పరిచయమ్యారు. నాన్నతో చెప్పినప్పుడు ఆయన వెంటనే ఏమీ చెప్పలేదు. నజీర్‌తో మాట్లాడిన తర్వాత తన అంగీకారాన్ని తెలియచేశారు. నిరాడంబరత, అభ్యుదయ భావాలను పైకి మాట్లాడరు. కానీ ఆయన ఆచరణలో అవి ఉంటాయి. గ్రామీణ మహిళల కోసం సర్వీస్ కూడా నాన్నతో మాట్లాడిన తర్వాతే మొదలుపెట్టాను. డాక్టర్ కావ్య, పేథాలజిస్ట్, వర్ధన్న పేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్, వరంగల్ జిల్లా -
ఎంపీగా పోటీ చేస్తా.. లోన్ ఇవ్వండి..!
హైదరాబాద్: ‘ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను.. ఎన్నికల ఖర్చుల కోసం రుణం మంజూరు చేయండి’ అని కోరుతూ ఓ సామాజిక కార్యకర్త నల్లకుంటలోని కెనరా బ్యాంక్‌లో దరఖాస్తు చేసుకున్నారు. బాగ్‌అంబర్‌పేటలో నివాసముండే కె.వెంకటనారాయణ సామాజిక కార్యకర్త. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. దీనికి అవసరమైన ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ. 5 లక్షల రుణం మంజూరు చేయాలని కోరుతూ బ్యాంక్ మేనేజర్‌కు దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా అవినీతిపై ప్రత్యక్ష ఉద్యమాల ద్వారా పోరాడుతున్నానని చెప్పారు. ప్రభుత్వ విభాగాల్లో జరిగే అవినీతి కుంభకోణాలను వెలికితీసి అవినీతిపరులను కోర్టుకు లాగుతున్నానని వివరించారు. తన సేవలను గుర్తించిన తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య తనను సన్మానించి పురస్కారం అందజేశారని గుర్తు చేశారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు. పేదరికం కారణంగా ఎన్నికల వ్యయాన్ని భరించలేకపోతున్నానని తెలిపారు. ఈ కారణంగానే రుణం కోసం దరఖాస్తు చేశానని వివరించారు. తాను గతంలో కూడా రుణం కోసం దరఖాస్తు చేసుకున్నానని.. అయినా తనకు రుణం మంజూరు చేయలేదని తెలిపారు. ఈ సారైనా రుణం మంజూరు చేస్తే, వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లిస్తానని వెంకటనారాయణ హామీ ఇచ్చారు. -
పేదరికంలో ఉన్నా.. ఆదుకోండి
సాక్షి, చెన్నై: ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మదురైకి చెందిన చిన్నపిళ్లై(67) కటిక పేదరికంలో కాలం వెళ్లదీస్తున్నారు. రెండున్నర దశాబ్దాలకు పైగా గ్రామీణ మహిళాభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ తమిళనాట కోరలు చాచిన కంతు వడ్డీకి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నారు. కళంజియం పేరిట సంస్థను స్థాపించి మహిళల్ని ఏకంచేసి బాల్య వివాహాల్ని అడ్డుకుంటున్నారు. పద్మశ్రీకి ఎంపికైన సందర్భంగా మీడియా పలకరించగా.. తాను పేదరికంలో ఉన్నానని, ప్రభుత్వం అందించే వితంతు పింఛను రూ.వెయ్యితో కాలం నెట్టుకు వస్తున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు.తనకు స్త్రీ శక్తి పురస్కారం అందజేసిన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి తనకు పాదాభివందనం చేశారని ఆమె గుర్తు చేశారు. అ‘సామాన్యుల’కు గుర్తింపు న్యూఢిల్లీ: సమాజ సేవ చేస్తున్న పలువురు సామాన్యులను ఈ ఏడాది పద్మ అవార్డులు వరించాయి. అందులో టీ విక్రేత, రూపాయికే పేదలకు వైద్యం అందిస్తున్న డాక్టర్ దంపతులు, దళితుల కోసం పాఠశాలను నెలకొల్పిన రిటైర్డ్ ఐపీఎస్ తదితరులున్నారు. ఒడిశాలో 100 ఎకరాలను సాగుచేసేందుకు ఒంటరిగా 3 కి.మీ మేర కాలువ తవ్విన గ్రామస్తుడు, మథురలో వేయికి పైగా ముసలి, జబ్బుపడిన ఆవుల బాగోగులు చూస్తున్న జర్మన్ పౌరురాలు కూడా తమ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను గెలుచుకున్నారు. కటక్‌కు చెందిన దేవరపల్లి ప్రకాశరావు టీ అమ్మడం ద్వారా వచ్చిన లాభాలతో మురికివాడల్లో నివసిస్తున్న పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. మహారాష్ట్రలో నక్సల్స్ ప్రభావిత మేల్ఘాట్ జిల్లాలో స్మిత, రవీంద్ర కోల్హె అవే వైద్య దంపతులు స్థానిక గిరిజనులకు మూడేళ్లుగా కేవలం రూ.1, రూ.2 కే వైద్యం అందిస్తున్నారు. ఇక బిహార్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జ్యోతికుమార్ సిన్హా మహాదళిత్ ముసాహర్ కులానికి చెందిన విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమ పాఠశాలను స్థాపించారు. రెసిడెన్షియల్ వసతి కూడా ఉన్న ఈ పాఠశాలలో 1 నుంచి 12 తరగతుల వరకు 320 మంది విద్యార్థులు చేరారు. ‘కెనాల్ మ్యాన్ ఆఫ్ ఒడిశా’గా పేరొందిన దైతారి నాయక్..పర్వతాల నుంచి నీటిని పొలాలకు పారించేందుకు బైత్రాని గ్రామంలో ఒక్కడే సుమారు నాలుగేళ్లు శ్రమించి మూడు కి.మీ పొడవైన కాలువను తవ్వి నీటి ఎద్దడి తీర్చారు. ‘గౌ మాతాకీ ఆశ్రయదాత్రి’గా పేరొందిన జర్మనీకి చెందిన ఫ్రెడరిక్ ఇరినా బ్రూనింగ్ మథురలో 1200 గోవులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. పద్మశ్రీకి ఎంపికైన.. అస్సాంకు చెందిన ఇంజినీరింగ్ డ్రాపౌట్ ఉద్ధవ్ కుమార్ భరాలి దానిమ్మ గింజలు తీసే, వెల్లుల్లి పొట్టు తొలిచే యంత్రాలను తయారుచేశారు. -
17న శబరిమలకు తృప్తి దేశాయ్
తిరువనంతపురం/ న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ నెల 17న తాను కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామిని దర్శించుకుంటానని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రకటించారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు మహిళలతో కలసి తాను ఆలయానికి వెళ్తున్నట్లు తెలిపారు. దర్శనసమయంలో తనకు రక్షణ కల్పించాలని ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్‌లను కోరింది. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టనివ్వ బోమని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ స్పష్టం చేశారు. గాంధేయ మార్గంలో వారిని అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోౖ వెపు, తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం మరోసారి నిరాకరించింది. శబరిమల తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లపై జనవరి 22న ఓపెన్ కోర్టులో విచారణ చేపడతామని తెలిపింది. -
సమాజ సేవలో విజయం
పాలకొల్లు టౌన్: జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో జాగ్రత్తగా చూసుకోవాలని, ఎంతో కొంత సమాజ సేవ చేయాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానికి దృఢ సంకల్పం తోడైతేనే ఆచరణలో సాధ్యమవుతుంది. ఇదే చేసి చూపించారు పాలకొల్లు పట్టణానికి చెందిన యువ న్యాయవాది కర్రా జయసరిత. మానవ సేవే.. మాధవ సేవ అనే నినాదం ఆమెను ముందుకు నడిపిస్తోంది. ఆమె తన సంపాదనలో కొంత సొమ్మును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో నిరుపేదలకు వనితా వాకర్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణానికి చెందిన కర్రా సూర్యనారాయణ మూర్తి, పద్మావతిల నాలుగో సంతానం జయసరిత. సూర్యనారాయణ మూర్తి వామపక్ష భావాలు కలిగిన కమ్యూనిస్టు నాయకుడిగా, కళాకారుడిగా పట్టణ ప్రజలకు సుపరిచితం. జయసరిత పాలకొల్లు దాసరి నారాయణరావు మహిళా డిగ్రీ కళాశాలలో బీకామ్ డిగ్రీ పూర్తి చేసి అనంతరం తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చదివారు. హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. అనంతరం తల్లిదండ్రులను వృద్ధాప్యంలో దగ్గరుండి చూసుకోవాలనే ఆలోచనతో ఐదేళ్ల క్రితం పాలకొల్లు వచ్చి స్థిరపడ్డారు. అప్పట్నుంచి వనితా వాకర్స్ క్లబ్లో చేరి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2016లో కర్రా జయసరిత పాలకొల్లు వనితా వాకర్స్‌క్లబ్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. అనంతరం 2017లో జిల్లా డెప్యూటీ గవర్నర్‌గా, ప్రస్తుతం జిల్లా గవర్నర్‌గా ఏకగ్రీవంగా రెండు రోజుల క్రితం ఎన్నికయ్యారు. సేవా కార్యక్రమాలకు రూ.20 లక్షలు జయసరిత తను సంపాదించిన సొమ్ములో కొంత భాగం రూ.20 లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్టు చేసి దానిపై వచ్చే వడ్డీతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణంలో నిరాధరణకు గురైన పేద మహిళలను గుర్తించి 50 మందికి ప్రతి నెలా రూ.200 పింఛన్‌ను అందజేస్తున్నారు. వనితా వాకర్స్ క్లబ్లో ప్రస్తుతం 40 మంది సభ్యులతో కలిసి ఏటా నియోజకవర్గ స్థాయిలో పేదలకు నిత్యావసర వస్తువులు, మురికివాడల్లోని పేదలకు దోమ తెరలు, రగ్గులు అందజేస్తున్నారు. అదే విధంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పేద మహిళలకు లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సహకారంతో కంటి ఆపరేషన్లు చేయించి ఉచితంగా కళ్ల జోళ్లు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల విజయనగరం జిల్లా గట్టువలస గ్రామం గరోట అటవీ ప్రాంతంలో పర్యటించి గిరిజన మహిళలకు అవసరమైన మెడికల్ కిట్స్, పౌష్టికాహారం అందజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నడక వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి రోజు అరగంట నడవడం వలన గుండె, ఊపిరితిత్తులు మెరుగుపడి సుగర్, బీపీ వ్యాధులకు దూరంగా ఉంటారని ప్రజలకు వివరిస్తున్నారు. వనితా వాకర్స్‌క్లబ్ ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం తీసుకోవడం, జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, ఐరన్, కాల్షియం ఆహార పదార్థాలు భుజించడంపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు మహిళల కోసం యోగా శిబిరాలను నిర్వహిస్తున్నారు. సేవా భావమే నడిపిస్తోంది వయోభారంతో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి హైకోర్టులో న్యాయవాద వృత్తిని మధ్యలో ఆపేసి పాలకొల్లు వచ్చాను. నాటి నుంచి వనితా వాకర్స్క్లబ్లో చేరి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నడక వలన ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. ఎన్ని కోట్లు సంపాదించినా ఆరోగ్యం లేకపోతే వృథా. నా సంపాదన నుంచి కొంత నిరుపేదల సేవా కార్యక్రమాలకు కేటాయించి సంతృప్తి పొందుతున్నా. – కర్రా జయసరిత, వాకర్స్‌క్లబ్ జిల్లా గవర్నర్ -
సోషల్ వర్క్‌కు ఐదు శాతం మార్కులు
సాక్షి, అమరావతి: ఇక నుంచి విద్యార్ధులకు సామాజిక సేవ (సోషల్ వర్క్)ను తప్పనిసరి చేసి ఐదు శాతం మార్కులు కేటాయించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. విద్యార్ధులపై ఒత్తిడి కలిగించి ఆత్మహత్యలకు పురిగొల్పేలా ఉన్న ప్రస్తుత కార్పొరేట్ విద్యావిధానంలో మార్పులపై సూచనలు చేసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచటంపై కమిటీ సూచనలు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని ముఖ్యమైన కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులతోపాటు అధికారులు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు. ఇటీవల వరుసగా విద్యార్ధుల ఆత్మ హత్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి సోమవారం కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మార్కులు, గ్రేడ్లు కోసం ఆరాటపడుతూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్న బట్టీ విధానాలను విడనాడాలని సూచించారు. విద్యార్ధులను ఒట్టి మరమనుషులుగా మార్చే ప్రస్తుత కార్పొరేట్ విద్యా విధానాన్ని సహించబోనని స్పష్టం చేశారు. విద్యార్ధులను వేధించే పద్దతులను తక్షణం విడనాడాలని, నాలుగైదు రోజుల్లో మార్పు తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించకుంటే కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. నెలకు ఒక సారి ఈ కమిటీతో, మూడు నెలలకు ఒకసారి అన్ని కళాశాలల ప్రతినిధులతో సమీక్షిస్తానని సీఎం చెప్పారు. గడువులోగా 28 ప్రాజెక్టులు పూర్తి కావాలి ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తించిన 28 ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నవంబర్‌లోగా హంద్రీ–నీవా రెండో దశలో భాగమైన మడకశిర బ్రాంచ్ కెనాల్, అడవిపల్లి రిజర్వాయర్, పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. -
మంచిని విత్తండి
వీధి చివర కుక్కపిల్లకు దెబ్బతగిలితే సుధాకర్రావుగారి అబ్బాయికి అయిదేళ్లు ఉంటాయేమో దాన్ని తీసుకెళ్లి కట్టుకట్టించాడు. టీ కొట్టు అతను అక్కడ పనిచేసే కుర్రాడిని బాదుతుంటే రమణిగారి అమ్మాయి ఏడేళ్లు కూడా ఉండవు అతనికి అడ్డం పడిందట. చూశారా... పిల్లల పేర్లు ఎవరికీ తెలియవు. కాని, పిల్లలు చేసిన మంచి పనితో ఆ తల్లిదండ్రులకు ఎంత మంచి పేరు వచ్చిందో. నిజానికి దీనికి రివర్సే కరెక్ట్. ఆ తల్లిదండ్రుల పెంపకంలో ఆ పిల్లలు నేర్చుకున్న మంచితనం అది. తల్లిదండ్రుల ఉపదేశాలకన్నా వారి చేతలను చూసే పిల్లలు మంచి తనాన్ని నేర్చుకుంటారు. అందుకేనేమో పుట్టినప్పుడు అమ్మపోలికో, నాన్నపోలికో అంటారు. పెరిగేటప్పుడు అమ్మ మంచితనమో, నాన్న మంచితనమో అంటారు. ‘ఎందుకు నాన్నా ఆ గింజలన్నీ అలా భూమిలో నాటుతున్నావు?’ ఆశ్చర్యంగా అడిగాడు కొడుకు. ‘ఇవి మొలకెత్తి, పెద్ద మొక్కలై మరిన్ని గింజలు వస్తాయి. వాటిని విత్తితే ఇంకా ఎక్కువ గింజలు వస్తాయి.. అలా అలా మన ఊళ్లో అందరికీ సరిపోయినన్ని గింజలను పండించుకోవచ్చు’ తండ్రి సమాధానం. ‘వీటిలాగే మన దగ్గర ఉన్న బుల్లెట్లను నాటితే ఇంకా బోలెడన్ని బుల్లెట్లు వస్తాయా! వాటితో మనల్ని పీడించే ఆంగ్లేయులందరినీ చంపేయచ్చా?’ ఆవేశంగా అడిగాడు కొడుకు. బ్రిటీష్ ఆధిపత్యం నుంచి భారతీయులను కాపాడుకోవాలనే ఆలోచన ఆ చిట్టి మెదడులో అప్పుడే రూపుదిద్దుకుంది. ఆ పిల్లాడే భగత్‌సింగ్. ఆ పేరే ఆంగ్లేయులను పరుగులు పెట్టించింది. ‘ఏంటి, స్కూల్ టైమ్ అయిపోయింది, ఇప్పుడా నువ్వు వచ్చేది’ బెత్తం ఆ విద్యార్థినిపై నాట్యం చేసింది. శిక్ష పూర్తయ్యాక... ‘ఇంతకీ ఎందుకు లేటయింది?’ అడిగింది టీచర్. ‘రోడ్డు దాటలేక అవస్థపడుతున్న ముసలి అవ్వను దగ్గరుండి రోడ్డు దాటించి వచ్చాను, అందుకే లేటయింది’ బదులిచ్చిందా విద్యార్థిని. బాధించిన బెత్తం చిన్నబోయింది. ఆ చిన్నారి పాఠాలకన్నా గొప్పగా ఎదిగిపోయింది. విశ్వమంతా విస్తరించింది. ప్రపంచాన్నే సేవా మార్గం పట్టించింది. చిన్నవయసులోనే ఎంతో మానవత్వాన్ని చూపిన ఆ మానవతామూర్తే ఆగ్నస్. ప్రపంచ జనులందరూ అమ్మగా ఆరాధించే మదర్ థెరిస్సా. ‘మనిషి సంఘజీవి’ అన్నాడు అరిస్టాటిల్. అందరూ ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించాలంటే అందరూ అందరికోసం అన్నట్టుగా జీవించాలి. అక్కడే భద్రత ఉంటుంది, అక్కడే శాంతి ఉంటుంది. అక్కడే ఇరుకు గోడలు విశాలమై రేపటి భావి జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి. సామాజిక బాధ్యత నుంచే సేవాతత్పరత, మానసిక వికాసం నుంచే మానవత్వం జనించాలి. దీనికి ఇల్లే సరైన పాఠశాల. మొక్కదశలోనే మానవత్వాన్ని, సేవాతత్పరతను పెంపొందించడానికి తల్లిదండ్రులే ఉపాధ్యాయులు కావాలి. చుట్టూ ఏం జరుగుతోంది? నా వంతు సాయం ఎంత వరకు చేయగలను? అనే భావనను వారి మెదళ్లలో నాటుకుపోయేలా చేయడం పెద్దల బాధ్యతే. ఇంట్లో వున్న చెత్తను వీధి బయట పడేస్తే కేవలం మన ఇల్లే శుభ్రమౌతుంది. అదే వీధి చివర్లో ఉన్న చెత్తకుండీ దాకా తీసుకెళ్లి పారబోస్తే? ఆ వీధి మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది. ఆ వీధిలో ఉన్న వారికి అసౌకర్యాన్ని దూరం చేయడం దగ్గర్నుంచే మొదలుపెట్టచ్చు. చేసే పనికి సామాజిక బాధ్యత జోడిస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయనేది పిల్లలకు బాల్యదశలో ఇంటి వద్ద నేర్పే పాఠాలుగా మారాలి. చిన్న మార్గం... సమాజసేవ అనగానే ‘డబ్బుతో ముడిపడి ఉంది, అది బాగా సంపన్నులు మాత్రమే చేసే పని అని, సాయం చేయాలంటే మన స్థాయి సరిపోదు’ అనే ఆలోచన సరికాదు. మీరలాంటి భావాలతో ఉంటే అది మీ పిల్లలపై కూడా ప్రభావం చూపిస్తుంది. తనకు నిరుపయోగంగా మిగిలినవి, తోటివారికి ఉపకరించేవి ఉంటే వాటిని పిల్లల చేతులమీదుగానే అవసరంలో ఉన్న వారికి అందజేయచ్చు. నేటి బాలలే రేపటి సంఘసేవకులు కావడానికి ఓ చిరు మార్గం చూపినట్టుంటుంది. స్కూళ్లు మొదలయ్యే నాటికి పిల్లలు వాడేసిన దుస్తులు, పుస్తకాలు బీదపిల్లలకు ఇప్పించవచ్చు. టీచర్లు తమకు నేర్పిన విద్యని ఎవరికైనా చెప్పాలని విద్యార్థులు ఉబలాటపడుతుంటారు. దీనిని అనుకూలంగా మార్చుకుని వారిచేత నిరుపేద పిల్లలకు చదువు చెప్పిస్తే ఆ కళ్లల్లో కనిపించే ఆనందం దేనితోను సరితూగదు. పసిపిల్లవాడు తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఆ అడుగులను చూసి ఆనందిస్తూ, వాటిని సరిదిద్దుతాం. అలాగే వారు జీవితంలో ఎదగడానికి, సమాజం గురించి అవగాహన కలగడానికి, చేతనైనంత సేవచేయడానికి పొరపాట్లను దిద్దుతూ మార్గనిర్దేశకం చేసేది తల్లిదండ్రులే. పిల్లలు పెద్దయ్యాక తమ తల్లిదండ్రుల్లా కావాలనుకునే విధంగా ఆదర్శంగా నిలవాలి. అలా చేయగలిగితే తల్లిదండ్రులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించినట్టే. చెప్పకుండా చెప్పే విషయాలు పెద్దలు ఏ పని చేస్తే పిల్లలు అది చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అమ్మ వంట చేస్తే తామూ చేయాలని ఉబలాటపడే పిల్లలు, నాన్నలా మోటార్‌బైక్ నడపాలని ఉత్సాహపడతారు. వారికి మంచేదో, చెడేదో తెలియదు. ఇంట్లో పెద్దల ప్రవర్తన ఎలా ఉంటే పిల్లలు అదే నేర్చుకుంటారు. ఇవేవీ పుస్తకాల్లో ఉండవు, చదివి నేర్చుకోవడానికి. తమ చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను ప్రాక్టికల్‌గా చూసి నేర్చుకుంటారు. తామూ పెద్దయ్యాక అలాగే అవ్వాలని కోరుకుంటారు. తండ్రి తన తల్లిని గౌరవిస్తే అది చూసి పిల్లవాడు నేర్చుకుంటాడు. అమ్మను ఎంత బాగా చూసుకోవాలో తెలుసుకుంటాడు. దేశాన్ని కూడా కన్నతల్లిలా చూసుకోవాలన్న భావన పెరిగేది కూడా ఇక్కడే. ఇంటి నుంచే సమాజసేవ చేయాలన్న ఆలోచన పుడుతుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కూరగాయల తొక్కలు తీసుకెళ్లి మొక్కలకు వేయండి. దీనివల్ల పిల్లలు మొక్కలకు వేస్టేజ్ ఎరువుగా పనిచేస్తుందన్న మాట అని అర్థం చేసుకొని అదేవిధంగా చేస్తారు. ట్యాప్ విప్పి పనులు చేయడం కాకుండా బకెట్లోనో, గిన్నెలోనో నీటిని పట్టి అవసరమైనంతే వాడుకోవాలి. ఇది చూసి పిల్లలు కూడా నీటి విలువ తెలుసుకుంటారు. ఇంట్లో ఎక్కడ తీసిన వస్తువులను అక్కడ పెడుతూ ఉంటే పిల్లలు కూడా అలా చేయడం అలవర్చుకుంటారు. గదిలో నుంచి బయటకు వెళ్లేటప్పుడు కరెంట్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లాలి. అది చూసి పిల్లలకు కరెంట్ ఆదా చేయాలని తెలుస్తుంది. పొట్టిగా అయిపోయిన దుస్తులు, చెప్పులు, షూస్, బ్యాగులు... మొదలైనవి బాగుచేసి పనివాళ్లకు ఇవ్వడం, లేదంటే పేదవాళ్లకు ఇవ్వడం చేయాలి. ఇది చూసి పిల్లలకు ‘లేనివాళ్లకు సహాయపడాలి’ అన్న ఆలోచన కలుగుతుంది. పిక్నిక్, సినిమా, పార్కులకు వెళ్లినప్పుడు చాక్లెట్ రాపర్లు, ఐస్‌క్రీమ్ కప్పులు లాంటివి తప్పకుండా డస్ట్‌బిన్‌లో వేయాలి. పెద్దలను పిల్లలు అనుసరిస్తుంటారని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.బస్సులో వెళ్లినప్పుడు, ఏదైనా బిల్లు కడుతున్నప్పుడు వయసులో పెద్దవాళ్లు, అంగవికలురు, గర్భవతులు ఉంటే వారికి సీట్ ఇవ్వడం, దారి ఇవ్వడం వంటివి చేయాలి. పిల్లలకు అలాంటి వాళ్లకు హెల్ప్ చేయాలనే ఆలోచన కలుగుతుంది.అంగవైకల్యంతో ఎవరైనా బాధపడుతుంటే మనం వారి గురించి చులకనగా, జాలిగా మాట్లడం చేయకూడదు. వాళ్లని మనుషుల్లానే భావించి సరైన గౌరవం ఇస్తే పిల్లలు కూడా అదేవిధంగా గౌరవించడం నేర్చుకుంటారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పోలీసుల శ్రమదానం
అల్లాదుర్గం: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అల్లాదుర్గం చౌరస్తాలో రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అల్లాదుర్గం ఎస్ఐ మహ్మద్ గౌస్ స్పందించారు. సోమవారం తన సిబ్బందితో కలిసి శ్రమదానం చేపట్టి గుంతలను పూడ్చారు. కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశం, కానిస్టేబుళ్లు నర్సింలు, మస్తాన్, గంగాధర్, రాంపూర్ రాజు, మోహన్‌రాథోడ్ పాల్గొన్నారు. -
90 సార్లు రక్తదానం
* గవర్నర్ నుంచి అవార్డు * 250కి పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించిన దేవణ్ణ బళ్లారి (తోరణగల్లు) : సమాజం నాకేమిచ్చిందని ఆలోచించేవారు కొందరైతే సమాజానికి మనమేమిచ్చామని ఆలోచించేవారు మరికొందరు. తన పరిధిలో ఎంతో కొంత సమాజసేవ చేయాలనుకొనే తపనగలవాడు బీ.దేవణ్ణ. వృత్తి రీత్యా బ్యాంకులో హెడ్‌క్యాషియర్ అయినా ప్రవృత్తిగా సమాజసేవలో రక్తదాన మార్గాన్ని ఎంచుకొన్నాడు. దీంతో పేరు ముందున్న ఇంటి పేరు బీ(బసన్న) కాస్తా బ్లడ్ దేవణ్ణగా మారింది. ఇప్పుడు నగర వాసులు బళ్లారి బ్లడ్ దేవణ్ణగా పిలుస్తారు. విద్యార్థి దశ నుంచే రక్తదానం బళ్లారిలోని ఎం.బసన్న, సావిత్రమ్మ దంపతులకు 1963లో జన్మించిన దేవణ్ణ 1981లో ఐటీఐ చదువుతున్నప్పుడు సుధాక్రాస్ వద్ద ప్రమాదం జరిగిన ఓ విద్యార్థిని ప్రాణాలను కాపాడటానికి మొదటిసారిగా రక్తదానం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తరచూ ఆపదలో ఉన్న బాధితులకు రక్తదానం చేయడం ఆనవాయితీగా మార్చుకొన్నాడు. కాన్పుకు వచ్చే మహిళలు, ప్రమాదాల్లో గాయపడిన బాధితులను ఆదుకోవడం కోసం తానొక్కడే కాకుండా శిబిరాలను ఏర్పాటు చేసి అనేకమందితో రక్తదానం చేయిస్తున్నారు. ఇప్పటి వరకు 90 సార్లు రక్తదానం చేశాడు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 250కి పైగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి 12000 యూనిట్ల రక్తాన్ని సేకరించి విమ్స్ బ్లడ్‌బ్యాంకుకు అందజేశారు. ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలను నిర్వహించాడు. అవార్డులు, రివార్డులు బ్లడ్ దేవణ్ణ రక్తదాన సేవా కార్యక్రమాలను గుర్తించి 2007లో డాక్టర్ రాజ్‌కుమార్ ప్రశస్తిని కన్నడ సినీ నిర్మాత దొరే భగవాన్ చేతుల మీదుగా అందుకొన్నారు. 2012లో జనతా సేవాదళ్ సంస్థ ప్రశస్తి ఇచ్చి సన్మానించింది. గతంలో జిల్లాధికారిగా పని చేసిన బిస్వాస్ 2014లో జిల్లా స్థాయి ఉత్తమ రక్తదాతగా ప్రశస్తిని అందజేశారు. అదే సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బెంగుళూరులో ప్రశస్తిని అందుకొన్నాడు. 2015 మే 8న రెడ్‌క్రాస్ డే సందర్భంగా రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బెంగుళూరు రాజ్‌భవన్‌లో అప్పటి గవర్నర్ వాజుబాయ్ రుడాబాయ్ వాలా చేతుల మీదుగా ప్రశస్తితో పాటు జ్ఞాపికను అందుకొన్నారు. ఇదే సంవత్సరం ఎస్బీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చీఫ్ మేనేజర్ ప్రభాకర్ జ్ఞాపికను అందజేసి సత్కరించారు. యువత రక్తదానం చేయాలి యువత వ్యసనాలకు బానిస కాకుండా అమూల్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యవంతులే నిజమైన కోటీశ్వరులు. రక్తదానం వల్ల ఆరోగ్యం, నూతనోత్సాహం, ఉత్తేజం కలుగుతుంది. యువత రక్తదానాన్ని సమాజ సేవగా భావించి రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. ఒక దాత ఇచ్చే రక్తం నలుగురి ప్రాణాలను కాపాడుతుందని, అందువల్ల రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని యువతను బ్లడ్ దేవణ్ణ కోరుతున్నారు. -
సామాజిక బాధ్యతతో పనిచేయాలి
జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి భవానిచంద్ర తిమ్మాపూర్: ప్రతీ వ్యక్తి సమాజంలో చెడును దూరం చేయడానికి సామాజిక బాధ్యతతో పనిచేయాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, జడ్జి జి.భవాని చంద్ర సూచించారు. మండలంలోని అల్గునూర్ గ్రామ పంచాయతీలో న్యాయ సేవా సదస్సును శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ యువత చెడువైపు వెళ్లడంతో కేసులు చాలా వస్తున్నాయని, ఇవన్నీ సమాజంపైనే ప్రభావాన్ని చూపుతున్నాయని అన్నారు. పేదరికంతో ఎక్కువ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. పిల్లల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు. పిల్లలతో వాహనాలు నడిపించవద్దని తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సినిమా, టీవీల ప్రభావం పిల్లలపై పడుతుందన్నారు. చెడుతో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. చిన్నచిన్న కేసుల విషయంలో రాజీమార్గాలు చూసుకోవాలని తెలిపారు. ప్రతీ వ్యక్తి బాగుండాలని, పక్కవారు బాగుండేలా చూడాలని ప్రతీ ఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు. చట్ట ప్రకారం భూములు రిజిష్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసుకోవాలని, ప్రామిసరీనోటు ద్వారా అప్పులు ఇవ్వాలని, తెల్లకాగితాలపై సంతకాలు పెట్టవద్దని సూచించారు. అల్గునూర్‌లో పలువురు భూసమస్యలు సృష్టిస్తున్నారని జడ్జికి స్థానికులు ఫిర్యాదుచేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చిందం కిష్టయ్య, ఎంపీటీసీ సింగిరెడ్డి స్వామిరెడ్డి, న్యాయ సలహాదారు వెంకటరమణయ్య పాల్గొన్నారు.