
మంగళవారం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనట్లుగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాబితాలో102 ఏళ్ల శకుంతల చౌధురి పేరు కూడా ఉంది. ‘అస్సాంలో వందేళ్లు దాటిన ఏకైక మహిళ శకుంతల’ అనే మాటపై భేదాభిప్రాయాలు ఉండొచ్చుగానీ ‘ఆమె అలుపెరగని సమాజ సేవిక’ అనే వాస్తవాన్ని ఎవరూ విభేదించరు.
అస్సాంలో ఏడుదశాబ్దాలకు పైగా ఆమె పేరు ‘సామాజిక సేవ’కు ప్రత్యామ్నాయంగా మారింది. గౌహతిలోని ‘కస్తూర్బా ఆశ్రమం’ కేంద్రంగా శకుంతలమ్మ ఎన్నో సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామ సేవాకేంద్రాలను స్థాపించడం ద్వారా ఎన్నో గ్రామాల అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచింది. ‘స్త్రీ శక్తి జాగారణ్’ ఉద్యమంతో స్త్రీల అక్షరాస్యతకు కృషి చేసింది. స్త్రీ సాధికారత వైపు అడుగులు వేయించింది.
శకుంతలమ్మ సుదీర్ఘ ఉపన్యాసాలేవి ఇవ్వదు. చాలా నిశ్శబ్దంగా సేవాకార్యక్రమాలు చేస్తూ పోతుంది. ఈ విధానం ఎంతోమందికి ఆదర్శం అయింది.
‘మనం మాట్లాడడం కంటే మనం చేసే పని మాట్లాడితేనే మంచిది’ అంటారు ఆమె.
గాంధీజి, వినోభావే సిద్ధాంతాలతో ప్రభావితం అయిన శకుంతల చిన్న వయసులోనే సమాజసేవను ఊపిరిగా మలుచుకుంది.
‘శకుంతలమ్మను వ్యక్తి అనడం కంటే మహావిశ్వవిద్యాలయం అనడం సరిౖయెనది. ఆమె సైద్ధాంతిక జ్ఞానం, సేవాదృక్పథం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అంటారు ఆమె అభిమానులు.
‘సహాయం కోసం శకుంతలమ్మ దగ్గరికి వెళ్లినప్పుడు, పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్లినట్లుగా అనిపించదు. మన ఇంటి పెద్ద దగ్గరికి ఆత్మీయంగా వెళ్లినట్లుగా అనిపిస్తుంది’ అంటారు సామాన్యులు.
శకుంతలమ్మకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న...
‘ఈ వయసులోనూ చురుగ్గా ఉంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?’
ఆమె చెప్పే సమాధానం: ‘సమాజసేవ’
శకుంతలమ్మ ఇచ్చిన చిన్న సమాధానంలో ఎంత పెద్ద తత్వం దాగి ఉందో కదా!
Comments
Please login to add a commentAdd a comment