
దేశంలో వివిధ రకాల ఆలయాలున్నా వాటన్నిటిలోనూ ముఖ్యమైనది.. విశిష్టమైనది కామాఖ్య... ఆలయంలో పూజలు చేసే విధానం.. దర్శన నిబంధనలు కూడా ఇతర ఆలయాలకు భిన్నంగానే ఉంటుంది. దక్షుని యజ్ఞావటికలో ఆత్మార్పణ చేసుకున్న సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు విలయతాండవం చేశాడు. ఆ తండవానికి ముల్లోకాలూ వణికిపోయాయి. దీంతో శివుని తాండవం ఆపడానికి సతీదేవిని విష్ణుమూర్తి తన చక్రంతో ఖండఖండాలుగా చేశారు. ఆ తరుణంలో సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ శక్తి పీఠాలుగా పూజలందుకుంటున్నాయి. ఇందులో 18 ముఖ్యమైనవాటిని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. అందులో సతీదేవి జననాంగం పడిన ప్రాంతమే ఈ కామాఖ్య.
ఇక్కడ అమ్మవారు మహిళల జననాంగం రూపంలోనే దర్శనం ఇస్తారు. ముఖ్యంగా ఈ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారన్న విశ్వాసం ఉంది. సంతానం లేనివారు సైతం ఈ ఆలయాన్ని దర్శించడం ద్వారా తమ ఆశలు నెరవేర్చుకుంటారు. మహిళలకు సంబంధించి సమస్యల నుంచి సైతం కామాఖ్య దర్శనం విముక్తి కలిగిస్తుందని విశ్వాసం. ఈ ఆలయాన్ని ఏటా నాలుగు రోజులపాటు మూసి ఉంచుతారు.
ఏటా ఆషాఢ మాసంలో ఏడో రోజు నుంచి పదోరోజు వరకు అమ్మవారు ఋతుస్రావం లో ఉంటారని భావించి ఆ రోజుల్లో భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఈ 2025లో జూన్ 22 నుంచి 25 వరకు ఆలయం తలుపులు మూసేసి ఉంచుతారు. ఆ తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ సందర్భంగా అంబుబాచీ మేళా పేరిట భారీగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ నాలుగు రోజులు ఆలయ గర్భ గుడిని తెల్లని వస్త్రాలతో .. అమ్మవారి ప్రతిరూపాన్ని తెల్లని వస్త్రాలతో కప్పి ఉంచుతారు. నాలుగో రోజు ఆలయం తెరవగానే ఆ తెల్లని వస్త్రాలు కాస్తా ఎర్రబారతాయి..అంతేకాకుండా. అమ్మవారి ప్రతిరూపం ( జననాంగం) వద్ద నిత్యం ప్రవహించే నీటి ఊట కూడా ఆ రోజుల్లో ఎర్రగా మారుతుంది.
ఎర్రని వస్త్రం మహా ప్రసాదం
ఆ రోజుల్లో ఎర్రగా మారిన వస్త్రాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి భక్తులకు అందజేస్తారు. ఈ వస్త్రం ఇంట్లో.. పూజా మందిరంలోనుంచుకుంటే శుభాలు కలుగుతాయని.. మహిళల ఆరోగ్యం బాగుంటుందని భక్తుల విశ్వాసం.
పాంచ్ బలి
అమ్మవారి ఆలయంలో ఇంకో విశిష్టమైన బలి పూజ. జరుగుతుంది. పాంచ్ బలి.. అంటే కామాఖ్యకు ఐదు రకాల పదార్థాలను అర్పిస్తారు. ఎనుబోతు.. మేక.. బాతు ఈ మూడింటిని ఆలయంలో బలి ఇస్తారు..వీటితోబాటు బూడిద గుమ్మడి కాయను. చెరుకు గడను సైతం అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఐదింటిని కలిపి పాంచ్ బలి అంటారు. మనోభీష్టం సిద్ధించడానికి కొంతమంది ఇలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు. సింహాచలం.. వేములవాడలో కోడె మొక్కులు మొక్కుకుని స్వామికి దూడలు సమర్పించినట్లు ఇక్కడ భక్తులు అమ్మవారికి మేకలు సమర్పించి ఆలయంలో వదిలేస్తారు. అవి ఆలయంలో సందడి చేస్తూ జనం మధ్యలో తిరుగుతుంటాయి.
ఉచిత దర్శనం కోసం కనీసం ఐదు గంటల సమయం పడుతుంది. లేదా పరిమిత సంఖ్యలో ఇచ్చే రూ.500 టికెట్ల కోసం వేకువజామున లైన్‌లో ఉంటే తెల్లవారేసరికి ఆ టిక్కెట్ తీసుకుని రెండు గంటల్లో దర్శనం చేసుకోవచ్చు. దీంతోబాటు బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉండే కొండపై ఉండే ఉమానంద శివాలయాన్ని లాంచీలో వెళ్ళి చూసి రావడం ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. గౌహతికి దేశంలోని అన్ని మూలల నుంచి రైళ్లు.. విమాన సౌకర్యాలు ఉన్నాయి. హోటళ్లు.. లాడ్జిలు.. టాక్సీలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటాయి.
-కామాఖ్య నుంచి సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment