గౌహతి: అస్సాంలోని గౌహతిలో ఒళ్లు జలదరించే ఘటన చోటుచేసుకుంది. మూడు నెలలుగా తల్లి మృతదేహంతో పాటు ఒకే ఇంట్లో ఉంటున్న కుమారునికి సంబంధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన గౌహతిలోని జ్యోతికుచి ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలిని పూర్ణిమా దేవి(75)గా పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితమే ఆమె మృతి చెందివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్ణిమా దేవి తన కుమారుడు జైదీప్ దేవ్‌తో కలిసి ఈ ఇంటిలో కొన్నేళ్లుగా ఉంటోంది. జైదీప్ దేవ్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు.
మృతురాలి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె కుమారుడు జైదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు బృందం ఇంట్లో ఆధారాలు సేకరించారు. జైదీప్ మామ, అమ్మమ్మలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
పూర్ణిమా దేవి ఇంటికి సమీపంలో ఉంటున్న వారు మీడియాతో మాట్లాడుతూ మృతురాలి కుమారుడు జైదీప్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అతని ప్రవర్తన వింతగా ఉండేదని తెలిపారు. అతని తండ్రి చనిపోయాడని, అప్పటి నుంచి తల్లిని బయటకు రానివ్వలేదని, ఎవరైనా అడిగితే తల్లి ఆరోగ్యంగా ఉందని చెప్పేవాడన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వెంటపడిన కుక్క.. హోటల్ పైనుంచి పడి యువకుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment