శాక్తేయులకు అత్యంత ఆరాధనీయమైనది కామరూప లేదా కామాఖ్యాదేవి ఆలయం. ఇక్కడే దశమహావిద్యలనే పేరు గల కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, ఛిన్నమస్త, భైరవి, ధూమావతి, కమలాంబిక, షోడశి, మాతంగి అనే పది వేర్వేలు ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయమూ ఒక్కో విద్యకు ప్రసిద్ధమైనది. ప్రధాన ఆలయం కామాఖ్యాలయమే.
సతీదేవి ఆత్మత్యాగానంతరం తీవ్రమైన వేదనతో తపస్సమాధిలో లీనమై ఉన్న పరమేశ్వరుని మనస్సును మార్చాలని దేవతలు సంకల్పిస్తారు. ఇందులో భాగంగా మన్మథుడు సమయం చూసుకుని, పూలబాణాలు వేసి, ఆయనకు తపోభంగం కలిగిస్తాడు. దాంతో ముక్కంటి తన మూడవకంటిని తెరచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. మన్మథుడికే కాముడు అనే పేరు. కాముణ్ణి దహించిన ప్రదేశం కనుక దీనికి కామాఖ్య అనే పేరొచ్చిందంటారు.
ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తిరిగి రూపాన్ని పొందాడు. అయితే కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే రూపంతో కనిపిస్తాడు. ఇక్కడి బ్రహ్మపుత్రానదిలో భస్మకూటమనే పర్వతం ఉండటం శివుడు మన్మథుని భస్మం చేయడం, తిరిగి ఆయన రూపం పొందాడనడానికి ప్రతీకగా నిలుస్తుంది.
ప్రత్యేకతలకు ఆలవాలం...
ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్యమతస్థుల దాడుల్లో ధ్వంసం కాగా, 17వ శతాబ్దంలో కుచ్ బీహార్ రాజు నరనారాయణుడు పునర్నిర్మించాడని శాసనాధారాలున్నాయి. తేనెపట్టు ఆకారంలో ఉన్న ఆలయ శిఖరం గణేశుడు తదితర దేవీ దేవతల శిల్పాలతో కనువిందు చేస్తుంది. మాంత్రికులకు, తాంత్రికులకు, వామాచారులకు, క్షుద్రపూజలు చేసేవారికి ఈ ఆలయమే ఆధారం.
కారణం ఇది సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం. మూడు మంటపాలుగా నిర్మించి ఉంటుంది. అందులో మొదటి ప్రాకారంలో గుహలా ఉండే గర్భాలయంలో యోనిచిహ్నం ఉన్న నల్లటి బండరాయి ఉంటుంది. దానికే పూజలు జరుగుతాయి.అయితే ఆ రూపం కనిపించకుండా భక్తుల దర్శనానికి ముందే పూలతో నింపేస్తారు. ఆ గుహ లోపల రాతి మీద ఎప్పుడూ జల వూరుతూ ఉంటుంది. అందువల్ల మూలవిరాట్టు ఎప్పుడూ తడిగా ఉంటుంది. గర్భాలయం అంతా చిత్తడిగా, జారుడుగా ఉంటుంది. ఆలయం బయటే శీతలాదేవి సన్నిధి ఉంటుంది. దీర్ఘవ్యాధులు ఉన్నవారు ఈమెను సేవించుకుంటే వాటినుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి.
పూజలు– ఉత్సవాలు...
అమ్మవారికి రోజూ చేసే పూజలు గాక దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా దుర్గాపూజ జరిపిస్తారు. ఇవిగాక ఫాల్గుణ మాసంలో దుర్గాడియుల్ అని దుర్గాదేవికి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా మానసాపూజ, పోహన్ బియా అంటే పుష్యమాసంలో కామేశ్వరుడికీ, కామేశ్వరీదేవికీ కల్యాణం జరిపిస్తారు.
పసిపిల్లవానికి పాలు ఇస్తున్నట్లుగా ఉండే విగ్రహం పశ్చిమ ద్వారాన ఉంటుంది. అమ్మవారు భక్తులను ఎల్లప్పుడూ కన్నతల్లిలా కాపాడుతూ ఉంటుందని చెప్పేందుకు ప్రతీక ఇది. ఈ ఆలయంలో అమ్మవారు సంవత్సరానికి ఒకసారి జూన్ రెండవవారంలో బహిష్టు అవుతారు. స్థానికులు దీనిని అంబుబాషి సమయం అంటారు. ఈ నాలుగురోజులపాటు ఆలయాన్ని మూసి ఉంచి, అయిదోరోజున తలుపు తెరుస్తారు. అంబుబాషి రోజులలో అమ్మవారి ఆలయంతోపాటు మిగతా ఆలయాలన్నిటినీ కూడా మూసి ఉంచుతారు.
గౌహతి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో చట్టగామ్‌లో శీతకుండం దగ్గర గల చంద్రశేఖర పర్వతంపై భగవతి అమ్మవారి ఆలయం ఉంది. కుండం లో నిత్యం అగ్ని ప్రజ్వరిల్లే శక్తి పీఠం ఇది. నరకాసురుడు కామాఖ్యాదేవిని ఆరాధించటం వల్లే అంతటి బలపరాక్రమాలు పొందగలిగాడని పెద్దలు చెబుతారు.
అమ్మవారు, పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం కామకేళిలో తేలియాడుతుంటారని, అందువల్లే అమ్మవారికి కామాఖ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. అలాగే శివపార్వతులు ప్రతిరోజూ రాత్రిపూట ఆలయం అంతర్భాగంలో సర్పాల రూపంలో జూదం ఆడుతుంటారని విశ్వాసం. ఈ క్షేత్రంలోనే మరో ఐదు శైవాలయాలున్నాయి. అవి అఘోరేశ్వర, అమృతేశ్వర, కోటిలింగేశ్వర, సిద్ధేశ్వర, కామేశ్వరాలయాలు.
కామాఖ్యలో ఇంకా ఏమేం చూడవచ్చు..?
కామాఖ్యాలయం నీలాచలం కొండలపై ఉందని తెలుసుకదా, అక్కడే భువనేశ్వరీ ఆలయం, వనదుర్గాలయం ఉన్నాయి. పైన చెప్పుకున్న ఐదు శివాలయాలూ, దశమహావిద్యలకూ సంబంధించిన ఆలయాలూ ప్రధానాలయానికి చేరువలోనే ఉంటాయి. ఇవిగాక శుక్లేశ్వర కొండలపై జనార్దనాలయం, లక్ష్మీమందిరం, గ్రామదేవతా మందిరం, చక్రేశ్వరాలయం, విశ్వకర్మ మందిరం, కాళీపురంలో శివమందిరం, మహావీర్ అక్రాలయం, శని మందిరం, గోపాల మందిరం, కాళీమందిరం, హనుమాన్ మందిరం ఉన్నాయి.
ఇంకా లోకనాథాలయం, శీతలామందిరం, నామ్ ఘర్ ఆలయం, గోశాల నేపాలీ మందిరం, రామ్ ఠాకూర మందిరం ఉన్నాయి. ఇవిగాక దిహింగ్ సరస్సు, బుద్ధ మందిరం, నౌకామందిరం, ఎల్విజిస్ మ్యూజియం, తోరుణామ్ ఫుకాన్ పార్క్, శ్రీ జలరామ్ మందిరాలను కూడా సందర్శించవచ్చు.
ఆలయానికి ఎలా వెళ్లాలి..?
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి గువహతికి వెళ్లేందుకు, బస్సులు, రైళ్లు, విమానాలూ ఉన్నాయి. గువహతి రైల్వేస్టేషన్ నుంచి 6 కిలోమీటర్లు, ఏర్΄ోర్టునుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలున్నాయి.
పిలవని పేరంటానికి వెళ్లి, కన్నతండ్రి చేత ఘోరపరాభవం పొందిన సతీదేవి, ఆ అవమాన భారంతో ఆత్మత్యాగం చేస్తుంది. ఇది తెలిసి, అక్కడకు చేరుకున్న శివుడు ఆమె శరీరాన్ని భుజాలమీదకు ఎత్తుకుని రుద్రతాండవం చేస్తుంటాడు. సతీదేవి శరీరం అక్కడ ఉన్నంతసేపూ శివుడిని ఆప శక్యం కాదని తెలిసిన విష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు చేస్తాడు.
అవి 108 ఖండాలుగా భూలోకంలోని వివిధ ప్రదేశాలలో పడతాయి. ఆమె శరీరంలోని కీలకమైన భాగాలు పడిన ప్రదేశాలలో తిరిగి అత్యంత కీలకమైన ప్రదేశాలను గుర్తించి, అలయాలు నిర్మించారు పూర్వులు. అవే అష్టాదశ శక్తిపీఠాలు. వాటిలో అమ్మవారి యోనిభాగం నీలాచలం కొండలపై పడింది. అదే కామాఖ్యా పీఠంగా గుర్తింపు పొంది, కామాఖ్యాదేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది.
ఇతర విశేషాలు..
ఎగుడు దిగుడు కొండలు, గుట్టలు, లోయలు ఉండే ఈ ప్రదేశానికి అసమ దేశం అని పేరు. అసమ కాస్తా అస్సాంగా, అసోమ్‌గా రూపాంతరం చెందింది. శ్రీహరి కొలువై ఉన్న ప్రదేశం కాబట్టి దీనికి హరిక్షేత్రం అని కూడా పేరు.
అందుకే అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రం లో హరిక్షేత్రే కామరూపా అని ఉంటుంది. ఇక్కడ అమ్మవారి రూపం కానీ, విగ్రహం కానీ ఏమీ ఉండవు. కామాఖ్యాదేవికి నలుపు రంగంటే ప్రీతి. జంతు బలులు ఇక్కడ పరిపాటి. అదీ నల్లటి జంతువులనే బలివ్వాలి. ఆడ జంతువులను వధించరాదని నియమం. ఇది అమ్మవారి యోనిభాగం పడిన ప్రదేశం కావడం వల్ల శివుడు, అమ్మవారు నిత్యం కామకేళిలో మునిగి తేలుతూ ఉంటారని ప్రతీతి.
– డి.వి.ఆర్. భాస్కర్
(చదవండి: మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!)
Comments
Please login to add a commentAdd a comment