Kasturba
-
Students Hair Cuts: కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరింపు..
-
కస్తూర్బాలో ఆకలి కేకలు..! విద్యార్థులు అర్ధాకలితో..
మహబూబ్‌నగర్: బాలానగర్ మండలంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో గురువారం విద్యార్థులు ఆకలితో అలమటించారు. సరైన భోజనం పెట్టకపోవడంతో విసిగిపోయిన విద్యార్థినులు ఒక్కసారిగా పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 384 మంది ఉన్నారు. వీరికి ప్రతిరోజు వంట చేసేందుకు ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉంది. అయితే రెండేళ్లుగా ఇద్దరు సిబ్బంది లేకపోవడంతో ముగ్గురే వంట చేస్తున్నారు. ఇటీవల ఒకరు పని మానేసి వెళ్లిపోగా.. మిగిలిన ఇద్దరు బుధవారం సాయంత్రం నుంచి అనారోగ్యం కారణంగా సెలవు పెట్టారు. దీంతో రాత్రి భోజనం వండకపోవడంతో విద్యార్థులు బొరుగులు తిని అర్ధాకలితో పడుకున్నారు. గురువారం ఉదయం ప్రిన్సిపాల్ జ్ఞానేశ్వరి ఎలాగోలా ఉప్మా చేసి అందించారు. అయితే అది రుచిగా లేకపోవడంతో చాలా మంది తినలేదు. మధ్యాహ్నం కూడా వంట చేసే పరిస్థితి లేకపోవడంతో పాటు అప్పటికే ఇద్దరు విద్యార్థినులు నీరసించి పడిపోయారు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థులు పాఠశాల ఆవరణలో ధర్నాకు దిగారు. సమస్యలను పలుసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని విద్యార్థులు తెలిపారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్యలకు పరిష్కారం చూపే వరకు ఇక్కడే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారు. పరిష్కారం కాని సమస్యలు పాఠశాలలో నిత్యం అందించే ఆహారాన్ని నాసిరకంగా వడ్డిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పాఠశాలకు తనిఖీ సమయంలో వచ్చిన అధికారులకు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయంలో సమస్యలు, ఇబ్బందులు చెబితే తర్వాత తమపై మండిపడుతారన్నారని ఆరోపించారు. దీనికి తోడు తనిఖీలకు సంబంధించి ముందస్తు సమాచారం ఉండడంతో ఆ సమయంలో ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తారన్నారు. ఇతర రోజుల్లో నీళ్లతో కూడిన కూరలు వడిస్తారని విద్యార్థులు చెబుతున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న మినరల్ వాటర్ పనిచేయకపోవడంతో బోరు నీళ్లే తాగుతున్నామని తెలిపారు. గదులకు కిటీకీలు లేక వర్షం పడితే విద్యార్థులు నిద్రపోలేని పరిస్థితి ఉందన్నారు. పాఠశాలలో బాత్రూంలు ఉన్నా కొన్నింటికి తలుపులు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. వంట చేసే ఆయాలు తమతో సేవలు చేయించుకుంటారని ఈ విషయాన్ని ప్రశ్నిస్తే ఉపాధ్యాయులకు చెప్పి బెదిరిస్తారని తెలిపారు. పాఠశాల ప్రహరీ గోడ దూకి ఆకతాయిలు ఆవరణలోకి ప్రవేశిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా మొక్కుబడిగా 4, 5 సార్లు పాఠశాలకు వచ్చి పరిశీలించారే గానీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాగా.. గురువారం విద్యార్థినులను చూసేందుకు వచ్చిన కొందరు తల్లిదండ్రులు పరిస్థితిని గమనించి..పాఠశాల ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ నాయకులు అక్కడకు చేరుకుని వారికి మద్దతుగా నిలిచారు. ప్రిన్సిపాల్, సిబ్బందిపై మండిపడిన వారు సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అధికారుల విచారణ.. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి బాబురావు పాఠశాల వద్దకు చేరుకుని విచారించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బాలికలకు భోజనం పెట్టడంతో పాటు విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న డీఈఓ రవిందర్ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
-
వయసు: 102 ఆరోగ్యరహస్యం: సమాజసేవ
మంగళవారం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనట్లుగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాబితాలో102 ఏళ్ల శకుంతల చౌధురి పేరు కూడా ఉంది. ‘అస్సాంలో వందేళ్లు దాటిన ఏకైక మహిళ శకుంతల’ అనే మాటపై భేదాభిప్రాయాలు ఉండొచ్చుగానీ ‘ఆమె అలుపెరగని సమాజ సేవిక’ అనే వాస్తవాన్ని ఎవరూ విభేదించరు. అస్సాంలో ఏడుదశాబ్దాలకు పైగా ఆమె పేరు ‘సామాజిక సేవ’కు ప్రత్యామ్నాయంగా మారింది. గౌహతిలోని ‘కస్తూర్బా ఆశ్రమం’ కేంద్రంగా శకుంతలమ్మ ఎన్నో సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామ సేవాకేంద్రాలను స్థాపించడం ద్వారా ఎన్నో గ్రామాల అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచింది. ‘స్త్రీ శక్తి జాగారణ్’ ఉద్యమంతో స్త్రీల అక్షరాస్యతకు కృషి చేసింది. స్త్రీ సాధికారత వైపు అడుగులు వేయించింది. శకుంతలమ్మ సుదీర్ఘ ఉపన్యాసాలేవి ఇవ్వదు. చాలా నిశ్శబ్దంగా సేవాకార్యక్రమాలు చేస్తూ పోతుంది. ఈ విధానం ఎంతోమందికి ఆదర్శం అయింది. ‘మనం మాట్లాడడం కంటే మనం చేసే పని మాట్లాడితేనే మంచిది’ అంటారు ఆమె. గాంధీజి, వినోభావే సిద్ధాంతాలతో ప్రభావితం అయిన శకుంతల చిన్న వయసులోనే సమాజసేవను ఊపిరిగా మలుచుకుంది. ‘శకుంతలమ్మను వ్యక్తి అనడం కంటే మహావిశ్వవిద్యాలయం అనడం సరిౖయెనది. ఆమె సైద్ధాంతిక జ్ఞానం, సేవాదృక్పథం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అంటారు ఆమె అభిమానులు. ‘సహాయం కోసం శకుంతలమ్మ దగ్గరికి వెళ్లినప్పుడు, పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్లినట్లుగా అనిపించదు. మన ఇంటి పెద్ద దగ్గరికి ఆత్మీయంగా వెళ్లినట్లుగా అనిపిస్తుంది’ అంటారు సామాన్యులు. శకుంతలమ్మకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న... ‘ఈ వయసులోనూ చురుగ్గా ఉంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?’ ఆమె చెప్పే సమాధానం: ‘సమాజసేవ’ శకుంతలమ్మ ఇచ్చిన చిన్న సమాధానంలో ఎంత పెద్ద తత్వం దాగి ఉందో కదా! -
కస్తుర్బా విషయంలో అది రుజువైంది
నా దృష్టిలో బాను మించిన విద్యావంతులు లేరు. నిజమైన చదువుకి నిఖార్సయిన ఉదాహరణ బా! ‘ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది’ అన్నది పాత నానుడే అయినా ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. గాంధీ, ఆయన సహధర్మచారిణి కస్తూర్బా విషయంలోనూ నిజమైంది. అనుక్షణం ఆమె జాతిపిత వెన్నంటి లేకపోతే స్వాతంత్య్ర పోరాటం సఫలమయ్యేదే కాదన్న మాటలో ఆవగింజంతైనా అతిశయోక్తి లేదు. అందుకే ఆ మహాత్ముడి జన్మదినం సందర్భంగా ఆ మహాఇల్లాలి బయోగ్రఫీ... 1869లో పుట్టారు కస్తూర్బా. ఆమె జన్మస్థలం కూడా గుజరాత్‌లోని పోరుబందరే. వ్రజ్కుంవర్, గోకుల్దాస్.. ఆమె తల్లిదండ్రులు. గోకుల్దాస్ పెద్ద వ్యాపారి. పశ్చిమాసియా, ఆఫ్రికా మార్కెట్లలో ఆహారధాన్యాలు, దుస్తులను అమ్మేవాడు. పోర్బందర్కు మేయర్‌గా కూడా పనిచేశారు. తల్లి గృహిణి. కస్తూర్బాకు ఇద్దరు అన్నదమ్ములు. కస్తూర్బా కుటుంబానికి, గాంధీ కుటుంబానికీ మొదటినుంచి మంచి స్నేహం ఉంది. కస్తూర్బా, గాంధీలకు పెళ్లి చేసి ఆ స్నేహాన్ని మరింత బలపర్చుకుందామనుకున్నారు ఇటు కస్తూర్బా తల్లిదండ్రులు అటు గాంధీ తల్లిదండ్రులు. అందుకే ఏడేళ్ల కస్తూర్బాకు గాంధీతో నిశ్చితార్థం చేసేసి పెళ్లి ఖాయం చేసుకున్నారు. పదమూడేళ్లు రాగానే పెళ్లి చేశారు. పెళ్లయిన కొత్తలోనే గాంధీ... మొగుడిగా కస్తూర్బా మీద పెత్తనం చలాయించడానికి, ఆమెను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. కాని తనకు నచ్చని విషయాల్లో ఆమె గాంధీ అభిప్రాయాలతో ఏకీభవించేవారు కాదు. స్వంతంగా ఆలోచించేవారు.. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవారు. ప్రొఫెషనల్ కోర్స్ అయిన బారిష్టర్ చదువుకోసం గాంధీ ఇంగ్లండ్‌కు, లా ప్రాక్టీస్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లడంతో కొన్నేళ్లపాటు ఆయనకు దూరంగానే ఉన్నారు కస్తూర్బా. బాల్యవివాహం కావడం వల్ల చదువుకూ దూరంగానే ఉంచారు ఆమె తల్లిదండ్రులు. ఈ కారణం వల్లే గాంధీ విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు పెద్ద సమస్యగా తయారయ్యాయి. స్వతంత్ర వ్యక్తిత్వం.. చెదరని ధైర్యం.. సమభాగస్వామ్యం గాంధీ దక్షిణాఫ్రికా వెళ్లిన కొన్నాళ్లకు కస్తూర్బాను తీసుకెళ్లారు. అప్పటికే వాళ్లకు పిల్లలు. అక్కడ భారతీయులను మూడోతరగతి పౌరులుగా చూడడం, భారతీయుల పని పరిస్థితులు సరిగా లేకపోవడం గాంధీని కలవరపర్చింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక మనవాళ్లకు సముచిత గౌరవం అందించడానికి, వాళ్ల పరిస్థితులు మెరుగుపడడానికి ఉద్యమం ప్రారంభించారు ఆయన. భర్తకు అండగా ఆ ఉద్యమంలో పాలుపంచుకున్నారు కస్తూర్బా. 1913, సెప్టెంబర్‌లో ఆమె అరెస్ట్ అయ్యారు. మూడు నెలలు జైల్లో ఉన్నారు. దేశం కాని దేశం.. భాష రాదు.. చదువు లేదు.. పైగా జైలు.. సహజంగానే ధైర్యస్థురాలైన కస్తూర్బా ఆ సమస్యకు కుంగిపోలేదు సరికదా.. జైల్లో ఉన్న తోటి మహిళా ఖైదీలకూ ధీమాగా నిలబడ్డారు. శిక్షను ఎదుర్కొనే శక్తినిచ్చారు. అప్పుడే కాదు తాను తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టినప్పడూ అదే స్థయిర్యంతో ఉన్నారు. కాలానికే పరీక్ష పెట్టి ఆరోగ్యాన్ని సాధించారు. ఒకసారి గాంధీని బ్రిటిష్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయనను ఇంటి నుంచి తప్పించి తాను పిల్లలను తీసుకొని వెరే ఇంటికి మకాం మర్చారు కస్తూర్బా. గాంధీ సహాయం లేకుండానే పిల్లలను పోషిస్తూ రోజులు నెట్టుకొచ్చారు. సంయమనం, సామరస్యంతో ఉంటూ ఇరుగుపొరుగుకు తలలో నాలుకయ్యారు. పుట్టెడు కష్టాన్ని పొట్టలో పెట్టుకొని పెదవుల మీద మాత్రం చిరునవ్వుతోనే కనిపించేవారు. దక్షిణా ఆఫ్రికాలోనే కాదు గాంధీ భారతదేశానికి వచ్చి సాగించిన స్ట్రగుల్లోనూ సగపాలు తీసుకున్నారు కస్తూర్బా. సత్యాగ్రహం, విదేశీవస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా.. ఇలా ఏ ఉద్యమంలో అయినా సమభాగస్వామ్యం నెరపారు. గాంధీ అరెస్ట్ అయితే ఆ స్ఫూర్తిని తాను కొనసాగించారు. మహిళా వాలంటీర్లలో ఉత్సాహాన్ని నింపారు. బా.. గొప్ప నాయకురాలు స్వాతంత్య్ర సమరంలో ఆమెదొక పాత్ర మాత్రమే కాదు.. గాంధీకి కొనసాగింపుగా ఆమెను వర్ణిస్తారు చరిత్రకారులు. క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న సమయం అది. బొంబాయిలోని శివాజీ పార్క్‌లో గాంధీ ప్రసంగించాల్సి ఉండింది. ఈ లోపే బ్రిటిష్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ మీటింగ్‌లో కస్తూర్బా మాట్లాడాలని అనుకున్నారు గాంధీ. ఆ మాట జనాలకు తెలిసి తాము ఆప్యాయంగా బా అని పిలుచుకునే కస్తూర్బా ఉపన్యాసం వినాలనే ఆత్రంతో లక్షమంది దాకా గుమిగూడారు పార్క్‌లో. మీటింగ్‌కి బయలుదేరారు కస్తూర్బా. కాని మార్గమధ్యంలోనే పోలీసులు ఆమెను అడ్డుకొని ఆర్థర్ రోడ్డులోని జైలుకి తరలించారు. ఆ సమయంలో ఆమె అనుచరురాలు సుశీలా నాయర్ కస్తూర్బా పక్కనే ఉన్నారు. జైలుకి వెళుతూ ‘నేను ప్రాణాలతో బయటకి రాలేననిపిస్తోంది సుశీలా’ అని అన్నారట కస్తూర్బా. అన్నట్టుగానే జరిగింది. ఆర్థర్రోడ్లోని జైలు ఓ మురికి కూపం. అందులోకి వెళ్లగానే ఆమె అనారోగ్యం పాలయ్యారు. కొన్ని రోజులకు అక్కడి నుంచి ఆమెను పుణెలోని ఆగాఖాన్ ప్యాలెస్‌కు తరలించారు. అక్కడే 1944 ఫిబ్రవరి 22న గాంధీ ఒడిలో ప్రాణాలు వదిలారు కస్తూర్బా. మరుసటి రోజు అదే కంపౌండ్‌లో ఆమెకు అంతిమ సంస్కారాలు జరిగాయి. డస్సి పోయిన మొహంతో నిలబడ్డ గాంధీని అనుచరులంతా లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకొమ్మని అడిగారట. ‘62 ఏళ్ల సహజీవన అంతిమ ఘడియలివి. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు నన్ను ఇక్కడనే ఉండనివ్వండి.. బా లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను’ అని అన్నారట గాంధీ బాధగా. ‘నేనంత ఒత్తిడి చేసినా.. బలవంత పెట్టినా తాను నమ్మిందే ఆచరించింది. నా కన్నా తనే గొప్పది అన్నిట్లో. నాతో అభిప్రాయా భేదాలున్నప్పటికీ నాతో కలిసి నడిచింది జీవితంలోనే కాదు.. నా పోరాటంలో, రాజకీయ యుద్ధంలో కూడా. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంది తప్ప వెనక్కి తగ్గలేదు.. నా దారి మార్చుకొమ్మని నన్ను పోరలేదు. ఆమె చదువులేనిదే కావచ్చు కాని నా దృష్టిలో బాను మించిన విద్యావంతులు లేరు. నిజమైన చదువుకి నిఖార్సయిన ఉదాహరణ బా. ఆమె ఫక్తు వైష్ణవ భక్తురాలే కావచ్చు. కాని వ్యవహారంలో ఒక హరిజన పిల్లను సాకి కులమత భేదాలు లేవని చూపిన మనిషి. ఆగాఖాన్ ప్యాలెస్‌లో నిరాహార దీక్ష చేపట్టి మరణం అంచుదాకా వెళ్లి వచ్చాను. అప్పుడు ఆమె కళ్లల్లో నీటిని చూడలేదు. ఆశను చూశాను. ధైర్యాన్ని పొందాను. మంచి సాధించే విజయాన్ని పసిగట్టాను’ అని కస్తూర్బా గురించి తన ఆత్మకథలో రాసుకున్నారు గాంధీ. రాతే రాదు... నోట్‌బుక్ ఎందుకు? అంతగా చదువురాకపోయినా లెక్కలు, పద్దులు పర్ఫెక్ట్గా చూసేవారట కస్తూర్బా. అయితే చేతిరాత మాత్రం చిన్నపిల్లలా ఉండేదట. ప్రతి అక్షరం విడివిడిగా, అ క్షరానికి అక్షరానికి మధ్య ఒక్కోసారి ఎక్కువ ఎడం, ఇంకోసారి అసలు ఎడమే లేకుండా ఓ పద్ధతి లేకుండా రాసేవారట. ఆమె చేతిరాతను మార్చడానికి గాంధీ చాలానే ప్రయత్నించేవారట. ఒకసారి అందరూ అడిగినట్టే కస్తూర్బా కూడా గాంధీని ఒక నోట్‌బుక్ అడిగారట. అందరికీ నోట్ బుక్స్ ఇచ్చి కస్తూర్బాకు మాత్రం విడిగా పేపర్ల కట్ట ఇచ్చారట. ‘నీ చేతిరాగ ముత్యాల్లా మారిన తర్వాతే నీకు నోట్‌బుక్’ అన్నారట. ఆ మాటకామె చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారట. అది గ్రహించిన సుశీలా నాయర్ ఆ సంగతిని సరోజినీ నాయుడికి చేరవేశారట. వెంటనే ఆమె కస్తూర్బా కోసం ఓ నోట్‌బుక్ పంపారట. కాని ఆ బుక్‌ని బా తీసుకోలేదట. సుశీల బలవంతంగా ఇస్తే... తీసుకొని దాన్ని మహాత్మా గాంధీ దగ్గరున్న నోట్‌బుక్ దొంతరలో పెట్టేశారట. ఈ విషయం గాంధీకి తెలిసింది. కస్తూర్బా నొచ్చుకుందని అర్థమైంది. గాంధీకి తన తప్పు తెలిసింది. ‘ఆమె చేతిరాత మార్చడానికి ఇంకో కొత్త మార్గం అన్వేషించక పోగా, ఆమెను అవమానించానే’ అని చాలా బాధపడ్డారట. తరాత స్వయంగా ఆయనే నోట్‌బుక్ ఇస్తుంటే.. ‘రాతే రాని దానికి నోట్‌బుక్ ఎందుకు? ఏం చేసుకోను?’ అని అక్కడి నుంచి వెళ్లిపోయారట కస్తూర్బా. రవీంద్రనాథ్ ఠాగూర్ – గాంధీజీల సమావేశంలో కస్తూర్బా గాంధీ, కస్తూర్బా పెళ్లినాటి ఫొటో భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీతోపాటు కస్తూర్బా -
బాలికల ఆకలి వేదన
కస్తూరిబాలో బాలికలకు కష్టాలు ♦ సమయానికి అన్నం పెట్టని అధికారులు ♦ కడుపు మాడ్చుకుంటున్న విద్యార్థినులు ♦ ఇష్టారాజ్యంగా పాఠశాల అడ్మిషన్లు ♦ పట్టించుకోని ఉన్నతాధికారులు సమయం మధ్యాహ్నం ఒంటి గంట..ఆ బాలికల కళ్లల్లో జీవం లేదు.. ముఖాల్లో కాంతి లేదు. కడుపులో పేగులు బాధతో మెలిపెడుతున్నాయి. ప్రతి ఒక్కరూ పొట్ట చేతపట్టి వంట మనుషుల వైపు దీనంగా చూస్తున్నారు. ఇప్పటికైనా వంట ప్రారంభిస్తారేమోనని.. అయితే అప్పటికే ఆ సిబ్బంది కడుపులు నిండాయనుకుంటా..పిల్లల ఆకలి కేకలు వారి చెవులకు చేరలేదు. నీరసించిన చిట్టి తల్లుల కన్నీటి పొర వారి హృదయాలను కరిగించ లేదు. సోమవారం అచ్చంపేటలోని కస్తూరిబా పాఠశాల్లో గుప్పెడు మెతుకుల కోసం బాలికలు ఇలా విలవిలలాడారు. అచ్చంపేట: బాలికలు వంటింటికే పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదవాలన్న కాంక్షతో 2008లో మండలానికి ఒక కస్తూరిబా పాఠశాలను ఏర్పాటు చేశారు. కానీ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాఠశాలలు నానాటికీ కునారిల్లుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పాఠశాల ప్రవేశాల్లోనూ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ నాయకులు చెబితేనే పాఠశాలలో సీట్లు ఇస్తామనే స్థాయికి పరిస్థితులు దిగజారాయి. పాఠశాల్లో మెనూ పాటించడం లేదు. సమయానికి అన్నం పెట్టడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కస్తూరిబా పాఠశాల అంటేనే తల్లిదండ్రులు వణికిపోయేలా మారుస్తున్నారు. ఇది అచ్చంపేటలోని కస్తూరిబా బాలిక పాఠశాల దుస్థితి. సోమవారం వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ సందెపోగు సత్యం పార్టీ నాయకులతో కలసి పాఠశాలకు అడ్మిషన్ కోసం వెళ్లి పరిస్థితులు చూసి విస్తుబోయారు. వీరితోపాటు కొందరు ఎమ్మార్పీఎస్ నాయకులు కూడా ఉన్నారు. ఆకలి కేకలతో విద్యార్థులు పాఠశాలలో ఐదు నుంచి పదో తరగతి వరకు 200 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు భోజనం వడ్డించాలి. సోమవారం ఒంటి గంటకు కూడా వంట ప్రారంభం కాలేదు. ఇదేమిటని ఇన్చార్జి ఎస్వో సంధ్యారాణిని ప్రశ్నిస్తే కూరగాయలు రావడం ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. రెండు మూడు రోజులకు ఒకసారి ఇదే విధంగా చేస్తున్నారని, వేళకు భోజనం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. తినలేకపోతున్నాం.. రోజుకో రకం కూరగాయలతో భోజనం పెట్టాల్సి ఉన్నా..ప్రతి రోజూ ఒకే కూర, సాంబారు, మజ్జిగ, అప్పుడప్పుడు గుడ్డు ఇస్తున్నారని, అవీ పాడైన గుడ్లు పెడుతున్నారని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. సాంబారు, మజ్జిగలో ఈగలు వస్తున్నాయని, లావు బియ్యంతో వండటం వల్ల తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సన్న బియ్యంతో వండేవారని, వారంలో ఒక రోజు చికెన్ పెట్టేవారని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వాటి ఊసే, అదేమని అడిగితే కొడుతున్నారని వాపోయారు. సస్పెండైనా హవా కొనసాగిస్తున్న ఎస్వో గతేడాది పాఠశాలలో ఓ విద్యార్థి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఎస్వో లక్ష్మిపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో ఉన్నతాధికారులు రెండు నెలల క్రితం ఆమెను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆమెకు ఏ అధికారం లేకపోయినా పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు, నిర్వహణ విషయంలో కొందరు రాజకీయ నాయకుల అండదండలతో హవా కొనసాగిస్తున్నారు. తన మాట వినే ఒక ఉపాధ్యాయురాలికి అనధికారికంగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. అడ్మిషన్లలోనూ రాజకీయం పాఠశాలలో విద్యార్థులు ప్రవేశాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన యాకోబు తన కుమారై సంజీవ రాణిని ఏడో తరగతి ప్రవేశానికి తీసుకెళ్లాడు. ముందుగా టీసీ తెచ్చుకోవాలని ఉపాధ్యాయులు చెప్పారు. టీసీ తీసుకొచ్చాక యాకోబు వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తని సీలు ఇవ్వ లేదు. ఆ తరువాత టీడీపీ నాయకుల సిఫార్సు మేరకు అనేక మంది బాలికలకు అడ్మిషన్లు ఇచ్చారు. అదేమిటని అడిగితే ఎస్వో మేడం చెబితేనే చేర్చుకుంటామని ఇన్చార్జ్ ఎస్వో సంధ్యారాణి తెలిపారని యాకోబు చెప్పాడు. చర్యలు తీసుకుంటా నేను ఇటీవలనే చార్జి తీసుకున్నా. నాకూ అచ్చంపేట పాఠశాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఫైల్ తెప్పించుకుని పరిశీలిస్తున్నా. పాఠశాల ఎస్వో సస్పెన్షలో ఉన్నారు. ఇన్స్పెక్షన్ చేసి విద్యార్థులకు వేళకు భోజనం అందేలా చర్యలు తీసుకుంటా. అర్హులైన విద్యార్థులందరీ అడ్మిషన్స్ ఉంటాయి. – సత్యవతి, ప్రాజెక్టు ఆఫీసర్,రాజీవ్‌విద్యామిషన్, గుంటూరు. -
కస్తూర్బా పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
కర్నూలు(అగ్రికల్చర్): కస్తూర్బా పాఠశాలల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి విడుదలైన నోటిపికేషన్‌కు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలోని ఈ పాఠశాలల్లో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లు, అకౌంటెంట్లు, ఎన్‌ఎన్‌ఎంలు, నైట్, డే వాచ్మెన్లు, అసిస్టెంటు కుక్స్ తదితర 84 పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికపై భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 10 వరకు గడువున్నా మంగళవారం దరఖాస్తులు ఇచ్చేందుకు పోటెత్తారు. నిరుద్యోగులు వేలాదిగా తరలి రావడంతో దరఖాస్తుల స్వీకరణకు సిబ్బంది అవస్థలు పడ్డారు. -
కస్తూర్భా హాస్టల్లో విద్యార్థుల కష్టాలు
-
పాఠాలు బోధించిన ఎమ్మెల్యే
నెన్నెల : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను ఆదివారం తనిఖీకి వెళ్లిన ఆయనకు అక్కడ ఆటలాడుకుంటున్న విద్యార్థులు కనిపించారు. వారితో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నార లేదా అని అడిగి తెలుసుకున్నారు. పాఠ్యపుస్తకాల్లోంచి ప్రశ్నలు అడిగారు. పుస్తకం తీసుకుని స్వయంగా పాఠాలు బోధించారు. రాఖీ పండుగ, అశోకుడు చెట్లు నాటిన విషయం గూర్చి పిల్లలకు వివరించారు. టీచర్లు అందుబాటులో లేక పోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విధ్యార్థులకు అందుబాటులో ఉండి విద్యాబుద్దులు నేర్పించాలని సూచించారు. -
గర్భం దాల్చిన కస్తూర్బా విద్యార్థిని
- వంచించిన సమీప బంధువు - పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ములుగు: కస్తూర్బా విద్యార్థినికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్న ఓ కామాంధుడు ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఆందోళనకు గురైన ఆమె సంబంధీకులు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ములుగులో ఈ దారుణం వెలుగుచూసింది. ఎస్ఐ సైదేశ్వర్ కథనం ప్రకారం.. జగదేవ్‌పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బాలిక గజ్వేల్ కస్తూర్బాగాంధీ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. దసరా సెలవుల్లో ములుగు మండలం మర్కుక్‌లో వున్న పెద్దమ్మ ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన వరుసకు బావ అయిన బక్కనోల్ల బన్నీ (25) మాయమాటలతో బాలికను లోబరుచుకున్నాడు. అనంతరం పలుమార్లు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. కంగుతిన్న కుటుంబసభ్యులు నిలదీయడంతో బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితులు మంగళవారం రాత్రి ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బన్నీపై కేసు నమోదు చేసినట్లు ఎసై సైదేశ్వర్ తెలిపారు. -
బాలికల గురుకుల వసతిగృహంలో ప్రబలిన అంటువ్యాధులు
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: మండల కేంద్రంలోని ప్రభుత్వ (కస్తూర్బా) బాలికల గురుకుల వసతిగృహంలో అంటువ్యాధులు ప్రబలాయి. దాదాపు 20 మంది బాలికలు చేతులకు, కాళ్లకు చీము పుండ్లతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ వసతి గృహంలో 147 మంది బాలికలు చదువుకుంటున్నారు. వసతి గృహ ంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో పాటు గదులు ఇరుకుగా ఉండి బాలికలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాగా వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అంటువ్యాధులు మరింత మంది బాలికలకు ప్రబలే ప్రమాదం ఉంది. వసతి గృహంలోనే ఉండి బాలికల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన ఏఎన్ఎం అనురాధ కొన్ని రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. దీంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా వీరికి వెంటనే వైద్య సౌకర్యం అందలేదు. మొదట్లో నలుగైదుగురు విద్యార్థినిలకు మాత్రమే చేతులు, కాళ్లకు పుండ్లు ఏర్పడగా ఆ తర్వాత 20 మంది బాలికలకు ఈ అంటువ్యాధి సోకింది. బుధవారం వీరిని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్సకు వచ్చిన వారిలో పలువురు బాలికలు జ్వరంతో కూడా బాధపడుతున్నారు. వీరిలో టి. మహేశ్వరి అనే ఏడో తరగతి బాలిక విపరీతమైన జ్వరంతో పాటు చేతి వేళ్ల మధ్య పుండ్లతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఐదో తరగతి చదువుతున్న వనిత అనే బాలిక పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స జరిపించినా ఫలితం లేకపోవడంతో మహేశ్వరిని బుధవారం సాయంత్రం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా వసతి గృహం వార్డెన్ దశరాథరామిరెడ్డి మాట్లాడుతూ ..ఏఎన్ఎం విధులకు రాకపోవడం వల్ల బాలికలను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని చెప్పారు. వసతి గృహంలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, కొద్ది మంది బాలికలు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.