మహబూబ్‌నగర్: బాలానగర్ మండలంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో గురువారం విద్యార్థులు ఆకలితో అలమటించారు. సరైన భోజనం పెట్టకపోవడంతో విసిగిపోయిన విద్యార్థినులు ఒక్కసారిగా పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళితే.. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 384 మంది ఉన్నారు. వీరికి ప్రతిరోజు వంట చేసేందుకు ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉంది. అయితే రెండేళ్లుగా ఇద్దరు సిబ్బంది లేకపోవడంతో ముగ్గురే వంట చేస్తున్నారు. ఇటీవల ఒకరు పని మానేసి వెళ్లిపోగా.. మిగిలిన ఇద్దరు బుధవారం సాయంత్రం నుంచి అనారోగ్యం కారణంగా సెలవు పెట్టారు.
దీంతో రాత్రి భోజనం వండకపోవడంతో విద్యార్థులు బొరుగులు తిని అర్ధాకలితో పడుకున్నారు. గురువారం ఉదయం ప్రిన్సిపాల్ జ్ఞానేశ్వరి ఎలాగోలా ఉప్మా చేసి అందించారు. అయితే అది రుచిగా లేకపోవడంతో చాలా మంది తినలేదు. మధ్యాహ్నం కూడా వంట చేసే పరిస్థితి లేకపోవడంతో పాటు అప్పటికే ఇద్దరు విద్యార్థినులు నీరసించి పడిపోయారు.
దీంతో ఆందోళనకు గురైన విద్యార్థులు పాఠశాల ఆవరణలో ధర్నాకు దిగారు. సమస్యలను పలుసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని విద్యార్థులు తెలిపారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్యలకు పరిష్కారం చూపే వరకు ఇక్కడే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారు.
పరిష్కారం కాని సమస్యలు
పాఠశాలలో నిత్యం అందించే ఆహారాన్ని నాసిరకంగా వడ్డిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పాఠశాలకు తనిఖీ సమయంలో వచ్చిన అధికారులకు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయంలో సమస్యలు, ఇబ్బందులు చెబితే తర్వాత తమపై మండిపడుతారన్నారని ఆరోపించారు.
దీనికి తోడు తనిఖీలకు సంబంధించి ముందస్తు సమాచారం ఉండడంతో ఆ సమయంలో ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తారన్నారు. ఇతర రోజుల్లో నీళ్లతో కూడిన కూరలు వడిస్తారని విద్యార్థులు చెబుతున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న మినరల్ వాటర్ పనిచేయకపోవడంతో బోరు నీళ్లే తాగుతున్నామని తెలిపారు. గదులకు కిటీకీలు లేక వర్షం పడితే విద్యార్థులు నిద్రపోలేని పరిస్థితి ఉందన్నారు.
పాఠశాలలో బాత్రూంలు ఉన్నా కొన్నింటికి తలుపులు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. వంట చేసే ఆయాలు తమతో సేవలు చేయించుకుంటారని ఈ విషయాన్ని ప్రశ్నిస్తే ఉపాధ్యాయులకు చెప్పి బెదిరిస్తారని తెలిపారు. పాఠశాల ప్రహరీ గోడ దూకి ఆకతాయిలు ఆవరణలోకి ప్రవేశిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా మొక్కుబడిగా 4, 5 సార్లు పాఠశాలకు వచ్చి పరిశీలించారే గానీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
కాగా.. గురువారం విద్యార్థినులను చూసేందుకు వచ్చిన కొందరు తల్లిదండ్రులు పరిస్థితిని గమనించి..పాఠశాల ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ నాయకులు అక్కడకు చేరుకుని వారికి మద్దతుగా నిలిచారు. ప్రిన్సిపాల్, సిబ్బందిపై మండిపడిన వారు సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
అధికారుల విచారణ..
విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి బాబురావు పాఠశాల వద్దకు చేరుకుని విచారించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బాలికలకు భోజనం పెట్టడంతో పాటు విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న డీఈఓ రవిందర్ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment