పెద్దకడ్మూర్‌లోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. బాలబ్రహ్మేశ్వర ఆలయంలోని వీరభద్రుడి విగ్రహం
కాకతీయుల కళాపోషణకు సజీవ సాక్ష్యాలుగా పలు కట్టడాలు నేటికీ దర్శనమిస్తున్నాయి. భారతీయ సంస్కృతికి ఒక కృతిని, ఆకృతిని కల్పించి.. తమలో దాగిన ఆగమజ్ఞాన నిధిని.. తత్వార్థ ఖనిని రాళ్లల్లో ఇమిడ్చిన కాకతీయుల ప్రతిభ అనన్యం అపూర్వం.. సుమధురం. కాకతీయుల కళామణిహారం లోంచి జాలువారిన కళాఖండాలు ఎన్నో నారాయణపేట జిల్లా నర్వ మండలం పెద్దకడ్మూర్‌లో సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మన చరిత్ర, సంస్కృతి, వైభవాన్ని ఎలుగెత్తి చాటుతోంది ఇక్కడి బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం. కాకతీయుల కళాపిపాసకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. – నర్వ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నో కోటలు, సంస్థానాలు కాకతీయుల కాలంలో నిర్మించబడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. నర్వ మండలం పెద్దకడ్మూర్‌లోని అనేక కట్టడాలు గత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా పేర్కొంటున్నారు. కాకతీయుల కాలంలోని శాతవాహనులు, గుప్తులు, వాకాటములు, కదంబులు రాజ్యపాలన చేశారు.
శాతవాహనుల తర్వాత దక్కను భాగమును విశేషంగా ఆక్రమించుకున్న వారు పల్లవులు. పల్లవుల నుంచి కర్ణాటక ఉత్తర భాగాన్ని విడిపించిన వారు కదంబులు. వీరు క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం ప్రారంభం వరకు సర్వాధికారాలతో పరిపాలన సాగించారు. ఈ కదంబులు కుంతల దేశాన్నే కాకుండా కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గ, బీజాపూర్, ధారవాడ, బళ్లారిలతో పాటు కర్నూల్, అనంతపురం ప్రాంతాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
వీటితో పాటు పాలమూరు జిల్లాలోని నారాయణపేట, మక్తల్ తాలుకా, తాండూర్, కోస్గి, కొడంగల్, ఆత్మకూర్, గద్వాల ప్రాంతాలతో పాటు అలంపూర్, అయిజ, కందూర్, కడుమూర్, కోడూర్ ప్రాంతాల్లో కదంబులతో పాటు కర్ణాటక ప్రభువులు ఏలుబడి ఉందని చరిత్ర చెబుతోంది. కదంబులు నాడు నిర్మించిన గ్రామమే కడుమూర్.. నేడు పెద్దకడ్మూర్‌గా పిలవబడుతోందని చరిత్రకారుడు, సాహితీ సేవకుడు కవి బాబు దేవిదాస్‌రావు ‘పాలమూరు చరిత్ర’ గ్రంథంలో పేర్కొన్నారు.
చరిత్రకు సాక్ష్యంగా కల్యాణి చాళుక్యుల శాసనం
పెద్దకడ్మూర్ బాలబ్రహ్మేశ్వర ఆలయ ప్రాంగణంలో కల్యాణి చాళుక్యుల శాసనం గత చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ శాసనాన్ని చరిత్రకారుడు బాబు దేవిదాస్‌రావు విపులంగా వివరించారు. కదంబుల కాలంలో పాలమూరు జిల్లాపై కర్ణాటక ప్రభువుల ఏలుబడి ఎక్కువగా ఉండేది. దీంతో నాటి కదంబూరు (కడ్మూర్), నాగలకడ్మూర్ గ్రామాలు ఆత్మకూర్ తాలుకాలో ఉండేవి.
కడ్మూర్‌లోని బాలబ్రహ్మేశ్వర ఆలయ ఆవరణలో స్థాపించిన శాసనంలో అనేక అంశాలను పొందుపర్చారు. అహవమల్లరాయ నారాయణుడి పరిపాలన కాలంలో మూడవ ఏట వీరబలంజయ ధర్మప్రతిపాదకులైన ‘ఆయావోళేనూర్వర స్వాములు’ కర్ణాటక దేశాన 4వేల ఉభయ నానాదేశి వర్తకులు పెద్దకడ్మూర్‌లో కూర్చొని తమ సంఘం వారికై చేసుకున్న కట్టుబాట్లను శాసన రూపకంగా పొందుపర్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కాగా.. గత వైభవాన్ని చాటే కాకతీయుల కళాఖండాలను సంరక్షించాలని పలువురు కోరుతున్నారు.
మరో కథ వెలుగులో..
నేటి పెద్దకడ్మూర్ ప్రాంతం జూరాల ప్రాజెక్టు అతి సమీపంలోని కృష్ణానది తీరంలో ఉండటంతో కాకతీయ రాజు రెండవ పులకేశి వేటకు వచ్చాడంటా. ఈ ప్రాంతం దట్టమైన అడవి.. కృష్ణనది సోయగాలతో రెండవ పులకేశిని మంత్రముగ్దులను చేసిందంటా. దీంతో ఇక్కడ ఓ గ్రామాన్ని నిర్మించాలని ఆయన తలంచారు.
రాజులు తలచుకుంటే కొదవే ముంటుందన్న చందంగా సైనికులు, నిపుణులు, శిల్పులతో కలిసి రాజుకు ఇష్ట దైవమైన బాలబ్రహ్మేశ్వరుడి ఆలయం నిర్మించారని గ్రామంలో చెబుతున్నారు. ఆలయంతో పాటు గ్రామముఖ ద్వారం, గ్రామదేవత ఆలయం, నాగదేవతల ఆలయాలు రూపొందించారు. ఈ అద్భుతమైన కట్టడాలు, కాకతీయుల కళాపోషణకు నిదర్శనాలుగా నిలిచి, నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.
చారిత్రక ఆలయాన్ని సంరక్షించాలి
కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చారిత్రక నేపథ్యం కలిగిన బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని సంరక్షించాలి. గ్రామస్తుల చైతన్యంతో కొంత అభివృద్ధి జరిగింది. ఆలయాన్ని ప్రాచీన ఆలయంగా గుర్తించి, విలువైన శిల్పసంపదను కాపాడాలి. – తంబలి నర్సింహయ్య, బాలబ్రహ్మేశ్వర ఆలయ అర్చకుడు
అద్భుత శిల్ప సౌందర్యాలకు నిలయం..
అద్భుత శిల్ప సౌందర్యాలకు నిలయం బాలబ్రహ్మేశ్వర ఆలయం. గ్రామముఖ ద్వారాలు, నాగదేవతల స్థలాలను సంరక్షించాలి. చారిత్రక నేపథ్యం కల్గిన ఈ కట్టడాలను పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సందర్శించి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామస్తుల సహకారంతో ఆలయాలను సంరక్షించుకుని ప్రస్తుతం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – ప్రవీణ్‌కుమార్ ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడు
Comments
Please login to add a commentAdd a comment