old Temples
-
కాకతీయుల కళావైభవం
కాకతీయుల కళాపోషణకు సజీవ సాక్ష్యాలుగా పలు కట్టడాలు నేటికీ దర్శనమిస్తున్నాయి. భారతీయ సంస్కృతికి ఒక కృతిని, ఆకృతిని కల్పించి.. తమలో దాగిన ఆగమజ్ఞాన నిధిని.. తత్వార్థ ఖనిని రాళ్లల్లో ఇమిడ్చిన కాకతీయుల ప్రతిభ అనన్యం అపూర్వం.. సుమధురం. కాకతీయుల కళామణిహారం లోంచి జాలువారిన కళాఖండాలు ఎన్నో నారాయణపేట జిల్లా నర్వ మండలం పెద్దకడ్మూర్‌లో సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మన చరిత్ర, సంస్కృతి, వైభవాన్ని ఎలుగెత్తి చాటుతోంది ఇక్కడి బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం. కాకతీయుల కళాపిపాసకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. – నర్వ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నో కోటలు, సంస్థానాలు కాకతీయుల కాలంలో నిర్మించబడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. నర్వ మండలం పెద్దకడ్మూర్‌లోని అనేక కట్టడాలు గత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా పేర్కొంటున్నారు. కాకతీయుల కాలంలోని శాతవాహనులు, గుప్తులు, వాకాటములు, కదంబులు రాజ్యపాలన చేశారు. శాతవాహనుల తర్వాత దక్కను భాగమును విశేషంగా ఆక్రమించుకున్న వారు పల్లవులు. పల్లవుల నుంచి కర్ణాటక ఉత్తర భాగాన్ని విడిపించిన వారు కదంబులు. వీరు క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం ప్రారంభం వరకు సర్వాధికారాలతో పరిపాలన సాగించారు. ఈ కదంబులు కుంతల దేశాన్నే కాకుండా కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గ, బీజాపూర్, ధారవాడ, బళ్లారిలతో పాటు కర్నూల్, అనంతపురం ప్రాంతాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. వీటితో పాటు పాలమూరు జిల్లాలోని నారాయణపేట, మక్తల్ తాలుకా, తాండూర్, కోస్గి, కొడంగల్, ఆత్మకూర్, గద్వాల ప్రాంతాలతో పాటు అలంపూర్, అయిజ, కందూర్, కడుమూర్, కోడూర్ ప్రాంతాల్లో కదంబులతో పాటు కర్ణాటక ప్రభువులు ఏలుబడి ఉందని చరిత్ర చెబుతోంది. కదంబులు నాడు నిర్మించిన గ్రామమే కడుమూర్.. నేడు పెద్దకడ్మూర్గా పిలవబడుతోందని చరిత్రకారుడు, సాహితీ సేవకుడు కవి బాబు దేవిదాస్‌రావు ‘పాలమూరు చరిత్ర’ గ్రంథంలో పేర్కొన్నారు. చరిత్రకు సాక్ష్యంగా కల్యాణి చాళుక్యుల శాసనం పెద్దకడ్మూర్ బాలబ్రహ్మేశ్వర ఆలయ ప్రాంగణంలో కల్యాణి చాళుక్యుల శాసనం గత చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ శాసనాన్ని చరిత్రకారుడు బాబు దేవిదాస్‌రావు విపులంగా వివరించారు. కదంబుల కాలంలో పాలమూరు జిల్లాపై కర్ణాటక ప్రభువుల ఏలుబడి ఎక్కువగా ఉండేది. దీంతో నాటి కదంబూరు (కడ్మూర్), నాగలకడ్మూర్ గ్రామాలు ఆత్మకూర్ తాలుకాలో ఉండేవి. కడ్మూర్లోని బాలబ్రహ్మేశ్వర ఆలయ ఆవరణలో స్థాపించిన శాసనంలో అనేక అంశాలను పొందుపర్చారు. అహవమల్లరాయ నారాయణుడి పరిపాలన కాలంలో మూడవ ఏట వీరబలంజయ ధర్మప్రతిపాదకులైన ‘ఆయావోళేనూర్వర స్వాములు’ కర్ణాటక దేశాన 4వేల ఉభయ నానాదేశి వర్తకులు పెద్దకడ్మూర్‌లో కూర్చొని తమ సంఘం వారికై చేసుకున్న కట్టుబాట్లను శాసన రూపకంగా పొందుపర్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కాగా.. గత వైభవాన్ని చాటే కాకతీయుల కళాఖండాలను సంరక్షించాలని పలువురు కోరుతున్నారు. మరో కథ వెలుగులో.. నేటి పెద్దకడ్మూర్ ప్రాంతం జూరాల ప్రాజెక్టు అతి సమీపంలోని కృష్ణానది తీరంలో ఉండటంతో కాకతీయ రాజు రెండవ పులకేశి వేటకు వచ్చాడంటా. ఈ ప్రాంతం దట్టమైన అడవి.. కృష్ణనది సోయగాలతో రెండవ పులకేశిని మంత్రముగ్దులను చేసిందంటా. దీంతో ఇక్కడ ఓ గ్రామాన్ని నిర్మించాలని ఆయన తలంచారు. రాజులు తలచుకుంటే కొదవే ముంటుందన్న చందంగా సైనికులు, నిపుణులు, శిల్పులతో కలిసి రాజుకు ఇష్ట దైవమైన బాలబ్రహ్మేశ్వరుడి ఆలయం నిర్మించారని గ్రామంలో చెబుతున్నారు. ఆలయంతో పాటు గ్రామముఖ ద్వారం, గ్రామదేవత ఆలయం, నాగదేవతల ఆలయాలు రూపొందించారు. ఈ అద్భుతమైన కట్టడాలు, కాకతీయుల కళాపోషణకు నిదర్శనాలుగా నిలిచి, నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చారిత్రక ఆలయాన్ని సంరక్షించాలి కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చారిత్రక నేపథ్యం కలిగిన బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని సంరక్షించాలి. గ్రామస్తుల చైతన్యంతో కొంత అభివృద్ధి జరిగింది. ఆలయాన్ని ప్రాచీన ఆలయంగా గుర్తించి, విలువైన శిల్పసంపదను కాపాడాలి. – తంబలి నర్సింహయ్య, బాలబ్రహ్మేశ్వర ఆలయ అర్చకుడు అద్భుత శిల్ప సౌందర్యాలకు నిలయం.. అద్భుత శిల్ప సౌందర్యాలకు నిలయం బాలబ్రహ్మేశ్వర ఆలయం. గ్రామముఖ ద్వారాలు, నాగదేవతల స్థలాలను సంరక్షించాలి. చారిత్రక నేపథ్యం కల్గిన ఈ కట్టడాలను పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సందర్శించి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామస్తుల సహకారంతో ఆలయాలను సంరక్షించుకుని ప్రస్తుతం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – ప్రవీణ్‌కుమార్ ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడు -
శివరాత్రి నాడు శివునికి నైవేద్యం కరువు..
మర్రిపూడి: ఎకరాలకు ఎకరాలు మాన్యం భూములున్నాయి.. వాటిపై వేలాది రూపాయల ఆదాయం వచ్చే మార్గం ఉంది. అయినా పురాతన ఆలయాలకు ఆలనాపాలనా కరువైంది. ఏడాదికి ఓమారు వచ్చే మహా శివరాత్రి పర్వదినం రోజు కూడా ఆ లయకారునికి నైవేద్యం సమర్పించే దిక్కు లేకుండా పోయింది. కొండపి మండల పరిధిలోని దేవుడి భూములు ఏళ్ల తరబడి అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానిక టీడీపీ నేతల అండతో కొందరు మాన్యం భూములు యథేశ్చగా దున్నుకుని పైర్లు వేసుకుని అనుభవిస్తున్నారు. దీంతో స్వామి వారి ఆలయాలు ఆదరణ కరువైశిథిల స్థితికి చేరాయి. శివునికి దూప, దీపాలు కరువు.. మండలంలోని సన్నమూరు గ్రామానికి పడమర దిక్కున పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. పటిష్టంగా రాతి కట్టడమైన ఈ ఆలయం చోళుల కాలంలో నిర్మించినట్లు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం ఆధారంగా తెలుస్తోంది. అప్పట్లో స్వాముల వారికి ధూపదీప నైవేద్యం పెట్టేందుకు ఓ ధర్మకర్తను ఏర్పాటు చేశారు. అప్పట్లో 26 ఎకరాల మాన్యపు భూమిని రామలింగేశ్వర స్వామికి కేటాయించారు. స్వామి వారికి నైవేద్యం సమర్పించే ధర్మకర్తకు ఆ భూమిపై వచ్చే ఆదాయంతో పోషణ జరిగేవిధంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతో రామలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా శిథిలమైపోయింది. ఆలయం చుట్టూ చిల్ల చెట్లు అల్లుకుపోవడంతో ఆ ప్రదేశంలో అసలు ఓ పుణ్యక్షేత్రం ఉందన్న విషయమే నేటి వారికి తెలియని స్థితి ఏర్పడింది. ఆక్రమణ చెరలో మాన్యం భూములు.. రామలింగేశ్వరస్వామి ఆలయంలో దొంగలు పడి శివ లింగాన్ని తవ్వేశారు. ప్రతిష్టంచిన ప్రదేశంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్టు పెద్దలు చెబుతున్నారు. ఆలయం దెబ్బతిని పోవడంతో కొందరు స్వార్ధపరులు ఇదే అవకాశంగా తీసుకున్నారు. సన్నమూరు గ్రామం పరిధిలో సర్వే నంబర్ 85లో 25.75 ఎకరాల మాన్యపు భూమిని కొందరు గ్రామానికి చెందిన టీడీపీ నేతల అండదండలతో యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. దాదాపు 30 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ రబీ సీజన్లోనూ ఆ మాన్యం భూమిలో కందిపంట సాగుచేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ఎండోమెంట్ అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. శిథిల స్థితిలో మరికొన్ని ఆలయాలు.. మండలంలో తంగెళ్ల గ్రామంలోని శివాలయానికి దేవుని మాన్యంపు భూమి 65.76 ఎకరాలు ఉంది. ధర్మకర్తను ఏర్పాటు చేశారు. కానీ గుడికి కనీసి వెల్లవేసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నిర్వాహణ సక్రమంగాలేక ఆలయం శిథిలావస్థకు చేరింది. అలాగే మండలంలోని కెల్లపల్లి గ్రామంలో శివాలయంలో 54.42 ఎకరాల దేవుని మాన్యపు భూమి ఉంది. ధర్మకర్తలు ఉన్నా కేవలం నైవేద్యానికే పరిమితం చేశారు. కానీ గతంలో ఎన్నడూ శివరాత్రి పండుగ వేడుకలు నిర్వహించిన దాఖలాలు లేవు. అలాగే కాకర్లలో 63 ఎకరాల మాన్యం భూమి ఉన్న శివాలయంలోనూ ఎలాంటి ఉత్సవాలు జరిగిన దాఖలాలు లేవు. రామాయపాలెం శివాలయానికి 18.29 ఎకరాల దేవుని మాన్యపు భూమిని కేటాయించారు. ఇక్కడ నైవేద్యం పెట్టేనాథుడు కరువయ్యారని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. 2008–09 లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్సార్ రాష్ట్రంలో రూ.28 వేల ఆలయాలను జీర్ణోద్దరణ చేసి, నైవేద్యానికి నిధులు కేటాయించారు. ఆ సమయంలో కూడా ఈ ఆలయాలను పునరుద్ధరించిన దాఖలాలు లేవు. ఎండోమెంట్ అధికారులు స్పందించి అన్యాక్రాంతం అవుతున్న దేవుని మాన్యాలను కాపాడాలని మండల ప్రజలు కోరుచున్నారు. -
జయితి..జగద్విఖ్యాతి
మెంటాడ: అపూర్వమైన శిల్ప కళా సౌందర్యం. అబ్బురపరిచే ఆలయాల సమూహం. అవే మెంటాడ మండలంలోని జయితి ఆలయాలు. మెంటాడకు సుమారు 7, గజపతినగరానికి సుమారు 20, జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలో మీటర్ల దూరంలో జయితి గ్రామం ఉంది. ఈ ఆలయాలను గ్రామస్తులే కమిటీగా ఏర్పడి అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ కమిటీ చైర్మన్‌గా గేదెల సత్యం నాయుడు వ్యవహరిస్తున్నారు. ఏటా మహాశివరాత్రి, కార్తీక మాసం, ఇతర పర్వదినాల్లో గ్రామస్తుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. రవాణా సదుపాయాలు విజయనగరం, గజపతినగరం నుంచి ప్రతి 2 గంటలకు బస్సు సౌకర్యం ఉంది. ఆటోలు నిరంతరం తిరుగుతుంటాయి. శివరాత్రికి ప్రత్యేక బస్సులను నడుపుతారు. ఇక్కడి శిల్ప కళా సంపదను పరిశీలించిన అధికారులు, పురావస్తు శాఖాధికారులు ప్రశంసించి అభివృద్ధి చేస్తామని హామీలివ్వడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014 నవంబరు 22న ఇదే గ్రామానికి చెందిన వజ్రపు తిరుపతిరావు మృత్యుంజయ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1992లో ముచ్చెర్ల రామచంద్రరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు కమిటీగా ఏర్పడి మల్లికార్జున ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆకర్షిస్తున్న గోపురాలు ఇక్కడి శిల్ప గోపురాలు జైనుల కాలం నాటివని చరిత్రకారుల కథనం. అందుకే ఈ గ్రామానికి జయితి అని పేరు లభించిందంటారు. మల్లికార్జున స్వామి ఆలయానికి ఎడమ వైపున్న గోపురంపై వినాయకుడు, విష్ణు, బ్రహ్మ, కుమారస్వామి తదితర విగ్రహాలున్నాయి. ఈ ఆలయాన్ని ఇటీవల తొలగించి పునర్నిర్మిస్తున్నారు. కుడి వైపున్న గోపురంలో పార్వతీ దేవి ఆలయం అని చెబుతున్నారు. తొమ్మిది చేతులతో నటరాజు విగ్రహం ఇక్కడ గొప్ప ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పరిసరాలకు ఉత్తర దిశలో కొండపైన శివ–పార్వతుల ఆలయం ఉందని పూర్వీకుల కథనం. ఇక్కడున్న పర్వతం వద్ద బంగారు లోయ ఉందని గ్రామస్తులు తెలిపారు. దాని మార్గం నేరుగా కాశీ వరకు ఉందంటారు. గతంలో ఈ లోయ ఎంతదూరం వరకూ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించినా గమ్యం కానరాలేదని చెబుతున్నారు. 1984, 85, 86 సంవత్సరాల్లో ఢిల్లీ, భువనేశ్వర్, అమెరికా, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన చెందిన పురాతత్వ శాఖ నిపుణులు ఆలయాలను సందర్శించారని ఆలయ కమిటీ చైర్మన్లు తాజా, మాజీ చాపాన జోగినాయుడు, గేదెల సత్యంనాయుడు, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు బెవర వీరునాయుడు, మన్నేపురి రామచంద్రుడు తెలిపారు. -
గుప్తనిధుల ముఠా అరెస్ట్
– పోలీసులు అదుపులో ఏడుగురు – ఆటోతో పాటు గడ్డపారలు స్వాధీనం – పరారీలో ప్రధాన సూత్రధారి డోన్: పురాతన ఆలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలకు పాల్పడే ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. వెల్దుర్తి మండలంలోని బ్రహ్మగుండం, సమీపంలోని పురాతన ఆలయాలను టార్గెట్ చేసిన ముఠాను హోంగార్డ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ముఠా వివరాలను డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ తులసీనాగప్రసాద్ మీడియాకు వివరించారు. హŸళగుంద మండలం గజ్జనహళ్లి గ్రామానికి చెందిన గొల్లరాముడు గుప్తనిధుల అన్వేషణ పేరుతో ముఠాను తయారు చేశాడు. ఇందులో ఆస్పరి మండలం గార్లపెంట గ్రామానికి చెందిన వడ్డె నరేష్, ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన బోయ తుగ్గలి చెన్నకేశవ్, ఎమ్మిగనూరు మండలం దేవరగట్ట గ్రామానికి చెందినన మాదిగ ఆంజనేయులు, మాదిగ రవికుమార్, గొల్లచంద్ర, వెల్దుర్తి మండలం చెర్లకొత్తూరుకు చెందిన మాదిగ కర్లకుంట తిరుమలేసు, క్రిష్ణగిరి మండలం మాదాపురం గ్రామానికి చెందిన మాదిగ మణీంద్ర ముఠాలో సభ్యులుగా చేరారు. ఇలా పట్టుబడ్డారు: దేవాలయాల్లో ఉండే శాసనాల ద్వారా గుప్తనిధులు ఉన్నట్లు తెలుసుకుని తవ్వకాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వెల్దుర్తి పరిసర ప్రాంతాల్లోని బ్రహ్మగుండం, రామళ్లకోటలోని వనమా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆలయాల ఆవరణలో పచ్చలబండ కింద గుప్తు నిధులు ఉన్నాయని టార్గెట్ చేశారు. ఈ మేరకు గొల్లరాముడుతో పాటు మరో ఏడుగురు సభ్యులు బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎమ్మిగనూరు నుంచి ఆటోలో బయల్దేరారు. బ్రహ్మగుండం ఆలయ ఆవరణలో తవ్వకాలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా బీట్‌కు వెళ్లిన హోంగార్డ్ జనార్దన్ గమనించి పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి గొల్లరాముడు పరారయ్యాడు. ఏడుగురు సభ్యులను స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. వీరి వద్ద నుంచి ఆటో, గడ్డపారలు, పారలు స్వాధీనం చేసుకున్నారు. హోంగార్డుకు రివార్డు: గుప్త నిధుల ముఠా పథకాన్ని భగ్నం చేసి, వారిని సమాచారాన్ని చేరవేసిన వెల్దుర్తి పోలీసుస్టేషన్ హోంగార్డ్ జనార్దన్‌కు రివార్డు ప్రకటిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు పోలీసుల అ«భినందించి పారితోషికాన్ని అందజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ పురాతన ఆలయాలతో పాటు దేవాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆలయ ధర్మకర్తలు, ఇతర పాలక మండల చైర్మన్లు, సభ్యులకు డీఎస్పీ బాబాఫకృద్దీన్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల గస్తీ నిరంతరం ఉన్నప్పటికీ భక్తులు, ఆలయ భద్రత దృష్ట్యా సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత తప్పనిసరి అన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఐ శ్రీనివాసులును ఆదేశించారు. -
'చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తాం'
రంగారెడ్డి జిల్లా: తెలంగాణలోని చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో జరిగిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కల్యాణ మహోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ... మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. రాఘవాపూర్ గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు.