పార్వతీ దేవి గోపురం,వినాయక గోపురం
మెంటాడ: అపూర్వమైన శిల్ప కళా సౌందర్యం. అబ్బురపరిచే ఆలయాల సమూహం. అవే మెంటాడ మండలంలోని జయితి ఆలయాలు. మెంటాడకు సుమారు 7, గజపతినగరానికి సుమారు 20, జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలో మీటర్ల దూరంలో జయితి గ్రామం ఉంది. ఈ ఆలయాలను గ్రామస్తులే కమిటీగా ఏర్పడి అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ కమిటీ చైర్మన్‌గా గేదెల సత్యం నాయుడు వ్యవహరిస్తున్నారు. ఏటా మహాశివరాత్రి, కార్తీక మాసం, ఇతర పర్వదినాల్లో గ్రామస్తుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
రవాణా సదుపాయాలు
విజయనగరం, గజపతినగరం నుంచి ప్రతి 2 గంటలకు బస్సు సౌకర్యం ఉంది. ఆటోలు నిరంతరం తిరుగుతుంటాయి. శివరాత్రికి ప్రత్యేక బస్సులను నడుపుతారు. ఇక్కడి శిల్ప కళా సంపదను పరిశీలించిన అధికారులు, పురావస్తు శాఖాధికారులు ప్రశంసించి అభివృద్ధి చేస్తామని హామీలివ్వడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014 నవంబరు 22న ఇదే గ్రామానికి చెందిన వజ్రపు తిరుపతిరావు మృత్యుంజయ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1992లో ముచ్చెర్ల రామచంద్రరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు కమిటీగా ఏర్పడి మల్లికార్జున ఆలయాన్ని పునరుద్ధరించారు.
ఆకర్షిస్తున్న గోపురాలు
ఇక్కడి శిల్ప గోపురాలు జైనుల కాలం నాటివని చరిత్రకారుల కథనం. అందుకే ఈ గ్రామానికి జయితి అని పేరు లభించిందంటారు. మల్లికార్జున స్వామి ఆలయానికి ఎడమ వైపున్న గోపురంపై వినాయకుడు, విష్ణు, బ్రహ్మ, కుమారస్వామి తదితర విగ్రహాలున్నాయి. ఈ ఆలయాన్ని ఇటీవల తొలగించి పునర్నిర్మిస్తున్నారు. కుడి వైపున్న గోపురంలో పార్వతీ దేవి ఆలయం అని చెబుతున్నారు. తొమ్మిది చేతులతో నటరాజు విగ్రహం ఇక్కడ గొప్ప ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పరిసరాలకు ఉత్తర దిశలో కొండపైన శివ–పార్వతుల ఆలయం ఉందని పూర్వీకుల కథనం. ఇక్కడున్న పర్వతం వద్ద బంగారు లోయ ఉందని గ్రామస్తులు తెలిపారు.
దాని మార్గం నేరుగా కాశీ వరకు ఉందంటారు. గతంలో ఈ లోయ ఎంతదూరం వరకూ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించినా గమ్యం కానరాలేదని చెబుతున్నారు. 1984, 85, 86 సంవత్సరాల్లో ఢిల్లీ, భువనేశ్వర్, అమెరికా, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన చెందిన పురాతత్వ శాఖ నిపుణులు ఆలయాలను సందర్శించారని ఆలయ కమిటీ చైర్మన్లు తాజా, మాజీ చాపాన జోగినాయుడు, గేదెల సత్యంనాయుడు, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు బెవర వీరునాయుడు, మన్నేపురి రామచంద్రుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment