ఆ శిలా తోరణాలు ఓ మహాలయపు ఆనవాళ్లు
ఓరుగల్లు కాకతీయ తోరణాల గుట్టు విప్పిన అమెరికా పరిశోధకుడు వాగనర్
సాక్షి, హైదరాబాద్: నాలుగున్నర ఎకరాల సువిశాల స్థలం.. దానికి నాలుగు దిక్కులా ఒక్కోటి 30 అడుగుల ఎత్తుతో భారీ తోరణ ద్వారాలు.. లోపల నాలుగు నంది మండపాలు... మధ్యలో సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన... ఇలా చతుర్ముఖ రూపంతో శివలింగం.. ఒక్కో ద్వారం నుంచి ఒక్కో రూపం దర్శనం! ఎత్తయిన స్తంభాలు, ప్రతి స్తంభం అద్భుత శిల్ప కళా వైభవానికి నిలువుటద్దం.. వెరసి సర్వతోభద్ర ఆలయం! ఈ గొప్ప ఆలయం ఉంది ఎక్కడో కాదు.. మన వరంగల్‌లో! ఆ ఆలయ తోరణాలే కాకతీయ తోరణాలు!! రాష్ట్ర అధికారిక చిహ్నంగా భాసిల్లుతున్న ఈ తోరణాల గుట్టు వీడింది. ఇన్నాళ్లూ అక్కడో దేవాలయం ఉండేదని, అందులో భాగంగానే వాటిని ఏర్పాటు చేశారని తెలుసు. కానీ.. వాటి అసలు రహస్యాన్ని తాజాగా అమెరికాకు చెందిన ఓ పురావస్తు పరిశోధకుడు తేల్చాడు. కేవలం తోరణాలే కాదు, ఆ ప్రాంతానికి చెందిన సరికొత్త అంశాలను వెలుగులోకి తెచ్చాడు.
అది సర్వతోభద్ర ఆలయం
సర్వతోభద్ర ఆలయం.. అన్ని వైపులా ప్రధాన శక్తులను ఆవాహన చేసి సర్వం క్షేమదాయకంగా ఉండాలని ఈ తరహా ఆలయాలను నిర్మిస్తారు. ఇవి చాలా అరుదు. ఇందులో నాలుగు వైపులా ద్వారాలు ఉండటం, ఒక్కో ద్వారం నుంచి మూల విరాట్టు ఒక్కో రూపంలో కనిపించడం ప్రత్యేకత. అలాంటి అరుదైన ఆలయం ఓరుగల్లు కోటలో ఒకప్పుడు వెలుగొందింది. ఆ ఆలయానికి ఏర్పాటు చేసిన ద్వారాలే ఈ కాకతీయ తోరణాలు. ఈ ఆలయానికి సంబంధించిన మూలవిరాట్‌ల స్థానంలో స్థాపితమైన చతుర్ముఖ లింగం.. ఇప్పుడు శంభుడి గుడిగా పిలుచుకునే మరో దేవాలయం ప్రాంగణంలో ఓ పక్కన భూమిలోకి కొంత కూరుకుపోయి ఉంది. ఈ చతుర్ముఖ శివలింగం పీఠం వరంగల్ కోటలో ఉత్తరం వైపున ఉన్న తోరణ ద్వారం పక్కన శిథిలాల్లో పడి ఉంది. ఈ వివరాలను తాజాగా అమెరికాలోని బోస్టన్ సమీపంలో ఉన్న మిడిల్‌టౌన్‌లోని వెస్లియాన్ వర్సిటీ ప్రొఫెసర్ ఫిలిప్ బి.వాగనర్ వెల్లడించారు. వీటిపై అధ్యయనం చేసి ఓ నివేదికను రూపొందించారు.
గణపతి దేవుడి హయాంలో నిర్మాణం
గణపతిదేవుడి కాలంలో 1220–1240 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఆలయం నిర్మాణం పూర్తయ్యే తరుణంలో ఢిల్లీ సుల్తాన్‌ల సైనికాధికారిగా ఉన్న ఉలూఘ్‌ఖాన్ వరంగల్‌పై దండయాత్ర చేసి గణపతిదేవుడిని ఓడించాడు. ఆ సమయంలో ఈ ఆలయం «పూర్తిగా ధ్వంసమైంది. ఆ రాళ్లతోనే ఆయన అక్కడ మసీదు నిర్మాణం జరిపినట్టు కూడా కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కోటలోపలి భాగంలో నిలిచి ఉన్న కొన్ని రాతి స్తంభాలు మసీదువేనని ప్రొఫెసర్ వాగనర్ పేర్కొంటున్నారు. తర్వాత ఆ ప్రాంతాన్ని పద్మనాయకులు స్వాధీనం చేసుకొని మసీదును ధ్వంసం చేసి ఉంటారని భావిస్తున్నారు.
నిజాం హయాంలో 1920 ప్రాంతంలో పురావస్తుశాఖకు సంచాలకులుగా ఉన్న గులాం యాజ్దానీ హయాంలో వరంగల్ కోటలో తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో చతుర్ముఖ శివలింగంతోపాటు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న శిథిలాలు వెలుగుచూశాయి. శివలింగం పీఠం మరో ప్రాంతంలో కనిపించింది. ఇప్పుడు వాగనర్ చెప్పేంతవరకు అది శివలింగం పీఠమనే విషయం తెలియకపోవటం విశేషం. ముస్లిం రాజుల దాడిలో ఈ శైవక్షేత్రం నేలమట్టమైనా.. దానికి వినియోగించిన నాలుగు తోరణ ద్వారాలు మాత్రం చెక్కు చెదరలేదు. వ్యూహాత్మకంగానే వారు వాటి జోలికి వెళ్లలేదని వాగనర్ పేర్కొంటున్నారు. ఈ తోరణాలపై ఎక్కడా హిందూ దేవుళ్ల విగ్రహాలు, ఆకృతులు లేవు. దీంతో వాటిని మసీదుకు ద్వారాలుగా చేసుకునే ఉద్దేశంతోనే ధ్వంసం చేసి ఉండకపోవచ్చు అని ఆయన వివరించారు.
అరుదు.. అత్యద్భుతం: వాగనర్
ఈ సర్వతోభద్ర ఆలయాలు చాలా అరుదు. దక్షిణ భారతదేశంలో వాటి సంఖ్య చాలా తక్కువ. కోటలో విలసిల్లిన ఆలయం అత్యద్భుతంగా నిర్మించారు. ఆలయం చాలా పెద్దదిగా నిర్మించి ఉంటారని పునాదుల ఆనవాళ్లు చెబుతున్నాయి. దీన్ని రామప్ప ఆలయం తర్వాతనే నిర్మించినా.. అలాగే నిలిచి ఉంటే దేశంలోనే గొప్ప ఆలయ నిర్మాణంగా చరిత్రలో ఉండేదేమో!
సరిపోలిన లింగం పీఠం.. లింగం చుట్టుకొలత..
ప్రస్తుతం వరంగల్ కోటకు వెళ్తే.. నాలుగు తోరణాల మధ్యలో ధ్వంసమైన శిల్పాలు, ఇతర శిథిలాలు కనిపిస్తాయి. ఇవి ఏంటన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. అవి ఏ కట్టడం తాలూకు భాగాలన్న వివరాలు లభ్యం కాలేదు. అమెరికా ప్రొఫెసర్ వాగనర్ వరంగల్‌పై అంతర్జాతీయ స్థాయిలో టూర్‌గైడ్ తయారీ కోసం ఇటీవల ఓరుగల్లు వచ్చారు. ఈయనకు దక్షిణ భారత్‌లో హంపి వంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన అనుభవం ఉంది. ఆరు రోజులు వరంగల్‌లోనే ఉండి అక్కడి చాలా ప్రాంతాలను పరిశీలించారు.
కోటకు చేరువలోని శంభుడి గుడి ప్రాంగణంలో చతుర్ముఖ లింగాన్ని చూడగానే ఇక్కడ సర్వతోభద్ర ఆలయం ఉండొచ్చని భావించారు. కోటలో నాలుగు వైపులా ఉన్న కీర్తి తోరణాలు ఆలయ ద్వారాలుగా నిర్ధారించుకుని వాటిని చతుర్ముఖ లింగంతో అన్వయించుకున్నప్పుడు కొంత స్పష్టత వచ్చింది. దీంతో నాలుగు తోరణాల మధ్య ఉన్న స్థలంలో పునాదుల ఆనవాళ్లను పరిశీలించగా అది నాలుగు మండపాలు, వాటికి నాలుగు వైపులా ద్వారాలు ఉన్నట్టు స్పష్టమైంది. దీంతో అది సర్వతోభద్ర ఆలయం ఉన్న స్థలంగా నిర్ధారించారు. ఇక్కడే శిథిలాల్లో చతుర్ముఖ లింగం పీఠం కనిపించింది. అది అష్టభుజి ఆకృతిలో ఉంది. దాని చుట్టుకొలత, చతుర్ముఖ లింగం చుట్టు కొలత సరిగ్గా సరిపోయాయి. ఆ ఆలయం ధ్వంసమైనప్పుడు అన్నీ వేర్వేరు ప్రాంతాల్లో పడిపోయాయి.