వర్క్-లైఫ్ బ్యాలెన్సింగ్ గురించి ఈ మధ్యకాలంలో విస్తృతస్థాయి చర్చ నడుస్తోంది. చైర్మన్, సీఈవో స్థాయిలో ఉన్న వ్యక్తులు నేరుగా స్పందిస్తుండడం.. వాటిపై విమర్శలు-సమర్థనలతో ఈ చర్చ కొనసాగుతోంది. ఈ దరిమిలా ఇవాళ విడుదలైన ఆర్థిక సర్వే సైతం పనిగంటల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.
పని గంటల చర్చలో ఇప్పుడు ఎకనామిక్ సర్వే సైతం భాగమైంది. వారానికి 60 గంటలకు మించి పని చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. వివిధ అధ్యయనాల నివేదికలను ఇందులో ప్రముఖంగా ప్రస్తావించింది. ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం..
‘‘ఆఫీసుల్లో ఎక్కువ సేపు గడపడం వల్ల మానసిక శ్రేయస్సుకు మంచిది కాదు. రోజుకు 12, అంతకంటే ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులు గణనీయమైన స్థాయిలో బాధను అనుభవిస్తున్నారు. వారానికి ఎక్కువ గంటలు పని చేయడం ఆరోగ్యానికి హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ(ILO) అధ్యయనాల నివేదికలూ ఈ విషయాన్నే స్పష్టం చేశాయి.
.. అనధికారికంగా.. ఎక్కువ పని గంటలతో ఉత్పాదకత(Productivity) పెరిగినా.. వారానికి 55-50 గంటల మధ్య పని చేయడం ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమేనని డబ్ల్యూహెచ్‌వో-ఐఎల్‌వో సంయుక్త అధ్యయన నివేదిక స్పష్టం చేసింది’’ అని ఆర్థిక సర్వే వెల్లడించింది. అలాగే.. సుదీర్ఘంగా ఒకే దగ్గర ఎక్కువ గంటలు పని చేయడం మానసిక ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందని సపెయిన్ లాబ్స్ సెంటర్ ఫర్ హుమన్ బ్రెయిన్ అండ్ మైండ్ స్టడీ రిపోర్ట్‌ను ఎకనామిక్ సర్వే హైలెట్ చేసింది.
ఇక.. పని గంటలపై పరిమితులు విధించడం ఆర్థిక వృద్ధికి అవాంతరాన్ని కలిగించొచ్చని సర్వే అభిప్రాయపడింది. అలాగే కార్మికుల సంపాదన సామర్థ్యాన్ని దెబ్బ తీసే అవకాశం లేకపోలేదని తెలిపింది. కాబట్టి సౌకర్యవంతమైన పని గంటల విధానం భారతదేశాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతుందని.. ఈ చర్యలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి తోడ్పడుతుంది అని ఆర్థిక సర్వే సూచించింది.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. అనంతరం 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. బడ్జెట్‌కు ముందర దీనిని ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment