సంస్కరణల మోత.. వృద్ధికి చేయూత! | India FY26 GDP Growth Revealed says Economic Survey 2024-25 | Sakshi
Sakshi News home page

సంస్కరణల మోత.. వృద్ధికి చేయూత!

Published Sat, Feb 1 2025 5:41 AM | Last Updated on Sat, Feb 1 2025 6:43 AM

India FY26 GDP Growth Revealed says Economic Survey 2024-25

ఆర్థిక సర్వే 2024–25 చెబుతోంది ఇదే... 

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 

ఆర్థిక మందగమనానికి తక్షణ చికిత్స అవసరం 

వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి 6.3–6.8 శాతంగా అంచనా 

ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్నాయి... 

2047కల్లా వికసిత దేశంగా అవతరించడమే లక్ష్యం

వచ్చే రెండు దశాబ్దాల పాటు 8% వృద్ధితోనే ఇది సాధ్యం 

జీడీపీలో పెట్టుబడులు 35 శాతానికి పెరగాలి... 

ఇందుకు నియంత్రణల తొలగింపు, సంస్కరణలు కీలకం.. 

భారత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటోందని ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్న నేపథ్యంలో తక్షణం ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేసి, వృద్ధికి చేయూతనివ్వాలంటే... పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న పలు నియంత్రణలను తొలగించడంతో పాటు భూ, కార్మిక తదితర కీలక సంస్కరణలు అమలు చేయాలని తేల్చిచెప్పింది. మరోపక్క, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వినిమయం భారీగా పుంజుకునేలా చర్యలు చేపట్టాలని సూచించింది. మరికొద్ది గంటల్లో మోదీ 3.0 సర్కారు కీలక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో 2024–25 ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించారు. 

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.3–6.8 శాతానికి పరిమితం కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది వృద్ధి 6.4 శాతానికి పడిపోవచ్చని ఇప్పటికే కేంద్రం ముందస్తు అంచనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కరోనా తర్వాత జీడీపీ వృద్ధి రేటు మళ్లీ ఇంతలా బలహీనపడటం ఇదే తొలిసారి. 2023–24 ఏడాదికి వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. 

కాగా, 2024 నాటికి వికసిత భారత్‌ (అభివృద్ధి చెందిన దేశం)గా అవతరించాలంటే వచ్చే ఒకట్రెండు దశాబ్దాల పాటు జీడీపీ ఏటా 8 శాతం చొప్పున వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సర్వే నొక్కి చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించాలంటే పలు రంగాల్లో, ముఖ్యంగా భూ, కార్మిక సంస్కరణలు చేపట్టాలని తెలిపింది. అంతేకాకుండా, జీడీపీలో పెట్టుబడుల శాతాన్ని ఇప్పుడున్న 31 శాతం నుంచి 35 శాతానికి పెంచాల్సిందేనని కూడా పేర్కొంది. తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), రోబోటిక్స్, బయో టెక్నాలజీ వంటి వర్ధమాన టెక్నాలజీల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2027–28లో 5 ట్రిలియన్‌ డాలర్లను, 2029–30లో 6.3 ట్రిలియన్‌ డాలర్లను తాకే అవకాశం ఉంది. 

ధరలు దిగొస్తాయి... 
కొత్త పంట చేతికి రావడం, సీజనల్‌గా కొన్ని కూర గాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇక ఆహార ద్రవ్యోల్బణం శాంతించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం 4%కి అటుఇటుగానే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉండొ చ్చని పేర్కొంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరల సెగ వంటి రిస్కులు పొంచిఉన్నాయని తెలిపింది. 2024 డిసెంబర్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టమైన 5.2%కి దిగొచ్చింది. అయితే, కూరగాయల ధరల మంటతో ఆహార ద్రవ్యోల్బణం ఇంకా భారీగానే 8.4%గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయ రిసు్కలు ఆందోళనకరంగానే ఉన్నా యని కూడా సర్వే పేర్కొంది.

నియంత్రణల సంకెళ్లు తెంచాలి... 
‘మౌలిక రంగంలో పెట్టుబడులను పెంచాలంటే వ్యవస్థలో పాతుకుపోయిన నియంత్రణ సంకెళ్లను తెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు కూడా వ్యాపారాలకు అడ్డంకులుగా నిలుస్తున్న పలు నిబంధనలను సరళీకరించడంతో పాటు పలు రకాల టారిఫ్‌లలో కోత విధించాలి. దేశంలో నవకల్పనలను ప్రోత్సహించి, చిన్న మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎంఈ) రంగానికి దన్నుగా నిలిచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్, సింగపూర్‌ తదితర దేశాల ఆర్థిక విజయంలో ఎస్‌ఎంఈలు కీలక పాత్ర పోషించాయి. అధిక నియంత్రణ వల్ల ఇన్నోవేషన్, ఆర్థికవ్యవస్థ చురుకుదనానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ దిశగా భూ, కార్మిక, తదితర సంస్కరణలు అత్యవసరం’ అని సర్వే పేర్కొంది.

సర్వేలో ఇతర ముఖ్యాంశాలు... 
→ దేశంలో సేవల రంగం మంచి పనితీరును కనబరుస్తోంది. తయారీ రంగం మా త్రం కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటోంది. 
→ ప్రపంచ ఆర్థిక అనిశి్చతిని సైతం తట్టుకుని మన ఫైనాన్షియల్‌ రంగం పురోగమిస్తోంది. బ్యాంకులు లాభాలు మెరుగుపడ్డాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య వ్యత్యాసం తగ్గుతోంది. 
→ పెట్టుబడులకు దన్నుగా, పొదుపులను మదుపుగా మార్చడంలో, సంపద సృష్టిలో మన క్యాపిటల్‌ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2013–14 నుంచి 2023–24 మధ్య ఐపీఓ ద్వారా కంపెనీల లిస్టింగ్‌లు ఆరు రెట్లు పెరిగాయి. ఇప్పుడు స్టాక్‌ మార్కెట్లకు యువ ఇన్వెస్టర్లే చోదక శక్తిగా నిలుస్తున్నారు. 
→ విదేశాల్లో డిమాండ్‌ తగ్గడంతో ఎగుమతుల వృద్ధి మందగించింది. మరోపక్క, దేశీయంగా పటిష్ట డిమాండ్‌తో దిగుమతులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణులు పెరిగిపోవడంతో ప్రపంచ వాణిజ్య ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన ఎగుమతులకు పోటీతత్వం 
పెంచాలంటే వ్యూహాత్మక వాణిజ్య రోడ్‌మ్యాప్‌ అత్యవసరం. 
→ అధిక ప్రభుత్వ వ్యయం, మెరుగుపడుతున్న వ్యాపార విశ్వాసంతో పెట్టుబడులు మళ్లీ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. 
→ సమృద్ధిగా 640 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇది 90 శాతం విదేశీ రుణానికి సమానం, అలాగే దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. 
→ వ్యాపారాలకు సానుకూల వాతావరణం కల్పించేలా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ 2.0లో రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలి. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారంపై ఫోకస్‌ చేయాలి. 
→ అధిక వృద్ధి పథంలో సాగాలంటే వచ్చే రెండు దశాబ్దాల పాటు మౌలిక రంగంలో పెట్టుబడులను దశలవారీగా పెంచాలి. 
→ కార్పొరేట్‌ రంగం సామాజిక బాధ్యత విషయంలో మరింతగా దృష్టి సారించాలి. 
→ పప్పు ధాన్యాలు, నూనెగింజలు, టమాటా, ఉల్లి ఉత్పత్తిని పెంచేలా పరిశోధనలు జరగాలి. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంట రకాలను రూపొందించడంతో పాటు పంట దిగుబడి పెంచి, పంట నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి.

వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం గ్రామీణ డిమాండ్‌కు దన్నుగా నిలుస్తోంది. ఆహార ధరలు శాంతించే అవకాశం ఉండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో వృద్ధి మళ్లీ పట్టాలెక్కనుంది. భౌగోళిక రాజకీయ, వాణిజ్య అనిశి్చతులతో పాటు కమోడిటీ ధరల షాక్‌లు మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ మనదే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే వృద్ధిని పరుగులు పెట్టించాల్సిందే’. 
– వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారు

పటిష్టమైన దేశీ డిమాండ్, పెట్టుబడులు పుంజుకుంటున్న నేపథ్యంలో వృద్ధి కాస్త మెరుగ్గానే (6.5–6.8%) ఉండొచ్చు. వ్యవసాయ దిగుబడుల జోరు, బలమైన సేవల రంగం వృద్ధికి కీలక చోదకాలు. పాశ్చాత్య దేశాల పాలసీలు, భౌగోళిక–ఆర్థిక అడ్డంకులు సరఫరా వ్యవస్థల రూపురేఖలను మార్చేస్తున్నాయి’.         
    – రుమ్కి మజుందార్, డెలాయిట్‌ ఇండియా ఎకనమిస్ట్‌

‘భారత్‌ వృద్ధి రేటు జోరును కొనసాగించాలంటే ప్రపంచ దేశాలతో పోటీతత్వాన్ని పెంచుకోవాల్సిందే. నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణల తొలగింపు ద్వారానే ఇది సాధ్యం’ 
– అదితి నాయర్, ఇక్రా చీఫ్‌ ఎకనమిస్ట్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement