
దేశీయ వ్యవసాయాన్ని రక్షించడానికి, ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు అమలు చేస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ICRIER) ఇటీవల చేసిన అధ్యయనం ఇలాంటి సుంకాలు భారత వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలిపింది. అందులోని కొన్ని కీలక అంశాలను కింద తెలుసుకుందాం.
అంతర్జాతీయ పోటీ నుంచి వివిధ దేశాలు తమ వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకునేందుకు ఆయా అగ్రికల్చర్ దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తున్నాయి. సాగుభూమిని నిర్ధారించేందుకు, గ్రామీణ ఉపాధిని నిర్వహించేందుకు, స్థిరమైన ఆహార సరఫరాను పొందేందుకు ఈ మేరకు చర్చలు తీసుకుంటున్నాయి. ఏదేమైనా ఈ రక్షణ చర్యలు దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల పోటీతత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఐసీఆర్‌ఐఈఆర్ అధ్యయనం వెల్లడించింది.
అధ్యయనంలోని వివరాల ప్రకారం..అధిక సుంకాలు ప్రపంచ మార్కెట్లో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు పోటీని తగ్గిస్తాయి. ఇవి మార్కెట్ సంకేతాలపై ప్రభావాన్ని చూపుతాయి. దాంతో వనరులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. లాభదాయకమైన లేదా స్థిరమైన ప్రత్యామ్నాయాల వైపు వనరులను మళ్లించకుండా రైతులు ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాని పంటలను ఉత్పత్తి చేసే ప్రమాదం ఉంది. అధిక సుంకాలు దిగుమతి చేసుకునే ఉత్పత్తుల ఖర్చును పెంచుతాయి. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. వైవిధ్యమైన ఆహార ఉత్పత్తుల వినియోగాన్ని పరిమితం చేస్తుంది.
అధిక సుంకాలు వాణిజ్య భాగస్వాముల నుంచి ప్రతీకార చర్యలను ప్రేరేపిస్తాయి. ఇది వాణిజ్య యుద్ధాలకు దారితీస్తుంది. దాంతో వ్యవసాయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ సుంకాల పోటీ వాతావారణం దేశీయ రైతులకు ఎగుమతి అవకాశాలను తగ్గిస్తుంది. అధిక సుంకాలు ప్రపంచ సరఫరా గొలుసులో వస్తువుల ప్రవాహానికి అంతరాయం కలిగిస్తాయి. ఇది ఉత్పత్తుల పంపిణీ, లాజిస్టిక్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఇదీ చదవండి: జెన్‌ఏఐ ద్వారా కొలువులు పెంపు
సిఫార్సులు
దేశంలో దిగుమతి అవుతున్న ఆహార పదార్థాలు, వాల్ నట్స్, కట్ చికెన్ లెగ్స్, పాల ఉత్పత్తులు వంటి ఎంపిక చేసిన వస్తువులపై దశలవారీగా సుంకాలను తగ్గించాలి. ఈ విధానం అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ అవకాశాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ దిగుబడులు, పోటీతత్వాన్ని పెంపొందించడానికి వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లో పెట్టుబడులను పెంచడం కీలకం. కోల్డ్ స్టోరేజీ సామర్థ్యాన్ని విస్తరించడం, లాజిస్టిక్స్ మౌలికసదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడం ముఖ్యం. అగ్రికల్చర్ వ్యాల్యూ చెయిన్‌ను ఆధునీకరించడం భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఉత్పాదకతను మెరుగుపరిచి స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.