
భారత్‌లో గడిచిన దశాబ్దకాలంలో పేదరికం తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచబ్యాంకు ఇటీవల విడుదల చేసిన ‘పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ ఆన్ ఇండియా’ రిపోర్ట్‌లో పేదరిక నిర్మూలనలో దేశం సాధించిన పురోగతిని హైలైట్ చేసింది. 2017 పీపీపీ(పర్చేజింగ్ పవర్ పారీటీ-కొనుగోలు శక్తి సమానత్వ సూచీ) నిబంధనల ప్రకారం రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ ఆదాయం సంపాదిస్తున్నవారు ‘తీవ్ర పేదరికం’లో ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల ఆ సూచీని భారత్ గణనీయంగా అధిగమించినట్లు నివేదిక తెలుపుతుంది. 2011-12లో 16.2%గా ఉన్న తీవ్ర పేదరికం 2022-23 నాటికి కేవలం 2.3%కు పడిపోయిందని పేర్కొంది. ఈ మార్పు 17.1 కోట్ల మందిని తీవ్రమైన పేదరికం నుంచి దూరం చేసింది.
పేదరిక నిర్మూలనకు కొన్ని ప్రధాన కారణాలు
దేశంలో 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను విస్తృతంగా పంపిణీ చేయడం వంటి ఆహార భద్రత కార్యక్రమాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. జన్ ధన్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రాష్ట్ర స్థాయి సంక్షేమ పథకాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్స్ (డీబీటీలు) ద్వారా ప్రజలకు సహాయం అందింది. 2022-23, 2023-24 సంవత్సరాలకుగాను గృహ వినియోగదారుల వ్యయ సర్వేల్లో (హెచ్‌సీఈఎస్) ఉపయోగించిన కొత్త పద్ధతులు పేదరిక గణాంకాలను మరింత కచ్చితంగా తెలియజేశాయి.
తీవ్ర పేదరికానికి అతీతంగా..
తక్కువ, మధ్య ఆదాయ దేశంలో పేదరికాన్ని కొలిచేందుకు రోజుకు 3.65 డాలర్ల (పీపీపీ) సంపాదనను బెంచ్‌మార్క్‌గా తీసుకుంటారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే భారత్‌లో 2011-12లో 61.8 శాతంగా ఉన్న పేదరికం 2022-23 నాటికి 28.1 శాతానికి పడిపోయింది. ఈ దశాబ్దంలో 37.8 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.
అసమానతలు..
వినియోగ ఆధారిత అసమానతలు తగ్గినప్పటికీ, దేశంలో ఆదాయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2023-24లో సంపాదనలో దిగువన ఉన్న 10% ప్రజల కంటే టాప్‌లో నిలిచిన 10% మంది 13 రెట్లు అధికంగా సొమ్ము కూడగట్టుకున్నారు. పట్టణ-గ్రామీణ వినియోగంలో వ్యత్యాసం 2011-12లో 84% నుంచి 2023-24 నాటికి 70%కి తగ్గింది. అయినప్పటికీ గణనీయమైన అసమానతలు కొనసాగుతున్నాయి. దేశంలో పేదరికాన్ని కట్టడి చేసేందుకు ‘ఉచితాలు’ లేదా సంక్షేమ పథకాల్లోని అంశాలను మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు.. లాభామా? నష్టమా?
పరిష్కారాలు
దేశంలో పేదరికాన్ని తగ్గించడానికి సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే ఆర్థిక అసమానతల మూల కారణాలను పరిష్కరించాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటి ప్రకారం.. తయారీ, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం వంటి పరిశ్రమలను ప్రోత్సహించి మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించాలి. రుణాలు, సబ్సిడీలు, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ల ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ ఎంఈ) మద్దతు ఇవ్వాలి. నాణ్యమైన విద్యను విస్తరించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వేతనంతో కూడిన ఉద్యోగాల కోసం వ్యక్తులకు తగిన నైపుణ్యాలు అందించాలి. శిశుసంరక్షణ సౌకర్యాలు, సురక్షితమైన పనివాతావరణాలు, ఆర్థిక స్వాతంత్ర్య కార్యక్రమాలను అందించడం ద్వారా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.