‘హోదా’ హిమాచల్ వృద్ధి పథం
అభివృద్ధిలో అట్టడుగునున్న పర్వత రాష్ట్రం ప్రత్యేక హోదాతో శరవేగంగా వృద్ధి చెందింది. కేంద్ర నిధులు వెల్లువెత్తాయి. ప్రత్యేకించి వాటిలో 90 శాతం గ్రాంటు కావడం సంజీవనిలా పని చేసింది. దీంతో హిమాచల్ ముఖచిత్రమే మారిపోయింది. పన్నెండేళ్ల కిందటి ఆపిల్ రాష్ట్రం పారిశ్రామిక రాష్ట్రమైంది. పెద్ద ఎత్తున విద్య, ఉద్యోగ అవకాశాలు ఏర్పడి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. మానవాభివృద్ధిలో అది దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలనలో, అక్షరాస్యతలో, సంతులిత వృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
హిమాచల్‌ప్రదేశ్ 1971లో పంజాబ్ నుంచి విడిపోయిన తరువాత అనాథలా మిగిలింది. ప్రధానంగా పర్వతప్రాంతంగా ఉండి, చదునైన నేల లేని ఆ రాష్ట్రాభివృద్ధి అసాధ్యమేమోనని ఆనాడు అనినిపించింది. వనరులు పరిమితం, పైగా ఎక్కడికి వెళ్లాలన్నా సరైన రోడ్డు మార్గమే లేని దుస్థితి. జనసాంద్రత అతి తక్కువగా ఉన్న (చదరపు కిలోమీటరుకు 123 మంది) ఆ రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు కన్నెత్తిచూడని పరిస్థితి. పారిశ్రామిక వాడలు, రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధికి, ప్రోత్సాహకాలు, రాయితీలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగినన్ని ఆర్థికవనరులు లేవు. దీంతో హిమాచల్ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది. విద్య, వైద్యం, రవాణా, పారిశ్రామికరంగాల్లో అట్టడుగు స్థాయికి చేరింది.
హిమాచల్ అంటే ఆపిల్ పళ్లు అని తప్ప మరేమీ చెప్పుకోలేని పరిస్థితి. కానీ నేడది సగర్వంగా మానవాభివృద్ధిలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలనలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ ప్రశంసలను అందుకుంటోంది. రోడ్లు, తదితర మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లోనూ శరవేగంగా వృద్ధి చెందుతోంది. పైగా తలసరి ఆదాయంలో జాతీయ స్థాయినే (రూ.88,538) అధిగమించి రూ.1,04,943 తలసరి ఆదాయాన్ని నమోదు చేసింది. ఇదంతా నాలుగున్నర దశాబ్దాలలో సాధించిన అభివృద్ధి అనుకుంటే పొరపాటు. కేవలం పన్నెండేళ్లలో జరిగిన అద్భుతం. ప్రత్యేక హోదా సృష్టించిన అద్భుతం.
మంత్ర దండంగా మారిన ప్రత్యేక హోదా
2003లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం హిమాచల్‌ప్రదేశ్ ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను గుర్తించి ఉత్తరాఖండ్‌తోపాటు దానికి కూడా ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించింది. దీంతో హిమాచల్ దశ, దిశా మారాయి. అభివృద్ధిలో అట్టడుగున నిలిచిన పర్వత రాష్ట్రం ప్రత్యేకహోదాతో రాకెట్లా దూసుకుపోవడం ప్రారంభించింది. హోదా రావడంతోనే నిత్య వనరుల కొరతకు మారుపేరైన ఆ రాష్ట్రానికి కేంద్ర నిధులు వెల్లువెత్తాయి. ప్రత్యేకించి ప్రత్యేక హోదావల్ల కేంద్ర నిధుల్లో 90 శాతం గ్రాంటుగా లభించడం సంజీవనిలాగా పనిచేసింది. రూ.36,000 కోట్లకు పైగా వచ్చిన గ్రాంట్ల నిధులతో భారీస్థాయిలో మౌలికసదుపాయాల నిర్మాణం చేపట్టారు. పట్టణాలకే సరైన రోడ్లు లేని రాష్ట్రంలో ఎక్కడో కొండకోనల్లోని గ్రామాలకు సైతం రోడ్డు రవాణా సదుపాయాలు విస్తరించాయి. బయటి ప్రపంచంతో హిమాచల్‌కు, ప్రత్యేకించి రైతాంగానికి, సంబంధాలు పెరిగాయి.
విద్య, వైద్యసదుపాయాలను వినియోగించుకునే అవకాశం ప్రజలకు కలిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సైతం కేంద్రం 90 శాతం నిధులను సమకూరిస్తే, రాష్ట్రం 10 శాతం మాత్రమే భరించేది. 12వ ఆర్థిక సంఘం 2005 నుంచి 2010 వరకు హిమాచల్‌కు రూ.14,450 కోట్ల గ్రాంట్లు విడుదల చేయగా, 2010 నుంచి 15 వరకు 13వ ఆర్థిక సంఘం రూ.21,691 కోట్ల గ్రాంట్లను సిఫారసు చేసింది. వీటితో పాటు ఈఏపీ (ఎక్సటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్) నిధుల కింద బయట నుంచి వరల్డ్ బ్యాంకు లాంటి సంస్థల నుంచి రుణాలు తీసుకునే అవకాశం లభించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది పథకాల కోసం ఈఏపీ కింద రూ.12,040 కోట్ల రూపాయలు సమ కూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో లక్ష్యంగా నిర్దేశించుకుంది.
శరవేగంతో పారిశ్రామిక వృద్ధి
కేవలం 64 లక్షల జనాభా (2003 నాటికి) ఉన్న హిమాచల్ ప్రత్యేక హోదా రావడంతోనే పారిశ్రామిక ప్యాకేజీలను, రాయితీల వరాలను కురిపించింది. దీంతో రూ.60 వేల కోట్ల మేరకు పారిశ్రామిక ఒప్పందాలు కుదిరి, ఆరు లక్షల ఉద్యోగవకాశాలకు భరోసానిచ్చాయి. వాటిల్లో రూ.16,533 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభం కాగా, మూడు లక్షల మందికిపైగా ఉద్యోగాలు దొరికాయి. మరో లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. అందువల్లనే హిమాచల్ తలసరి ఆదాయం జాతీయ సగటును మించిపోయింది. 40 వేలకుపైగా పరిశ్రమలతో పారిశ్రామికరంగంలో ముందుకు దూసుకుపోతోంది.
వాటిలో 90 శాతం 2003 తర్వాత ఏర్పడ్డవి!
పదేళ్లపాటు ఎక్సైజ్ డ్యూటీ 100 శాతం మినహాయింపు, ఆదాయపు పన్ను మినహాయింపుతో పాటు రూ.30 లక్షల వరకు కేంద్రం సబ్సిడీలు అందించింది. ప్రత్యేక హోదా పారిశ్రామికవేత్తలకు స్పెషల్ టానిక్‌గా పని చేసింది. హోదా భరోసాతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని ప్రోత్సాహకాలు అందజేసింది. చౌక ధరకే నిరంతర విద్యుత్, అత్యాధునిక సాకేతికతతో అభివృద్ధి చేసిన పారిశ్రామిక ప్రాంతాలు, స్నేహపూర్వక అధికార యంత్రాం గం, వాతావరణం ఉండటంతో ఫార్మా, టెక్స్టైల్స్, ఆపిల్, హెర్బల్స్, మెటల్ తదితర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఇక్కడి పరిశ్రమలు ఎదిగాయి. గత ఏడాది ఎగుమతుల టర్నోవర్ రూ.1,010 కోట్లని అంచనా. ఎగుమతులు, వస్తు తయారీ రంగాల ఫలితంగా రాష్ట్ర జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా 17 శాతానికి పెరిగింది.
పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో వాటి అవసరాలకు తగిన మానవ వనరులను సిద్ధం చేయడం ఆవశ్యకమైంది. ఫార్మా కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం 14 కొత్త విద్యా సంస్థలను నెలకొల్పి, డిప్లొమా, డిగ్రీ ఫార్మా కోర్సులను రూపొందించి విద్యార్థులకు శిక్షణనిస్తోంది. అలాగే ఇంజనీరింగ్, ఐటీఐ కాలేజీలను ఏర్పాటు చేసింది. పారిశ్రామికీకరణ తొలినాళ్లలో వివిధ సంస్థలు ఇతర రాష్ట్రాల వారిని ఉద్యోగాల్లోకి తీసుకోక తప్పలేదు. ఇప్పుడు హిమాచల్ విద్యార్థులే అక్కడి పరిశ్రమలకు అవసరమైన వివిధ రకాల నైపుణ్యాలను కలిగిన ఉత్తమ మానవ వనరుల వనరుగా మారారు. ఉద్యోగావకాశాలూ విస్తృతంగా లభిస్తున్నాయి.
ప్రత్యేక హోదాకు ముందు - తర్వాత
ప్రత్యేకహోదాతో వచ్చిన ప్యాకేజీతో పారిశ్రామిక రంగంలో హిమాచల్‌ప్రదేశ్ అత్యధికంగా 20.15 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. కాగా ఉత్తరాఖండ్ 18.28 శాతం, జమ్మూకశ్మీర్ 11.20 శాతం వృద్ధిని సాధించగలిగాయి. ఇదే సమయంలో హర్యానా 3.77 శాతం, యూపీ 5.48 శాతం, పంజాబ్ 7.8 శాతం మాత్రమే వృద్ధి సాధించగలిగాయి. జాతీయ వృద్ధిరేటు కేవలం 6.49 శాతమే! ప్రత్యేకహోదాతో లభించే ప్యాకేజీ ప్రభావం ఎలాంటిదో దీన్నిబట్టి సులభంగానే అంచనా వేయొచ్చు. ఇక పారిశ్రామికరంగంలో కూడా ఇదే వృద్ధి కనిపించింది.
ఆదర్శంగా మారుతున్న నిన్నటి ఆపిల్ రాష్ట్రం
ప్రత్యేక హోదాతో హిమాచల్ ముఖ చిత్రమే మారిపోయింది. పన్నెండేళ్ల కిందటి ఆపిల్ రాష్ట్రం ఇప్పుడు పారిశ్రామిక రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. పారిశ్రామికీకరణ ఫలితంగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడడంతో ప్రజల జీవనప్రమాణాలు మెరగయ్యాయి. ప్రత్యేక హోదాకు ముందు మానవాభివృద్ధిలో ఎనిమిదో స్థానంలో నిలబడిన హిమాచల్ ఆ తర్వాత జరిగిన అభివృద్ధితో మూడో స్థానానికి ఎగబాకింది. సమ్మిళిత అభివృద్ధి, ఆదాయపంపిణీతో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటు లోకి వచ్చాయి. అన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం ఏర్పడడంతో రవాణా, విద్య, వైద్య సేవలు అందుకునేందుకు ప్రజలకు వీలుకలిగింది. మాతా,శిశు మరణాలు తగ్గాయి. పిల్లలందరికీ టీకాలు వేయించగలిగారు. మధ్యలో బడి మానివేసే విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గింది. అక్షరాస్యతలో కేరళ తర్వాత హిమాచల్ రెండో స్థానంలో నిలిచింది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు హిమా చల్కు తరలివచ్చాయి.
వందలాదిగా కొత్త ఐటీఐలు ఏర్పడ్డాయి. ‘స్కేలింగ్ ది హైట్స్’ అనే పేరుతో వరల్డ్ బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదిక హిమా చల్ అభివృద్ధిని ప్రశంసించింది. 1993లో 36.8 శాతంగా ఉన్న పేదరికం ప్రస్తుతం 8.5 శాతానికి తగ్గింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పేదరిక నిర్మూలన జరగలేదని వరల్డ్ బ్యాంకు పేర్కొంది. ఈ స్థాయి పేదరిక నిర్మూలనకు ప్రత్యేక హోదా, దానివల్ల జరిగిన పారిశ్రామికాభివృద్ధే కారణం. ఆర్థికవృద్ధిని, మానవాభివృద్ధిని సమతూకంగా సాధించడమే కాదు, పర్యావరణానికి హాని కలగకుండా పారిశ్రామికీకరణ జరగడం మరొక రికార్డు. హిమాచల్ మహిళల్లో ఉపాధి 63 శాతం ఉండడం విశేషం. జాతీయ సగటు 27 శాతం! దీంతో కుటుంబాలన్నీ ఆర్థికంగా బలప డ్డాయి. మాతా, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. జీవన ప్రమాణాలు మెరుగై సగటు జీవిత కాలం 3.4 సంవత్సరాల మేరకు పెరగడం విశేషం.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగు కావడంతో జీవన ప్రమాణాల స్థాయి పెరిగింది. ఈ మౌలిక సదుపాయలను కల్పించేందుకు అవసరమైన నిధులు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదాతోనే సాధ్యమైంది. కేంద్రం నుంచి, బయటి సంస్థల నుంచి వచ్చిన గ్రాంట్లు, అదనపు నిధులతో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు రోడ్లు, విద్యుత్, వైద్యం, విద్య సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ హిమాచల్‌కు కొన్ని సవాళ్లు ఎదురువుతున్నాయి. నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణలోటు కారణంగా ఆయా రంగాల్లో యువతకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు సరైన విధాననిర్ణయాలు తీసుకోవాలని వరల్డ్‌బ్యాంకు నివేదిక సూచిస్తోంది.
(సిమ్లా నుంచి ‘సాక్షి’ టీవీ ప్రిన్సిపల్ కరస్పాండెంట్) మొబైల్: 9911042464
- నాగిళ్ల వెంకటేశ్