
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి భారత్-పాక్‌ల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయడంతో సహా కఠిన చర్యలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు భారత్ ఇప్పటికే కొన్ని చర్యలు అమలు చేసింది.
అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ మూసివేత
చారిత్రాత్మకంగా భారత్-పాకిస్థాన్ మధ్య వాణిజ్యం సవాళ్లతో కూడుకున్నది. 2019లో పుల్వామా దాడి తరువాత పాక్ వస్తువులపై భారతదేశం 200% సుంకాన్ని విధించింది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయం దెబ్బతినేందుకు దారితీసింది. ఇటీవల జరిగిన పహల్గాం దాడి ఈ వాణజ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలకు కీలకంగా ఉన్న అట్టారి వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను మూసివేసేందుకు కారణమైంది. ఈ మూసివేతతో సుమారు రూ.3,800 కోట్ల విలువైన సీమాంతర వాణిజ్యం నిలిచిపోనుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రెండు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అయితే భారత్ శత్రదేశంతో ఎలాగో విభేదాలు తలెత్తుతాయనే ఉద్దేశంలో కొన్నేళ్లుగా క్రమంగా వాణిజ్యాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోవడం భారత్‌పై పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పరోక్ష వాణిజ్యం
అధికారిక ఆంక్షలు ఉన్నప్పటికీ భారత వస్తువులు దుబాయ్, సింగపూర్ వంటి థర్డ్ పార్టీ మార్గాల ద్వారా పాకిస్థాన్‌కు చేరుకుంటూనే ఉన్నాయి. ఇది వాణిజ్య నెట్‌వర్క్‌ల భద్రతను హైలైట్ చేస్తుంది. ఏదేమైనా అటువంటి పరోక్ష వాణిజ్యం నైతిక, రాజకీయ చిక్కులకు కారణమవుతుందనే వాదనలున్నాయి. పహల్గాం దాడి దౌత్యపరమైన విభేదాలకు కూడా దారితీసింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత్.. పాక్ పౌరులకు వీసాలను రద్దు చేసింది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలని భారత్ సంకల్సిస్తోంది.
ఇదీ చదవండి: వాట్సప్ యూజర్లే లక్ష్యంగా కొత్త మోసం!
భారత్ నుంచి పాకిస్థాన్‌కు జరిగే ఎగుమతులు ప్రధానంగా..
సేంద్రీయ రసాయనాలు
ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు
చక్కెర, మిఠాయిలు
యంత్రాలు, వస్త్రాలు
కాఫీ, టీ, మసాలా దినుసులు
2023లో పాకిస్థాన్‌కు భారతదేశ ఎగుమతుల విలువ సుమారు 523.22 మిలియన్ డాలర్లు.
సేంద్రీయ రసాయనాలు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ఇందులో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి.
పాకిస్థాన్ నుంచి భారత్‌కు దిగుమతులు
ఉప్పు, సల్ఫర్, సున్నం
సిమెంట్
జౌళి ఉత్పత్తులు
2023లో పాకిస్థాన్ నుంచి దిగుమతుల విలువ 2.27 మిలియన్ డాలర్లు.