
ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ఎగుమతులు, దిగుమతులపై నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వుల్ని జారీ చేసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్థిక మూలాలను చావు దెబ్బ తీసే ప్రయత్నాల్ని భారత్ ముమ్మరం చేసింది. తాజాగా పాకిస్తాన్ అధికారిక, అనధికారిక దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ పరిమితిని విధించింది. అయితే, ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు అమానుషంగా 26 మంది టూరిస్టుల ప్రాణాల్ని బలితీసుకున్నారు. ఈ దాడి తర్వాత భారత్,పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నాటి నుంచి వరుస కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్‌ను భారత్ దెబ్బకు దెబ్బ తీస్తోంది.

ముందుగా సరిహద్దు దాటిన ఉగ్రవాదం అని పేర్కొంటూ సింధు జల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ జాతీయుల అన్ని వీసాలను రద్దు చేసింది. పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత గగనతలంలో పాక్ విమానాలపై నిషేధం విధించింది. భారత్‌లో పాక్ దేశ మీడియా,సోషల్ మీడియా అకౌంట్స్‌పై బ్యాన్ విధించింది. ఇప్పుడు పాకిస్తాన్‌పై వాణిజ్య యుద్ధం ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్న కేంద్రం పేర్కొంది.