
యజమాని దంపతుల దెబ్బలకు తాళలేక చనిపోయిన బాలిక
పాకిస్తాన్‌లో దారుణం
రావల్పిండి: పాకిస్తాన్‌లో పేదరికం కారణంగా చిన్నతనంలోనే బాలకార్మికులుగా ఇంటిపని చేసే చిన్నారుల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ 13 ఏళ్ల బాలికను ఆ ఇంటి యాజమానులు చితకబాదడంతో గాయాలపాలై ఆ అమ్మాయి చనిపోయిన ఘటన ఆగ్నేయ పాకిస్తాన్‌లో గత బుధవారం సాయంత్రం జరిగింది.
రావల్పిండిలో నమోదైన ఈ కేసులో యజమాని రషీద్ షఫీఖ్, ఆయన భార్య సనా, వాళ్ల ఖురాన్ బోధకుడినీ పోలీసులు అరెస్ట్‌చేశారు. బాలిక కాళ్లు, చేతులు, చీలమండ పలు చోట్ల విరిగినట్లు పోస్ట్‌మార్టమ్ ప్రాథమిక నివేదికలో తేలింది. సమగ్ర నివేదిక ఇంకా రావాల్సి ఉంది. బాలిక ఇఖ్రా పనిచేస్తున్న యజమాని దంపతులకు 8 మంది సంతానం. వాళ్ల బాగోగులు, ఇంటి పనులు చూసుకునేందుకు రెండేళ్ల క్రితం వాళ్లింట్లో ఇఖ్రా పనికి కుదిరింది.
జీతంగా నెలకు దాదాపు రూ.2,430 ఇచ్చేవారు. చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ ఇఖ్రాను దారుణంగా హింసించారని పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు తీవ్రగాయమైనట్లు సంబంధిత వీడియోల్లో తెలుస్తోంది. అన్నపానీయాలు ఇవ్వకుండా కడుపు మార్చారని, కట్టేసి కొట్టారని, చపాతీలు చేసే కర్రతో కొట్టడంతో పుర్రె పగిలిందని వార్తలొచ్చాయి. బాలిక మరణవార్త తెల్సి దేశవ్యాప్తంగా వేలాది మంది బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఇఖ్రాకు న్యాయం జరగాలని డిమాండ్‌చేశారు. తన బిడ్డ మరణాన్ని 45 ఏళ్ల రైతు సనా ఉల్లాహ్ ఏడుస్తూ చెప్పారు. ‘‘నా కుమార్తె ఆరోగ్యం బాలేదని పోలీసులు ఫోన్‌చేసి ఆస్పత్రికి రమ్మన్నారు. వచ్చి చూస్తే ఆస్పత్రి బెడ్‌పై ఇఖ్రా చలనంలేకుండా పడి ఉంది. కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోయింది. నాకున్న అప్పు తీర్చుకునేందుకు గతిలేక ఇఖ్రాను పనికి పంపించాను’’అంటూ తండ్రి దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చారు. తండ్రి అప్పులు తీర్చేందుకు, ఇంట్లో ఖర్చులకు పనికొస్తాయనే ఉద్దేశ్యంతో ఇఖ్రా ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే పనులకు వెళ్లడం మొదలెట్టింది.
పేదరికంలో మగ్గిపోతున్న బాలకార్మికుల కుటుంబాలు ఇలాంటి సందర్భాల్లో న్యాయం కోసం తుదికంటా పోరాటం చేయడం పాకిస్తాన్‌లో చాలా అరుదు. నిందితులను దేవుడే క్షమిస్తాడని మనసును రాయి చేసుకుని ఆ దోషులు నష్టపరిహారంగా ఇచ్చే ఏంతో కొంత మొత్తాలను తీసుకుని కోర్టుల బయటే రాజీ కుదుర్చుకోవడం పాకిస్తాన్‌లో పరిపాటిగా మారింది. ఇఖ్రా కేసు సైతం చివరకు ఇలాంటి ‘పరిష్కారం’దిశలో పయనిస్తుందని పలువురు సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం పాకిస్తాన్‌లో 33,00,000 మంది బాలకార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో ఇంటిపనుల్లో నిమగ్నమైన మొత్తం 85 లక్షల మంది కార్మికుల్లో అత్యధిక శాతం మంది మహిళలు, బాలికలేనని అంతర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్‌ఓ) పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment