వలస బాటపడుతున్న మత్స్యకార బాలలు
ఇప్పుడు వంటపనికి... రాబోయే రోజుల్లో వేటకు
ఆర్థిక అవసరాలకోసం తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్న వైనం
పేదరికం కారణంగా చదువుకు దూరం
వేళ్లూనుకుంటున్న బాలకార్మిక వ్యవస్థ
పేదరికం వారిపాలిట శాపంగా మారుతోంది. ఏడాది పొడవునా పనిదొరక్క ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పిల్లల్ని వలసబాట పట్టించాల్సిన దుస్థితి దాపురించింది. చిన్నతనంలో వంటపనివారిగా... రాబోయే కాలంలో చేపలవేట కార్మికునిగా మార్చాల్సి వస్తోంది. విలువైన వారి బాల్యం బందీగా మార్చి చదువుకు దూరం చేస్తోంది.
ఎచ్చెర్ల: జిల్లాలోని విశాల తీరప్రాంతంలో వేలాది మత్స్యకార కుటుంబాలకు వేటే జీవనాధారం. పరిస్థితుల ప్రభావం... ప్రకృతి సహకరించకపోవడం వారి పాలిట శాపంగా మారుతోంది. వేటకు దూరం కావాల్సి వస్తోంది. ఈ తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో వారు వలస వెళ్లాల్సి వస్తోంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకు 194 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన తీరప్రాంతంలోని 12 మండలాల్లో 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 98,450 మంది జనాభా ఉండగా, 53,469 మందికి చేపల వేటే ప్రధాన వృత్తి. 1225 ఇంజిన్ బోట్లు, 2598 సంప్రదాయ నాటుపడవలు వేటకు వినియోగిస్తున్నారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేట నిషేధం అమలవుతుంది. ఈ రోజుల్లో జీవనభృతికోసం గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అక్కడ చేపలు వేటాడితే కాంట్రాక్టర్లు రూ.20 వేల వరకు నెలకు జీతం చెల్లిస్తారు.
ఇదే అదనుగా పిల్లల తరలింపు
ఇదే తరుణంలో 15ఏళ్ల లోపు పిల్లలు చదువుకు స్వస్తి చెప్పి వలసలు వెళ్తున్నారు. వారి తల్లిదండ్రులు కాంట్రాక్టర్లనుంచి రూ.50 వేలు వరకు అడ్వాన్స్ తీసుకొని గుజరాత్‌లోని వీరావల్, సూరత్, మహారాష్ట్రలోని ముంబాయి, పూనే వంటి ప్రాంతాలకు పంపిస్తారు. వీరు అక్కడ వంట మనుషులుగా పనిచేస్తారు. అందుకు నెలకు రూ.5వేల వరకు జీతంగా వస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ వీరూ చేపల వేట నేర్చు కుని ఆ వృత్తిలోకి మారుతారు. ఈ విధంగా పిల్లల బాల్యం మసకబారుతోంది. చదువుకు దూరమై వలస కార్మికులుగా మారిపోతున్నారు.
స్వచ్ఛంద సంస్థల సర్వేతో...
ఎచ్చెర్ల మండలంలో డి.మత్స్యలేశం, బడేవానిపేట, బుడగట్లపాలెం అనే మూడు మత్స్యకార గ్రామ పంచాయతీలున్నాయి. ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు నిర్మూలనకు పాటుపడుతోంది. పాఠశాలకు ఈ మధ్య విద్యార్థులు వెళ్లకపోవటాన్ని గుర్తించిన ఈ సంస్థ దీనిపై ఆరా తీయగా విద్యార్థులు వలస వెళ్లిన విషయం వెలుగు చూసింది. వెంటనే వారు జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా ఈ మూడు పంచాయతీల్లో 70 మంది విద్యార్థులను వలస వెళ్లకుండా ముస్కాన్, ఐసీడీఎస్, పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ శాఖలు అడ్డుకున్నాయి. దీనిపై పిల్లల తల్లిదండ్రులు గుర్రుగా ఉన్నారు. అయితే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ద్వారా వలసలను శాశ్వతంగా నివారించవచ్చన్నది నిపుణుల సూచన.
బాలల భవిష్యత్తు దెబ్బ తింటుంది
మత్స్యకార గ్రామాల్లో బాలకార్యిక వ్యవస్థ, బాల్య వివాహాలు రెండూ ప్రధాన సమస్యలు. ఈ రెండింటిపైనా ప్రజలను చైతన్య పరుస్తున్నాం. తల్లిదండ్రులు తమ ఆర్థిక అవసరాలకోసం పిల్లలను వలస పంపిస్తున్నారు. దీనివల్ల వారి భవిష్యత్తు దెబ్బ తింటుంది. చదువు విలువ సైతం ప్రజలకు తెలియటం లేదు. దీనిపై వారిని చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం అధికారులు చర్యలు చేపట్టాలి. 10వ తరగతి వరకు మత్స్యకార గ్రామాల్లో నిర్బంధ విద్య అమలు చేయాలి.
- గురుగుబెల్లి నరసింహమూర్తి, హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్, కార్యదర్శి
బాల్యం బందీ
Published Wed, Aug 12 2015 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM
Advertisement
Advertisement