పేదరిక స్థాయిని బట్టి ర్యాంకులు
ఏడు ప్రశ్నల ద్వారా అర్హుల నిర్ధారణ
మొబైల్ యాప్ ద్వారా జాబితా సిద్ధం
95 శాతం ప్రక్రియ పూర్తి
21 నుంచి 25 వరకు గ్రామ సభల్లో చర్చ
మార్పులు చేర్పులతో తుది జాబితా ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఏడు ప్రశ్నలతో పేదరిక స్థాయి నిర్ధారణ.. దాని ఆధారంగా ర్యాంకుల కేటాయింపు.. ఆ ర్యాంకులను బట్టి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి స్థూలంగా చేపట్టిన ప్రక్రియ ఇది.
ఏడాది క్రితం ప్రజా పాలన కింద అందిన 80.63 లక్షల దరఖాస్తుల నుంచి గ్రామాలవారీగా అర్హుల జాబితాను మొబైల్‌యాప్ ద్వారా సిద్ధం చేసే ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ నెల 21 నుంచి 25 వరకు జరిగే గ్రామ సభల్లో ఈ జాబితాపై చర్చించి మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించే లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిరుపేదల నిర్ధారణకు ఏడు ప్రశ్నలు
అసలైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని కృత నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. దరఖాస్తులను మాన్యువల్‌గా కాకుండా మొబైల్ యాప్ ద్వారా జల్లెడ పట్టి ప్రాథమిక జాబితాలు సిద్ధం చేసింది. ఈ యాప్‌లో ఏడు రకాల ప్రశ్నలను నిక్షిప్తం చేశారు. దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందులోని వివరాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను సరిచూసి యాప్‌లో పొందుపరిచారు.
అందరికంటే పేదలు, ఇందిరమ్మ ఇల్లు అవసరం ఉన్నవారి వివరాలను ప్రాధాన్యత క్రమంలో సిద్ధం చేశారు. గ్రామాలవారీగా అర్హులు.. వారిలో ముందు వరుసలో ఉన్నవారిని గుర్తించి ఓ జాబితాను రూపొందించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే 95 శాతం పూర్తయింది. మరో ఐదారు రోజుల్లో మొత్తం పూర్తి చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
పేదరిక స్థాయి ఆధారంగా ర్యాంకులు..
పేదల్లో నిరుపేదలు, ఇంటి అవసరం ఎక్కువగా ఉండి.. దానిని సమకూర్చుకునే స్తోమత లేనివారి జాబితాను ప్రాధాన్యతా క్రమంలో రూపొందించారు. వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి ఆధారంగా యాప్‌లో కొన్ని ర్యాంకులు కేటాయించారు. తొలుత ఏడు ప్రశ్నలకు సమాధానాలు సేకరించటం ద్వారా పేదరికాన్ని నిర్ధారిస్తారు. సొంత ఇల్లు ఉందా లేదా? ఉంటే దాని పైకప్పు ఎలాంటిది? ఇంటి విస్తీర్ణం, కుటుంబ ఆదాయం, వృత్తి, ఆదాయ మార్గం లాంటి వివరాలతో కుటుంబ స్థాయిని ధ్రువీకరిస్తారు.
ఈ ప్రశ్నలతోపాటు ఆధార్ కార్డు ఆధారంగా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి, గతంలో ప్రభుత్వ పథకంలో ఇల్లు పొందిందీ లేనిదీ.. తదితర వివరాలు సేకరిస్తారు. ఇంటి పన్ను, ఆదాయ పన్ను చెల్లింపు, కారు లాంటి పెద్ద వాహనం ఉందీ లేనిదీ, బ్యాంకు రుణాల వంటివాటిని గుర్తిస్తారు. పట్టాదారు పాసుపుస్తకం ఉంటే భూమి వివరాలను కూడా సేకరిస్తారు. ఇలా 360 డిగ్రీల కోణంలో వివరాల సేకరణ ఉంటుంది.
నిరుపేద వితంతువు, సంపాదన మార్గం లేనివారు, దివ్యాంగులు, సఫాయి కర్మచారీలు, పనికి ఆహార పథకం కూలీలు, వ్యవసాయ కూలీలు, సాధారణ కూలీలకు ర్యాంకులు కేటాయించటం ద్వారా పేదల్లో నిరుపేదలకు ఎక్కువ ర్యాంకు ఇస్తారు.
21 నుంచి గ్రామ సభలు..
యాప్ ద్వారా రూపొందించిన జాబితాను అధికారులు జిల్లా కలెక్టర్లకు పంపుతున్నారు. కలెక్టర్లు వాటిని సరిచూసుకుని ప్రాధాన్యతా క్రమంలో అర్హుల జాబితాను రూపొందించి జిల్లా ఇన్‌చార్జి మంత్రికి అందిస్తారు. గ్రామాలవారీగా లబ్ధిదారుల జాబితాను రూపొందించి గ్రామ సభలో ప్రదర్శనకు ఉంచుతారు.
ఈ నెల 21 నుంచి 25 వరకు జరిగే గ్రామ సభల్లో ఆ జాబితాపై చర్చిస్తారు. అందులో వచ్చే అభ్యంతరాల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి తుది జాబితాను ఖరారు చేసి గ్రామ సభ ఆమోదం తీసుకుంటారు.
ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపి.. జాబితాలోని వారికి ఇళ్లను మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుంది. పునాదుల ప్రక్రియ పూర్తయ్యాక తొలివిడత రూ.లక్షను విడుదల చేస్తారు.
పరిశీలించే అంశాలు..
360 డిగ్రీల వెరిఫికేషన్
ఇంటి పన్ను, ఆదాయపన్ను కడుతున్న వారు.. కారు ఉన్నవారు.
ఆధార్ ద్వారా..
పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా భూమి వివరాలు
పేదరిక ర్యాంకు
వితంతువు, సింగిల్ చైల్డ్, దివ్యాంగులు,సఫాయి కర్మచారీ, పనికి ఆహారపథకం కూలీలు,వ్యవసాయ కూలీలు.
Comments
Please login to add a commentAdd a comment