
మెటీరియల్ నాణ్యత, ఫ్యాకల్టీ ప్రమాణాలు పెంచేందుకు కేంద్రం కసరత్తు
కోచింగ్ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లకు వర్తింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి అనంతరం డిజిటల్ ఎడ్యుకేషన్‌పై ఆధారపడటం బాగా పెరిగింది. హోం ట్యూషన్లు మొదలు సివిల్స్ కోచింగ్ వరకు అంతా వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లలో ఆన్‌లైన్ కోచింగ్‌లు సర్వసాధారణంగా మారాయి. అయితే, ఒక్కో కోచింగ్ సెంటర్ ఒక్కో తరహా మెటీరియల్‌ను తమ ఇష్టానుసారంగా తయారు చేసి వినియోగదారులకు అందిస్తోంది. ఆన్‌లైన్‌లో కోచింగ్ క్లాస్‌లు తీసుకునే ఫ్యాకల్టీ విద్యార్హతలపైనా ఎక్కడా పెద్దగా పట్టింపు లేదు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ కోచింగ్ సెంటర్లకు, వారు ఇచ్చే మెటీరియల్ నాణ్యత, ఫ్యాకల్టీ నిపుణత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ను రంగంలోకి దించేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆన్‌లైన్ కోచింగ్ తీసుకునే విద్యార్థులను సైతం వినియోగదారులుగా పరిగణిస్తూ బోధనతోపాటు ప్రొఫెషనల్ కంటెంట్ తయారీలోనూ నాణ్యత పెంచడమే ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. బీఐఎస్ మార్క్ తీసుకురావడం వల్ల ఆన్‌లైన్‌లో విద్యాప్రమాణాలు మెరుగయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విద్యార్థులు సైతం ఆన్‌లైన్ కోచింగ్ సెంటర్ల ద్వారా పొందే స్టడీ మెటీరియల్ తగిన విధంగా ఉండేలా యాజమాన్యం సైతం జాగ్రత్తలు తీసుకుంటుందని పేర్కొంటున్నారు. నానాటికీ ఆన్‌లైన్ కోచింగ్ సెంటర్లు, క్లాసుల ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో వెబ్‌సైట్లతోపాటు మొబైల్ యాప్‌లకు ఇది వర్తింపజేయనున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల కోచింగ్ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌ల యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్ విద్యలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరం చాలా ఉందని విద్యావేత్త, ఎన్‌సీఈఆర్టీ మాజీ డైరెక్టర్ జేఎస్ రాజ్‌పుత్ అభిప్రాయపడ్డారు.
మార్గదర్శకాలు కావాలి
నాణ్యత లేని కంటెంట్, బలహీనమైన డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు విద్యార్థులకు సరైన విద్యను అందించలేవు. అందుకే ఆన్‌లైన్ విద్యలో నాణ్యతను పెంచడానికి స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం.
–అభాష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ
భారత ఇ–లెర్నింగ్ మార్కెట్ విలువ (రూ.లలో)
2023లో : 88 వేల కోట్లు
2029 నాటికి: 2.46 లక్షల కోట్లు (అంచనా)
(అరిజ్టన్ అడ్వైజరీ సంస్థ నివేదిక)
Comments
Please login to add a commentAdd a comment