ఇంటి పెద్ద, పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి | Telangana CM Revanth Reddy Launches Mobile App For Indiramma Housing Scheme | Sakshi
Sakshi News home page

ఇంటి పెద్ద, పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి

Published Fri, Dec 6 2024 4:25 AM | Last Updated on Fri, Dec 6 2024 4:25 AM

Telangana CM Revanth Reddy Launches Mobile App For Indiramma Housing Scheme

సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్‌ అప్లికేషన్‌ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, జూపల్లి, పొంగులేటి, మహేశ్‌కుమార్, పొన్నం ప్రభాకర్‌

ఇందిరమ్మ పథకం మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

పిల్ల చేష్టలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నవారిని వదిలేయడం మంచిది కాదు..లేనిపక్షంలో చట్టం తనపని తాను చేసుకుపోతుంది 

కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు

పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయలేని పనులు మేం చేసి చూపుతున్నాం 

దీన్ని జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్‌ నేతలు మాకు అడ్డుపడుతున్నారు

కేసీఆర్‌ శాసనసభకు వచ్చి ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలన్న ముఖ్యమంత్రి 

పెద్దరికం వహించి ఎదుగుతున్న నేతలకు మార్గదర్శనం చేయాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: ‘రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే, పదేళ్ల తర్వాత ఆయన రూ.7 లక్షల కోట్ల అప్పుతో అస్తవ్యస్త పరిస్థితుల రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. మేం క్రమంగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటే ఆ పార్టీ నేతలు అడ్డు తగులుతున్నారు. పిల్ల చేష్టలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వారికి ఇంటి పెద్దగా, పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి. అలాగే వదిలేస్తే ఎవరికీ మంచిది కాదు.

లేనిపక్షంలో వారిని నియంత్రించేందుకు చివరకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పరోక్షంగా కేటీఆర్, హరీశ్‌రావులను హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్‌ అప్లికేషన్‌ను పలువురు మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్, బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు.  

హోమ్‌ వర్క్‌ చేయని విద్యార్థుల్లా..
‘కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగించి తీర్చిదిద్దిన రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే.. అప్పుల కుప్పగా మార్చి అప్పుల మిత్తి కట్టేందుకు మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితికి దిగజార్చిన రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయలేని పనులను ఏడాదిలో మేము చేసి చూపుతున్నాం. దీన్ని జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్‌ నేతలు.. హోమ్‌ వర్క్‌ చేయని విద్యార్థులు, హోమ్‌ వర్క్‌ చేసిన వారి పుస్తకాల్లోని కాగితాలను చింపేసిన తరహాలో వ్యవహరిస్తున్నారు. మేము చేసే మంచి పనుల లబ్ధి ప్రజలకు చేరకుండా వారు మారీచ సుబాహుల తరహాలో అడ్డుపడుతున్నారు. మా పాలన కూడా వారి తరహాలోనే ఉండాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.  

వైఎస్‌ పంథాను కేసీఆర్‌ మార్చేశారు 
    చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నేతగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చొరవ చూపేందుకు వీలు కలి్పంచారు. ఆ పంథాను కేసీఆర్‌ మార్చేశారు. భారత్, పాకిస్థాన్‌ సైనికులు ఎదురుపడితే కాల్పులు జరుపుకొంటున్న చందంగా పాలక, ప్రతిపక్షాల మధ్య శత్రుత్వాన్ని పెంచారు.

ప్రజాతీర్పును గుర్తించి ఇప్పటికైనా కేసీఆర్‌ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ప్రజా వ్యతిరేకతకు నిజామే తలవంచారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును కేసీఆర్‌ ఇంకా గుర్తిస్తున్నట్టు లేదు. ఇప్పటికైనా కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి. శాసనసభకు వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేయాలి. తన సీనియారిటీకి అనుగుణంగా విలువైన సూచనలు ఇవ్వాలి.  

మేమంతా ఎదుగుతున్న నేతలమే.. 
    మా మంత్రులు తుమ్మల, జూపల్లి లాంటి వారు తప్ప మిగతా వారమంతా ఎదుగుతున్న నేతలమే. సభలో ప్రతిపక్ష నేత కుర్చీని ఖాళీగా ఉంచటం సరికాదు. కేసీఆర్‌ పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ సూచనలతో మార్గదర్శనం చేయాలి. మా ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన మంచి పనులను గుర్తించాలి. ఏడాది పూర్తయిన సందర్భంగా చేస్తున్న విజయోత్సవాల్లో పాల్గొనాలి. ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి మంత్రి పొన్నం ద్వారా ఆహ్వానాలు పంపుతాం. కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ హాజరుకావాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.  

పేదల ఇళ్లకు రూ.5 లక్షలిస్తున్నది తెలంగాణ ఒక్కటే.. 
    ‘పేదల ఇళ్ల నిర్మాణ పథకానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. పేదలు పక్కా ఇంటిని కలిగి ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరాగాంధీ చేశారు. దేశంలో గుడి లేని ఊరుంటుందేమో గానీ ఇందిరమ్మ కాలనీ లేని పల్లె ఉండదనటంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయ భూముల సీలింగ్‌ యాక్టు ద్వారా భూములు సేకరించి పేదలకు పంచిన ఆమె, వారి సొంతింటి కలను నిజం చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం అదే స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. తొలి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది.  

నిరుపేదల జాడ తేల్చే యాప్‌ 
    పేదల్లో అతి పేదలకు ఇళ్లు దక్కేలా ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధునికతను వినియోగించుకుంటున్నాం. ఆ దిశలోనే ఇప్పుడు నిరుపేదల జాడ తేల్చేలా యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. అర్హులకే లబ్ధి కలిగేలా, అక్రమాలు లేకుండా దీన్ని వినియోగిస్తాం. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని వారికి సొంతింటి లబ్ధి కలిగేలా ప్రత్యేకంగా ఇళ్లను కేటాయిస్తాం. ప్రస్తుతం ప్రకటించిన కోటాతో ప్రమేయం లేకుండా వారికి ఇళ్లను ఇస్తాం. లబ్ధిదారులకు స్తోమత ఉంటే ఇంటిని విస్తరించుకోవచ్చు..’ అని రేవంత్‌ తెలిపారు.  

ఎంత భారం అయినా నిధులిస్తాం: భట్టి 
    నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా సొంత పక్కా ఇంటిని సమకూర్చాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇంటి పథకానికి శ్రీకారం చుట్టామని, ఎంత భారమైనా దానికి కావాల్సిన నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనతో ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్నా.. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన రూ.22,500 కోట్ల నిధులను మాత్రం సమకూర్చి తీరతామన్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం సమకూర్చటం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని పేర్కొన్నారు.  

అతిపేదలకు సొంతిల్లే లక్ష్యం: పొంగులేటి 
    పేదల్లో అతి పేదలకు సొంతింటిని సమకూర్చటమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమకు అందిన లక్షల దరఖాస్తుల్లో అతిపేదలు, నిరుపేద వితంతువులు, వికలాంగులను గుర్తించి ఇళ్లను అందిస్తామని చెప్పారు. ఈ పథకంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూస్తామన్నారు. యాప్‌ను ఆవిష్కరించిన తర్వాత.. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నమూనాలను, డిజైన్‌లను సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్‌ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎస్‌ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.  

తెలంగాణ తల్లి విగ్రహ పనులు పరిశీలించిన సీఎం  
ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని సూచన 
సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం లోపల ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఈ నెల 9న విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం తన చాంబర్‌ నుంచి నడుచుకుంటూ నేరుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలానికి వచి్చన సీఎం.. విగ్రహం ముందు గ్రీనరీ పనులు, భారీ ఫౌంటైన్, ఆకట్టుకునేలా ఏర్పాటు చేస్తున్న లైటింగ్‌ సిస్టం పనితీరు గురించి ఆరా తీశారు. గేటు–2, గేటు 4లను అనుసంధానిస్తూ వేస్తున్న రోడ్లను చూశారు. సచివాలయానికి వచ్చే సందర్శకులకు ఆహ్లాదం పంచేలా రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు, పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

గేటు–4 పక్కన ప్రధాన గేటు ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. పనులన్నీ విగ్రహావిష్కరణకు ముందురోజే పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. విగ్రహం ఏర్పాటులో ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటూ జరగకూడదని, విగ్రహాన్ని తెచ్చేటప్పుడు, వేదికపై ఏర్పాటు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అక్కడ పని చేస్తున్న కూలీలతో కూడా రేవంత్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీఎస్‌ శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ , టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement