
సాక్షి, మేడ్చల్: సోషల్ మీడియా సరదా యువకుడి ప్రాణం తీసింది. జవహర్‌నగర్‌లో రీల్స్ చేస్తూ తరుణ్(17) అనే యువకుడు క్వారీ గుంతలో పడి మృతి చెందాడు. రీల్స్ ప్రభావంతో తరుణ్ తన ఆరుగురి స్నేహితులతో కలిసి ఓ క్వారీ దగ్గర ఫోటో షూట్ చేస్తుండగా ఈ విషాదం జరిగింది.
స్నేహితులతో ఈత కొడుతూ ఫొటోలు దిగుతూ లోతును గమనించకపోవడంతో ఈత రాక ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు తరుణ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సమాచారం తెలుసుకున్న జవహర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కాగా, కొంతమందిలో సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. త్వరగా ఫేమస్ అయిపోవాలని, తమ వీడియోలు వైరల్ అవ్వాలని కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని ఎంతమంది చెప్పినా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం లేదు.