
కరీంనగర్ జిల్లా: సోషల్ మీడియా సరదా మరో యువకుడి ప్రాణం తీసింది. ఇటీవల హైదరాబాద్ లో రీల్స్ చేస్తూ ఒక యువకుడు దుర్మరణం చెందిన ఘటన మరువకముందే ఇప్పుడు మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా అశోక్ నగర్ కు చెందిన మహ్మద్ అర్బాజ్ రీల్స్ చేసే క్రమంలో ఓ లోతైన లోయలో పడి దుర్మరణం చెందాడు.
రీల్స్ చేస్తున్న క్రమంలో మానేరు నదీ తీరంలో ప్రమాదవశాత్త జారిపడి 20 ఏళ్ల అర్బాజ్ మృత్యువాత పడ్డాడు. అర్బాజ్ తో పాటు రీల్స్ చేయడానికి మరో ఇద్దరు యువకులు కూడా వెళ్లారు. అయితే నదీ తీరంలో అర్బాజ్ ను వారిద్దరూ కెమెరాతో షూట్ చేసే క్రమంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కుమారుడు మృతితో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఇటీవల హైదరాబాద్ లోని జవహర్‌నగర్‌లో రీల్స్ చేస్తూ తరుణ్(17) అనే యువకుడు క్వారీ గుంతలో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. రీల్స్ ప్రభావంతో తరుణ్ తన ఆరుగురి స్నేహితులతో కలిసి ఓ క్వారీ దగ్గర ఫోటో షూట్ చేస్తుండగా ఈ విషాదం జరిగింది. స్నేహితులతో ఈత కొడుతూ ఫొటోలు దిగుతూ లోతును గమనించకపోవడంతో ఈత రాక ప్రాణాలు కోల్పోయాడు.
కొంతమందిలో సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. త్వరగా ఫేమస్ అయిపోవాలని, తమ వీడియోలు వైరల్ అవ్వాలని కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని ఎంతమంది చెప్పినా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం లేదు.