
బెట్టింగ్.. ఈ పేరు వింటేనే ఎంతోమంది జీవితాలు ఛిద్రమైన ఉదంతాలు గుర్తుకు వస్తాయి. బెట్టింగ్ యాప్‌లు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఈ వ్యసనంలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఉండగా.. యువత సైతం తప్పుడు దారిలో వెళ్తోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. దీంతో, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘యువత, ఎందరో బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రెటీలు ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకపోవడం మంచిది. యాప్‌ను ఎవరు ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి యాప్ వస్తున్నాయి అనేది చూడాలి. ఎవరు అప్‌లోడ్ చేస్తున్నారు అనేది పర్యవేక్షించాలి. ఈ యాప్స్ ద్వారా ఎవరు లాభం పొందారు అనేది కూడా విచారణ చేపట్టాలి. ఇలాంటి యాప్స్ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు.
ఇలాంటి యాప్స్‌పై అవగాహన కల్పించాలి. ఇప్పటకే పలు విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. డిజిటల్ అరెస్ట్, బ్యాంక్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, ఓఎల్‌ఎక్స్ నేరాలు ఇలాంటివి అన్నీ గతంలో జరిగాయి. ప్రధాని మోదీ కూడా డిజిటల్ అరెస్ట్ మోసాలను వివరించారు. దీంతో, మోసాలు తగ్గుముఖం పట్టాయి. అలాగే, బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా అందరికీ అవగాహన కల్పిస్తే మోసాలు తగ్గిపోతాయి. మళ్లీ చెబుతున్నాను.. బెట్టింగ్ యాప్స్ వెళ్లకండి. జీవితాలను నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్ యాప్స్ మాయలో పడకండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కదలికలు, ప్రవర్తనను గమనించాలి’ అని కోరారు.
అలాగే, ప్రస్తుతం మార్కెట్లో వేలాది బెట్టింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయని, వీటిని ప్రోత్సహించే యూట్యూబర్లను, ప్రచారకర్తలను నమ్మ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రికెటర్లు, సినీ స్టార్లు, టీవీ సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బు కోసం ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. కష్టపడి పనిచేస్తేనే డబ్బు వస్తుందని, షార్ట్‌కట్ మార్గాల్లో డబ్బును ఆశిస్తే నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే యూట్యూబర్లను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సజ్జనార్ తెలిపారు. ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ అనే ఉద్యమం ఊపందుకుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment