
సోషల్ మీడియా దుర్వినియోగం..జీహెచ్‌ఎంసీ సిబ్బందిలో వణుకు
శాసనసభ జీరోఅవర్‌లో దానం నాగేందర్ ఆరోపణ
సమస్యల చిట్టా విప్పిన నగర, జిల్లాల ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొందరు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ.. బిల్డర్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. వీరంటే జీహెచ్‌ఎంసీ సిబ్బంది వణికిపోతున్నారని, అందరూ కూర్చుని కాంప్రమైజ్ అవుతుండడంతో.. అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. శాసనసభలో మంగళవారం జరిగిన జీరోఅవర్‌లో ‘దానం’మాట్లాడారు.
తన ప్రమేయం లేకుండా.. తన నియోజకవర్గంలోని ఈద్గా మైదానంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. దీంతో తాను వెళ్లి.. సబ్ స్టేషన్‌కు వేసిన పునాదులను కూల్చివేశానన్నారు. తన క్యాంపు కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరినా కేటాయించడం లేదని ‘దానం’ విమర్శించారు.
» అంబర్‌పేటలో రూ.400 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మించగా, సీఎంకు సమయం లేక ఇంకా ప్రారంభించలేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఫ్లైఓవర్‌కు సమాంతరంగా సర్వీసు రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మూసారాంబాగ్ ఫ్లైఓవర్ నిర్మాణం నత్తనడకన సాగుతోందని, వేగం పెంచాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ 15 నెలలుగా తమ నియోజకవర్గాల్లో ఎలాంటి పనులకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు.
» ఎల్బీనగర్ నియోజకవర్గంలో హుడా ఆమోదించిన లేఅవుట్‌లో 44 కాలనీలు ఏర్పాటు కాగా, ఆ తర్వాత ఆ స్థలం ప్రభుత్వానిదని పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు ఆపేశారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో 118 కింద ఈ స్థలాలను క్రమబద్దికరించి కన్వేయన్స్ డీడ్స్ జారీ చేసిందని చెప్పారు.
ఎన్నికలు రావడంతో కొందరికి ఇవ్వలేకపోయిందన్నారు. మిగిలిన వారికి సైతం కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వడంతో పాటు నిషేధిత జాబితాల నుంచి ఈ స్థలాలను తొలగించాలని కోరారు. ఈ సమస్యను గతంలో సైతం తన దృష్టికి తీసుకువచ్చారని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బదులిచ్చారు.
» నగరంలోని బస్తీ దవాఖానాల్లో వైద్యులు, అత్యవసర మందులు లేవని యాకుత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ తెలిపారు. రక్త పరీక్షలు సైతం జరపడం లేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు బస్తీ దవాఖానాలకు ప్రజలు ఎందుకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలానికి తక్షణమే ఎన్‌వోసీ జారీ చేయాలని జీహెచ్‌ఎంసీని కోరారు.
» ప్రకాశ్‌నగర్, ఇతర కాలనీల ప్రజలు అటవీ భూముల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని, వారికి పట్టాలు ఇవ్వాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
» తన నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలకు టీయూఎఫ్‌ఐడీసీ నుంచి రూ.15 కోట్లు రావలసి ఉండగా, ఇవ్వడం లేదని కోరుట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. మెట్‌పల్లి ఆస్పత్రి నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వాలని కోరారు. మునిపేటలో రుణమాఫీ జరగని 330 మంది రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తే అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు.
» నాగర్‌కర్నూల్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం నిర్మించాలని, సాంకేతిక విద్య కళాశాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కె.రాజేశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
» సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల మధ్య ఉన్న తన నియోజకవర్గం.. గత బీఆర్‌ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని మానకొండూరు ఎమ్మెల్యే కె.సత్యనారాయణ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆట పాటలు, ఎగరడం, దూకడానికే పరిమితమయ్యారని, నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించగా, బీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. కేవలం 24 ఎకరాలు సేకరిస్తే 10వ ప్యాకేజీ పనులు పూర్తయ్యేవని, బాలకిషన్ ప్రజలను రెచ్చగొట్టి పనులు జరగకుండా చేశారని ఆరోపించారు. సత్వరం భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
» ఆసిఫాబాద్ నియోజకవర్గం ఉండి గ్రామంలో రూ.8.5 కోట్లతో మంజూరైన వంతెన నిర్మాణ అంచనాలు రూ.14.4 కోట్లకు పెరిగాయని, నిధులు మంజూరు చేసి సత్వరం పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి విజ్ఞప్తి చేశారు. లక్మాపూర్ వంతెనను కూడా పూర్తిచేయాలని, ఆసిఫాబాద్ నుంచి అస్మాపూర్ వరకు రోడ్డు వేయాలని కోరారు.
» నారాయణపేట నియోజకవర్గం కోయిల్‌కొండ నియోజకవర్గంలో బీసీ వసతి గృహ భవనం శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధన్వాడలో డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
» నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తయిన 396 ఇళ్లతో పాటు నిర్మాణం ఆగిపోయిన 252 ఇళ్లను పూర్తిచేసి లబ్దిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే డి.సూర్యనారాయణ గుప్తా విజ్ఞప్తి చేశారు.
» మిర్యాలగూడను స్పెల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గంలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉండగా, విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment