ప్రభుత్వ భూములే కాదు.. అటవీ, రక్షణ భూములూ ధారాదత్తం
సీలింగ్ భూములకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చేశారని ఆరోపణలు
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇష్టానుసారంగా భూ అక్రమాలు
ఆధారాలతో ఈడీకి ఫిర్యాదు
ఈడీ కార్యాలయానికి క్యూ కడుతున్న బాధితులు
దీపావళి తర్వాత మరోసారి అమోయ్‌కుమార్‌ను విచారణకు పిలవనున్న ఈడీ
సాక్షి, హైదరాబాద్: అమోయ్‌కుమార్.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో చేసిన అక్రమాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే కాదు అటవీ, రక్షణశాఖ, కాందిశీకుల భూములనూ తన అధికారాన్ని ఉపయోగించి ధారాదత్తం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహేశ్వరం మండలంలో భూదాన్‌భూములపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేపట్టడంతో ఆయన బారిన పడిన బాధితులు ఒక్కొక్కరుగా ఈడీకి ఫిర్యాదు చేస్తున్నారు.
ఒకవైపు ఈడీ విచారణ చేస్తుండగానే.. మరోవైపు హైకోర్టు, అమోయ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు 52 ఎకరాల ప్రభుత్వ భూమిని పైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని తప్పుపడుతూ ఆ నిర్ణయాన్ని మంగళవారం కొట్టేయడం చూస్తుంటే.. కలెక్టర్‌గా ఆయన ప్రభుత్వానికి తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించారో తెలుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీపావళి తర్వాత అమోయ్‌కుమార్‌ను మరోసారి విచారణకు పిలిచే అవకాశాలున్నాయి.
– ఆదిబట్లలోని సర్వే నంబరు 44లోని సీలింగ్ భూములైన 18 ఎకరాలను కొంతమందికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వడం పూర్తిగా అధికార దుర్వినియోగమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– శామీర్‌పేట మండలంలోని తూముకుంటలోని అటవీ భూములకు సంబంధించి సర్వే నంబరు 164లో మొత్తం 26 ఎకరాలను కూడా అన్యాయంగా కొంతమంది వ్యక్తులు, పరిశ్రమల పేరిట పెద్దవారికి ధారాదత్తం చేశారని రాఘవేందర్‌గౌడ్ డాక్యుమెంట్లతో సహా ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
– సర్వే నంబరు 165/1, సర్వేనంబరు 1266లోని భూములను కూడా ఒకసారి పరిశీలించాలని అందులో పేర్కొన్నారు. 26 ఎకరాలను మరొకరి పేరిట చేయడమేకాక, మ్యుటేషన్ కూడా చేశారని, ఆ స్థలం అటవీశాఖ ఆ«దీనంలోనే ఉన్నా.. ఇలా మ్యుటేషన్ చేయడంతో వారు ఆ కాగితాలను వినియోగించుకొని రుణాలు కూడా తెచ్చుకున్నారని చెబుతున్నారు. 1953లోనే ఆ సర్వే నంబరులోని భూములు రిజర్వ్ ఫారెస్ట్ కోసం కేటాయించినట్టు గెజిట్ నోటిఫికేషన్‌లో ఉన్నా, వారసులం అంటూ కొందరు చేసుకున్న దరఖాస్తు ఆధారంగా వారికి ఆ భూములు ధారాదత్తం చేశారని ఆ ఫిర్యాదులో వివరించారు. ఆ భూమి తమదంటూ దరఖాస్తు చేసుకున్న వారసుల తండ్రి 1976లో చనిపోతే.. వారు 2017లో వచ్చి తమ భూమి అంటూ దరఖాస్తు చేసుకోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
ఆర్‌ఓఆర్ చట్టం ప్రకారం వారసులకు భూములు అప్పగించే ముందు ఆ భూమిలో వారి ఆ«దీనంలో ఉందా.. వారు ఆ భూమిని సాగు చేస్తున్నారా.? రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడం, దానిపై అభ్యంతరాలను ఆహా్వనించడం, సక్సెషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లను కోరడం, యుఎల్‌సీ, తదితర వాటిని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌కు కేవలం 10 నిమిషాల దూరంలో ఉన్న ఆ భూములు ఎవరి ఆ«దీనంలో ఉన్నాయో తెలుసుకోకుండా మ్యుటేషన్ చేశారని ఈడీకి ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు.
– 261, 273 తదితర సర్వే నంబర్లలోని భూములను కూడా అదే విధంగా అప్పగించారని పేర్కొన్నారు. కూకట్‌పల్లి సమీపంలోని హైదర్‌నగర్ దగ్గర మూడు ఎకరాల భూమిని కూడా అమోయ్‌కుమార్ ధరణిని అడ్డుపెట్టుకొని ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేశారన్నారు.
– శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్‌మక్తలోని నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా ఆ జాబితా నుంచి తొలగించి కొందరికి అప్పగించారని పేర్కొన్నారు.
మరో పిటిషన్..
అమోయ్‌కుమార్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో గోపనపల్లిలో 50 ఎకరాలు, మాదాపూర్‌లో 5 ఎకరాలు, హఫీజ్‌పేటలో 20 ఎకరాలు, మోకిలలో 115 ఎకరాలు, వట్టినాగుల పల్లిలో 20 ఎకరాలు, గండిపేట ఖానాపూర్‌లో 150 ఎకరాలు, మియాపూర్‌లో 27 ఎకరాలు అన్యాక్రాంతం చేశారని బక్క జడ్సన్ మంగళవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడంలో ఆయనతోపాటు మాజీ చీఫ్ సెక్రటరీ, ప్రస్తుత రెవెన్యూ ముఖ్యకార్యదర్శిల పాత్ర ఉన్నట్టు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment