గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ తొలిజాబితాలో పాతవారికే చోటు | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ తొలిజాబితాలో పాతవారికే చోటు

Published Tue, Aug 22 2023 6:14 AM | Last Updated on Tue, Aug 22 2023 7:07 AM

- - Sakshi

హైదరాబాద్: ఊహించినట్లుగానే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ తొలిజాబితాలో ఒక్కరికి తప్ప సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే తిరిగి టిక్కెట్లు లభించాయి. కొంత సంశయాత్మకంగా కనిపించిన అంబర్‌పేటలో కాలేరు వెంకటేశ్‌కు, ముషీరాబాద్‌లో ముఠాగోపాల్‌లకే టిక్కెట్లు ఇచ్చారు. ఎలాంటి ప్రచారం జరిగినా వారు టిక్కెట్లు తమకే లభిస్తాయనే ధీమాను వ్యక్తం చేయగా, అందుకు తగ్గట్లే వారికే తిరిగి అవకాశం లభించింది. కంటోన్మెంట్‌లోనూ సిట్టింగ్‌కు ఇచ్చినట్లే లెక్క. సాయన్న మృతితో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉంది. సాయన్న స్థానే ఆయన కుమార్తె లాస్యనందితకు అవకాశం కల్పించారు. లాస్యనందితకు గతంలో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

ఉప్పల్‌ తిప్పల్‌..
ఉప్పల్‌ సీటును సిట్టింగ్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డికి ఇచ్చారు. బండారికి టిక్కెట్‌ రాకుండా ఉండేందుకు ఆ సీటు కోసం ఎంతో కాలంగా ఆశలు పెట్టుకున్న మాజీ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి విభేదాలు వీడి సంయుక్తంగా చివరి క్షణంలో ఎమ్మెల్సీ కవితను కలిసినప్పటికీ వారి కోరిక నెరవేరలేదు. అప్పటికే జాబితా ఖరారు కావడంతో వారి ఆశ నిరాశే అయినట్లు తెలిసింది. అంబర్‌పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు, స్థానికంగా ఐదుగురు మాజీ కార్పొరేటర్లు, ఒక సిట్టింగ్‌ కార్పొరేటర్‌కు పొసగడం లేదు.

మంత్రి కేటీఆర్‌ వార్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలోనూ వారి వైషమ్యాలు బయటపడ్డాయి. కాలేరుకు టిక్కెట్‌ ఇవ్వొద్దంటూ కూడా డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో కొంత అయోమయం నెలకొన్నప్పటికీ కాలేరుకే తిరిగి టిక్కెట్‌ లభించింది. ముషీరాబాద్‌లో వయోభారం వల్లనే ముఠాగోపాల్‌పై కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ ఆయనకే కేటాయించారు. తమ నాయకులకే తిరిగి టిక్కెట్లు రావడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

ఓల్డ్‌సిటీలో..
ఓల్డ్‌సిటీలో నాలుగు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన వారికి మళ్లీ టిక్కెట్లు లభించాయి.

చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఓడినా మళ్లీ వారికే టిక్కెట్లిచ్చారు. ఆ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాల్లేకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

నాంపల్లి, గోషామహల్‌ పెండింగ్‌..
కోర్‌సిటీ (పాత ఎంసీహెచ్‌) పరిధిలోని నాంపల్లి, గోషామహల్‌వి మాత్రం పెండింగ్‌లో ఉంచారు. గత 2018 ఎన్నికల్లోనూ నాంపల్లి విషయంలో కొంత గందరగోళం జరిగింది. తొలుత ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్‌కు కేటాయించినప్పటికీ, బీ ఫారం ఇచ్చే సమయానికి మరో ఆనంద్‌గౌడ్‌కు కేటాయించారు. గోషామహల్‌ ఈసారి నందుబిలాల్‌కు ఇవ్వనున్నట్లు భావించారు. ఈరెండు స్థానాలు పెండింగ్‌లో ఉంచడంతో అధిష్ఠానం ఆంతర్యం ఏమిటన్నది అంతుబట్టడం లేదు. గోషామహల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (బీజేపీ) సస్పెండ్‌ కాకముందు పకడ్బందీ ప్రణాళికతో ఆయనను ఓడించే అభ్యర్థిని ఎంపిక చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు భావించినట్లు సమాచారం. ఆయనపై సస్పెన్షన్‌ను బీజేపీ ఇప్పటికీ తొలగించలేదు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ను తమవైపు తిప్పుకునే ఆలోచనల్లో బీఆర్‌ఎస్‌ ఉందనే అభిప్రాయాలున్నప్పటికీ, తాను ఎట్టిపరిస్థితుల్లోనూ వేరే పార్టీలోకి వెళ్లనని రాజాసింగ్‌ కుండబద్దలు కొట్టడం తెలిసిందే.

మేడ్చల్‌లో ఇలా...
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో నాలుగింటిలో మళ్లీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే అధిష్థానం అవకాశం కల్పించింది. మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి మంత్రి చామకూర మల్లారెడి, కుత్బుల్లాపూర్‌ నుంచి కేవీ వివేకానందగౌడ్‌, కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి మాధవరం కృష్ణారావు, మ ల్కాజిగిరి నియోజకవర్గం నుంచి మైనంపల్లి హన్మంతరావులను బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా అధిష్థానం ప్రకటించింది. ఉప్పల్‌ నియోజకవర్గంలో మాత్రం బండారి లక్ష్మారెడ్డికి కొత్తగా అవకాశం ఇచ్చారు.

రంగారెడ్డి జిల్లాలో...
రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నిచోట్లా సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌– దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం–మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కల్వకుర్తి– గుర్క జైపాల్‌ యాదవ్‌, షాద్‌నగర్‌–ఎల్గమోని అంజయ్య యాదవ్‌, చేవెళ్ల– కాలే యాదయ్య, రాజేంద్రనగర్‌ ప్రకాష్‌గౌడ్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఆరికెపూడి గాంధీల పేర్లను అధినేత కేసీఆర్‌ ప్రకటించారు.

అసంతృప్తులు క్షణికమే ?
కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెటు వారి అసంతృప్తి క్షణికమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పల్‌లో బొంతు రామ్మోహన్‌, కంటోన్మెంట్‌లో మన్నె క్రిశాంక్‌, గజ్జెల నగేష్‌ వంటి వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి లేదు. కాగా, కంటోన్మెంట్‌కు చెందిన శ్రీగణేశ్‌, శేరిలింగంపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్‌లు పార్టీ మారనున్నట్లు వారి అనుయాయులు చెబుతున్నారు.

ఉప్పల్‌లో బండారి..కంటోన్మెంట్‌లో లాస్య నందిత

24 స్థానాల్లో ఇద్దరే మహిళలు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో మహిళలకు పెద్దగా చోటు దక్కలేదు. ఈసారి కూడా ఊరించి ఉస్సూరనిపించారని పలువురు ఆశావహ మహిళానేతలు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 24 స్థానాల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి యథావిధిగా ఈసారి కూడా పోటీ చేయనున్నారు. కొత్తగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానాన్ని మాత్రం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితకు ఈసారి అవకాశం కల్పించారు. దీంతో మొత్తం 24 నియోజకవర్గాల్లో కేవలం ఇద్దరు మహిళలకే అవకాశం లభించింది. అందులోనూ సాయన్న కన్నుమూయడం వల్ల ఆయన కూతురు లాస్య సందితకు అవకాశం ఇచ్చారు. కానీ మహిళా అభ్యర్థిగా ఆ స్థానాన్ని కేటాయించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి. బీఆర్‌ఎస్‌ మహిళాశ్రేణులు పెద్ద సంఖ్యలో ఆ ఆందోళనలో పాల్గొన్నారు. కానీ బీఆర్‌ఎస్‌లోనే మహిళలకు ఆశించిన స్థాయిలో చోటు దక్కలేదు. మొత్తం 119 స్థానాల్లో ఆరుగురికి మాత్రమే అవకాశం కల్పించగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి ఇద్దరు మహిళలకు ఆ అవకాశం దక్కింది.

మజ్లిస్‌–బీఆర్‌ఎస్‌ ఫ్రెండ్లీ పోటీ
బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో పాతబస్తీ రాజకీయాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈసారీ ఇక్కడ బీఆర్‌ఎస్‌–మజ్లిస్‌ మధ్య స్నేహపూర్వక పోటీనే ఉంటుందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నాంపల్లి మినహా బీఆర్‌ఎస్‌ గతంలో ఓడిపోయిన తమ పాత అభ్యర్థులనే తాజాగానూ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో సైతం మజ్లిస్‌ పార్టీ పోటీ చేయని స్థానాల్లో బాహాటంగా బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచార సభల్లో సైతం అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే ఈసారి 50 స్థానాల్లో బరిలో దిగి కనీసం 15 స్థానాలతో అసెంబ్లీలో అడుగుపెడుతామని అక్బరుద్దీన్‌ ప్రకటించడం ఇటీవల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పోటీ చేసే స్థానాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకున్నా..బీఆర్‌ఎస్‌తో దోస్తి ఉందంటూ ఒవైసీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా సీఎం కేసీఆర్‌ కూడా ఫ్రెండ్లీ పార్టీ అంటూనే ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ ఉటుందని వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో రెండుమూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయి పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సున్నిత ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. రాజధానిలోని దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు ఆశావహులు ఉండటం సాధారణం. అధికార పార్టీతో పాటు విపక్షాల్లోనూ ఈ పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఆఖరి నిమిషం వరకు అనేక ప్రయత్నాలు చేసే వీళ్ళు టిక్కెట్‌ దొరక్కపోతే అసమ్మతి రాగం అందుకుంటారు.

నిరాశపడిన ఆశావహుల్లో మరికొందరు తన అనుచరులతో కలిసి నేరుగా నిరసనలకు దిగడం, కొందరైతే తాము తెర వెనుక ఉండి అనుచరులను రెచ్చగొట్టడం చేస్తుంటారు. వీళ్ళు చేపట్టే నిరసన కార్యక్రమాల వల్ల ఒక్కోసారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తడం, ట్రాఫిక్‌ ఇబ్బందులు చోటు చేసుకోవడం జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే నగర నిఘా విభాగాలు, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు అలర్ట్‌ అయ్యాయి. టిక్కెట్‌ లభించని ఆశావహులు, వారి ముఖ్య అనుచరుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడంపై దృష్టి పెట్టాయి. దీని కోసం కొన్ని ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

అభివృద్ధే విజయానికి సోపానం
సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల విజయానికి సోపానాలవుతాయి. జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే మళ్లీ గెలిపిస్తుంది.
 – పి.సబితారెడ్డి

ప్రజలకు అందుబాటులో ఉంటా
ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ పార్టీ ఆదేశాల మేరకు ముందుకెళ్తున్నాం. గత కొన్నేళ్లుగా పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి సీఎం కేసీఆర్‌ రెండోసారి యాకుత్‌ఫురా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉంది.
– సామ సుందర్‌రెడ్డి

హమీలన్నీ నెరవేర్చా.. మరోసారి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేశాం. ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేర్చాను. వచ్చే ఎన్నికల్లోనూ అభివృద్ధే ప్రధాన నినాదంగా ముందుకెళ్తా. విజయం సాధిస్తా.
 – టి.ప్రకాష్‌గౌడ్‌

సాక్షి, సిటీబ్యూరో: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో రాజకీయ వారసత్వానికి బ్రేకులు పడ్డాయి. బీఆర్‌ఎస్‌ యువనాయకులుగా కొనసాగుతున్న పలువురు ఎమ్మెల్యేల తనయులకు ఈసారి అవకాశం దక్కలేదు. సీఎం కేసీఆర్‌ తాజాగా ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ఆ పార్టీ వారసత్వ యువ కిశోరాలను ఊరించి ఉస్సూరుమనిపించింది.

మరోసారి వారే...
సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుమారుడు సాయికిరణ్‌కు ఈసారి అవకాశం లభించవచ్చునని భావించారు. ఈ మేరకు ఆయన సనత్‌నగర్‌లో రాజకీయంగా ఎదిగేందుకు సన్నద్ధమయ్యారు. బీఆర్‌ఎస్‌ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొన్నారు. ఆ పార్టీ శ్రేణుల్లోనూ తలసాని వారసుడిగా ఆయన కొడుకు పోటీచేయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ ఈసారి సాయికిరణ్‌కు అవకాశం దక్కలేదు.

మహేశ్వరం నియోజకవర్గం నుంచి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డికి సైతం అవకాశం లభించలేదు. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కార్తీక్‌రెడ్డికి నిరాశే ఎదురయ్యింది.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనయుడు డాక్టర్‌ రోహిత్‌ సైతం మైనంపల్లి వారసుడిగా ఎన్నికల బరిలోకి దూకేందుకు సన్నద్ధమయ్యాడు. ఈ మేరకు విస్తృతంగా ప్రచారం సైతం జరిగింది. కానీ యథావిధిగా మైనంపల్లి హనుమంతరావుకే అవకాశం లభించింది.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి కూడా టిక్కెట్‌ ఆశించనా ఫలితం దక్కలేదు.

ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ కుమారుడు జయసింహ పేరు దాదాపు ఖరారు అని భావించిన తరుణంలో చివరి నిమిషంలో నిలిపివేశారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో మాత్రం ఎమ్మెల్యే సాయన్న కన్నుమూయడంతో ఆ స్థానాన్ని ఆయన కూతురు లాస్యకు కేటాయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement