TS Assembly Greater Hyderabad
-
ఎస్ బాస్.. మేమూ మీ వాళ్లమే!
హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. రాష్ట్రం ఏర్పాటు అనంతరం.. దాదాపు పదేళ్లకు తర్వాత తొలిసారిగా ప్రభుత్వం మారింది. ఈ ప్రభావం ఇతర విభాగాల కంటే పోలీసులపై ఎక్కువగా ఉంటుంది. ఈ అంశంలో కొందరు అధికారుల్లో మోదం.. మరికొందరిలో ఖేదానికి కారణమైంది. ఒకప్పుడు కొందరు నాయకుల కనుసన్నల్లో పని చేసిన అధికారులు ప్రస్తుతం పవర్లోకి వచ్చిన నాయకులను, వారి సన్నిహితులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలో భారీ స్థాయిలో జరగనుండటంతోనూ ఇవి ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ మరకలు తుడిచేసుకోవడానికి.. గత ప్రభుత్వ హయాంలో అనేక మంది అధికారులు, సిబ్బంది అధికార పార్టీకి అనుకూలంగా పని చేశారని, ప్రతిపక్షాలను ప్రత్యేకించి రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహితులు, అనుచరులను ఇబ్బందులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలుమార్లు రేవంత్‌రెడ్డే బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఆ అధికారుల్లో కొందరు పదవీ విరమణ చేయడం, పొడగింపులో ఉన్న ఇంకొందరు రాజీనామాలు సమర్పించడం జరిగాయి. ఇక మిగిలిన వారితో పాటు అవకాశాన్ని బట్టి ఎటైనా మారగల వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్లంతా ప్రస్తుతం రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహితులు, కీలక అనుచరులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వారిని కలవడంలో ఏమాత్రం ఆలస్యం చేసినా తమపై ఉన్న అభిప్రాయం బలపడటంతో పాటు మరింత దూరం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా.. సాంకేతిక కారణాలు, ఈసీ నిబంధనల నేపథ్యంలో సోమవారం వరకు కాస్త నెమ్మదించారు. కోడ్ ముగియడంతో.. ఎన్నిలక నేపథ్యంలో షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి కోడ్ అమలులోకి వచ్చింది. పోలింగ్, కౌంటింగ్ ముగిసినప్పటికీ సోమవారం వరకు అమలులో ఉంది. దీన్ని పట్టించుకోకుండా రేవంత్‌రెడ్డిని కలిసి అభినందనలు తెలిపిన డీజీపీ అంజనీకుమార్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు వెళ్లిన మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లు సంజయ్ కుమార్ జైన్, మహేష్ మురళీధర్ భగవత్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఆయా అధికారులు రెండు రోజుల పాటు మిన్నకుండిపోయారు. బయటపడకుండా ఫోన్ల ద్వారానే ప్రసన్నానికి ప్రయత్నాలు చేశారు. సోమవారంతో ఎన్నికల కోడ్ ముగిసిపోవడాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అభినందనలు చెప్పే సాకుతో వారిని కలుస్తూ, పుష్పగుచ్ఛాలు అందిస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఎన్నికల్లో మీ పార్టీ గెలవడానికి, అభ్యర్థుల కోసం రిస్క్ తీసుకుని, బయటపడకుండా అనేక సహాయసహకారాలు అందించినట్లు చెప్పుకుంటున్నారు. ► అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోలీసు విభాగంలోని అన్ని స్థాయిల అధికారులు భారీ ఎత్తున బదిలీ అయ్యారు. ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు పెద్ద ఎత్తున పదోన్నతుల నేపథ్యంలో కొందరు కమిషనరేట్లు, జిల్లాలు దాటాల్సి వచ్చింది. ఎన్నికల్లో ప్రభుత్వం మారిన ప్రతిసారీ బదిలీలు అనివార్యమైనప్పటికీ ఈసారి ఇవి గతంకంటే భారీగా జరగనున్నాయి. దీంతో సుదీర్ఘకాలంలో అప్రాధాన్య పోస్టి ంగ్స్‌లో ఉన్న వారితో పాటు ఆశావహులు సైతం అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలెట్టారు. ► ఇలా వారిని కలుస్తున్న ప్రతి అధికారీ నేను మీ వాడినేనని, ఇన్నాళ్లూ బయటపడలేకపోయానని, ఉన్నతాధికారుల ఒత్తిడితో మిన్నకుండిపోయానని.. ఇలా అనేక రకాలుగా సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారు. కొందరైతే తాము పైనుంచి వచ్చే ఆదేశాలను పాటించే బ్యూరోక్రాట్లమని, ఎవరి ఎలా చెప్తే అలా చేయాల్సి వస్తుందని నేతల వద్ద వాపోతున్నారు. ఇలా బయటకు రాలేని, వచ్చినా అధికార పార్టీ వారు పట్టించుకోరని భావిస్తున్న కొందరు అధికారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుం దో? అనే భావనలో వారు ఉన్నారు. -
వైఎస్సార్ హయాంలోనే కాంగ్రెస్ హవా
హైదరాబాద్: రాష్ట్రంలో అనుకూల పవనాలతో అధికారం ‘హస్త’గతమైనప్పటికీ రాజధాని హైదరాబాద్ మాత్రం కాంగ్రెస్‌ను దూరం పెట్టింది. దశాబ్ద కాలంగా ఈ పార్టీకి ఇక్కడ ఆదరణ లభించడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మూడో ఎన్నికలోనూ కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవంగా పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో ఖాతా తెరవడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము కాగా, కోర్‌సిటీలో సైతం అదే పరిస్థితి నెలకొంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాత్రమే కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ మేరకు 2009లో ఖైరతాబాద్‌లో దానం నాగేందర్, జూబ్లీహిల్స్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి, సనత్‌నగర్‌లో మర్రి శశిధర్‌రెడ్డి, గోషామహల్లో ముఖేశ్‌గౌడ్, సికింద్రాబాద్‌లో జయసుధ, కంటోన్మెంట్లో శంకర్రావు, మల్కాజిగిరిలో ఆకుల రాజేందర్, ఉప్పల్‌లో బండారి రాజిరెడ్డి, ఎల్బీనగర్లో దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో భిక్షపతి యాదవ్, మహేశ్వరంలో సబితారెడ్డి, ముషీరాబాద్‌లో మణెమ్మ తదితరులు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పూర్తిగా చతికిలపడింది. 2014లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలనుసైతం దక్కించుకోలేక పోయింది. 2018 ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్‌తో కలిసి కూటమిగా పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అన్ని స్థానాల్లో అపజయాన్ని మూటగట్టుకుంది. పదేళ్లలో రెండు పర్యాయాలు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినా..అందులోనూ సైతం మొక్కుబడి స్థానాలకు పరిమితమైంది. కాగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమే. నగర అధ్యక్షుల ఎంపికలో ఆలస్యం..సీనియర్ల మధ్య సమన్వయలేమి కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చింది. 2014, 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ, 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నా అధిష్టానం సమీక్షించుకోకపోవడం దారుణం. -
‘హ్యాట్రిక్’ హీరో కేపీ వివేకానంద్
ఎమ్మెల్యేగా వివేకానంద్ ముచ్చటగా మూడోసారి ఎన్నికలో ‘హ్యాట్రిక్’ సాధించారు. గతంలో మేడ్చల్‌లో అంతర్భాగంగా ఉన్న కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా కూన శ్రీశైలంగౌడ్ గెలుపొందారు. తర్వాత 2014, 2018, 2023 వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వివేకానంద ఘన విజయం సాధిస్తూ వచ్చారు. గడచిన ఎన్నికల్లో 41,500 మెజార్టీ రాగా తాజాగా ఏకంగా 85,576 మెజారీ్టతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా భారీ మెజారీ్టతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద్ తనదైన శైలిలో పాదయాత్రల ద్వారా, స్థానికంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఘనవిజయం చేకూర్చి పెట్టారు. కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే వివేకానంద్ ఘనవిజయం సాధించడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.. గత నెల రోజులుగా విస్తృత ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కలిసి సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా చింతల్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఈ విజయం కుత్బుల్లాపూర్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివేకానంద ప్రకటించారు. హ్యాట్రిక్ ఇచి్చన ప్రజలకు రుణపడి ఉంటా.. తనపై నమ్మకంతో హ్యాట్రిక్ విజయం చేకూర్చిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సుమారు రూ.6వేల కోట్ల నిధులతో కుత్బుల్లాపూర్ రూపురేఖలు మార్చానన్నారు. తద్వారా ప్రజల్లో ఉంటూ ముందుకు సాగానన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని అభివృద్ధి మౌలిక వసతులు కలి్పంచడం మూలంగానే నన్ను ఆదరించి గెలిపించారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచి్చన తనకు మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరారు. రికార్డు విజయంతో ఆనందోత్సవాలు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేకానంద్ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 85,576 మెజార్టీ ఓట్లు కార్యకర్తల్లో జోష్ పెంచింది. ఆది నుండి ఎమ్మెల్యేకు వెన్నంటి ఉండేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక టీమ్ స్పిరిట్‌తో ముందుకు సాగుతూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్‌కు రెండు సంవత్సరాలుగా పార్టీ కార్పొరేటర్లు దూరం ఉన్నప్పటికీ చివరికి మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఎన్నికల్లో ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేశారు. అంతకుముందే తనకంటూ ఒక వర్గాన్ని ద్వితీయ శ్రేణి నాయకులను ఎంపిక చేసుకొని డివిజన్ల వారీగా పక్క ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడంతో ఈ భారీ విజయం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఇద్దరూ హ్యాట్రిక్ వీరులే.. కుత్బుల్లాపూర్: ఆదివారం వెలువడిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద్, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావులు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేలుగా హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో ఫలితం వెలువడిన వెంటనే ఇరువురు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి గెలుపొందిన ఆనందాన్ని పంచుకున్నారు. ఇరువురు గతంలో టీడీపీ నుంచి గెలిచి అనంతరం బీఆర్ఎస్లో చేరారు. ఒకటి నుంచి 22వ రౌండ్ వరకు వివేకానంద్ ఆధిపత్యం కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కేపీ వివేకానందగౌడ్ (బీఆర్ఎస్)కు 1,87, 999 ఓట్లు, కూన శ్రీశైలంగౌడ్(బీజేపీ)కు 1,02,423 ఓట్లు, కొలన్ హన్మంత్‌రెడ్డి (కాంగ్రెస్)కు 1,01,554 ఓట్లు రాగా 85,576 ఆదిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్ సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై ఘన విజయం సాధించారు. ఒకటో రౌండ్ నుంచి 22 రౌండ్ వరకు ఎక్కడా తగ్గకుండా ప్రతి రౌండ్లో ఆధిక్యత కనబరిచి వివేకానంద పట్టు నిలుపుకుని హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు. అయితే 20 రౌండు వరకు రెండో స్థానంలో కొనసాగిన కాంగ్రెస్ అభ్యర్థి హన్మంత్‌రెడ్డి చివరి రెండు రౌండ్లలో వెనక్కి తగ్గడంతో అనూహ్యంగా రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ వచ్చారు. ఫలితం ప్రకటించే సమయానికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. -
అక్బరుద్దీన్ ఒవైసీ మెజారిటీపై సర్వత్రా ఆసక్తి
చాంద్రాయణగుట్ట: వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు ఆరోసారి బరిలోకి దిగిన చాంద్రాయణగుట్ట ఎంఐఎం పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ ఎంత మెజార్టీతో గెలుస్తారన్న విషయం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. గత ఎన్నికల సమయంలో అక్బరుద్దీన్ ఒవైసీ 95,339 ఓట్లు రాబట్టి బీజేపీ అభ్యర్థి సయ్యద్ షహజాదిపై 80,264 ఓట్ల మెజార్టీ సాధించారు. ద్వితీయ స్థానంలో సయ్యద్ షహజాదీ 15,075, తర్వాతి స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పిడి సీతారాంరెడ్డి 14,224, కాంగ్రెస్ అభ్యర్థి ఇసా బిన్ ఒబేద్ మిశ్రీ 11,309ల ఓట్లు మాత్రమే రాబట్ట గలిగారు. గతంతో పోలిస్తే ఈసారి 12 వేల ఓట్లు అధికంగా పోలవ్వడం.. ప్రధాన పారీ్టల అభ్యర్థులు హిందువులు కావడంతో ముస్లిం ఓట్లు తమకు గంపగుత్తగా పడి లక్ష మెజార్టీ వస్తుందని మజ్లిస్ శ్రేణులు అంచనాలు వేసుకుంటున్నాయి. వారి అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయన్నది ఆదివారం వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
పాతబస్తీలో పతంగ్ జోరేనా...!
చార్మినార్: పాతబస్తీలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా నియోజకవర్గాలు మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో గతంలో లాగే మజ్లిస్ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాతబస్తీ నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ బలం–అత్యధిక సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉండటమే. చార్మినార్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ అభ్యరి్థకి గట్టి పోటీ ఎదురైనప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ సరళి మారి మజ్లిస్ పార్టీకి అనుకూలంగా ఏర్పడింది. యథేచ్ఛగా బోగస్ ఓట్లు పోలయ్యాయి. ఎక్కడా గుర్తింపు కార్డుల కోసం సంబంధిత అధికారులు విచారణ (అడగకపోవడం) చేయకపోవడంతో ఎవరు పడితే వారు స్లిప్‌లతో బోగస్ ఓట్లు వేశారు. యాకుత్‌పురాలో మజ్లిస్ పారీ్టకి ఎంబీటీ గట్టి పోటీనిచి్చంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల పోటీ నామమాత్రమే.. ► యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి ఎంబీటీ అభ్యరి్థగా ఎన్నికల బరిలో నిలిచిన మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్, మజ్లిస్ పార్టీ అభ్యర్థి మాజీద్ హుస్సేన్ మేరాజ్‌కి గట్టి పోటీ నిచ్చారు. నిజానికి ఈ నియోజకవర్గం మజ్లిస్ పార్టీకి కంచుకోట. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గం ఓటర్లు మార్పును కోరుతుండటంతో మజ్లిస్ పార్టీకి కాకుండా ఎంబీటీకి అధిక సంఖ్యలో ఓట్లు పోలైనట్లు సమాచారం. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీకి ఈసారి యాకుత్‌పురా నుంచి టికెట్ దక్క లేదు. ఆయన స్థానంలో నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ మేరాజ్‌కు టికెట్ లభించడం.. ఆయన స్థానికేతరుడు కావడంతో ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లాఖాన్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ► అయితే ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మజ్లీసేతర పారీ్టలైన బీఆర్ఎస్ అభ్యర్థి సామా సుందర్‌రెడ్డి కేవలం ఐఎస్ సదన్ డివిజన్, గౌలిపురా డివిజన్లలో మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించి.. మిగిలిన డివిజన్లలోని ఓటర్లకు అతని ముఖం ఎలా ఉంటుందో చూపించ లేదు. ► ఇక బీజేపీ అభ్యర్థి వీరేందర్ యాదవ్ సైతం గౌలిపురా, కుర్మగూడ డివిజన్లకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ఐఎస్‌సదన్ డివిజన్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ► యాకుత్‌పురా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవిరాజ్ అసలు ఎన్నికల ప్రచారమే నిర్వహించ లేదు. కేవలం ఒకటి రెండు చోట్ల పాదయాత్రలు నిర్వహించిన ఆయన ఒక దశలో ఎన్నికల కార్యాలయానికి తాళాలు వేసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ► ఇలా యాకుత్‌పురాలో మజ్లీసేతర పారీ్టలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల పోటీ నామమాత్రమే. చారి్మనార్‌లో మజ్లిస్‌కు గట్టి పోటీనిచి్చన కాంగ్రెస్, బీజేపీ.. ► చార్మినార్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్‌తో పాటు బీజేపీ అభ్యర్థి మెఘారాణి అగర్వాల్ పోటాపోటీగా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ..మజ్లిస్ పార్టీ అభ్యర్థి మీర్ జులీ్ఫకర్ అలీ విజయం సాధించనున్నారు. ► ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ సలావుద్దీన్ లోధీ నామమాత్రమే. చాంద్రాయణగుట్టలో మజ్లిస్‌కు పోటీ నిచ్చిన బీజేపీ.. ► చాంద్రాయణగుట్టలో ఈసారి కూడా మజ్లిస్ పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించనున్నారు. ► బీజేపీ తరఫున భాగ్యనగర్ గణేష్‌ఉత్సవ సమితి కార్యదర్శి కౌడి మహేందర్ ఎన్నికల బరిలో ఉండి ప్రచారంలో దూసుకు పోయారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి అక్బరుద్దీన్ ఒవైసీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ► చాంద్రాయణగుట్టలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సక్రమంగా నిర్వహించకపోవడంతో వీరిరువురి ముఖాలు సైతం నియోజకవర్గం ఓటర్లకు తెలియకుండా పోయింది. బహదూర్‌పురాలో కనిపించని బీఆర్ఎస్.. ► బహదూర్‌పురా నియోజకవర్గం మజ్లిస్ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి మజ్లిస్ పార్టీ జెండాపై ఎవరూ పోటీ చేసినా గెలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే నియోజకవర్గం నుంచి హాట్రిక్ సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మొజంఖాన్‌కు ఈసారి టికెట్ లభించ లేదు. ఈయన స్థానంలో మోబిన్ ఎన్నికల బరిలో దిగగా.. భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు. ► ఈ ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి ఆయనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిపాటి రాజేష్‌కుమార్ గట్టిగా పోటీనిచ్చారు. ► ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మీర్ ఇనాయత్ అలీ బాక్రీతో పాటు బీజేపీ అభ్యర్థి వై.నరేష్‌ల పోటీ నామమాత్రమే. -
మలక్‌పేటలో మళ్లీ మజ్లిస్ ?
దిల్సుఖ్నగర్/చంచల్‌గూడ: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాతంగా ముగిశాయి. మలక్‌పేట నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు రణరంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో నెలకొంది. గత మూడు పర్యాయాల నుంచి ఎంఐఎం సిట్టింగ్ సీటు కావడంతో ఈసారి కూడా అభ్యర్థి అహ్మద్ బలాలా నాలుగోసారి విజయం నమోదు చేస్తానని గట్టి నమ్మకంతో ఉన్నాడు. మైనార్టీ ఓట్లు, అభివృద్ధి, హిందువుల ఓట్లపై నమ్మకం పెట్టుకున్న బలాలా మెజార్టీ పెంచుకోవడంపై దృష్టి సారించాడు. బీజేపీ అభ్యర్థి ప్రాంతానికి చెందిన పలు కుల సంఘాలు ఎంఐఎం అభ్యర్థికి మద్దతు పలకడం గమనర్హం. బీజేపీ మేకపోతు గాంభీర్యం... ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఈసారి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయామని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. గెలుస్తామనే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ రెండో స్థానం వచ్చినా పర్వాలేదని క్యాడర్ ఆశిస్తోంది. బీజేపీ సీటుకై ప్రస్తుత అభ్యరి్థతో పాటు సైదాబాద్ కార్పొరేటర్ భర్త కొత్తకాపు రవీందర్‌రెడ్డి సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి ఎన్నికల ప్రచారం సాధనాలను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆఖరి నిమిషంలో సీటు సంరెడ్డి సురేందర్‌రెడ్డిని వరించడంతో రవీందర్‌రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎన్నికల మెనేజ్మెంట్లో దిట్ట అయిన రవీందర్‌రెడ్డికి సీటు ఇస్తే ఎంఐఎం ఎమ్మెల్యే సీటుకు గురి పెట్టడం ఖా యమని బీజేపీ క్యాడర్లో గట్టిగా ఉండే. ఒక వేళ రవీందర్‌రెడ్డికి సీటు కేటాయిస్తే ఇబ్బంది కలగవచ్చని సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సైతం తర్జనభర్జన పడ్డాడు. మలక్‌పేటలో చాలా మంది సీనియర్ నేతల తో పా టు ఇద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ఎవరికీ ఎన్నికల కీలక బాధ్యతలు అప్పగించకుండా అభ్యర్థి అన్నీ తానై వ్యవహరించడం తో బీజేపీ క్యాడర్ గందరగోళానికి గురైంది. మైనార్టీ ఓట్లు గెలిపిస్తాయని కాంగ్రెస్.. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రియల్టర్ వ్యాపారి షేక్ అక్బర్ కూడా మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకున్నాడు. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ఓట్లతో పాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో గట్టెకొచ్చని ధృడ నమ్మకంతో ఉన్నాడు. ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య స్నేహపూర్వక పోటీ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి తనకు విజయం సాధించి పెడతాయని గులాబీ పార్టీ అభ్యర్థి తీగల అజిత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. డిసెంబర్ 3వ తేదీన విజయం ఎవరిని వరిస్తుందో వేసి చూద్దాం. -
అభ్యర్థులు ఎక్కడ ఓటు వేస్తారంటే?
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. నెల రోజుల నుంచి ప్రచారంతో హోరెత్తించిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. గురువారం ఈ ముగ్గురు అభ్యర్థులు నియోజకవర్గంలోని వేర్వేరు డివిజన్ల పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ►బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ వెంకటేశ్వరకాలనీ డివిజన్ బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని ఓల్డ్ వెంకటేశ్వరనగర్ బూత్ నెం. 130లో తన ఓటు వేయనున్నారు. ► కాంగ్రెస్ అభ్యర్థి పి. విజయారెడ్డి ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని టెలిఫోన్ భవన్ పక్కన పాఠశాల విద్యాశాఖ పోలింగ్ బూత్ నెం. 59లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ► బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి జూబ్లీహిల్స్ డివిజన్పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 2 షేక్‌పేట మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన 140వ బూత్‌లో ఓటు వేయనున్నారు. -
చార్మినార్ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్‌పై.. ఎలాంటి కఠిన చర్యలు వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మేఘా రాణి అగర్వాల్‌తో పాటు పవన్ మిస్త్రాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ర్యాలీలో జరిగిన వివాదంపై వివరణ ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నందున, వారి వివరణ వినాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వెలువడిన నాటి నుంచి 3 రోజుల్లో సీఆర్పీసీ 41ఏ నోటీసులకు వివరణ ఇవ్వాలని పిటిషనర్లకు చెప్పింది. హైదరాబాద్ హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్‌లో తమపై దాఖలైన కేసులో అరెస్టు సహా ఇతర చర్యలు చేపట్టకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ మేఘా రాణి అగర్వాల్‌తో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ న్యాయవాది అంజలి అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలో ఒకరైన మేఘా రాణి అగర్వాల్ చార్మినార్ నుంచి పోటీ చేస్తున్నారని, ఈ నెల 9న నిర్వహించిన ర్యాలీ సందర్భంగా కొంత గందరగోళం చోటుచేసుకుందన్నారు. ర్యాలీలో గందరగోళంపై ఎండీ.జాఫర్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పిటిషనర్లపై కేసు నమోదైంది. 22న పిటిషనర్లకు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. పిటిషనర్లు వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పోలీసులు అరెస్టు సహా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వివరణ ఇచ్చేందుకు వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ, పిటిషన్లో వాదనలను ముగించారు. -
అత్యంత అప్రమత్తంగా నగర పోలీసు విభాగం
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ సమీపిస్తుండటంతో నగర పోలీసు విభాగం అప్రమత్తమైంది. బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండనున్నారు. ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బయటకు వెళ్లి మళ్లీ స్ట్రాంగ్ రూమ్స్‌కు చేరే వరకు ఎక్కడిక్కడ ప్రత్యేక బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య మంగళవారం తన కార్యాలయం నుంచి సమీక్షించారు. నగర వ్యాప్తంగా 144వ సెక్షన్, నిషేధాజ్ఞలు విధిస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని 15 ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నుంచి వీటి వద్ద ఈవీఎంల పంపిణీ ప్రారంభం కానుంది. సాయంత్రానికి ఈవీఎం బాక్సులు పోలింగ్ కేంద్రాలకు చేరతాయి. ఆపై గురువారం రాత్రి పోలింగ్ ముగిసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలను తరలిస్తారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు విభాగం ప్రత్యేక బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు సిబ్బంది, అధికారులు నిర్విరామంగా విధుల్లో ఉండనున్నారు. కీలక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారికి మాత్రం రిలీవర్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. దీని ప్రకారం నిర్ణీత సమయం తర్వాత ఆ ప్రాంతంలో కొత్త వాళ్ళు వస్తూ రోటేషన్ విధానంలో పని చేస్తారు. నగదు, మద్యం సహా ఇతర వస్తువులు పంపిణీ, ఓటర్ల తరలింపు పైనా నిఘా వేసి ఉంచుతున్నారు. నగర కమిషనరేట్‌లో ఉన్న 7 జోన్లలోనూ అధికారులు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్‌మార్చ్‌లు ముమ్మరం చేశారు. పోలింగ్ కేంద్రాలను 200 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ విధిస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి 8 గంటల వరకు ఇవి అమలులో ఉండనున్నాయి. వీటికి తోడు నగర వ్యాప్తంగా నిషేధాజ్జలు విధించారు. వీటి ప్రకారం నలుగురి కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడటం, జెండాలతో సహా ఎలాంటి కర్రలు తదితరాలు కలిగి ఉండటం నిషేధం. -
ఓటు వేశాక సెల్ఫీ దిగి వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు
హైదరాబాద్: గ్రీన్ చాలెంజ్, బకెట్ చాలెంజ్ తరహాలోనే ఓటు చాలెంజ్‌కు కాలనీ సంఘాలు తెరలేపాయి. గ్రేటర్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు, యువ ఓటర్లలో చైతన్యం నింపేందుకు యునైటెడ్ ఫెడరేషన్‌న్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌న్ (యూ–ఎఫ్‌ఈఆర్‌డబ్ల్యూఏఎస్) పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రౌడ్ ఓటరు, ఫ్యామిలీతో సెల్ఫీ..అనే కార్యక్రమాలను చేపడుతున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి బీటీ శ్రీనివాస్ తెలిపారు. కుటుంబంతో కలిసి ఉదయమే ఓటు వేసి, సిరా చుక్కను చూపిస్తూ సెల్ఫీ దిగాలని, ఆయా ఫొటోలను కాలనీ సంఘాల వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయాలని సూచించారు. కాలనీలో ఇతరులకు ఓటు వేయాలని చాలెంజ్ చేయాలని తెలిపారు. డివిజన్‌్ స్థాయిలో వాట్సాప్ గ్రూప్‌లు.. నగరంలోని 4,800 కాలనీల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని డివిజన్ స్థాయిలో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్లో 800–900 మంది సభ్యులున్నారు. ఈనెల 30న పోలింగ్ రోజు ఉదయమే ఓటేశాక కుటుంబ సభ్యులంతా కలిసి వేలిపై సిరా చుక్కను చూపిస్తూ సెల్ఫీ దిగి కాలనీ వాట్సాప్ గ్రూప్‌లలో పెట్టాలని అసోసియేషన్‌న్ ప్రతినిధులు సూచించారు. ఆ రోజు ఎలాంటి పనులున్నా వాయిదా వేసుకోవాలని, వేడుకలకు హాజరవ్వాల్సి ఉంటే సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. పోలింగ్‌కు ముందురోజు కాలనీ వాసులంతా సమూహంగా బూత్ వరకు ఈవినింగ్ వాక్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా 40–55 శాతం మాత్రమే పోలింగ్ నమోదైన కాలనీల్లో ఈసారి 60 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరగాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. -
కష్టాలు తీరాలంటే.. కాంగ్రెస్ జెండా ఎగరాలి
కాప్రా: ఉప్పల్ నియోజకవర్గం ప్రజల కష్టాలు తీరాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఈసీఐఎల్‌లో రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉప్పల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే ప్రజల వెన్నంటే ఉంటూ కష్టాలు తీరుస్తారన్నారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రానివారికి, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మల్కాజిగిరి ఎంపీగా తనను ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపినట్లే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుండి మందముల పరమేశ్వర్‌రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను చూసి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అండగా ఉంటుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఇవన్నీ జరగాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని, తెలంగాణలో మార్పు రావాలంటే కేసీఆర్ పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘కొడంగల్’ సింహం ఎవరో?
కొడంగల్: నియోజకవర్గ ప్రజల తీర్పు విభిన్నం. మార్పు కావాలనుకుంటే ఎలాంటి వారికైనా పరాభవం తప్పదు. ఇది గతంలో నిరూపితమైంది. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014లో తెలంగాణ ఉద్యమాన్ని పక్కకు పెట్టి టీడీపీకి అవకాశం ఇచ్చారు. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల నాడీ నాయకులకు అంతుపట్టడం లేదు. ఓటరును ప్రసస్నం చేసేందుకు అభ్యర్థులు, వారి అనుచరులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. అయితే కొడంగల్‌లో ఎవరు గెలిచినా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. అందులో ఒకరు రేవంత్‌రెడ్డి. ఆయన పీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన విజయం ఖరారైతే రాజకీయంగా మరింత పట్టు సాధిస్తాడనడంలో ఎలాటి సంషయం లేదు. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలకుపైగా గెలిస్తే రేవంత్ సీఎం అవుతాడని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం కొడంగల్ ప్రజల తలరాత మారుస్తుందని హస్తం నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి గెలిస్తే మంత్రి పదవి లభిస్తుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు ఇప్పటికే ప్రకటించారు. బీఆర్ఎస్ గెలిస్తే మంత్రి పదవి, కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కొడంగల్‌కు వరిస్తుందని జనం భావిస్తున్నారు. ఇద్దరిలో ఎవరిని గెలిపించాలనే విషయంపై ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు పలు సర్వేల్లో బహిర్గతమవుతోంది. ఈనెల 30న సాయంత్రం 5 గంటల తర్వాత వెలువడే ఎగ్జిట్‌పోల్‌లో ఈ విషయం బయట పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటమి కోసం శ్రమిస్తున్న నేతలు..? నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే ప్రమోషన్ వస్తుందని బీఆర్ఎస్ అధినేతలు ఏ క్షణంలో ప్రకటించారో కాని అప్పటి నుంచి ఆయనకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రజల మనిషిగా పేరుగాంచిన ఆయనకు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో అఽభిమానులు ఉన్నారు. ఆయన కోసం గట్టిగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ఆయన నామినేషన్ వేస్తే అలవోకగా గెలిచేంతగా పట్టు సాధించారు. అయితే ప్రమోషన్ ఇస్తామని బహిరంగంగా చెప్పడంతో బీఆర్ఎస్ జిల్లా నేతలే ఆయన ఓటమి కోసం శ్రమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన గెలిస్తే తమకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గుతుందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఓడితేనే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని జిల్లా నేతలు భావిస్తున్నట్లు పీఎన్ఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గురునాథ్‌రెడ్డి కేడర్ రేవంత్‌కే జై కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కీలకంగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ పక్షాన ప్రచారం చేసి నరేందర్‌రెడ్డిని అసెంబ్లీ మెట్లెక్కించారు. గురునాథ్‌రెడ్డికి బీఆర్ఎస్లో సముచిత స్థానం దక్కకపోవడంతో ఆయన కారు దిగి కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. గురునాథ్‌రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డిలతో పాటు నియోజకవర్గంలోని ఆయన కేడర్ మొత్తం రేవంత్ పక్షాన నిలిచింది. హస్తం విజయం కోసం గట్టిగా పని చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న తన అనుచరులను కాంగ్రెస్‌లో చేర్పించారు. ఇప్పటికే బీఆర్ఎస్కు ఇబ్బందికర వాతావరణం కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొడంగల్‌లో బీఆర్ఎస్ను ఓడించాలనే నిర్ణయానికి వచ్చారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఎవరి తలరాతను మారుస్తుందోనని స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఓటర్లకు రాపిడో గుడ్ న్యూస్.. ఉచిత సర్వీసులు
హైదరాబాద్: ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు ఓటర్లను తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు రాపిడో సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని 2,600 పోలింగ్స్టేషన్లకు రాపిడో సేవలు లభించనున్నాయి. ఓటర్లు తమ మొబైల్ ఫోన్ రాపిడో యాప్‌లో ‘ఓట్ నౌ’ కోడ్‌ను నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకొనేలా ఈ సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు. రవాణా సదుపాయం లేని కారణంగా ఓటు వేయలేని పరిస్థితి ఉండకూడదని చెప్పారు. గ్రేటర్లో గత ఎన్నికల్లో 40 శాతం నుంచి 55 శాతం వరకే ఓటింగ్ నమోదైందని, దీన్ని మరింత పెంచేందుకు తమవంతు కృషిగా రాపిడో సేవలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆ 24 సీట్లతోనే అధికార పగ్గాలు?
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పోలింగ్ శాతం పెరిగితే గెలుపోటములపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి కొత్త యువ ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రధాన రాజకీయ పక్షాలకు కంచుకోటలుగా, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరుగులేని శక్తిగా తయారయ్యాయి. ప్రతిసారి పోలింగ్ శాతం సగానికి మించనప్పటికి.. పోలైన ఓటింగ్‌లో సైతం సగం శాతం దక్కించుకున్న అభ్యర్థులు విజయకేతనంఎగరవేయడం సర్వసాధారణంగా మారింది. కేవలం పార్టీ సంప్రదాయ, సెంటిమెంట్, లబ్ధి పొందిన, ప్రలోభాలకు గురైన, రాజకీయ పార్టీ కార్యకర్తలు, సానుభూతి తదితరులు మాత్రమే పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిగిలిన తటస్థ ఓటర్లు అభ్యర్థుల జయాపజయాలపై పెద్ద ఆసక్తి లేక తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఫలితం వన్ సైడ్‌గా డిసైడ్ అవుతోంది. వాస్తవంగా ప్రతి ఓటు ప్రాధాన్యం కలిగిందే. ఓటు హక్కు వినియోగించడంలో నిర్లక్ష్యమే ప్రభావం చూపుతోంది. 40 శాతం సీట్లు ఇక్కడే.. రాష్ట్రం మొత్తంమీద 119 అసెంబ్లీ స్థానాలుండగా అధికార పగ్గాలు చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 60 అందులో 40 శాతం సీట్లు మహా నగరంలోనే ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్న 24 సీట్లు అత్యంత కీలకమే. పాతబస్తీ మినహా ఏకపక్షంగా ఏ పార్టీకి సీట్లు వచ్చే అవకాశం లేదు. మజ్లిస్ పార్టీకి మాత్రం గ్యారంటీగా ఆరేడు సీట్లు వస్తాయి. మిగతా స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ ఉన్నా.. అధికార, ఆర్థిక బలం ఉన్న అభ్యర్థులకే ఫలితం మొగ్గు చూపుతోంది. పాతబస్తీలో సంప్రదాయ ఓట్లే రాష్ట్రంలోనే అతి తక్కువగా పోలయ్యే ఓట్లు హైదరాబాద్ పాతబస్తీలోనే. ఇక్కడ కేవలం సంప్రదాయ ఓటర్లు మాత్రమే తమఓటు హక్కును వినియోగిస్తారు. అది కూడా ముస్లిం– హిందు ఓట్లు మాత్రమే. అందులో సైతం ముస్లిం ఓటర్లలో 35 శాతం వరకు, హిందూ ఓటర్లలో 20 శాతం వరకు శాతం వరకు మాత్రమే తమ హక్కు వినియోగించుకుంటారు. పాతబస్తీల పెద్దగా పోటీ ఉండని కారణంగా రెండు సామజిక వర్గాలు సైతం ఓటింగ్‌పై పెద్దగా ఆసక్తి కనబర్చరు. గత ఎన్నికల్లో మజ్లిస్ 7 స్థానాల్లో గెలుపొందింది. నాంపల్లి, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా సిట్టింగ్ స్థానాలను పదిల పర్చుకుంది. మజ్లిస్‌కు నాంపల్లి మినహ ఎక్కడ గట్టి పోటీ ఎదురుకాలేదు. అయినా ఏడు శాతం ఆధిక్యతతో గట్టెక్కింది. కొత్త ఓటర్లే కీలకం.. గ్రేటర్ పరిధిలో ఈసారి యువ ఓటర్లు అధికంగా పెరిగారు. మొత్తం మీద 2.71,084 కొత్త ఓటర్లు నమోదయ్యారు. జిల్లాలవారీగా పరిశీలిస్తే హైదరాబాద్ 77,5 22, రంగారెడ్డి జిల్లాలో 92,540, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 1,01,022 ఓట్లు పెరిగాయి. పాతబస్తీతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంతో పోలిస్తే ఓటర్లు పెరిగినట్లయింది. ఇందులో తొలి ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. పాతబస్తీతో పాటు మిగతా సెగ్మెంట్లలో సైతం సిట్టింగులు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు, జెండాలు మారుతున్న వారి సంప్రదాయ ఓటర్లు సైతం వారి వెంట నడుస్తన్నట్లు తెలుస్తోంది. ముషీరాబాద్, అంబర్‌పేట, ఉప్పల్ మినహా సనత్‌నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, మహేశ్వరంలో పాతకాపులకే పట్టం లభిస్తూ వస్తోంది. గత పర్యాయం ఇలా.. గ్రేటర్ పరిధిలో గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 14 సీట్లను దక్కించుకుంది. అంతకు ముందు 2014లో 3 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 2018లో మహాకూటమి పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసి ఎల్బీనగర్, మహేశ్వరంలోనే మాత్రమే నెగ్గింది. అనంతరం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో చేరిపోయారు. అంతకు రెండు పర్యాయాలు ముందు 2009లో గ్రేటర్‌లోని 24 చోట్ల పోటీ చేసి 14 స్థానాలు గెలుచుకుంది. అప్పటి నుంచి 2018 వరకు పెద్దగా సీట్లు గెలుచుకోలేదు. బీజేపీ గత ఎన్నికల్లో గోషామహల్లో మాత్రమే గెలుపొందింది. 2014లో గోషామహల్‌తోపాటు ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, ఉప్పల్‌లో విజయం సాధించింది. -
పాతబస్తీలో వేడెక్కిన రాజకీయం.. యాకుత్‌పురా చేజారేనా?
హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్‌కు ఎంబీటీ పోరు తప్పడం లేదు. ఏకంగా యాకుత్‌పురా అసెంబ్లీ స్థానంలో తీవ్రమైన పోటీ నెలకొనడంతో మజ్లిస్‌కు ఎంబీటీ కొరకరాని కొయ్యగా మారింది. ఈసారి పాతబస్తీకే పరిమితమై కేవలం తొమ్మిది స్థానాల్లో బరిలో దిగినప్పటికీ.. ఒక సిట్టింగ్ స్థానంలో ఎంబీటీ, మరో రెండు సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ దూకుడు ఆందోళనకరంగా తయారైంది. గతంలో ఏన్నడూ లేని విధంగా మజ్లిస్‌కు గడ్డు పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సిట్టింగ్ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించి పాదయాత్ర, స్థానిక సభలతో పరిస్థితి చక్కదిద్దేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. యాకుత్‌పురా చేజారేనా? ► ఎంబీటీ దూకుడుతో మజ్లిస్‌కు యాకుత్‌పురా సిట్టింగ్ స్థానం చేజారే పరిస్థితి నెలకొంది. మజ్లిస్ పక్షాన నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎంబీటీ పక్షాన ఆ పార్టీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఇద్దరి మధ్యే నెలకొన్నట్లు కనిపిస్తోంది. యాకుత్‌పురా సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ పాషాకు రిటైర్మెంట్ ప్రకటించిన మజ్లిస్.. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ అభ్యర్థిత్వాన్ని యాకుత్‌పురాకు బదిలీ చేసి రంగంలోకి దింపింది. ► రెండు దశాబ్దాలుగా యాకుత్‌పురా స్థానాన్ని కై వసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎంబీటీ ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాస్తవంగా గతంలో మజ్లిస్ నుంచి చీలిన ఎంబీటీ యాకుత్‌పురా స్థానాన్ని కై వసం చేసుకుంది. ఆ తర్వాత ఎంబీటీ నుంచి ఎన్నికై న ముంతాజ్ ఖాన్ మజ్లిస్‌లో చేరి వరసగా గెలుస్తూ వచ్చారు. గత పర్యాయం ముంతాజ్ ఖాన్ చార్మినార్ నుంచి పోటీ చేసి ఇటీవల రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎంబీటీ తన పూర్వవైభవం కోసం యాకుత్‌పురాపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఈసారి ఎలాగైనా పాగా వేసేందుకు పాట్లు పడుతోంది. నాంపల్లి పదిలమేనా? మజ్లిస్ సిట్టింగ్ స్థానమైన నాంపల్లిలో పరిస్థితి నువ్వా.. నేనా? అన్న విధంగా తయారైంది. మజ్లిస్ వ్యూహత్మంగా సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్క సెగ్మెంట్‌కు పంపించి ఇక్కడి నుంచి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌ను రంగంలోకి దింపింది. ఇదే స్థానం నుంచి మూడు పర్యాయాలుగా పోటీ పడుతున్న ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉండటంతో తీవ్ర పోటీ తప్పడం లేదు. కాంగ్రెస్ దూకుడు కూడా మజ్లిస్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ , మరోవైపు ఫిరోజ్ ఖాన్‌కు వ్యక్తిగత ప్రాబల్యం మజ్లిస్ ఓట్లకు గండికొట్టే అవకాశాలున్నాయి. మలక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ బలపడింది. స్థిరాస్తి వ్యాపారి అక్బర్ ప్రచారం ఉద్ధృతం చేయడం మజ్లిస్‌ను కలవర పెట్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల తన స్థానాన్ని పదిలపర్చుకునేందుకుప్రయత్నిస్తున్నారు. -
బేగంపేట్ ఎయిర్‌పోర్టు.. బిజీబిజీ
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లు దూసుకెళ్తున్నాయి. రాజకీయ నేతల సుడిగాలి పర్యటనల్లో గిరికీలు కొడుతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈసారి వీటి వినియోగం విరివిగా పెరిగింది. అన్ని ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు రోజుకు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. బహిరంగసభలతో పాటు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలు, ర్యాలీలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్రమంతటా పర్యటించాల్సివస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరుసగా వివిధ ప్రాంతాల్లో జరిగే సభల్లో పాల్గొనేందుకు రోడ్డు మార్గంలో వెళ్లడం కష్టసాధ్యంగా మారడంతో అన్ని ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు హెలికాప్టర్లపైనే ఆధారపడి పరుగులు తీస్తున్నారు. ఇంచుమించు నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి రోజు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం రోజుకు నాలుగైదు సభలకు హాజరవుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితర నాయకులు రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తున్నారు. ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్లు కూడా హెలికాప్టర్లలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో రోజుకు 3 నుంచి 4 హెలికాప్టర్లను మాత్రమే వినియోగించగా ఈసారి రోజుకు పది వరకు వినియోగిస్తున్నట్లు అంచనా. ప్రముఖుల రాకపోకలు మినహా మిగతా రోజుల్లో నిశ్శబ్దంగా ఉండే బేగంపేట్ ఎయిర్‌పోర్టు కొద్ది రోజులుగా సందడిగా మారింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు, నాయకుల రాకపోకలతో బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి విమానాలు పరుగులు తీస్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షలు ఖర్గే,ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, తదితరుల రాకపోకలతో పాటు వారితో పాటు వచ్చే ఇతర నాయకులు, స్థానిక నేతల ఉరుకులు,పరుగులతో బేగంపేట్ కళకళలాడుతోంది. ఐదుగురి నుంచి ఏడుగురి వరకు.. ప్రస్తుతం రాజకీయ పార్టీలు వినియోగిస్తున్న హెలికాప్టర్లన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినవే. కొన్ని సింగిల్ ఇంజిన్ సామర్థ్యం కలిగినవి కాగా, చాలా వరకు డబుల్ ఇంజిన్ సామర్థ్యం కలిగిన వాటినే వినియోగిస్తున్నారు. ఒక్కో చాపర్‌లో ఐదుగురు నుంచి ఏడుగురు ప్రయాణం చేయవచ్చు. దీంతో వీటి కోసం పార్టీలు చేసే ఖర్చు కూడా రూ.లక్షల్లోనే ఉంది. గతంలో గంటకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చార్జీ ఉంటే ఇప్పుడు ఒక్కో హెలికాప్టర్‌కు గంటకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆయా సంస్థలు చార్జీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగడం, అన్ని పార్టీలకు చెందిన నాయకులు విరివిగా పర్యటిస్తుండటంతో చార్జీలను భారీగా పెంచాయని ఏవియేషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లకు చెందిన పలు ఏవియేషన్ సంస్థలు హెలికాప్టర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్, చిప్సన్ ఏవియేషన్, ఇండో పసిఫిక్ ఏవియేషన్, గోల్డెన్ ఈగిల్ ఏవియేషన్ తదితర సంస్థలకు చెందిన హెలికాప్టర్లు ప్రచారంలో పరుగులు తీస్తున్నాయి. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ (ఏడబ్ల్యూ) 109, ఏడబ్ల్యూ 139, ఏడబ్ల్యూ 169, బెల్ 429,యురోకాప్టర్ 135 తదితర రకాలకు చెందిన హెలికాప్టర్లు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి. ఈ నెల 28 వరకు రాజకీయ పార్టీలు హెలికాప్టర్లను వినియోగించనున్నాయి. -
పల్లెకే మా ఓటు! ఉంటారా.. ఊరెళ్తారా..
హైదరాబాద్: గ్రేటర్ అభ్యర్థుల గుండెల్లో సరికొత్త గుబులు మొదలైంది. వలస ఓట్లపై ఆందోళన నెలకొంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నగరానికి వచ్చి స్థిరపడినప్పటికీ చాలామంది నగరవాసులు సొంత ఊళ్లలోనే ఓటింగ్‌లో పాల్గొనేందుకు మొగ్గు చూపుతున్నారు. వివిధ నియోజకవర్గాల్లో వేలాది మంది నగరంలోనూ, సొంత ఊళ్లోను ఓటుహక్కును కలిగి ఉన్నారు. ఇలా ఒక్కో నియోజకవర్గంలో సుమారు 20 వేల నుంచి 30 వేల మందికి పైగా ఓటర్లు రెండు చోట్ల ఓటుహక్కును కలిగి ఉన్నట్లు అంచనా. వివిధ కారణాల దృష్ట్యా వారంతా నగరంలో ఉంటున్నప్పటికీ పుట్టి పెరిగిన ఊళ్లలో తమ అస్తిత్వాన్ని చాటుకొనేందుకు సొంత ఊళ్లలోనే ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఇదొక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లోనూ నగరంలో ఓటు హక్కును కలిగి ఉన్నప్పటికీ చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం ఉంది. ఈ పరిణామం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. సాధారణంగా ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఉన్నత, మధ్యతరగతి వర్గాల కంటే దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాలే ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటారు. ప్రస్తుతం నగరంలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధుల తరఫున ప్రచారంలో పాల్గొనడంతో పాటు, సభలు, సమావేశాల్లోనూ ఈ వర్గాలే భారీ సంఖ్యలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో తమ ఓటుహక్కును ఎక్కడ వినియోగించుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. అనుచరులతో నిఘా... ► ఈ క్రమంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ అనుచరులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తున్నారు. డివిజన్లు, కాలనీలు, బస్తీల వారీగా ఇన్చార్జులను ఏర్పాటు చేసి ప్రతి ఓటరు నగరంలోనే తమ ఓటుహక్కును వినియోగించుకొనేలా ప్రోత్సహించేందుకు కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే మద్యం, డబ్బు పంపిణీ మొదలైన దృష్ట్యా ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లో సొంత ఊళ్లకు వెళ్లకుండా గట్టి హామీలను తీసుకుంటున్నట్లు తెలిసింది. నగరంలోని ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి. మేడ్చల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం స్థిరపడిన వారు, వలస కూలీలు, అసంఘటిత రంగంలో పని చేస్తున్నవారు, స్విగ్గి, జొమాటో, ఉబెర్, ఓలా వంటి యాప్ ఆధారిత వర్కర్లు తదితర వర్గాలకు చెందిన వారు భారీ సంఖ్యలో ఉన్నారు. ఇలా ఒక్కో నియోజకవర్గంలో 30 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. ► సొంత ఊళ్లలో స్థిరనివాసం కలిగిన వీరిలో ఎక్కువ మంది నగరంలో అద్దె ఇళ్లల్లోనే నివస్తున్నారు. దీంతో నగరంలో ఓటుహక్కు, రేషన్ కార్డు వంటివి కలిగి ఉన్నప్పటికీ ఎప్పటికై నా సొంత ఊళ్లకు వెళ్లాల్సిన వారిమేననే భావనతో ఉన్నారు. దీంతో సొంత ఊళ్లోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లోనూ చాలా మంది సొంత ఊళ్లకు తరలి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ అలా వెళితే నగరంలోని వివిధ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లను ఆశిస్తున్న అభ్యర్థులకు ఇది అశనిపాతమే కానుంది. వాహనాలు రెడీ.. హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు ఓటర్లను తరలించేందుకు వివిధ పార్టీలు పెద్ద సంఖ్యలో వాహనాలను బుక్ చేస్తున్నాయి. ఓటర్లను నగరంలోని తమ ఇంటి నుంచి తీసుకెళ్లి ఓటింగ్ అనంతరం తిరిగి నగరానికి చేరవేసేందుకు ట్రావెల్స్‌కు చెందిన వాహనాలను బుక్ చేస్తున్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా మినీ బస్సులు, కార్లు, క్రూజర్లు వంటి వాహనాలను ఇప్పటి నుంచే ఏర్పాటు చేస్తున్నారు. అలా రాలేనివాళ్లకు బస్సుల్లో, రైళ్లలో వచ్చేందుకు చార్జీలు, ఖర్చులు కూడా ముందస్తుగానే అందజేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సొంత ఊళ్లలోఓటు హక్కును వినియోగించుకొనేందుకు సిద్ధంగా ఉన్న వారి వివరాలను సేకరించేందుకు ఆయా ఊళ్లకు చెందిన నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దృష్ట్యా ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఎలాంటి ఖర్చులకై నా వెనుకడుగువేయడం లేదు. ఇటు హైదరాబాద్‌లోని వివిధ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు అందజేసే తాయిలాలు.. అటు జిల్లాల్లోని సొంత నియోజకవర్గాల అభ్యర్థుల నుంచి వచ్చే ఆహ్వానాలతో ఓటర్లు ఎటూ తేల్చుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
మజ్లిస్ కంచుకోటలో పాగా కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ
హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు మజ్లిస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మజ్లిస్ పారీ్టకి చారి్మనార్ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. ఈసారి జరిగే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు అటు బీజేపీ..ఇటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మజ్లిస్ పారీ్టకి ధీటుగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మేయర్ మీర్ జులీ్ఫకర్ అలీ ఎన్నికల బరిలో ఉండగా..బీజేపీ నుంచి మెఘారాణి, కాంగ్రెస్ పార్టీ నుంచి మహ్మద్ ముజీబుల్లా షరీఫ్ పోటీ చేస్తున్నారు. అన్ని డివిజన్లలో మజ్లిస్ కార్పొరేటర్లు.. ఈసారి చార్మినార్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు టికెట్ లభించ లేదు. ఆయన స్థానంలో మాజీ మేయర్ మీర్ జులీ్ఫకర్ అలీకి స్థానం దక్కింది. స్థానికంగా నివాసం ఉండడంతో పాటు గత అనుభవం దృష్ట్యా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చారి్మనార్ నియోజకవర్గంలోని ఘాన్సీబజార్, పత్తర్‌గట్టి, మొఘల్‌పురా, పురానాపూల్, శాలిబండ తదితర ఐదు డివిజన్లలో మజ్లిస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. ఈ డివిజన్ల పరిధిలోని ఓటర్లందరినీ సంబంధిత కార్పొరేటర్లు క్రమం తప్పకుండా కలుస్తూ ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఘాన్సీబజార్ నుంచి .. నియోజకవర్గంలోని ఇరువర్గాల ఓటర్లను తమకు మద్దతుగా చేసుకోవడంలో బీజేపీ అభ్యర్థి మెఘారాణి అహరి్నషలు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి ఘాన్సీబజార్ డివిజన్ అండగా ఉంది. ఇక్కడ బీజేపీ నాయకురాళ్లు, కార్యకర్తలు, నాయకులు కొనసాగుతున్నారు. డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో తమకే ఓట్లు పడే విధంగా నిరంతరం శ్రమిస్తున్నారు. కాగా, ఇదే డివిజన్లో కొంత మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పురానాపూల్ డివిజన్లో సైతం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన టీపీసీసీ కార్యదర్శి మహ్మద్ ముజీబుల్లా షరీఫ్ అన్ని స్థాయిల నాయకులను, కార్యకర్తలను పొగేసి తన గెలుపు కోసం ప్రయతి్నస్తున్నారు. నియోజకవర్గంలోని మత పెద్దలతో పాటు స్థానిక నాయకులను కలిసి వారి మద్దతు తీసుకున్నారు. ఇప్పటికే టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలీ మస్కతీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఉనికి కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ సలావుద్దీన్ లోధీ ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ.. మజ్లిస్‌తో లోపాయికారి ఒప్పందం ఉండడంతో చారి్మనార్‌లో తమ పార్టీ ఉనికి కోల్పోకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థితో స్థానికంగా కొంత మంది సీనియర్ నాయ కులు, కార్యకర్తలతో మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఏకంగా అభ్యరి్థని మార్చాలంటూ సమావేశాలు నిర్వహించి పార్టీ అధిష్టానానికి ఫిర్యా దులు చేశారు. వీటన్నింటిని పక్కన పెట్టిన ఆయన పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. -
25 నుంచి మరింత ఉద్ధృతంగా..
హైదరాబాద్: ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్ధృతంగా సాగుతోంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ రాజధాని నగరం హైదరాబాద్‌పై దృష్టి సారించాయి. మూడు జిల్లాల పరిధిలోని 29 నియోజకవర్గాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ‘టార్గెట్– హైదరాబాద్’ లక్ష్యంతో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో ప్రచార గడువు ముగిసిన దృష్ట్యా అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు కొందరు ఇప్పటికే నగరానికి వచ్చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సికింద్రాబాద్‌లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ సైతం ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంటోన్మెంట్లో పర్యటించారు. పలు సమావేశాల్లో ప్రసంగించారు. తుది దశకు చేరుకోవడంతో.. ► రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని వివిధ వర్గాలకు చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకొని ప్రధాన పార్టీలు తమ ప్రచారానికి పదును పెట్టాయి. సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లు, సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వివిధ వర్గాలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. మహిళలు, నిరుద్యోగులు, ఐటీ నిపుణులు వంటి వర్గాలను లక్ష్యంగా చేసుకొని మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ సైతం ఎక్కడికక్కడ ఆయా వర్గాలకు చేరువయ్యేందుకు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాయి. 25 నుంచి మరింత ఉద్ధృతంగా.. బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల భారీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 25న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ఆ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ నిర్వహిస్తోన్న ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ► మరోవైపు ప్రధాని మోదీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలుచోట్ల జరగనున్న సభలు, ర్యాలీలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లలో ఆయన పాల్గొననున్నారు. 25న మహేశ్వరంలో జరగనున్న సభలో ఆయన పాల్గొంటారు. 27వ తేదీన నగరంలో రోడ్‌షోలో ప్రధాని పాల్గొనే అవకాశం ఉంది. ఈ నెల 24 నుంచే కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ నగరంలో మకాం వేయనున్నారు. బీజేపీ అగ్రనేతలు నడ్డా, అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తదితర అగ్రనేతలంతా హైదరాబాద్‌తో పాటు వివిధ చోట్ల జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. -
కాంగ్రెస్ కార్పొరేటర్ అనిత ఇంటికి మల్లా రెడ్డి కోడలు
బోడుప్పల్: కాంగ్రెస్ పార్టీ 13వ డివిజన్ కార్పొరేటర్ దానగల్ల అనిత ఇంటికి సోమవారం బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు చామకూర ప్రీతిరెడ్డి వచ్చారు. గతంలో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన దానగల్ల అనిత బీఆర్ఎస్లో చేరగా, వారం రోజుల క్రితం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ప్రీతిరెడ్డి కలిసి మళ్లీ బీఆర్ఎస్లో చేరాలని కోరారు.. తమను బీఆర్ఎస్లో చాలా ఇబ్బందులకు గురి చేశారని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్పొరేటర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఇంటికి వచ్చి ఎన్నికల సమయంలో ప్రలోభపెడుతున్నారని వాదించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి మల్లారెడ్డి కోట్ల రూపాయలకు టిక్కెట్లు అమ్ముకున్నారని, అలాంటి వారికి ఓట్లు వేయవద్దంటూ నినాదాలు చేశారు. అక్కడ నుంచి ప్రీతిరెడ్డి కారులో వెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. అడ్డుకున్న వారిలో కాంటెస్ట్డ్ కార్పొరేటర్ రాపోలు ఉపేందర్, నాయకులు చెంచల నర్సింగ్‌రావు, గోపు రాము, జయేందర్‌రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. -
ఓటేస్తం.. ఏమిస్తరు.. ఫోన్ పే ఉందా...
హైదరాబాద్: ఉప్పల్‌లోని ఓ అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్లలో మొత్తం 33 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్ల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు తరచూ సంప్రదిస్తూనే ఉన్నారు. దీంతో తమ అపార్ట్మెంట్ నిర్వహణ కోసం రూ.4 లక్షలు ఇచ్చే పార్టీకే ఓట్లు వేస్తామని చెప్పారు. ఒక ప్రధాన పార్టీ అందుకు సిద్ధమైంది. ఆ డబ్బులతో అపార్ట్‌మెంట్‌కు పెయింటింగ్ వేయించాలని భావిస్తున్నట్లు అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు ఒకరు చెప్పారు. ► హిమాయత్‌నగర్ ప్రాంతంలోని ఒక మధ్యతరగతి కాలనీలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌కు ప్రధాన పార్టీ 25 మద్యం సీసాలు, రూ.3 లక్షలు అందజేసినట్లు ఆ అపార్ట్మెంట్ నివాసి ఒకరు తెలిపారు. ఆ 3 లక్షల రూపాయలతో అపార్ట్మెంట్లో ఒక క్రీడా సౌకర్యాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. మరో రెండు, మూడు ప్రధాన పార్టీల నుంచి కూడా ఎంతో కొంత డిమాండ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇలా ఉప్పల్, హిమాయత్‌నగర్ వంటి ఒకటి రెండు ప్రాంతాల్లోనే కాదు గ్రేటర్ అంతటా ప్రలోభాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కాలనీలుగా, అపార్ట్మెంట్లుగా ఓటర్లను సమావేశపరిచి డిమాండ్లను ఆహ్వానిస్తున్నారు. ► ఈ క్రమంలో ఓటర్ల సంఖ్యకు, అపార్ట్మెంట్ల అవసరాలకు అనుగుణంగా ఒక్కో చోట నుంచి ఒక్కో విధమైన డిమాండ్లు బరిలో నిలిచిన అభ్యర్థుల ముందుకు వస్తున్నాయి. కొన్నిచోట్ల ఈ డిమాండ్లు తలకు మించిన భారంగా ఉన్నట్లు వివిధ పార్టీలకు చెందిన నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ అభ్యర్థుల వెంట నడిచే అనుచరులు మొదలుకొని అపార్ట్మెంట్ల ప్రతినిధుల వరకు తమ డిమాండ్లను ‘పెద్ద మొత్తం’లో పార్టీల ముందుంచుతున్నారు. ఈ డిమాండ్లను భర్తీ చేసే క్రమంలో అంచనాలకు మించి ఖర్చు చేయాల్సి వస్తోందని వివిధ పార్టీలకు చెందిన నాయకులు చెబుతున్నారు. ఓట్లు ఉత్తగనే ఎందుకేస్తాం.. ‘అధికారం, అక్రమార్జనే లక్ష్యంగా ఎన్నికల్లో గెలిచేందుకు వాళ్లు పోటీపడుతున్నారు. అలాంటప్పుడు ఉచితంగా ఓట్లు ఎందుకు వేయాలి’ జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ చోటా నాయకుడి వాదన ఇది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి శివారు ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకొన్న వందలాది కాలనీలకు అక్కడికక్కడే చోటా మోటా నాయకులు పుట్టుకొస్తున్నారు. ప్రధాన పార్టీలతో బేరాలుడుతున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల ఇదో దందాగా మారింది. ప్రధాన పార్టీలకు చెందిన హేమాహేమీలను సైతం ముగ్గులోకి దించేస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో ఉండే ఓటర్ల సంఖ్య మేరకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల అనుచరులుగా చలామణి అయ్యే వ్యక్తులు కూడా కాలనీ సంఘాలకు మద్ధతుగా నిలిచి అనంతరం వాటాల చొప్పున పంచుకుంటున్నట్లు నాగారం ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు విస్మయం వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఈ డిమాండ్లు, పంపకాల కార్యక్రమం బాహాటంగానే కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు కూడా ఈ నాయకులను తోసిరాజని ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ‘ఎన్నికల సంఘం చెప్పినట్లుగా అభ్యర్థులు రూ.40 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సివస్తే నాలుగు కాలనీల ఓట్లు కూడా రాలే పరిస్థితి లేదు’ అని సైనిక్‌పురికి చెందిన ఓ మహిళా సంఘం ప్రతినిధి అభిప్రాయపడ్డారు. మద్యం, నగదు పంపిణీ అన్ని చోట్ల రూ.కోట్లల్లోనే ఉందన్నారు. అభ్యర్థులను బెంబేలెత్తిస్తున్న బేరసారాలు అపార్ట్మెంట్లు, కాలనీల్లో ప్రలోభాల పంపిణీ ఇలా ఉంటే ఓటర్లకు నేరుగా డబ్బులు వేసేందుకు ఆన్లైన్ యాప్‌లను విరివిగా వినియోగిస్తున్నారు. గూగుల్‌పే, ఫోన్‌పేల ద్వారా జోరుగా నగదు చేరిపోతోంది. అభ్యర్థులకు ఆయా ప్రాంతాల్లో ఉండే బలాబలాలను బట్టి ఒక్కో ఓటుకు రూ.3000 నుంచి రూ.5000 వరకు అందజేస్తున్నారు. నలుగురు ఓటర్లు ఉన్న ఇంటికి రూ.12000 నుంచి రూ.18000 వరకు చేరుతున్నట్లు సమాచారం. ‘గత ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే ఈ ఎన్నికల్లో కూడా ఇవ్వాల్సిందే కదా. ఒకసారి లెక్క డిసైడ్ అయిందంటే ఎప్పుడైనా అదే ఉంటుంది కదా’ అని రామంతాపూర్‌కు చెందిన వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. నిన్నా మొన్నటి వరకు సభలు, సమావేశాలు, ప్రచారంపై ఎక్కువ దృష్టి సారించిన పార్టీలు ఇప్పుడు ప్రలోభాలపై సీరియస్‌గా దృష్టి పెట్టాయి. మహిళలను, కుల సంఘాలు, కాలనీ సంఘాలను విడివిడిగా ఏర్పాటు చేసి గంపగుత్తగా సంఘాలకే డబ్బులు అందజేస్తున్నారు. -
తొమ్మిదిన్నరేళ్లలో నగర రూపురేఖల్నే మార్చాం
యాభయ్యేళ్లలో గత ప్రభుత్వాలు చేయలేని పనులెన్నో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలోనే చేసి చూపించిందని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఇప్పటి వరకూ చేసిన పనులేమిటో చెబుతూ, మున్ముందు మరిన్ని పనులు చేసేందుకు అవకాశమివ్వాలని కోరుతూ ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. పోటీలో ఉన్న ఇతర పార్టీల వారెవరన్నది తాను పట్టించుకోనన్నారు. ఏ పనులు చేసేందుకు ఎన్ని నిధులు అవసరమో సరిగ్గా తెలియని కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ కూడబెట్టిన అవినీతి సొమ్మును వెలికితీసి దాంతో తమ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలు హాస్యాస్పదమన్నారు. గాలి మాటలతోనే కాంగ్రెస్ హామీలు ఫేక్ అని వెల్లడవుతోందని వ్యాఖ్యానించారు. ‘సాక్షి’ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలను ఆయన వెల్లడించారు. మీ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలేమిటి? వాటినెలా పరిష్కరిస్తారు? సమస్యలనేవి నిరంతరం ఉంటాయి. ఒకటి పరిష్కరిస్తే మరొకటి పుట్టుకొస్తుంది. సమస్యల్ని క్రమేపీ తగ్గించుకుంటూ, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా పనులు చేస్తున్నాను. అందుకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం ఇస్తోంది. నగరానికి, మీ నియోజకవర్గానికి ఇస్తున్న హామీలు? హైదరాబాద్ నగరానికి కేసీఆర్ ప్రభుత్వం చాలా చేసింది. దేశంలోనే అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దింది. ఈ అభివృద్ధిని ఇంకా విస్తరించుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రజలకు 24 గంటల కరెంటుకు ఢోకాలేదు. యాభయ్యేళ్ల వరకు తాగునీటి సమస్యల్లేకుండా చేస్తున్నాం. కృష్ణా, గోదావరి జలాలు ఇప్పటికే అందుతున్నాయి. కాళేశ్వరం, తదితర ప్రాజెక్టుల నుంచీ నీటిని రప్పించే పనులున్నాయి. ముంపు సమస్యల్లేకుండా ఎస్ఎన్డీపీ కింద పనులు చేపట్టాం. పూర్తయిన పనులతో వరద సమస్యలు కొంత తగ్గాయి. అన్నీ పూర్తయితే ఈ సమస్యలిక ఉండవు. వాటికోసం ఎంత ఖర్చయినా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చేసిన పనుల్లో ముఖ్యమైనవి? చెప్పాలంటే చాలా ఉన్నాయి. 70 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు జీఓ 58, 59ల ద్వారా ఇళ్ల పట్టాలు చేతికొచ్చాయి. పేదలకు ఇప్పటికే 70వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చాం. మరో 30వేల ఇళ్లు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. దళితబంధు, కళ్యాణలక్ష్మి, పెన్షన్లు తదితర పథకాలు అమలవుతున్నాయి. అధికార బీఆర్ఎస్పై వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారు ? డబుల్బెడ్రూం ఇళ్లు వచ్చిన ప్రజలు సంతోషంగా ఉన్నారు. రానివారు బాధపడుతున్నారు. వారి బాధ కూడా తీరుస్తాం. మరో లక్ష ఇళ్లు నిర్మిస్తాం. అసలీ పథకాలు తెచ్చింది. అమలు చేస్తున్నదే కేసీఆర్ ప్రభుత్వం. గత పాలకులకు కనీసం ఇలాంటి ఆలోచనలు కూడా రాలేదు. చేసిన పనులు కళ్లముందే కనిపిస్తున్నాయి. దశల వారీగా అన్ని పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం. మిగతా పార్టీల మాటలు నమ్మొద్దు. అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారనే ప్రచారం ఉంది. తగ్గించలేరా ? డబ్బుతో ప్రజలను కొనలేరు. అభ్యర్థులు కూడా వీలైనంత మేరకు ఎన్నికల వ్యయం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇంటింటికీ వెళ్లి చేసిన పనులు, చేయబోయే పనులు చెప్పుకోవడం ద్వారా ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాంగ్రెస్ హామీలను ఎలా చూడొచ్చు? మాకు పాలనానుభవం ఉంది. వచ్చే రెవెన్యూ ఎంతో, ఎంత ఖర్చు చేయొచ్చో తెలిసిన నాయకుడున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలు ఇంతకుముందే విన్నా. బీఆర్ఎస్ దగ్గరి అవినీతి సొమ్ము వెలికితీసి వారి ఆరు గ్యారంటీలు అమలు చేస్తారట. గాలి మాటలు తప్ప అది సాధ్యమా ? అలాంటి హామీలు ఫేక్ కాక , వాటికి శాంక్టిటీ ఉంటుందా ? కాబట్టి కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మరు కూడా. నగరంలో సీఎం సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ? ఈనె ల 25వ తేదీన గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. భారీయెత్తున నిర్వహించనున్న ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా పార్టీ క్యాడరే కాక నగర ప్రజలకు, చదువుకున్న వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం బాగా పని చేస్తోందనే నమ్మకం ఉంటే అధిక సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సోషల్ మీడియాలో, కొన్ని సర్వేల్లో బీఆర్ఎస్ బలం కనిపించడం లేదు ఎందుకంటారు? రాజకీయ నేతలపై, వివిధ రంగాల్లో ప్రముఖులపై కనీస గౌరవం లేకపోవడంతో పాటు సోషల్ మీడియాలో వారిని ఇష్టానుసారం చిత్రీకరించడం కొందరికి ఫ్యాషన్‌గా, ప్యాషన్‌గానూ మారింది. ఇంకొందరు సర్వేలపేరిట తోచింది రాస్తున్నారు. సర్వేల నివేదికలంటూ ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. వాటికెలాంటి శాంక్టిటీ లేదు. వాటి గురించి పట్టించుకోవద్దు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎవరేమిటో గ్రహిస్తున్నారు. చేసిన మంచి పనులు కళ్లముందే ఉన్నాయి. ఉదాహరణకు కరోనా వైరస్ తరుణంలోనూ ప్రభుత్వపరంగా ఏంచేశామో ప్రజలు చూశారు. నియోజకవర్గంలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ప్రత్యర్థి గురించి ఆలోచించను. నియోజకవర్గంలో నేను చేసిన పనులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముందుకెళ్తున్నా. గత ప్రభుత్వాలు యాభయ్యేళ్లలో చేయని పనులు తొమ్మిదిన్నరేళ్లలో చేశాం. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాం. వాటితోపాటు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు, రాత్రుళ్లు ఎల్ఈడీ వీధి దీపాలు, ఇండోర్ స్టేడియాలు, తగినన్ని తాగునీటి రిజర్వాయర్లు తదితరమైన వాటిపైనే నా ఫోకస్. -
అక్కా..మీ ఓటు మాకే
ముషీరాబాద్: హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశించిన బండారు విజయలక్ష్మికి బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ కరపత్రాన్ని అందించి మద్దతు ఇవ్వాలని కోరారు. సోమవారం అడిక్‌మెట్ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ నివాసం ఉండే గల్లీలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బల్లా శ్రీనివాస్‌రెడ్డి, శ్యామ్‌సుందర్, సయ్యద్ అస్లాం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అదే వరుసలో ఉన్న దత్తాత్రేయ నివాసానికి వెళ్లగా విజయలక్ష్మికి కరపత్రాన్ని అందించి ముఠా గోపాల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆమె చిరునవ్వుతో కరపత్రాన్ని స్వీకరించి వారితో ఫొటో దిగారు. కార్యక్రమంలో నాయకులు కొండపల్లి సాయిప్రసన్న, ఇంద్రసేనారెడ్డి, మహ్మద్ ఖదీర్, నేత శ్రీనివాస్, చంద్రశేఖర్, మహ్మద్ జహంగీర్, రోషం బాలు తదితరులున్నారు. దత్తన్న కుమార్తె విజయలక్ష్మికి బీఆర్ఎస్ కరపత్రం -
Malkajgiri: అల్లుడి గెలుపు మల్లారెడ్డికి సవాల్
హైదరాబాద్: తాజా ఎన్నికల్లో కొందరు నేతలు పోటీ చేయడం లేదు. అయినా అభ్యర్థులను మించి కష్టపడాల్సి వస్తోంది. ఇందుకు కారణం తాము నిలిపిన వాళ్లను గెలిపించాల్సిన బాధ్యత భుజస్కంధాలపై ఉండటం. వారు గెలవకపోతే తమ పరపతికి భంగం వాటిల్లుతుంది. ప్రతిష్ట మసకబారుతుంది. ఓవైపు పార్టీల పరంగా బాధ్యతలు, మరోవైపు తమ వారి గెలుపు వారికి సవాల్‌గా మారింది. ఇది కొందరి పరిస్థితి. ఇంకొందరు తాము పోటీ చేస్తున్న చోట గెలవడంతోపాటు మరోచోట తమ వారినీ గెలిపించాలి. ఇటు కృష్ణ యాదవ్.. అటు పూస రాజు.. ► బీజేపీలో జాతీయస్థాయిలో కీలక పదవుల్లో ఉన్న నగరానికి చెందిన ఇద్దరు నేతలకు పెద్ద బాధ్యతలే ఉన్నాయి. నగరంలోని అంబర్‌పేట, ముషీరాబాద్ నియోజవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత వారిపై ఉంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్థానిక సెగ్మెంట్ అయిన అంబర్‌పేట బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్‌ను గెలిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కేంద్రమంత్రిగా, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో తన నియోజవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు ఆయనకు సవాల్‌గా మారింది. ► ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన డా.కె. లక్ష్మణ్దీ దాదాపుగా ఇదే పరిస్థితి. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పూస రాజుకు టికెట్ దక్కింది. పార్టీ ఓబీసీ మోర్చా చైర్మన్‌గా ఉన్న లక్ష్మణ్.. అదే విభాగంలో కార్యవర్గ సభ్యుడిగా ఉన్న రాజుకు టిక్కెట్ ఇప్పించుకున్నారని పార్టీవర్గాల ప్రచారం. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యత లక్ష్మణ్ మీద పడింది. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడుగానూ, రాజ్యసభ సభ్యుడుగానూ, ఇతరత్రానూ ఎన్నో కీలక స్థానాల్లో ఉన్న లక్ష్మణ్ తన నియోజకవర్గంలో తమ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన తప్పనిసరి స్థితి. ఇలా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు తమ జాతీయస్థాయి బాధ్యతల నిర్వహణతోపాటు తమ నియోజకవర్గాల్లో బరిలోని వారు గెలిచేందుకు కృషి చేయాల్సి ఉంది. ఆయనకు అదనపు బాధ్యతలు.. ఈయనకు అల్లుడి గెలుపు ► పోటీ చేస్తున్న తాము గెలవడంతో పాటు తమవారిని గెలిపించాల్సిన బాధ్యతలు బీఆర్ఎస్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డిలపై అదనంగా పడ్డాయి. కంటోన్మెంట్ నియోజవర్గంలోనే తన ఓటు ఉన్న మంత్రి తలసాని ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా ఉన్నారు. కంటోన్మెంట్లో పోటీ చేస్తున్న లాస్య నందిత ఎమ్మెల్యేగా బరిలో దిగడం కొత్త. అధిష్ఠానం ఆమె గెలుపు బాధ్యతలు కూడా తలసానికి అప్పగించింది. ఇటు సనత్‌నగర్‌లో తాను గెలవాలి. అటు కంటోన్మెంట్లో ఆమెను గెలిపించాలి. ► అలాగే.. మల్కాజిగిరి నియోజకవర్గంలో తన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మంత్రి మల్లారెడ్డిపై పడింది. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించి పార్టీని వీడిన మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ గెలుపు పార్టీ అధిష్థానానికే సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో మేడ్చల్‌లో అల్లుడి గెలుపు మల్లారెడ్డికి అనివార్యంగా మారింది. మేడ్చల్‌లో తాను గెలవడంతోపాటు అల్లుణ్ని గెలిపించడం మల్లారెడ్డికి పెను సవాల్‌గా మారింది. కాంగ్రెస్‌లో ఇలా.. ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ సెల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్‌ఖేరా భార్య కోటా నీలిమ సనత్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జాతీయస్థాయిలో కీలకస్థానంలో ఉన్న ఆయనకు తన భార్యను గెలిపించుకోవడం సవాల్‌గా మారింది. -
ఎల్బీనగర్, మహేశ్వరంలలో బోణీ కొట్టని బీఆర్ఎస్
హైదరాబాద్: రాష్ట్రంలో రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ.. నగర శివారు రంగారెడ్డి జిల్లాలోని ఆ రెండు స్థానాల్లో మాత్రం ఖాతా తెరవలేక పోయింది. గత ఎన్నికల్లో జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ మహేశ్వరం, ఎల్బీనగర్లలో మాత్రం ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులు గెలువలేకపోయారు. ఈసారైనా ఇక్కడ బోణీ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ కూడా ఈ స్థానాలను కీలకంగా తీసుకుంది. మహేశ్వరంలో గులాబీ గుబాళించేనా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది. తొలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం చోటుచేసుకున్న పలు రాజకీయ సమీకరణాలతో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో నిర్వహించిన తొలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018లో బీఆర్ఎస్ తరఫున పోటీలో నిలిచి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరి మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. ఇప్పటి వరకు ఇక్కడ బీఆర్ఎస్ గెలుపొందలేదు. ఈ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ బోణీ కొడుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎల్బీనగర్లో జెండా ఎగిరేనా.. అప్పటి వరకు మలక్‌పేట్ నియోజకవర్గంలో అంతర్భాంగంగా ఉన్న ఎల్బీనగర్ 2009లో కొత్త నియోజకవర్గంగా ఆవిర్భవించింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, టీడీపీ నుంచి ఎస్వీ కృష్ణ ప్రసాద్‌లు పోటీ చేశారు. దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నిక (2014 ఎన్నిక)ల్లో కాంగ్రెస్ నుంచి సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, టీడీపీ నుంచి ఆర్ కృష్ణయ్యలు పోటీ చేశారు. ఆర్. కృష్ణయ్య విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి అధికార బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు.