హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లు దూసుకెళ్తున్నాయి. రాజకీయ నేతల సుడిగాలి పర్యటనల్లో గిరికీలు కొడుతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈసారి వీటి వినియోగం విరివిగా పెరిగింది. అన్ని ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు రోజుకు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. బహిరంగసభలతో పాటు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలు, ర్యాలీలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్రమంతటా పర్యటించాల్సివస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరుసగా వివిధ ప్రాంతాల్లో జరిగే సభల్లో పాల్గొనేందుకు రోడ్డు మార్గంలో వెళ్లడం కష్టసాధ్యంగా మారడంతో అన్ని ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు హెలికాప్టర్లపైనే ఆధారపడి పరుగులు తీస్తున్నారు.
ఇంచుమించు నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి రోజు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం రోజుకు నాలుగైదు సభలకు హాజరవుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితర నాయకులు రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తున్నారు. ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్లు కూడా హెలికాప్టర్లలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో రోజుకు 3 నుంచి 4 హెలికాప్టర్లను మాత్రమే వినియోగించగా ఈసారి రోజుకు పది వరకు వినియోగిస్తున్నట్లు అంచనా.
ప్రముఖుల రాకపోకలు మినహా మిగతా రోజుల్లో నిశ్శబ్దంగా ఉండే బేగంపేట్ ఎయిర్‌పోర్టు కొద్ది రోజులుగా సందడిగా మారింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు, నాయకుల రాకపోకలతో బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి విమానాలు పరుగులు తీస్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షలు ఖర్గే,ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, తదితరుల రాకపోకలతో పాటు వారితో పాటు వచ్చే ఇతర నాయకులు, స్థానిక నేతల ఉరుకులు,పరుగులతో బేగంపేట్ కళకళలాడుతోంది.
ఐదుగురి నుంచి ఏడుగురి వరకు..
ప్రస్తుతం రాజకీయ పార్టీలు వినియోగిస్తున్న హెలికాప్టర్లన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినవే. కొన్ని సింగిల్ ఇంజిన్ సామర్థ్యం కలిగినవి కాగా, చాలా వరకు డబుల్ ఇంజిన్ సామర్థ్యం కలిగిన వాటినే వినియోగిస్తున్నారు. ఒక్కో చాపర్‌లో ఐదుగురు నుంచి ఏడుగురు ప్రయాణం చేయవచ్చు. దీంతో వీటి కోసం పార్టీలు చేసే ఖర్చు కూడా రూ.లక్షల్లోనే ఉంది. గతంలో గంటకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చార్జీ ఉంటే ఇప్పుడు ఒక్కో హెలికాప్టర్‌కు గంటకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆయా సంస్థలు చార్జీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగడం, అన్ని పార్టీలకు చెందిన నాయకులు విరివిగా పర్యటిస్తుండటంతో చార్జీలను భారీగా పెంచాయని ఏవియేషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లకు చెందిన పలు ఏవియేషన్ సంస్థలు హెలికాప్టర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్, చిప్సన్ ఏవియేషన్, ఇండో పసిఫిక్ ఏవియేషన్, గోల్డెన్ ఈగిల్ ఏవియేషన్ తదితర సంస్థలకు చెందిన హెలికాప్టర్లు ప్రచారంలో పరుగులు తీస్తున్నాయి. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ (ఏడబ్ల్యూ) 109, ఏడబ్ల్యూ 139, ఏడబ్ల్యూ 169, బెల్ 429,యురోకాప్టర్ 135 తదితర రకాలకు చెందిన హెలికాప్టర్లు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి. ఈ నెల 28 వరకు రాజకీయ పార్టీలు హెలికాప్టర్లను వినియోగించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment