హైదరాబాద్: రాష్ట్రంలో అనుకూల పవనాలతో అధికారం ‘హస్త’గతమైనప్పటికీ రాజధాని హైదరాబాద్ మాత్రం కాంగ్రెస్‌ను దూరం పెట్టింది. దశాబ్ద కాలంగా ఈ పార్టీకి ఇక్కడ ఆదరణ లభించడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మూడో ఎన్నికలోనూ కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవంగా పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో ఖాతా తెరవడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము కాగా, కోర్‌సిటీలో సైతం అదే పరిస్థితి నెలకొంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాత్రమే కాంగ్రెస్ హవా కొనసాగింది.
ఈ మేరకు 2009లో ఖైరతాబాద్‌లో దానం నాగేందర్, జూబ్లీహిల్స్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి, సనత్‌నగర్‌లో మర్రి శశిధర్‌రెడ్డి, గోషామహల్‌లో ముఖేశ్‌గౌడ్, సికింద్రాబాద్‌లో జయసుధ, కంటోన్మెంట్‌లో శంకర్‌రావు, మల్కాజిగిరిలో ఆకుల రాజేందర్, ఉప్పల్‌లో బండారి రాజిరెడ్డి, ఎల్‌బీనగర్‌లో దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో భిక్షపతి యాదవ్, మహేశ్వరంలో సబితారెడ్డి, ముషీరాబాద్‌లో మణెమ్మ తదితరులు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పూర్తిగా చతికిలపడింది.
2014లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలనుసైతం దక్కించుకోలేక పోయింది. 2018 ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్‌తో కలిసి కూటమిగా పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అన్ని స్థానాల్లో అపజయాన్ని మూటగట్టుకుంది. పదేళ్లలో రెండు పర్యాయాలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగినా..అందులోనూ సైతం మొక్కుబడి స్థానాలకు పరిమితమైంది. కాగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమే. నగర అధ్యక్షుల ఎంపికలో ఆలస్యం..సీనియర్ల మధ్య సమన్వయలేమి కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చింది. 2014, 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ, 2020లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నా అధిష్టానం సమీక్షించుకోకపోవడం దారుణం.
Comments
Please login to add a commentAdd a comment