
హైదరాబాద్: నగర కాంగ్రెస్ రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ.. మరో రెండు రోజుల్లో తుది జాబితా విడుదలకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యూహాత్మంగా ముందుకు సాగుతోంది. నగరంలోని పాతబస్తీ మినహ అన్ని అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. ఇక్కడ మరో 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండటంతో ఆశావహులు ఢిల్లీకి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కొందరు ఏకంగా దేశ రాజధానిలో మకాం వేసి అగ్రనేతల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు.
గెలుపు గుర్రాలు
అధికారమే లక్ష్యంగా అడుగులు వేసున్న కాంగ్రెస్ కోర్ సిటీతో పాటు శివార్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో దింపేందుకు సిద్ధమైంది. అభ్యర్థుల బలాబలాలపై సర్వే చేయిస్తూ అంచనా వేస్తోంది. ఇతర పార్టీల అసమ్మతివాదులను సైతం తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సెగ్మెంట్లలో ఇతర పార్టీలకు చెందిన అసమ్మతి నేతలకు గాలం వేసింది. ముఖ్యంగా ఎల్‌బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ తదితర సెగ్మెంట్లలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అధిష్టానం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అయితే.. ఇతర పార్టీల నుంచి వలసలు పెరగడంతో రాజకీయ సమీకరణలు కూడా మారుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment