ఈసీఐఎల్‌లో రోడ్‌షోలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
కాప్రా: ఉప్పల్ నియోజకవర్గం ప్రజల కష్టాలు తీరాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఈసీఐఎల్‌లో రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉప్పల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే ప్రజల వెన్నంటే ఉంటూ కష్టాలు తీరుస్తారన్నారు.
నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రానివారికి, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మల్కాజిగిరి ఎంపీగా తనను ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపినట్లే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుండి మందముల పరమేశ్వర్‌రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను చూసి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అండగా ఉంటుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఇవన్నీ జరగాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని, తెలంగాణలో మార్పు రావాలంటే కేసీఆర్ పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment