బీఆర్‌ఎస్‌ కోసమే.. | CM Revanth Reddy Comments On BRS | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ కోసమే..

Jul 2 2025 6:15 AM | Updated on Jul 2 2025 6:15 AM

CM Revanth Reddy Comments On BRS

సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్, చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌

పార్టీ పునరుజ్జీవం కోసం నీళ్ల సెంటిమెంట్‌ వాడుకుంటున్నారు

రైతాంగానికి మరణ శాసనం రాసింది కేసీఆర్, హరీశ్‌రావే  

తెలంగాణకు బనకచర్ల రాచపుండు తగిలించింది కేసీఆరే 

బనకచర్లపై అవగాహన సదస్సులో సీఎం రేవంత్‌ ఫైర్‌ 

బీఆర్‌ఎస్‌ను బతికించేందుకు బీజేపీ ప్రయతి్నస్తోందని ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పునరుజ్జీవం కోసమే ఆ పార్టీ నేతలు నీళ్ల రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్లక్ష్యమే నేడు తెలంగాణ రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి– బనకచర్ల ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం ప్రజాభవన్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో సీఎం మాట్లాడారు. ‘వాళ్లు (బీఆర్‌ఎస్‌) 2023లో ఓడిపోయారు. 

2024లో డిపాజిట్లు కోల్పోయారు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకలేదు. ఇప్పుడు నదుల పునరుజ్జీవం కాదు.. పార్టీ పునరుజ్జీవం కోసం నీళ్ల సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారు. పక్క రాష్ట్రం సీఎంను, ఈ రాష్ట్రం సీఎంను భూతాలుగా చిత్రీకరించాలని కుట్రలు చేస్తున్నరు. క్షుద్రపూజలు చేసినట్టుగా ఆయన (కేసీఆర్‌) ఫాంహౌస్‌లో కూర్చుని ఆలోచన చేస్తున్నడు. ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి’అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచించారు.  

మరణ శాసనం రాసింది కేసీఆర్, హరీశ్‌రావులే..  
తొమ్మిదిన్నరేళ్లు పాలనలో కేసీఆర్, హరీశ్‌రావు తీసుకున్న నిర్ణయాలు నేడు తెలంగాణకు గుదిబండగా మారాయని సీఎం విమర్శించారు. ‘కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల నికర జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎలా వాడుకోవాలన్న అంశంపై 2015 సెప్టెంబర్‌ 18న కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించింది. 

ఆ సమావేశానికి నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, సాగునీటి రంగ సలహాదారులు విద్యాసాగర్‌ రావు హాజరై ఏపీ 512 టీఎంసీలు వాడుకోవచ్చని, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని అంగీకరిస్తూ సంతకం పెట్టి తెలంగాణ రైతాంగం పాలిట మరణశాసనం రాసి వచ్చారు. 

2020లో కూడా సమావేశానికి వెళ్లి మళ్లీ సమ్మతి తెలిపారు. 2015లో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో, తర్వాత జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో కృష్ణా జలాల్లో మన హక్కుల కోసం కేసీఆర్‌ వాదించలేదు. కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలనూ కేసీఆర్‌ ఏపీకి తాకట్టు పెట్టిండు. ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి కృష్ణా, గోదావరి జలాలపై చర్చిద్దాం’అని సీఎం బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. 

రాచపుండును పెట్టింది కేసీఆరే.. 
‘ఏటా 3,000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని 2016 సెపె్టంబర్‌ 21న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తొలిసారి నాటి సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 968 టీఎంసీలు, ఏపీ వాటా 518 టీఎంసీలను పూర్తిస్థాయిలో వాడుకునే విధంగా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాతే మిగులు జలాలు, వరద జలాల లభ్యత ఎంతో లెక్క తేలుతుంది. 

ఆ తర్వాతే ఆ జలాల్లో దామాషా ప్రకారం రెండు రాష్ట్రాల వాటాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. ఏటా 3,000 టీఎంసీల వరద సముద్రంలో కలుస్తోందని కేసీఆర్‌కు ఏ దేవుడు చెప్పిండు? లేని ఏకును, రాచపుండును పెట్టిందే కేసీఆర్‌. దాని ఆధారంగానే గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు డీపీఆర్‌ తయారు చేయించడానికి చంద్రబాబు 2016లో జీవో ఆర్టీ నం.262 జారీ చేశారు. దీనికి కొనసాగింపుగా 2019 సెపె్టంబర్‌ 29న జీవో ఆర్టీ నం.230 ఇచ్చారు. 

వ్యాప్కోస్‌ 4 ప్రత్యామ్నాయాలు సూచించగా, 4వ ప్రత్యామ్నాయంగా 400 టీఎంసీలు తరలించవచ్చని నివేదిక ఇచి్చంది. ఇప్పుడు ఏపీ 200 టీఎంసీలను తరలిస్తామని చూపించడం తాత్కాలికం. ప్రీఫీజిబిలిటీ రిపోర్టు ప్రకారం 300 టీఎంసీల ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. అదనంగా 100 టీఎంసీల పంపులను ఫిట్‌ చేయడం లేదు. 400 టీఎంసీలను నెల్లూరు, ప్రకాశంకు ఎలా తీసుకెళ్లాలో 2016లోనే కేసీఆర్‌ చెప్పిండు. 

ఇదే అదనుగా చంద్రబాబు పనులు మొదలు పెట్టిండు. 2019లో జగన్‌ సీఎం కాగానే గోదావరి జలాలను ఏ విధంగా పెన్నాకు తరలించాలో ఆయనకు కేసీఆరే నేర్పిండు. కేసీఆర్‌ రోజా ఇంటికి వెళ్లి గోదావరి జలాలు మీకిచ్చి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నాడు. 2016–19 మధ్యలో కేసీఆర్‌ సంపూర్ణంగా సహకరించారు’అని సీఎం ఆరోపించారు. 

తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపకుండా ఏపీ సీఎం చంద్రబాబు ఎన్‌ఓసీ ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు. సమస్యల పరిష్కారంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం వివాదం సృష్టిస్తోందని విమర్శించారు. నీటి కేటాయింపుల బాధ్యతను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. 

బీజేపీ పరోక్షంగా బీఆర్‌ఎస్‌ను బతికించడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు. సదస్సులో ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తమ పోరాటం వల్లే బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర పర్యావరణ శాఖ తిరస్కరించిందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement