
ఆ దెయ్యాన్ని వదిలించాలన్నదే బీఆర్‌ఎస్ ప్రయత్నం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్‌రెడ్డి అని, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ దెయ్యాన్ని, శనిని వదిలించాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఈమేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్‌ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుంది. ఈ సూత్రం వాళ్లకు వీళ్లకు కాదు.. పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ వర్తిస్తుంది. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన బీఆర్‌ఎస్‌లో అధ్యక్షుడు కేసీఆర్‌కు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా సూచనలిస్తూ ఎవరైనా లేఖలు రాయొచ్చు.
అయితే పార్టీలో ఏ హోదాలో ఉన్న వారైనా కొన్ని అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది’అని కేటీఆర్ అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఎలా ముందుకు పోవాలని వేల మంది కార్యకర్తలతో గంటలకొద్దీ చర్చించాం. ఆ క్రమంలో చాలామంది నేరుగా మైక్‌లో మాట్లాడారు.
మరికొందరు కేసీఆర్‌కు ఇవ్వమంటూ లేఖలు ఇచ్చారు. మా పార్టీలో బహిరంగ చర్చను ప్రోత్సహిస్తాం. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన మా పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా సూచనలు చేయొచ్చు, ఉత్తరాలు రాయొచ్చు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లో ఉన్నట్లు బీఆర్‌ఎస్‌లోనూ రేవంత్ కోవర్టులు ఉండొచ్చని, సరైన సమయంలో వారంతటే వారు బయటపడతారన్నారు.
ఓటుకు నోటు కేసులో ‘బ్యాగ్‌మ్యాన్’
‘యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్‌లో చేర్చడం రాష్ట్రానికి అవమానకరం. ఈ కేసులో రేవంత్ పేరు వచ్చిందన్న వార్తను కొన్ని పత్రికలు అసలు రాయనే లేదు. మీడియా ఎంత తాపత్రయపడ్డా.. ఎన్ని ప్రకటనలు తీసుకున్నా రేవంత్ ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి అని ప్రజలకు అర్థమైపోయింది. మీడియా ఎన్ని దాచినా సోషల్ మీడియాతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయి.
ఓటుకు నోటు కేసులో బ్యాగ్‌మ్యాన్ అని పేరు తెచ్చుకున్న రేవంత్ వైఖరి మారలేదని ఈడీ చార్జిïÙట్‌లో బయటపడింది. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారగా, ఢిల్లీ కాంగ్రెస్‌కు అవసరమైనప్పుడల్లా భారీ మొత్తంలో ఇస్తూ రేవంత్ తన పదవి కాపాడుకుంటున్నాడు. నైతికత ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆయనను పదవి నుంచి తప్పించాలి.
ప్రధాని మోదీ, అమిత్ షాతో ఒప్పందం కుదుర్చుకునేందుకే రేవంత్ ఢిల్లీ వెళ్లారు. 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కేసుల నుంచి తప్పించాలని చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నాడు. రేవంత్‌కు రాహుల్ గాంధీ అధికారిక బాస్ కాగా, మోదీ, అమిత్ షా అనధికార బాస్‌లుగా వ్యవహరిస్తున్నారు.
ఏడాదిన్నరగా బీఆర్‌ఎస్‌పై నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాస్‌లకు రూ.వేలకోట్ల చందాలు అనే రీతిలో రేవంత్ పాలన సాగుతోంది. రేవంత్ అవినీతిపై రాహుల్ మాట్లాడాలి. ఈడీ చార్జిïÙట్‌లో సోనియా, రాహుల్ పేర్లు ఉన్నా జపాన్ టూర్ పేరిట రేవంత్ స్పందించకుండా తప్పుకున్నాడు’అని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ నడుమ అపురూప బంధం
‘నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు మౌన మునుల్లా మారిపోయారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూదందా అక్రమాలకు రేవంత్ వత్తాసు పలుకుతున్నందుకే మౌనమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.187 కోట్ల వాల్మీకి స్కామ్, ట్రిపుల్ ఆర్ టాక్స్, హెచ్‌సీయూ భూముల్లో అక్రమాలు, పౌర సరఫరాల కుంభకోణం జరుగుతున్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు.
రేవంత్‌కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం స్పందించకుంటే నెల రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్‌ను కోరతాం’అని చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, రాజయ్య పాల్గొన్నారు.