హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి సభకు సర్వం సిద్ధమైంది. ప్యాబ్‌సిటీ సమీపంలోని వంద ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా యువనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీడబ్ల్యూసీ ముఖ్యులు, అన్ని రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు హాజరు కానుండటంతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నియోజకవర్గాల వారీగా భారీగా జన సమీకరణ చేయాలని నేతలకు టార్గెట్లు ఇచ్చింది. ఇందు కోసం 300 బస్సులను కూడా సిద్ధం చేసింది.
రెయిన్ ఫ్రూప్ టెంట్లు..
భారీ వర్షానికి సైతం నేతలు తడవకుండా ఉండేందుకు రెయిన్ ఫ్రూప్ టెంట్లను వేశారు. నేతల ప్రసంగాలు స్పష్టంగా విన్పించేందుకు సభాస్థలికి నాలుగు వైపులా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం చుట్టూ పెద్ద సంఖ్యలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. స్వాగత తోరణాలు, భారీ కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటులో ఎల్‌బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు పోటీపడ్డారు. సీడబ్ల్యూసీ ముఖ్య నేతల కోసం ప్రధాన వేదికను కేటాయించారు. పీసీసీలు, మాజీ మంత్రులు, ఎంపీల కోసం ఒకటి.. డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు, కళాకారుల కోసం మరో స్టేజీని కేటాయించారు. ఈ మూడు వేదికలపై సుమారు 250 మంది ఆసీనులు కానున్నారు. సభకు వచ్చే ముఖ్య నేతల వాహనాలను ప్రధాన వేదిక వెనుక భాగంలోనే పార్కింగ్ చేయించనున్నారు. ఇతర నేతలు, కార్యకర్తల వాహనాల కోసం సర్వీసు రోడ్డుతో పాటు ఆ ప్రాంగణానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలను కేటాయించారు.
భారీ బందోబస్తు..
తుక్కుగూడకు వచ్చి వెళ్లే నాలుగు ప్రధాన రహదారులపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 61 మంది మంది ఎస్‌ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తాజ్‌కృష్ణ హోటల్ నుంచి బయలుదేరే ముఖ్య నేతల వాహనాలు శంషాబాద్ నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా తుక్కుగూడకు చేరుకుంటాయి. అటు నుంచి ర్యాలీగా ప్రధాన వేదిక వెనుకభాగంలోని ప్యాబ్‌సిటీ నుంచి సభా ప్రాంగణానికి అనుమతించనున్నారు. మిగిలిన వాహనాలను ప్రధాన రహదారి నుంచి అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment