హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్ధానాలకు ప్రకటించిన తొలి జాబితాలో సగానికి పైగా కొత్తవారికే అవకాశం లభించింది. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాలకు గాను పద్నాలుగింటికి అభ్యర్థులు ఖరారయ్యారు. అందులో 8 స్థానాల నుంచి కొత్త ముఖాలు ఎన్నికల బరిలో దిగుతున్నారు. కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే పాత వారికి అవకాశం ఇచ్చింది.
బరిలో తొలిసారిగా ..
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలోని సుమారు 8 మంది అభ్యర్థులు తొలిసారిగా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. సనత్‌నగర్ నుంచి డాక్టర్ నీలిమ, గోషామహల్ నుంచి మొగిలి సునీత, ఉప్ప ల్ నుంచి ఎం.పరమేశ్వర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి ఆదం సంతోష్ కుమార్, చాంద్రాయణగుట్ట నుంచి బోయ నగేష్ (నరేష్), యాకుత్‌పురా నుంచి కె.రవి రాజు, బహదూర్‌పురా రాజేష్ కుమార్, మలక్‌పేట నుంచి షేక్ అక్బర్‌లు తొలిసారిగా పోటీ చేస్తున్నారు.
పాతకాపులు ఇలా..
ముషీరాబాద్ అసెంబ్లీ స్ధానం నుంచి బరిలో దిగుతున్న అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి వరుసగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు పరాజయం పాలయ్యారు. నాంపల్లి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిత్వం ఖారారైన ఫిరోజ్ ఖాన్ వరసగా పీఆర్‌పీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు గత పార్లమెంట్ ఎన్నికల్లో సైతం హైదరాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగాఎన్నికయ్యారు. ఇటీవల బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో మల్కాజిగిరి సీటు ఖరారైంది. మేడ్చల్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, కుత్బుల్లాపూర్ అభ్యర్ధి కొలన్ హనుమంతరెడ్డి, కార్వాన్ అభ్యర్థి ఒసామా బిన్ మహ్మద్ అలీ హిజ్రీలు గతంలో వివిధ పార్టీల నుంచి ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పక్షాన బరిలో దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment